• facebook
  • whatsapp
  • telegram

'లక్ష' లక్ష్యం ఖాయం!

* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పకడ్బందీగా చర్యలు
* త్వరలో మరో 10వేల ఖాళీలు వస్తున్నాయి
* జిల్లాల విభజన తర్వాతే డీఎస్సీ ఉండొచ్చు
* 'ఈనాడు'తో ప్రత్యేక ముఖాముఖిలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఆచార్య ఘంటా చక్రపాణి

 

ఈనాడు - హైదరాబాద్‌: లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగులందరినీ సంతృప్తిపరచలేకున్నా..భారీ సంఖ్యలోనే ప్రభుత్వ నియామకాలు జరుగనున్నాయని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఆచార్య ఘంటా చక్రపాణి భరోసా ఇచ్చారు. నీళ్లు, నిధుల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో నియామకాలకూ ఢోకా ఉండదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కూడా లక్ష్యం మేరకు సాగుతుందని తెలిపారు. లక్ష ఉద్యోగాల లక్ష్యం నెరవేరుతుందని ధీమా వ్యక్తం జేశారు. అయితే, ఒకేసారి లక్ష ఉద్యోగాలు భర్తీ చేయటం కుదరదని, ఉద్యోగుల విభజన పూర్తయి సమగ్రపాలన వ్యవస్థ రూపుదిద్దుకునేదాక క్యాలెండర్‌ వేయలేమని ఆయన స్పష్టం చేశారు. భారీ గ్రూప్‌-2 పరీక్షకు ప్రకటన వెలువడటంతోపాటు టీఎస్‌పీఎస్సీ ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఈనాడు’కిచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో నిరుద్యోగుల మదిలో మెదులుతున్న అనేక అంశాలపై ఆయన స్పందించారు.

 

రెండేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షల్ని ఏమేరకు నెరవేర్చామనుకుంటున్నారు?
ఏ సంస్థకైనా, ఏ రాష్ట్రానికైనా నిరుద్యోగుల ఆకాంక్షల్ని పూర్తిచేయటం సాధ్యంగాని పని. మాకిచ్చిన పరీక్షల్ని నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం. ఎలాంటి అవకతవకలకు స్థానం ఉండదనే నమ్మకాన్ని మాత్రం మా కమిషన్‌ కల్పించగలిగింది. ఆ విధంగా చూసినప్పుడు టీఎస్‌పీఎస్సీ ఈ రెండేళ్లలో తన విధిని నిర్వర్తించటంలో సంపూర్ణంగా విజయవంతమైందనే భావిస్తున్నా.

 

ఉద్యోగాల భర్తీకి సంబంధించి కచ్చితమైన క్యాలెండర్‌ విడుదల చేయాలన్న తెలంగాణ విద్యావంతుల డిమాండ్‌పై ఏమంటారు?
సమాజంలోని ఆకాంక్షల్ని ఆ డిమాండ్‌ ప్రతిబింబిస్తుంది. దాన్ని తప్పుపట్టలేం. కానీ, ఉద్యోగాల భర్తీ తీరును, నియామకాల పద్ధతిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తనంత తానుగా ఉద్యోగాల క్యాలెండర్‌ తయారు చేయలేదు. రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా ఇంకా పాలనావ్యవస్థ కుదుట పడలేదు. ఉద్యోగుల విభజన, తరలింపు ఇంకా పూర్తికాలేదు. ఏ అధికారి ఎక్కడుంటారో ఇంకా చెప్పలేని పరిస్థితి. యూపీఎస్సీ తరహా వ్యవస్థ ఏర్పడాలంటే సమగ్రమైన పాలన స్వరూపం వచ్చాకే సాధ్యమవుతుంది.

 

జాప్యం చేయకుండా లక్ష ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయాలనే వాదన కూడా ఉందిగదా!
ఉద్యోగాల కల్పన అనేది ఆకాంక్షల ఆధారంగాకాకుండా ప్రభుత్వ, ప్రజల అవసరాల మేరకు జరుగుతుంది. అదీ పరిమిత సంఖ్యలోనే జరుగుతుందనేది అంతా గుర్తించాలి. ఒకేసారి అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలివ్వటం రాజ్యాంగ విరుద్ధం కూడా! ప్రపంచంలో ఏ ప్రభుత్వంగానీ, వ్యవస్థగానీ ఒకేసారి లక్ష ఉద్యోగాలు భర్తీ చేయదు. చేయలేదు. నియామకాలు ఓ నిరంతర ప్రక్రియ.

 

ప్రభుత్వం అనుమతినిచ్చాక కూడా జాప్యం జరుగుతోందెందుకు?
ప్రభుత్వం అనుమతినివ్వగానే ప్రకటన వెలువరించలేం. ఆయా విభాగాలు స్పందించి ఆ ఉద్యోగాల (ప్రతి పోస్టుకు సంబంధించి) వివరాల్ని, నిబంధనలను, రోస్టర్‌ పద్ధతులను కమిషన్‌కు అందజేయాలి. ఆ తర్వాత దరఖాస్తులకు గడువివ్వటం, విద్యార్థులకు చదువుకోవటానికి సమయం, పరీక్ష..ఫలితాలు... తదితర ప్రక్రియలు ఉంటాయి. చాలా రాష్ట్రాలకు భిన్నంగా మనకో జిల్లా... జోనల్‌, రాష్ట్రస్థాయి వ్యవస్థ ఉంది. ఫలితాలకు ముందు ఆ లెక్కలు తీయటం పెద్దపని. ఒక నియామక పరీక్ష సజావుగా పూర్తికావటానికి ఎంతలేదన్నా ఐదు నెలల సమయం పడుతుంది. అన్నీ సక్రమంగా ఉన్న యూపీఎస్సీకే ఒక్కో నియామకం పూర్తి చేయటానికి ఏడాది వ్యవధి పడుతోంది. ఇంత ఇబ్బందున్నా 2 నుంచి వెయ్యి పోస్టుల దాకా ఉన్న నియామకాలు ఏడాదిలో దాదాపు 22రకాలు పూర్తి చేశాం. కొన్ని సందర్భాల్లో బయటిశక్తుల ప్రభావం వల్ల వాయిదాలు వేయాల్సి వస్తోంది. కోర్టుల జోక్యం వల్ల జాప్యం జరుగుతోంది.

 

అలా ఆగినవి ఎన్ని?
ఏడాదిలో ఐదువేల ఉద్యోగాలిచ్చాం. 1300 పోస్టుల దాకా న్యాయస్థానాల్లో వ్యాజ్యాల వల్ల ఆగిపోయాయి. హైకోర్టు విభజన జరగకపోవటం... న్యాయస్థానంపై పనిఒత్తిడి, ప్రతి చిన్నవిషయానికి అభ్యర్థులు కోర్టులకు వెళ్లటం... నిలుపుదల ఉత్తర్వు(స్టే)లు తెచ్చుకుంటుండటం కూడా నియామకాల్లో జాప్యానికి కారణమవుతోంది. న్యాయవ్యవస్థ మాదిరిగానే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కూడా రాజ్యాంగ ప్రతిపత్తికి లోబడే పనిచేస్తుంది. ఆ పరిమితులను దాటి మేం వెళ్లినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే బాగుంటుంది. వ్యవసాయ శాఖలో పలు పోస్టుల నియామకాలు న్యాయస్థానంలో వ్యాజ్యాల కారణంగా ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వ శాఖాధిపతుల అలసత్వం వల్ల కూడా నియామకాలు ఆలస్యమవుతున్నాయి. ఏడాది కిందట ప్రభుత్వం అనుమతిచ్చిన కొన్ని పోస్టులకు మున్సిపల్‌ పరిపాలన శాఖ ఇంతవరకూ వివరాలు పంపించలేదు.

 

ఎంసెట్‌ లీకేజీల అనుభవం నేపథ్యంలో గ్రూప్‌-2 నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ఎంసెట్‌లాంటి ఇబ్బంది గ్రూప్‌-2కు ఉండదు. ఆ విషయంలో అభ్యర్థులు నిశ్చింతగా ఉండొచ్చు. ఇప్పటిదాకా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాం. ఇకముందు కూడా అలాగే నిర్వహిస్తాం. తాజా అనుభవాల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉంటాం.

 

గ్రామీణ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మౌఖిక పరీక్ష తీసేసే అవకాశముందా?
మౌఖిక పరీక్షల విషయంలో చాలామందిలో అపోహలున్నాయి. చిన్నస్థాయి పోస్టులకు ఇంటర్వ్యూలు వద్దని ప్రధాని నరేంద్రమోదీ కంటే ముందే మా కమిషన్‌ చెప్పింది. అలాగే చేస్తున్నాం కూడా! కానీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, గెజిటెడ్‌ పోస్టులు... మున్ముందు ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందే పోస్టులకు కూడా మౌఖిక పరీక్ష వద్దంటే ఎలా? తహసీల్దార్‌ కాబోయే వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, విశ్లేషణ చతురతలను అంచనా వేయకుండా ఎలా ఎంపిక చేస్తాం? పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రాజ్యాంగబద్ధ సంస్థగా తన విధులను తాను నిర్వచించుకుంటుంది. అంతేగాని కమిషన్‌ ఎలా పనిచేయాలో, పరీక్షలెలా నిర్వహించాలో అభ్యర్థులు నిర్దేశించలేరు. ఇక మౌఖిక పరీక్షలో గ్రామీణ విద్యార్థులు, పట్టణ విద్యార్థులనే తేడా ఏమీ ఉండదు. మౌఖిక పరీక్షల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మౌఖిక పరీక్ష మార్కులు రాతపరీక్ష మార్కుల ప్రభావాన్ని తారుమారు చేయకుండా సంస్కరణలు తీసుకొచ్చాం.

 

మున్ముందు కూడా గ్రూప్‌-2 ఇలాగే ఉంటుందా?
గ్రూప్‌-2 ఇప్పటికైతే ఇదే పద్ధతిలో ఉంటుంది. భవిష్యత్తులో ఇలాగే ఉంటుందని చెప్పలేం. చాలారాష్ట్రాల్లో గ్రూప్‌-2 స్థాయి నియామకాలకు రాతపరీక్ష అమల్లో ఉంది. మన దగ్గర కూడా అలానే ఉండాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగదా అనే ఉద్దేశంతో ఈసారికి ఆబ్జెక్టివ్‌ విధానంలోనే పరీక్ష పెడుతున్నాం. ప్రతిసారీ ఇలాంటి సడలింపు ఉండకపోవచ్చు. మున్ముందు మారొచ్చు!

 

రాబోయే రోజుల్లో ఎన్ని నియామకాల్ని ఆశించొచ్చు?
ఇప్పటిదాకా భర్తీ చేసిన ఐదువేలేగాకుండా ఇంకా పదివేల దాకా పోస్టులు మా చేతుల్లో ఉన్నాయి. కొత్తజిల్లాల నేపథ్యంలో మరికొన్ని పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కూడా ఈ మేరకు సూచన చేశారు. తెలంగాణలో నీళ్లు, నిధులకు కొరత లేకుండా చూసినట్లే... నియామకాలు కూడా జోరుగానే ఉంటాయి. రాబోయే రోజుల్లో చాలా ఉద్యోగాలు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో లక్ష ఖాళీలుంటే 11 లక్షల మంది నిరుద్యోగులున్నారు. కాబట్టి అందరినీ సంతృప్తి పర్చలేకున్నా లక్ష ఉద్యోగాల లక్ష్యం మాత్రం పూర్తవుతుంది. ఈ నెల వెటర్నరీ నియామకాలు, వచ్చేనెల గురుకులాలు... ఆ తర్వాత డాక్టర్లు ఇలా వరుసలో ఉన్నాయి. వీటన్నింటినీ డిసెంబరులోగా పూర్తి చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం మాచేతిలో ఏడాదికి సరిపడా నియామకాలున్నాయి.

 

డీఎస్సీకి మరికొంత సమయం పట్టొచ్చు..
ఉపాధ్యాయుల నియామకాల్లో తొలి అంచెగా గురుకులాల్లో భర్తీ జరుగుతుంది. ఐదువేలకుపైగా పోస్టులు రాబోతున్నాయి. అన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతేగాకుండా వీటిలో బోధనేతర సిబ్బంది పోస్టులూ ఉన్నాయి. డీఎస్సీని కూడా కమిషన్‌కే అప్పగించారు. అయితే, దానిపై ఇంకా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతున్నట్లుంది. సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో భర్తీ చేస్తారు. అయితే, అవి జిల్లాస్థాయి పోస్టులు. కాబట్టి జిల్లాల విభజన పూర్తయ్యాక... ఏ జిల్లావారిని ఆ జిల్లాలో సర్దిన తర్వాత జిల్లాల్లో అవసరాలు, ఖాళీల వివరాలపై స్పష్టత వస్తుంది. ఆ తర్వాత డీఎస్సీ ఉండే అవకాశముంది.

 

విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల భర్తీపై..
ప్రభుత్వం ఆదేశించినవీ... చట్టప్రకారం ఉన్నవాటికి వేటికైనా మేం నియామకాలు చేస్తాం. ప్రభుత్వం చెప్పాక మేం వెనకంజ వేయటం ఉండదు. అయితే, అవి నిబంధనల మేరకు ఉన్నాయో లేదో చూడమంటాం! ఇప్పటికే ఓ విశ్వవిద్యాలయం తమ నియామకాలు చేపట్టాల్సిందిగా మమ్మల్ని కోరింది. కొన్ని నిబంధనల విషయంలో వారికి సూచనలు చేశాం.

 

Posted Date: 23-10-2019


 

SLIDER

మరిన్ని