• facebook
  • whatsapp
  • telegram

ఈసారి పరీక్షల్లో ప్రశ్నలు భిన్నంగా ఉంటాయ్!

* ఉద్యోగాలంటే కేవలం గ్రూప్స్ మాత్రమే కాదు
* టెన్త్, ఇంటర్ అభ్యర్థులకూ ఉద్యోగ ప్రకటనలు
* సిలబస్‌లో తెలంగాణకు కేటాయించింది 30 శాతమే
* సివిల్ సర్వీసెస్ పరీక్షల దృష్టితో సిలబస్ రూపకల్పన
* ప్రత్యేక ముఖాముఖిలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి

 

దరఖాస్తు దాఖలు నుంచి పరీక్షల నిర్వహణ వరకు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ హాజరులాంటి విలక్షణ విధానాలకు పెద్ద పీటవేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే పరీక్షలు ఎలా ఉండబోతున్నాయి? ప్రశ్నపత్రం ఎలా ఉండొచ్చు?
ఇంజినీరింగ్ ఉద్యోగార్థుల కోసం ఇప్పటికే ప్రకటించిన కొన్ని నోటిఫికేషన్ల నుంచి త్వరలో వెలువడనున్న గ్రూప్స్ ఉద్యోగాల పరీక్షల వరకు ప్రభుత్వోద్యోగ ఆశావహులందరిలోనూ ఆసక్తిరేపుతున్న ప్రశ్నలివే! వాటన్నింటికీ సమాధానం చెబుతున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి!
ఉద్యోగ ప్రకటనల నుంచి ప్రశ్నపత్రాల తీరు మొదలు, ప్రామాణిక పుస్తకాలు సహా సిలబస్‌లో మార్పుల వెనకున్న అసలు ఆంతర్యం వరకు అనేకానేక అంశాలను 'ఈనాడు-ప్రతిభ'కి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ప్రస్తావించారు.

 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా గ్రూప్స్ పరీక్షల సందడే కనిపిస్తోంది. కానీ గ్రూప్స్ ప్రకటన ఎప్పుడు?
ఉద్యోగమన్నా, పబ్లిక్ సర్వీస్ కమిషనన్నా కేవలం గ్రూప్స్ మాత్రమే కావు. 450 బిట్లకు సమాధానాలు గుర్తిస్తే ఉద్యోగం వచ్చేస్తుందనే అపోహతో చాలామంది ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రానికి కావాల్సిన అన్నిరకాల ఉద్యోగాలను భర్తీ చేసే సంస్థ. కేవలం గ్రూప్స్ పరీక్షల నిర్వహణ ఒక్కటే బాధ్యత కాదు. ఇప్పుడిచ్చిన ఉద్యోగాల్లో గ్రూప్స్ అనేవి 450 కూడా లేవు. అంటే పదిశాతం మాత్రమే ఉన్నాయి. 4వేల ఉద్యోగాల్లో 400 పైచిలుకు మాత్రమే గ్రూప్స్. మిగిలిన ఉద్యోగాల్లో కూడా చాలా ముఖ్యమైనవి, ప్రధానమైనవి ఉన్నాయి.

 

కానీ ఇప్పటిదాకా వేసినవి అన్నీ సాంకేతిక విద్య సంబంధిత ఉద్యోగాలే కదా. మిగతా ఎలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయి?
అన్నీ సాంకేతిక విద్య సంబంధిత ఉద్యోగాలే అనిపించటం సహజం. కానీ తెలంగాణ పునర్నిర్మాణంలో అవసరమైన భౌగోళిక, భౌతిక వనరులను సమీకరించుకోవటం ప్రాథమిక ప్రాధాన్యంగా మారింది. చాలావరకు ప్రభుత్వ పథకాలకు అనుగుణమైన సేవలను అందించే ఉద్యోగాలను ప్రకటించాం. వాటర్‌గ్రిడ్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, చెరువులు తదితర అవసరాల ఉద్యోగాలు వచ్చాయి. అలాగే రాబోయే రోజుల్లో చాలా ఉద్యోగాలు వస్తాయి. అవన్నీ డిగ్రీస్థాయి అభ్యర్థులకే అనుకుంటారు. కానీ ఇంటర్మీడియట్ స్థాయి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో బైపీసీ చేసిన వారికి శానిటరీ ఇన్‌స్పెక్టర్, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌లాంటి పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. బహుశా గత 20-30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కమిషన్ వీటిని నిర్వహించి ఉండకపోవచ్చు. చిన్నప్పుడు మనం చూసిన మలేరియా వర్కర్‌లాంటి క్షేత్రస్థాయి ఉద్యోగాలు ఈ మధ్యకాలంలో కనిపించలేదు. కానీ ఇప్పుడు మళ్లీ రాబోతున్నాయి. అకౌంటెంట్ ఉద్యోగాలూ ఉన్నాయి. బీకాం పట్టా సహా కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు వీటికి అర్హులు. ఇవి వందకు పైగా ఉండవచ్చు. త్వరలో ప్రకటన విడుదల చేస్తాం. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో బిల్డింగ్ ఓవర్‌సీయర్‌లాంటి ఉద్యోగాలు, అంతగా ఆదరణ లేదనుకుంటున్న ఐటీఐ అర్హతతో కూడా పోస్టులు రాబోతున్నాయి. ఇంటర్మీడియట్ అర్హతగా ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ పెద్ద ఎత్తున ఇవ్వబోతున్నాం. పదో తరగతి అర్హతతో ఆర్‌టీఏలో కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేస్తాం. అన్నింటిలోనూ తెలంగాణ దృక్పథం, అవగాహన కీలకంగా ఉంటాయి.

 

సిలబస్‌లో తెలంగాణ అంశం ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై మీరేమంటారు?
సిలబస్ మొత్తం తెలంగాణ మయమైందనడం సమంజసం కాదు. కేవలం 30 శాతం మాత్రమే తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. గ్రూప్-1లో ఒక్క ఆరోపేపర్‌లో మాత్రమే పూర్తిగా తెలంగాణపై ఇచ్చాం. అయినా మేం యూపీఎస్సీ తరహాను అనుసరిస్తున్నాం. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సిలబస్‌లో చరిత్ర పెట్టలేదు. కేవలం స్వాతంత్య్ర సంగ్రామం వరకు మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే వలస పాలనలోని అక్రమాలు, మనవాళ్ల పోరాట ప్రాధాన్య క్రమం అర్థమైతే మన దేశ భవిష్యత్తు లక్ష్యాలు అర్థమవుతాయనే ఉద్దేశంతో అలా చేశారు. మేం కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాం. గతంలో జరిగిన ఒప్పందాలు, తప్పిదాలు తెలంగాణకు జరిగిన అన్యాయాలు అభ్యర్థులు తప్పకుండా తెలుసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలకు ఇవన్నీ ఉపయోగపడతాయి. అందుకే యూపీఎస్సీ బాటలో సివిల్ సర్వీస్ పద్ధతిలోనే సిలబస్‌ను రూపొందించాం. కావాలనే ఈ మార్పులు చేశాం.

 

సిలబస్ రూపకల్పనలో ప్రత్యేకమైన లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి. గ్రూప్-1 అనేది 20 ఏళ్లలో రెండు మూడుసార్లు కూడా జరగడం లేదు. జాతీయ స్థాయిలో పోటీ పడాల్సిన అవసరం తెలంగాణ యువకులకే కాదు తెలంగాణకు కూడా ఉంది. 50 ఏళ్ల సివిల్ సర్వీసెస్ చరిత్ర చూస్తే ఎంపికైనవాళ్లలో తెలుగువాళ్లు తక్కువ. అందులో తెలంగాణ వాళ్లు మరీ తక్కువ. తెలంగాణ అభ్యర్థులుమంచి మార్కులు సంపాదించి తెలంగాణ కేడర్‌కు రావటం ఇంకా ఇంకా తక్కువగా ఉంది. చరిత్ర చూస్తే పది పదిహేను మంది కూడా తెలంగాణ వాళ్లు ఆ రాష్ట్ర కేడర్‌కు రాలేదు. ఇది దయనీయమైన పరిస్థితి. ఇది మారాలంటే మన పరీక్షల సిలబస్‌ను మార్చాలని అనుకున్నాం. అందుకే తెలంగాణ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ సిలబస్‌ను, పరీక్ష పద్ధతిని ప్రవేశపెట్టాం. దీంతో అటు సివిల్స్, ఇటు గ్రూప్స్ రాయగలుగుతారు. మార్పులు చేర్పులు కావాలంటే కాలానుగుణంగా చేసుకుంటాం. ఇదేమీ పాఠ్య ప్రణాళిక కాదు. నిపుణులైనవారు సూచనలిస్తే వాటిని పరిశీలించి వచ్చేసారి చేర్చటానికి, సవరించటానికి ప్రయత్నిస్తాం.

 

సిలబస్ మార్పు వెనుక లక్ష్యం అర్థమైంది. కానీ ప్రామాణిక పుస్తకాలపై అభ్యర్థుల్లో సందిగ్ధత ఉంది. దీనిపై మీరేమంటారు?
వర్తమాన చరిత్రకు సంబంధించిన ప్రామాణికత నిత్య అధ్యయనం ద్వారా నిర్ధరించుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి సరైన అవగాహనతో చదివితే ఏ సంఘటనలు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో జరిగాయో అర్థమవుతుంది. వార్తాపత్రికల్లో వచ్చిన చర్చలు, వ్యాసాలు ఇందుకు ఉపయోగపడతాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి కూడా కొన్ని వందల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఆచార్య జయశంకర్ రాసిన 'తెలంగాణ ఒక డిమాండ్' పుస్తకం చూస్తే మూడు తరాల్లో ఏం జరిగిందో తెలుస్తుంది. అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి. వాటికి చాలా ప్రాధాన్యం ఉంది. వాటిలోని అంశాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేరు. అలాగే ఆర్థికాంశాల విషయానికొస్తే 'సెస్' విడుదల చేసిన అనేక నివేదికలు, పరిశోధన పత్రాలు ప్రామాణికాలే. అవన్నీ నెట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక సర్వేలు, మానవాభివృద్ధి సూచికల వంటివన్నీ కూడా ప్రామాణికమే. 'సెస్' దాదాపు 60 పుస్తకాల జాబితా తయారు చేసి అందుబాటులో ఉంచింది. అవి చదవటం అలవాటు చేసుకోవాలి. కేవలం బిట్లు కాకుండా వీటిని సమగ్రంగా అధ్యయనం చేస్తే అవగాహన పెరుగుతుంది. తెలంగాణ చరిత్రపై ఉస్మానియా ఆచార్యులు వంద పుస్తకాల జాబితా తయారు చేశారు. అవి ఉపయోగకరమే. తెలంగాణ చరిత్ర రికార్డు కాలేదనడం సరైన అభిప్రాయం కాదు. ఆంధ్రుల సమగ్ర చరిత్రలోగానీ, సంక్షిప్త చరిత్రలోగానీ తెలంగాణ ప్రస్తావన ఉంది. వాటిలో తెలంగాణకు ప్రాధాన్యం లేకపోవచ్చు. కానీ పూర్తిగా తెలంగాణను విస్మరించి చరిత్ర రాసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ పుస్తకాలు కూడా అధ్యయనానికి ఉపయోగపడతాయి. వాటిని ఏమేరకు ఉపయోగించుకోవాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఇవికాకుండా లైబ్రేరియన్ పాత్రను పత్రికలే పోషిస్తున్నాయి. ఈ సమయంలో సరైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పత్రికలపై ఉంది. శిక్షణ కేంద్రాలుగానీ, మరొకరుగానీ ఎవరికి అందుబాటులో ఉన్నట్లు వారు ప్రకటనలు చేస్తున్నారు. ఏదో బ్యాచ్ పూర్తి చేయాలనే ఆతృతతో కాకుండా సమగ్రంగా అధ్యయనం చేసి అభ్యర్థులకు సరైన సమాచారాన్ని అందించాలి.

 

ఉద్యోగి ఎంపికకు ఎలాంటి వాటిని గీటురాళ్లుగా భావిస్తున్నారు?
కేవలం అర్హతలు, సబ్జెక్ట్‌పరమైన పరిజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా మేం పరీక్షిస్తాం. ముఖ్యంగా తెలంగాణ, ఇక్కడి వనరులు, అవసరాలు, ప్రణాళికలు, వాటి వినియోగం పట్ల అభ్యర్థులకు ఉండే అవగాహనే మాకు ప్రధాన గీటురాయి కాబోతోంది. ప్రాథమికంగా అభ్యర్థులను పరీక్షించడం తెలంగాణ నేపథ్యంలోనే జరుగుతుంది. ఎందుకంటే వాళ్లు చాలా సంవత్సరాలు తెలంగాణకు సేవలందించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అవగాహన లోతుగా ఉందా లేదా అనేది పరీక్షించటానికే ఇంటర్వూలు. చిన్నచిన్న ఉద్యోగాలకు ఇంటర్వూలు ఉండవు. అవసరం లేదు కూడా. కానీ గెజిటెడ్, జిల్లాస్థాయి అధికారుల పోస్టులకు ఎంపికయ్యే వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవటం ప్రభుత్వానికి, కమిషన్‌కు చాలా అవసరం.

 

మరి ఇంటర్వ్యూలు లేని ఉద్యోగాల విషయంలో మీరు చెప్పిన గీటురాళ్లను ఏవిధంగా గుర్తిస్తారు?
ఇంటర్వూలు లేని ఉద్యోగ పరీక్షల్లో ప్రశ్నపత్రం రూపకల్పన ద్వారానే తెలంగాణపై వారికున్న అవగాహనను లోతుగా పరీక్షించటానికి ప్రయత్నిస్తాం. నిర్ణయాలు తీసుకునేవారికి ఉండే పరీక్ష పద్ధతికి, వారి కింద పనిచేసే వారికి ఉండే పరీక్ష పద్ధతికి తేడా ఉంది. ప్రశ్న పత్రాల రూపకల్పనలో భేదం తప్పకుండా ఉంటుంది. ప్రణాళికలు రచించి, విధానాలు రూపొందించి, అమలు చేసేస్థాయిలో వారికి తప్పకుండా ఇంటర్వూలు ఉంటాయి.

 

ప్రశ్నపత్రాల తీరుతెన్నులు ఎలా ఉంటాయి?
ప్రశ్నపత్రం ఎలా ఉంటుందనేది చెప్పలేం. కానీ తప్పకుండా కొత్తగా ఉంటుంది. తెలంగాణ దృక్పథంతో ఉంటుంది. గతానికి భిన్నంగా ఉంటుంది. సమ్మిళితంగా (ఇంక్లూజివ్‌గా) ఉంటుంది. ప్రాపంచిక విషయాలు, తెలంగాణ అంశాలపై వారికుండే లోతైన అవగాహనను పరీక్షించేదిగా ఉంటుంది. ప్రశ్న పత్రాల్లో అన్నిరకాల ప్రశ్నలు ఉంటాయి. కొన్ని అవగాహన, జ్ఞాపకశక్తి, విశ్లేషణ నైపుణ్యాలతోపాటు హేతుబద్ధతను కూడా ప్రశ్నించే విధంగా ఉంటాయి. అలా ఉంటేనే సమగ్ర ప్రశ్న పత్రం అవుతుంది. కేవలం బట్టీ పట్టి పది పాయింట్లు గుర్తుంచుకుంటే మార్కులొస్తాయనే విధంగా ప్రశ్నపత్రం ఉండకూడదు. ప్రశ్నపత్రం రూపొందించేవాళ్లు అది తప్పకుండా దృష్టిలో పెట్టుకునే విధంగా చూస్తాం.

Posted Date: 23-10-2019


 

SLIDER

మరిన్ని