• facebook
  • whatsapp
  • telegram

ఇస్రో మాజీ శాస్త్రవేత్త సుబ్బారావు తో ఇంటర్వ్యూ

* ఇంజినీరింగ్ కళాశాలలకు రేటింగ్ ఇవ్వాలి
* దీనివల్ల విద్యాప్రమాణాలు పెరుగుతాయిు
* యాజమాన్యాల వైఖరి మారాలి
* కాలేజీలంటే కేవలం వ్యాపారమే కాదు
* ప్రమాణాలు లేకే నిరుద్యోగం
* ఆంగ్లంలో నైపుణ్యం, విషయ పరిజ్ఞానం ఉంటే ఏ కోర్సుతోనైనా మంచి భవిష్యత్తు

ఇంజినీరింగ్ కళాశాలల పనితీరు తెలుసుకోవటానికి అవసరమైన సమాచారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందుబాటులో ఉండాలని ఇస్రో మాజీ శాస్త్రవేత్త, అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ పావులూరి సుబ్బారావు (60) పేర్కొన్నారు. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గటానికి వీలుగా ఆంగ్లంలో నైపుణ్యం, విషయం పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావటం తగదని హితవు పలికారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడ గ్రామానికి చెందిన సుబ్బారావు ఇస్రోలో 15 ఏళ్లపాటు శాస్త్రవేత్తగా పని చేశారు. నేటి ఇంజినీరింగ్ విద్యకు సంబంధించిన పలు అంశాలపై 'న్యూస్‌టుడే'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

» దేశంలోకెల్లా అత్యధికంగా ఇంజినీరింగ్ కళాశాలలు మన రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ.. విద్యా ప్రమాణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి?
అమెరికాలో విశ్వవిద్యాలయాలకు ప్రతి ఏడాది కొన్ని పేరొందిన ఏజెన్సీలు రేటింగ్ ఇస్తుంటాయి. దీనికోసం సుమారు 30 అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఇంత పకడ్బందీగా జరిపే ఈ రేటింగ్ ప్రక్రియ.. అక్కడి విద్యార్థులకు.. ఏ కాలేజీని ఎన్నుకోవాలన్న అంశంలో ఎంతగానో తోడ్పడుతోంది. మన దగ్గరా ఇటువంటి విధానం అవసరం చాలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా స్వతంత్ర ఏజెన్సీ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో పారదర్శకంగా రేటింగ్ ఇవ్వాలి. దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీల విషయంలో జాగ్రత్తపడతారు. ప్రమాణాలు పాటించని కళాశాలలు కాలక్రమంలో కనుమరుగవుతాయి. పనితీరు బాగా ఉన్నవే మనుగడ సాగిస్తాయి. ఈ క్రమంలో విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి. అధ్యాపకులకు సరైన వేతనాలు, ఇతర సౌకర్యాలు అందజేయటం కూడా ముఖ్యమైన విషయం. ఇవి ఉన్నప్పుడే వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. వేతనాల కోసం ఇతర రంగాలపై దృష్టి పెట్టరు. కళాశాలలను మారుమూల ప్రాంతాల్లో నెలకొల్పినప్పుడు.. బిట్స్‌లాంటి సంస్థల్లో ఉన్నట్టుగా మంచి సదుపాయాలను ఏర్పాటు చేయాలి. లేనట్త్టెతే ఆశించిన ఫలితాలు రావు.

» మీ కాలంనాటి ఇంజినీరింగ్ విద్యకు.. ప్రస్తుత ఇంజినీరింగ్ విద్యకు ఎటువంటి తేడాలున్నాయి?
చాలా తేడా ఉంది. నేను బీటెక్‌ను కేరళలో పూర్తి చేశాను. అప్పట్లో ఇంజనీరింగ్ ఐదేళ్ల కోర్సు. కానీ, మూడో సంవత్సరం నుంచే ప్రాజెక్టువర్క్ కింద పరిశ్రమలకు వెళ్లేవాళ్లం. నేను బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భెల్ తదితర భారీ పరిశ్రమలను సందర్శించాను. సబ్జెక్టుపై, పరిశ్రమల అవసరాలపై అవగాహన పెంచుకునేందుకు ఇది దోహదపడింది. ప్రస్తుత ఇంజినీరింగ్ విద్య ఆవేదన కలిగిస్తోంది. పరిశ్రమలతో కళాశాలల యాజమాన్యాలకు సంబంధాలే ఉండటం లేదు. కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రాజెక్ట్‌వర్క్ రిపోర్టులపై సంతకాలు చేయటానికి మాత్రమే పరిమితమవుతున్నారు. దీనివల్ల పరిశ్రమల గురించి ప్రత్యక్ష అవగాహన లేక విద్యార్థులు నష్టపోతున్నారు.

» ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సిన ప్రస్తుత పరిస్థితులపై మీ అభిప్రాయం?
ప్రమాణాలు లేని కళాశాలల నుంచి వస్తున్న వారికి వెంటనే ఉద్యోగాలు లభించటం లేదు. దీనివల్ల హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో రకరకాల కంప్యూటర్ కోర్సులను అదనంగా చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోతోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కళాశాల యాజమాన్యాల వైఖరే. కాలేజీ నిర్వహణలో యాజమాన్యాలు లాభపేక్షతో ఉండటంలో తప్పులేదు. కానీ ప్రమాణాలు కలిగిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామా? లేదా? అన్నదానిపై నిరంతర సమీక్ష మాత్రం జరగటం లేదు. దీనివల్లే అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. ఇంజినీరింగ్ కళాశాలలు వ్యాపారం కింద కాకుండా సొసైటీ కింద ఏర్పడుతున్న విషయాన్ని యాజమాన్యాలు గుర్తించి.. అందుకు తగ్గట్లుగా ప్రవర్తించాలి.

» విద్యార్థుల భవిష్యత్తులో తల్లిదండ్రుల పాత్ర ఎంత?
మేము చదువుకునే రోజుల్లో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొమ్మని మాత్రమే తల్లిదండ్రులు చెప్పేవారు. వారి మాటలను గౌరవిస్తూ సీనియర్లు, శ్రేయోభిలాషుల ప్రోత్సహంతో ముందుకు వెళ్లేవాళ్లం. ప్రస్తుతం తల్లిదండ్రుల దృక్పథం మారింది. తోటి విద్యార్థులకంటే ఒక్క మార్కుతో తమ పిల్లలు వెనుకబడినా నేటి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లలను చదవమని ప్రోత్సహించాలి కానీ ఫలానాకోర్సులో మాత్రమే చేరాలంటూ ఒత్తిడి తీసుకురాకూడదు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును శాసించకూడదు.

» ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగావకాశాలను ఎలా మెరుగుపరుచుకోవాలి?
ఇంజినీరింగ్ డిగ్రీ చేతికొచ్చినంత మాత్రాన ఉద్యోగం రాదు. ఆంగ్లంలో స్పష్టంగా మాట్లాడడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం వంటి అంశాల్లో విద్యార్థులు ముందుండాలి. ఈ సామర్థ్యాలు ఉన్నప్పుడు ఏ కోర్సులో ఇంజినీరింగ్ చేసినా భవిష్యత్తుకు ఢోకా ఉండదు.

» ఏరోస్పేస్ రంగంలో ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి?
బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతరిక్ష, రక్షణ రంగాల్లో ఇంజినీర్ల అవసరం పెద్ద ఎత్తున ఉంది. ప్రస్తుతం ఇస్రో ఏడాదికి ఎనిమిది ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. ఈ సంఖ్యను 12 నుంచి 20 వరకు క్రమేణ పెంచేందుకు కేంద్రప్రభుత్వం భారీఎత్తున ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అలాగే, రక్షణ అవసరాలకు విదేశాల నుంచి కొనుగోళ్లకు వెచ్చించే మొత్తంలో 30 శాతం నిధులను దేశంలో విడిభాగాల తయారీకి వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల ఇంజినీరింగ్ ఆధారిత పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరగనుంది.

Posted Date: 02-11-2019

SLIDER

మరిన్ని