• facebook
  • whatsapp
  • telegram

ఆర్మీలో చేరతారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆగ‌స్టు 16 నుంచి 31 వ‌ర‌కు ర్యాలీ

ఎనిమిది, పది తరగతులు, ఇంటర్మీడియట్‌ చదివినవారికి సైన్యంలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 16 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఫిజికల్, మెడికల్, రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనంతరం స్టైపెండ్‌తో కూడిన శిక్షణ ఉంటుంది. దాన్ని విజయవంతంగా పూర్తిచేసినవారిని విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరినవారు మొదటి నెల నుంచే సుమారు రూ.35 వేల వేతనంతోపాటు ఎన్నో ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు.  

ఆర్మీలో ప్రారంభ స్థాయి (ఎంట్రీ లెవెల్‌) ఉద్యోగాల భర్తీకి ప్రాంతాలవారీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్రం లేదా అందులోని కొన్ని జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి స్థానికులకు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఈ పోస్టుల్లో చేరినవారు లెవెల్‌-3 మూల వేతనం రూ.21,700తోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే పొందవచ్చు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. అందువల్ల మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం లభిస్తుంది. భవిష్యత్తులో వీరు దశలవారీ సిపాయ్, నాయక్, హవల్దార్, నయీబ్‌ సుబేదార్, సుబేదార్, సుబేదార్‌ మేజర్‌ హోదా వరకు చేరుకోవచ్చు. 15 ఏళ్ల సేవలతో జీవితాంతం పూర్తి పింఛను పొందవచ్చు. 

ఎవరికంటే...

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందినవారితోపాటు యానాం పరిధిలోనివారు ఇందులో పాల్గొనవచ్చు. ఇతర ప్రాంతాలవారికి అవకాశం లేదు. ప్రస్తుతం వీటికోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివరాలు ‘జాయిన్‌ ఇండియన్‌ ఆర్మీ’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు ర్యాలీలో ఎప్పుడు పాల్గొనాలి, అవసరమైన పత్రాల వివరాలు అందులో పేర్కొంటారు. నియామకాల్లో భాగంగా ముందుగా పత్రాలు పరిశీలిస్తారు. అనంతరం దేహదార్ఢ్య, శారీరక కొలతల పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు ఉంటాయి. క్రీడల్లో ప్రతిభావంతులకు కొన్ని సడలింపులు వర్తిస్తాయి. 

ఇవీ పోస్టులు

సోల్జర్‌ ట్రేడ్స్‌మన్‌: ఈ విభాగంలో కొన్ని ఉద్యోగాలకు ఎనిమిదో తరగతి విద్యార్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. హౌస్‌ కీపర్, మెస్‌ కీపర్, గుర్రాల పర్యవేక్షణ పోస్టులు ఈ విద్యార్హతతో లభిస్తాయి. ట్రేడ్స్‌మన్‌ విభాగంలో పదో తరగతి విద్యార్హతతో..చెఫ్, వాషర్‌ మెన్, డ్రెస్సర్, స్టివార్డ్, టైలర్, ఆర్టిజన్‌ (వడ్రంగి/ ఇస్త్రీ/ తాపీపని) మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అన్ని పోస్టులకు వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తు, దానికి తగ్గ బరువు తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం 76 సెం.మీ. ఉండాలి. 

సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ: పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు, సోల్జర్‌ జనరల్‌ డ్యూటీకి అర్హత లభించినట్టే. వయసు 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తుతోపాటు సరిపడే బరువు ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి.   

సోల్జర్‌ టెక్నికల్‌: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు సోల్జర్‌ టెక్నికల్‌ పోస్టులకు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందాలి. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు 165 సెం.మీ., బరువు తగినంత, ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ.తప్పనిసరి. 

సోల్జర్‌ టెక్నికల్‌ (ఏవియేషన్‌): మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు సోల్జర్‌ టెక్నికల్‌ (ఏవియేషన్‌) పోస్టులకు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు 165 సెం.మీ., అందుకు తగ్గ బరువు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ.అవసరం.

సోల్జర్‌ క్లర్క్, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌: ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌లో 60 శాతం మార్కులు పొందినవాళ్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఇంటర్‌ లేదా పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు అవసరం. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు, ఎత్తు 162 సెం.మీ. అవసరం. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. తప్పనిసరి. 

సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌: ఆర్మీ మెడికల్‌ కాప్స్‌ (ఏఎంసీ)లో ఈ పోస్టులు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు వీటికి అర్హులు. అలాగే ప్రతి సబ్జెక్జులోనూ కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. 

ఫిజికల్‌ టెస్టులు

అన్ని పోస్టులకూ ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధించడం తప్పనిసరి. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 5 ని. 30సెకన్లలో పూర్తిచేస్తే 60 మార్కులు, 5ని. 31సె నుంచి 5ని. 45సె. లోపు పూర్తిచేస్తే 48 మార్కులు కేటాయిస్తారు. కనీసం 6 పుల్‌అప్స్‌ తీయడం తప్పనిసరి. 6 తీసినవారికి 16, 7 తీస్తే 21...10 తీస్తే 40 మార్కులు పొందవచ్చు. అనంతరం ఫిజికల్‌ మెజర్‌మెంట్, మెడికల్‌ టెస్టులు ఉంటాయి. వీటన్నింటిలో అర్హత సాధించినవారికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు అవసరమైన పత్రాలు తీసుకెళ్లడం తప్పనిసరి.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 3.

హాల్‌ టికెట్లు: ఆగస్టు 9 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ర్యాలీ: ఆగస్టు 16 నుంచి 31 వరకు కొనసాగుతుంది. 

వేదిక: ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్టణం.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/
 

Posted Date : 30-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌