• facebook
  • whatsapp
  • telegram

సాంఖ్యక శాస్త్రవేత్త సీఆర్‌రావుతో ఇంటర్వ్యూ

* వ్యాపారం వైపు యువత చూపు
* ఉద్యోగం వద్దనుకుంటున్నారు
* రిస్కు తీసుకోవడానికి వెనుకాడడం లేదు
* 'విద్యాసంస్థలు- పరిశోధన కేంద్రాలు- ప్రభుత్వం' సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.

నేటి యువతీయువకుల్లో సొంతంగా ఏదైనా చేయాలనే తపన పెరుగుతోంది, అందుకే ఉద్యోగానికి బదులు వ్యాపారం వైపు వారు మొగ్గు చూపుతున్నారు, రెండు మూడు దశాబ్దాల కిందట ఇలాంటి ధోరణి లేదని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) కార్యనిర్వాహక సంచాలకుడు (ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌- ఈడీ) డాక్టర్‌ కృష్ణ తణుకు అంటున్నారు. 1970- 80 దశకంలో చదువు పూర్తయిన ప్రతి ఒక్కరి లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే. ఆ తరువాత కాలంలో బడా కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగం గాని, లేదా అమెరికాకు వెళ్లడానికి గాని యువత ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడేమో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, పారిశ్రామికవేత్తగా ఎదగాలని ముందుకు వస్తున్నారని ఆయన 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. యువతరం ఆలోచనలకు అనుగుణంగా తగిన అవకాశాలు కల్పించేందుకు 'విద్యాసంస్థలు- పరిశోధన కేంద్రాలు- ప్రభుత్వం' సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కృష్ణ అభిప్రాయపడ్డారు. ఐఎస్‌బీలోని వాధ్వానీ సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ (డబ్లూసీఈడీ) ఈ దిశగా తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే...

మనకు వ్యాపారవేత్తల సంస్కృతి (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కల్చర్‌) కొత్త కాదు. ఆ మాట కొత్తదంతే. ఓసారి వెనుదిరిగి చూస్తే జేఆర్‌డీ టాటా, నారాయణమూర్తి వంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు కనిపిస్తారు. కానీ గతంతో పోల్చితే ఇప్పుడు రిస్కు తీసుకోవడానికి సిద్ధపడుతున్న యువకుల సంఖ్య పెరుగుతోంది. ఫలానా వ్యక్తి వ్యాపారవేత్తగా ఎదగగా లేనిది నేనెందుకు చేయకూడదనే పట్టుదల వారిలో కనిపిస్తోంది. ఉద్యోగం చేస్తూ కాలం గడపడానికి బదులు ఏదైనా సాధించాలని తపన పడుతున్నారు. అంతేకాకుండా మంచి వ్యాపారాలోచన ఉండాలే కానీ నిధుల లభ్యత ఇప్పుడు సమస్యే కాదు. సీడ్‌ ఫండింగ్‌ నుంచి వీసీ/ పీఈ నిధుల వరకూ... సందర్భాన్ని, అవసరాన్ని బట్టి నిధులు సమీకరించే మార్గాలు ఉన్నాయి. వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక నైపుణ్యం కూడా కొత్తగా వ్యాపారవేత్తలు తయారుకావడానికి తోడ్పడుతోంది. వ్యాపారం పెట్టాలంటే పెద్ద ఫ్యాక్టరీ స్ధాపన అనే కాకుండా, రెండు మూడు కంప్యూటర్లతో ఒక గదిలో కూర్చొని వ్యాపారం చేసే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ కలసి వ్యాపారవేత్తల సంస్కృతి ఎదిగేందుకు దోహదపడుతున్నాయి.

 

విజయం సాధించే వారెవరంటే..
నా దగ్గర చాలా డబ్బు ఉంది. నేను విజయవంతంగా వ్యాపారం చేయగలనా? అని అడిగితే లేదని జవాబు చెప్పాలి. వ్యాపారంలో విజయం దక్కాలంటే, అది ఒక వ్యాపారవేత్త అందించదలచిన వస్తువు/ లేదా సేవ వినియోగదార్లకు ఎంతవరకు అవసరం.. అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇదొక వస్తువు తయారు చేశాను, కొనండి - అని వినియోగదార్లకు అవసరం లేని వస్తువును తీసుకు వెళ్తే ఎందుకు కొంటారు? కొనరు గాక కొనరు. వ్యాపారవేత్త కావడం అనేది తనొక్కడే అనుకొని చేసేది కాదు, సమాజంలో ప్రజల మధ్య, ప్రజలతో కలసి చేసేదే వ్యాపారం. ఈ విషయాన్ని కొత్తగా వ్యాపారవేత్త కావాలనుకునే వారు గుర్తించాలి.

 

ల్యాబ్స్‌ నుంచి మార్కెట్‌కు వచ్చే ప్రయోగాలేవి?
మన దేశంలో పరిశోధన కేంద్రాలకు కొదువ లేదు. 100 బిలియన్‌ డాలర్లు పరిశోధనలపై వెచ్చిస్తున్నాం. కానీ వాణిజ్యీకరణ (కమర్షియలైజేషన్‌)కు అనువైన ప్రయోగాలేమీ రావడం లేదు. వినియోగదారుకు అవసరమైన వస్తువులు, సేవల ఆవిష్కరణ దిశగా ప్రయోగాలు సాగడం లేదు. విద్యా సంస్థలు- పరిశోధన కేంద్రాలు- వ్యాపార సంస్థల మధ్య బలమైన బాంధవ్యం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. మనది 100 కోట్లకు పైబడిన జనాభా ఉన్న దేశం. అతి పెద్ద మార్కెట్‌. ప్రజల అవసరాలకు అనుగుణంగా వచ్చే పదేళ్లలో 12 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలను తయారు చేసుకోవడమే దీనికి మార్గం. అందుకు అవసరమైన ప్రోత్సాహం పరిశోధన రంగం నుంచే రావాలి. పరిశోధనల ఆధారంగా కొత్త వ్యాపారవేత్తలు పుట్టుకువస్తారు.

 

ప్రభుత్వ విధానాల్లో లోపాలు
వ్యాపారవేత్తలను తయారు చేసుకునే దిశగా ప్రభుత్వ విధానాలు లోపాలతో కూడి ఉన్నాయి. ఎస్‌ఈజడ్‌లను నెలకొల్పారు, అందులో యూనిట్లు చైనా నుంచి తెచ్చి వస్తువులను కూర్పు ( అసెంబుల్‌) చేస్తున్నాయే గాని ఇక్కడే ఉన్న ఎస్‌ఎంఈల నుంచి కొనుగోలు చేయడం లేదు. రాయితీలు ఇవ్వడం ద్వారా వ్యాపారవేత్తలను ఆకర్షించాలని తప్పిస్తే సానుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించడం ద్వారా వ్యాపారవేత్తలు వారంట వారే వచ్చి పరిశ్రమలు నెలకొల్పే విధంగా చేయవచ్చని ప్రభుత్వం అనుకోవడం లేదు. ఫలానా చోట, ఫలానా పరిశ్రమ పెడితే పన్ను రాయితీ ఇస్తానని ప్రభుత్వం చెబుతుంది, కానీ కొరియాలో వర్తక ప్రదర్శన- జర్మనీలో పారిశ్రామిక ప్రదర్శన ఉంది, వెళ్లే వారికి ఖర్చులు భరిస్తాం- అని ప్రభుత్వం చెప్పడం లేదు. మార్కెటింగ్‌ నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అమలు చేయడం లేదు. కొత్త సంస్థల స్ధాపన మీద దృష్టి సారిస్తున్నారు.. వాటిలో ఎన్ని మనగలుగుతున్నాయి... అనే ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ఇటువంటపుడు పుట్టిన సంస్థల్లో అత్యధిక భాగం కొద్దికాలానికే కనుమరుగవుతాయి. మనదేశంలో వ్యవసాయ రంగంలో ఎటువంటి కొత్తదనం లేదు. వ్యవసాయ రంగంలోని వారికి తగిన శిక్షణ, శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించడం లేదు. రైతులు పండించిన పంటను యథాతథంగా విక్రయించడం తప్పిస్తే, దాన్ని ప్రాసెస్‌ చేసి అధిక విలువైనదిగా తయారు చేసి అమ్మేందుకు రైతాంగానికి ప్రోత్సాహం లేదు. పరిశ్రమల స్థాపన, వ్యాపారవేత్తగా ఎదగడం అంటే పెద్ద పరిశ్రమలు పెట్టడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం మాత్రమే కావు, చిన్నచిన్న ప్రాసెస్‌ యూనిట్ల స్థాపన కూడా పరిశ్రమే.

 

వచ్చే రెండేళ్లలో ఐఎస్‌బీ లక్ష్యం ఇదీ..
దశాబ్ద కాలం క్రితం ఐఎస్‌బీలో వాధ్వానీ సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ (డబ్లూసీఈడీ) ఏర్పాటైంది. విద్యార్థు´లను పరిశ్రమల స్ధాపన వైపు మళ్లించడం ఈ కేంద్రం లక్ష్యం. ఇప్పటివరకు మంచి ఫలితాలను రాబట్టగలిగాం. వచ్చే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల నుంచి 500-800 మంది విద్యార్ధులను ఎంపిక చేసి వారిని పరిశ్రమల స్థా´పన వైపు మొగ్గు చూపే విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. వ్యాపారవేత్తగా ఎదగాలనుకునే వారికి హైదరాబాద్‌లో అనువైన వాతావరణం కూడా ఉంది. కానీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లేదు. ఈ లోపాన్ని సరిదిద్దాలి.

 

Posted Date: 24-10-2019


 

SLIDER

మరిన్ని