• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అవుతారా డ్రోన్‌ పైలట్‌

ఇప్పుడు సందర్భం ఏదైనా సందడంతా డ్రోన్లదే. పెళ్లి బాజా, సినిమా షూటింగ్, రసాయనాల పిచికారీ, ఏరియల్‌ సర్వే, ఔషధాల సరఫరా, విత్తనాలు చల్లడం... ఇలా అన్ని వ్యవహారాలనూ డ్రోన్లు చక్కబెట్టేస్తున్నాయి. వీటికి మార్గనిర్దేశం చేస్తే చాలు. పక్కాగా పని పూర్తయిపోతుంది. అయితే ఇవి లక్ష్యం దిశగా దూసుకుపోవాలంటే ఏం చేయాలి? ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేవాళ్లే డ్రోన్‌ పైలట్లు. ప్రస్తుతం వీరికి గిరాకీ పెరిగింది. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలో రాణించవచ్చు. ఇందుకోసం పెద్ద విద్యార్హతలేమీ  అవసరం లేదు. పదో తరగతి చాలు. స్వల్ప వ్యవధిలోనే శిక్షణ పూర్తిచేసుకుని, డ్రోన్‌ పైలట్‌ అవతారమెత్తవచ్చు!

పైలట్‌ విమానంలో కూర్చుని దాన్ని నడిపిస్తారు. ఏ వాహకానికైనా చోదకుడు అందులో ప్రయాణించడం తప్పనిసరి. కానీ, డ్రోన్లు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. వాటిలో కూర్చుని కమాండ్స్‌ ఇవ్వడం సాధ్యం కాదు. సాంకేతికత సాయంతో దానికి సరైన దిశానిర్దేశం చేస్తే అది లక్ష్యాన్ని కచ్చితత్వంతో పూర్తి చేస్తుంది. ప్రస్తుతం పలు రంగాల్లో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. భవిష్యత్తులో మరింతగా పెరగనుంది. అందువల్ల తక్కువ వ్యవధిలోనే కనీసం లక్ష మంది డ్రోన్‌ పైలట్ల అవసరం ఉంటుందని అంచనా. 2030 నాటికి భారతదేశం ప్రపంచ డ్రోన్‌ హబ్‌గా మారుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. 

సాధారణంగా పైలట్‌ కావాలంటే రూ.అరకోటి వరకు అవసరం అవుతాయి. ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేయడం తప్పనిసరి. అయితే డ్రోన్‌ పైలట్‌ కావడానికి ఇవేవీ అవసరం లేదు. పది పాసై, పద్దెనిమిదేళ్లు నిండితే చాలు. అలాగే శిక్షణ వ్యవధి తక్కువే. ఐదు రోజుల్లోనే దీన్ని పూర్తి చేసుకోవచ్చు. ఫీజు అందుబాటులోనే ఉంటుంది. సంస్థను బట్టి రూ.అర లక్ష నుంచి రూ.లక్షలోపే! అంతేకాకుండా ఈ శిక్షణ తర్వాత ఉద్యోగానికి మరీ అంతగా శ్రమించాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల కొరత ఎక్కువగా ఉన్నందున వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చు. కొన్ని సంస్థలు శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగానికీ అవసరమైన తోడ్పాటు అందిస్తున్నాయి. పనికి ఇంత లేదా నెలకు ఇంత అనే విధంగా ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. శిక్షణ తీసుకున్నవారు నెలకు సుమారు రూ.30 వేల వేతనం అందుకోవచ్చు. డ్రోన్‌ పైలట్‌ శిక్షణలో హైదరాబాద్‌ హబ్‌ కాబోతోంది.

అనుమతి తప్పనిసరి 

సాధారణ పైలట్‌ శిక్షణ సంస్థలకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) లైసెన్స్‌ తప్పనిసరి. డ్రోన్‌లు నడపడానికీ ఈ సంస్థ అనుమతులే ఉండాలి. డ్రోన్ల శిక్షణ, మార్గ నిర్దేశాలు, పరీక్షలు, లైసెన్స్‌ అంతా డీజీసీఏ పరిధిలో ఉంటాయి. సంబంధిత సంస్థ వీటిని పాటించాలి. రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ను డీజీసీఏ జారీ చేస్తుంది. ఇందుకోసం సంబంధిత సంస్థ అభ్యర్తి తమవద్ద శిక్షణ పొందినట్లు, స్కిల్‌ టెస్టు రిపోర్టును డీజీసీఏకు అందించాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్‌ పదేళ్లు చెల్లుబాటు అవుతుంది. దీన్ని ప్రతి పదేళ్లకు రెన్యువల్‌ చేసుకోవచ్చు. దేశంలో పలు సంస్థలు డ్రోన్‌ పైలట్‌ శిక్షణ అందిస్తున్నాయి. చేరే ముందు డీజీసీఏ అనుమతి ఉందా, లేదా తెలుసుకోవాలి.

అర్హతలు

పదో తరగతి పూర్తవ్వాలి. కనీసం 18 ఏళ్లు నిండాలి. వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. 65 ఏళ్లలోపు వారు ఎవరైనా రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ నిమిత్తం శిక్షణ తీసుకోవచ్చు. ఆంగ్లం, సాంకేతికతపై కొంచెం పట్టు ఉంటే మంచిది.

నైపుణ్యాలు

పదో తరగతి అర్హత అయినప్పటికీ ఏవియానిక్స్, వాతావరణం, గాలుల వేగం, ఇతర మెకానిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అన్ని విభాగాల్లోనూ డ్రోన్‌ సేవలు బాగా వృద్ధి చెందుతున్నాయి. ఒక్కో రంగం అవసరాలు ఒక్కోలా ఉంటాయి. చలనచిత్ర నిర్మాణం,  జియో సెన్సింగ్, నిర్మాణ రంగం, మైనింగ్, రియల్‌ ఎస్టేట్, వ్యవసాయం, రవాణా, ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్‌...ఇలా ఎన్నో విభాగాల్లో డ్రోన్‌ పైలట్ల అవసరం పెరుగుతోంది. అందువల్ల డ్రోన్‌ పైలట్‌గా విజయవంతం కావడానికి సంబంధిత సేవలు అందించే విభాగంపైనా పట్టు పెంచుకోవడం మంచిది. 

2030కి మూడో స్థానం!

ప్రస్తుతం ప్రభుత్వం డ్రోన్‌ పరిమాణం 300 కి.గ్రా. నుంచి 500 కి.గ్రా. వరకు పెంచింది. అలాగే ఫీజూ తగ్గించింది. ఇవి ఈ విభాగం వృద్ధికి దోహదం చేస్తాయి. 

2026 నాటికి మనదేశ డ్రోన్‌ పరిశ్రమ రూ.15వేల కోట్లకు చేరుకుంటుందని పౌర విమానయాన శాఖ మంత్రి సింధియా తెలిపారు. ప్రభుత్వం పలు నిబంధనలను సడలించడంతో రాబోయే రోజుల్లో ఈ రంగం గణనీయమైన వృద్ధి నమోదు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే సంవత్సరాల్లో మన దేశానికి లక్ష మంది డ్రోన్‌ పైలట్ల అవసరం ఉంటుందని కొద్ది రోజుల కిందటే ఆయన తెలిపారు. దేశంలో ప్రస్తుతం పలు సంస్థలు డ్రోన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. డ్రోన్ల తయారీ రంగంలోనూ గణనీయమైన అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం డ్రోన్‌ టెక్నాలజీని ఆత్మ నిర్భర భారత్‌లో భాగం చేసింది. అందువల్ల ఈ రంగంలో ప్రోత్సాహకాలు, అవకాశాలు ఊపందుకోనున్నాయి. పలు స్టార్టప్‌ సంస్థలు దేశవ్యాప్తంగా ఈ విభాగంలో సేవలు అందిస్తున్నాయి. మారత్‌ డ్రోన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ టీ¨హబ్‌లో భాగంగా ఇప్పటికే డ్రోన్ల రంగంలో తమ సేవలు విస్తరిస్తోంది. 2030 నాటికి ప్రపంచ డ్రోన్‌ మార్కెట్‌లో భారత్‌ మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా. 

పరిమాణాన్ని బట్టి... 

నాన్‌ కమర్షియల్‌ విధానంలో నానో, మైక్రో డ్రోన్లను నడపడానికి పైలట్‌ లైసెన్స్‌ అవసరం లేదు. ఇవి కాకుండా మరే తరహా డ్రోన్‌ నడపాలన్నా లైసెన్స్, శిక్షణ తప్పనిసరి. డ్రోన్ల పరిమాణం బట్టి వాటిని వర్గీకరించారు. ఈ లెక్క ప్రకారం..

నానో: 250 గ్రాముల వరకు

మైక్రో: 250 గ్రాముల కంటే ఎక్కువ 2 కి.గ్రా. కంటేతక్కువ

స్మాల్‌: 2 కి.గ్రా. కంటే ఎక్కువ; 25 కి.గ్రా. కంటే తక్కువ

మీడియం: 25 కి.గ్రా. కంటే ఎక్కువ; 150 కి.గ్రా. కంటే తక్కువ

లార్జ్‌: 150 కి.గ్రా. కంటే ఎక్కువ.

శిక్షణ సంస్థలు

తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడెమీ డ్రోన్‌ పైలట్‌ శిక్షణ అందిస్తోంది. ఈ సంస్థకు 280 ఎకరాల ఫ్లైట్‌ ఏరియాతోపాటు 920 మీటర్ల రన్‌ వే ఉంది. ఇక్కడ శిక్షణకు సుమారు రూ.60 వేల వరకు తీసుకుంటారు. ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ, వింగ్స్‌ ఏవియేషన్, డ్రోన్‌ అకాడమీ..ఇల పలు సంస్థలు హైదరాబాద్‌ పరిసరాల్లో శిక్షణ అందిస్తున్నాయి.

రాబోయే కొన్నేళ్లలో దేశంలో దాదాపు లక్షమంది డ్రోన్‌ పైలట్లు అవసరం. కాబట్టి ఇది యువతకు సువర్ణావకాశం

- జ్యోతిరాదిత్య సింధియా 

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి 

శిక్షణ ఇలా...

ఐదు రోజుల శిక్షణ (కోర్సు) అనంతరం థియరీ, ప్రాక్టికల్స్‌లో పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్‌ అందిస్తారు. కోర్సులో భాగంగా డ్రోన్స్‌ని పరిచయం చేస్తారు. డీజీసీఏ నిబంధనలు, ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్‌పై ట్యుటోరియల్, సోలో ఫీల్డ్‌ ఫ్లయింట్‌ టెస్టు, డ్రోన్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్, ఫ్లైట్‌ సిములేటర్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. ఫ్లయిట్‌కు సంబంధించి ప్రాథమికాంశాలు, ఏటీసీ ప్రొసీజర్లు, రేడియోటెలిఫోనీ, ఎమర్జెన్సీ ఐడెంటిఫికేషన్‌ అండ్‌ హ్యాండ్లింగ్‌ గురించి నేర్పుతారు.


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌