• facebook
  • whatsapp
  • telegram

అర్హతకు తగిన ఆర్మీ కొలువులెన్నో! 

టెన్త్ నుంచి పీజీ వ‌ర‌కు విద్యార్హ‌త‌ల‌తో విభిన్న ఉద్యోగాలు

 

 

సైన్యంలో ఉద్యోగం అంటే... దేశానికి సేవ ఒక్కటే కాదు; ఆకర్షణీయ వేతనం, పదోన్నతులూ,  ప్రోత్సాహకాలూ.. ఇవన్నీ! వీటిపై ఆసక్తి ఉన్నవారు ఉన్నత  విద్యార్హతలు వచ్చేదాకా  ఎదురుచూడనక్కర్లేదు. ఎనిమిదో తరగతి  విద్యార్హతతోనే ప్రయత్నాలు  మొదలుపెట్టవచ్చు. ఇంకా పది నుంచి  పీజీ వరకు వివిధ అర్హతలతో  విభిన్న ఉద్యోగాలు ఆర్మీలో  ఉన్నాయి. పోస్టు ఏదైనప్పటికీ ప్రతి  ఆరు నెలలకు ప్రకటన తప్పనిసరిగా వెలువడుతుంది. అందువల్ల  వీటిని లక్ష్యంగా చేసుకున్నవారు తప్పనిసరిగా ఏదో ఒక  ప్రయత్నంలో విజయం సాధిం చవచ్చు. ఆర్మీలో ఉన్న వివిధ  ఉద్యోగాలూ, అర్హతల వివరాలు తెలుసుకుందాం... 

 

ఆర్మీలో చిన్న స్థాయి ఉద్యోగాలకు ఆయా ప్రాంతాలవారీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఏదైనా రాష్ట్రం లేదా అందులోని కొన్ని జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని స్థానికులతో భర్తీ చేస్తారు. సాధారణంగా 8, 10, ఇంటర్‌ విద్యార్హతలతో ఉన్న సాధారణ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు చేపడతారు. ఈ పోస్టుల్లో చేరినవారు లెవెల్‌-3 మూలవేతనం రూ.21,700తోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే పొందవచ్చు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. అందువల్ల మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు.

 

ఆఫీసర్‌ పోస్టులకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలతో నియామకాలు చేపడతారు. వీటికి ఎంపికైనవారు నేరుగా లెవెల్‌-10 వేతనాలు పొందవచ్చు. విధుల్లో చేరినవారికి రూ.56,100 మూలవేతనంతోపాటు రూ.15,500 మిలటరీ సర్వీస్‌ పే అందుతుంది. అన్నీ కలుపుకుని రూ.లక్ష వేతనం మొదటి నెల నుంచే అందుకోవచ్చు. 

 

ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరీక్షలో జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ సైన్స్, ఆప్టిట్యూడ్‌ (మ్యాథ్స్, లాజికల్‌ రీజనింగ్‌) అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఆ పోస్టుకి ఉన్న విద్యార్హత ప్రకారం ప్రశ్నల స్థాయుల్లో వ్యత్యాసం ఉంటుంది. పరీక్షల వారీ సిలబస్, మోడల్‌ పేపర్లు జాయిన్‌ ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లోని డౌన్‌లోడ్‌ విభాగం నుంచి పొందవచ్చు. ఎక్కువ ఖాళీలు పర్మనెంట్‌ కమిషన్‌ విధానంలో భర్తీ చేస్తారు. మిగిలినవి షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో నింపుతారు.  పెద్ద మొత్తంలో పోస్టులు సాంకేతికేతర విభాగంలో ఉంటాయి. వీటితోపాటు టెక్నికల్‌ గ్రాడ్యుయేట్ల కోసమూ ప్రత్యేకంగా కొన్ని కొలువులున్నాయి. 

 

సాధారణ నియామకం ద్వారా వెళ్లినవాళ్లు అంటే పదోతరగతి తదితర అర్హతలతో చేరినవారు సిపాయ్, నాయక్, హవల్దార్, నయీబ్‌ సుబేదార్, సుబేదార్, సుబేదార్‌ మేజర్‌ హోదా వరకు చేరుకోవచ్చు. 

 

ఆఫీసర్‌ స్థాయిలో చేరితే లెఫ్టినెంట్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభించి కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్‌ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్‌ జనరల్, లెఫ్టినెంట్‌ జనరల్, జనరల్‌ స్థాయికి చేరుకుంటారు. 

 

సాధారణ ఉద్యోగులైతే కనీసం 15 ఏళ్లు, ఆఫీసర్‌ స్థాయివారైతే 20 ఏళ్లు విధుల్లో కొనసాగిన తర్వాత కావాలనుకుంటే ఉద్యోగ విరమణ పొందవచ్చు. ఇలా వైదొలిగినవారు జీవితాంతం పూర్తి స్థాయి పింఛను అందుకోవచ్చు. వీరు సివిల్‌ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. ఇందుకోసం గరిష్ఠ వయసులో సడలింపులు ఉంటాయి. అలాగే ప్రత్యేకంగా కొన్ని పోస్టులు ఎక్స్‌ ఆర్మీ అభ్యర్థులకు రిజర్వ్‌ చేస్తారు. 

 

ఎనిమిదో తరగతితో..

పదో తరగతి చదవకపోయినా, పదిలో ఉత్తీర్ణులు కాకున్నా సోల్జర్‌ ట్రేడ్‌ మెన్‌ విభాగంలో కొన్ని ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. ఎనిమిదో తరగతి విద్యార్హతతోనే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. హౌస్‌ కీపర్, మెస్‌ కీపర్, గుర్రాల పర్యవేక్షణ పోస్టులు లభిస్తాయి. వీటికి 166 సెం.మీ. ఎత్తు, కనీసం 48 కి.గ్రా. బరువు తప్పనిసరి. ఛాతీ విస్తీర్ణం 76 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి.

 

పదో తరగతితో... 

సోల్జర్‌ ట్రేడ్‌ మెన్‌: చెఫ్, వాషర్‌ మెన్, డ్రెస్సర్, స్టివార్డ్, టైలర్, ఆర్టిజన్‌ (వడ్రంగి/ ఇస్త్రీ/ తాపీపని) మొదలైన ఉద్యోగాలను సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌ విభాగంలో భర్తీ చేస్తారు. వీటికి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు 166 సెం.మీ., బరువు 48 కి.గ్రా. తప్పనిసరి. ఛాతీ విస్తీర్ణం 76 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి.

సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ: పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు సోల్జర్‌ జనరల్‌ డ్యూటీకి అర్హత లభించినట్టే. వయసు 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తుతోపాటు 50 కి.గ్రా. బరువు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి. 

 

 

ఇంటర్‌ అర్హతతో... 

సోల్జర్‌ టెక్నికల్‌: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు సోల్జర్‌ టెక్నికల్‌ పోస్టులకు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందాలి. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు 165 సెం.మీ., బరువు 50 కి.గ్రా., ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ., ఊపిరి పీల్చిన తర్వాత వ్యత్యాసం 5 సెం.మీ. తప్పనిసరి. 

సోల్జర్‌ టెక్నికల్‌ (ఏవియేషన్‌): మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు సోల్జర్‌ టెక్నికల్‌ (ఏవియేషన్‌) పోస్టులకు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. కొన్ని బ్రాంచీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసినవాళ్లూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు 165 సెం.మీ., బరువు 50 కి.గ్రా., ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ., ఊపిరి పీల్చాక వ్యత్యాసం 5 సెం.మీ. అవసరం 

సోల్జర్‌ క్లర్క్, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌: ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌లో 60 శాతం మార్కులు పొందినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఇంటర్‌ లేదా పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు అవసరం. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు, ఎత్తు 162 సెం.మీ., బరువు 50 కి.గ్రా. ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ., ఊపిరి పీల్చాక వ్యత్యాసం 5 సెం.మీ. తప్పనిసరి. 

సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌: ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌ (ఏఎంసీ)లో ఈ పోస్టులు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు వీటికి అర్హులు. అలాగే ప్రతి సబ్జెక్జులోనూ కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. 

సిపాయ్‌ (ఫార్మా): ఇంటర్‌ తర్వాత ఫార్మసీలో డిప్లొమా లేదా బీఫార్మసీ కోర్సు పూర్తిచేసినవాళ్లు ఈ పోస్టులకు అర్హులు. డి ఫార్మసీలో 55, బీఫార్మసీలో అయితే 50 శాతం మార్కులు సాధించాలి. వయసు 19 - 25 ఏళ్లలోపు ఉండాలి. 

క్యాటరింగ్‌ జేసీవో: ఇంటర్‌ తర్వాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీలో డిప్లొమా కోర్సు పూర్తిచేసినవారు క్యాటరింగ్‌ విభాగంలో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌(జేసీవో) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 -27 ఏళ్లలోపు ఉండాలి.

 

డిగ్రీ అర్హతతో... 

హవల్దార్‌ ఎడ్యుకేషన్‌: డిగ్రీ లేదా పీజీతోపాటు బీఎడ్‌ చదివినవాళ్లు హవల్దార్‌ ఎడ్యుకేషన్‌ గ్రూప్‌- ఎక్స్‌ పోస్టులకు అర్హులు. సాధారణ డిగ్రీతో గ్రూప్‌-వై పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. 

రెలిజియస్‌ టీచర్‌ (జేసీవో): డిగ్రీతోపాటు సంబంధిత మత ఆచారాలు, సంప్రదాయాలు తెలిసుండాలి. 27-34 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సర్వేయర్‌ అటోమేటెడ్‌ కార్టోగ్రాఫర్‌: డిగ్రీలో మ్యాథ్స్‌ చదివినవాళ్లు ఈ పోస్టులకు అర్హులు. అలాగే వీళ్లు ఇంటర్‌లో మ్యాథ్స్‌తోపాటు సైన్స్‌ కోర్సులు చదివివుండడం తప్పనిసరి. వయసు 20-25 ఏళ్లలోపు ఉండాలి.

 

మార్చిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ   

తెలంగాణలో మార్చి 5 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందినవారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఇతర ప్రాంతాలవారికి అవకాశం లేదు. ప్రస్తుతం వీటికోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 17లోగా తమ వివరాలు జాయిన్‌ ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ప్రవేశ పత్రాలు ఫిబ్రవరి 18 నుంచి డౌన్‌లోడ్‌ చేసకోవచ్చు. 

 

 

అభ్యర్థులు ర్యాలీలో ఎప్పుడు పాల్గొనాలి, అవసరమైన పత్రాల వివరాలు అందులో పేర్కొంటారు. నియామకాల్లో భాగంగా ముందుగా పత్రాలు పరిశీలిస్తారు. అనంతరం దేహదార్ఢ్య, శారీరక కొలతల పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు మార్చి 6 నుంచి ఉంటాయి. క్రీడల్లో ప్రతిభావంతులకు ర్యాలీ తొలిరోజే అవకాశం కల్పిస్తారు. వీరికి కొన్ని సడలింపులు వర్తిస్తాయి. సోల్జర్‌-టెక్నికల్, జనరల్‌ డ్యూటీ, ట్రేడ్స్‌ మెన్, క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ విభాగాల్లో నియామాలు ఉంటాయి. ఆయా పోస్టుల ప్రకారం 8,10, ఇంటర్మీడియట్‌ విద్యార్హతలతో వీటికి పోటీ పడవచ్చు.

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 5 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేస్తే 60 మార్కులు, 5ని. 31సె. నుంచి 5ని. 45సె. లోపు పూర్తిచేస్తే 48 మార్కులు కేటాయిస్తారు. కనీసం 6 పుల్‌అప్స్‌ తీయడం తప్పనిసరి. 6 తీసినవారికి 16, 7 తీస్తే 21...10 తీస్తే 40 మార్కులు పొందవచ్చు. అనంతరం ఫిజికల్‌ మెజర్‌మెంట్, మెడికల్‌ టెస్టులు ఉంటాయి. వీటన్నింటిలో అర్హత సాధించినవారికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఆ వివరాలు ర్యాలీలో ప్రకటిస్తారు. అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్‌ పత్రాలు తీసుకెళ్లడం తప్పనిసరి. ర్యాలీని తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్, హకీంపేటలో నిర్వహిస్తారు. 

 

ఆఫీసర్‌  హోదాలో..!

కేవలం ఇంటర్మీడియెట్‌ విద్యార్హతతోనే ఆర్మీలో ఆఫీసర్‌ ఉద్యోగానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరీక్షలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహిస్తుండగా కొన్నింటిని మాత్రం ఆర్మీ నేరుగా భర్తీ చేస్తోంది. 

 

 

యూపీఎస్‌సీతో..

ఎన్‌డీఏ: ఇంటర్మీడియట్‌ (ప్లస్‌ 2) విద్యార్హతతో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ) పోస్టులకు పోటీ పడవచ్చు. వీటికి ఎంపికైనవారు ప్రారంభ స్థాయి ఆఫీసర్‌ ఉద్యోగమైన లెఫ్టినెంట్‌ హోదాను సొంతం చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపినవారికి డిఫెన్స్‌ అకాడెమీ, పుణెలో చదువు, శిక్షణ అందిస్తారు. ఆర్మీ పోస్టులకు ఎంపికైనవారు బీఏ లేదా బీఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు. అనంతరం వీరికి మిలటరీ అకాడెమీ, దేహ్రాదూన్‌లో శిక్షణ ఉంటుంది. ఏడాదికి రెండు సార్లు సాధారణంగా జనవరి, ఆగస్టుల్లో ప్రకటన వెలువడుతుంది. ఒక్కో విడతలో ఆర్మీలో 200కు పైగా ఖాళీలను భర్తీ చేస్తారు. 16 1/2 - 19 1/2 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

సీడీఎస్‌ఈ: డిగ్రీ పూర్తిచేసివారు కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) రాసుకోవచ్చు. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. ఇందుకు జూన్, అక్టోబరుల్లో ప్రకటన వెలువడతాయి. 19 నుంచి 24 ఏళ్లలోపువారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ఇందులో ఆర్మీ విభాగానికి సంబంధించి ఐఎంఏలో వంద ఖాళీలు ప్రతి విడతలోనూ ఉంటాయి. ఇందులోనే ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులు సైతం ఉంటాయి. వీటిని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో భర్తీ చేస్తారు. ఈ విభాగంలో పురుషులకు 225, మహిళలకు 15 ఖాళీలు కేటాయిస్తున్నారు. ఇండియన్‌ మిలటరీ అకాడెమీ (ఐఎంఏ)కు ఎంపికైనవారికి దేహ్రాదూన్‌లో 18 నెలల శిక్షణ ఉంటుంది. ఓటీఏకు ఎంపికైనవారికి చెన్నైలో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

 

10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌

ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు. వీటికి ఎంపికైనవారు ఉచితంగా బీటెక్‌ పూర్తిచేసుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. ఏటా జూన్, నవంబరుల్లో ప్రకటన వెలువడుతుంది. ఇంటర్‌ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో కనీసం 70 శాతం మార్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 16 1/2 - 19 1/2 ఏళ్లలోపు ఉండాలి. ఒక్కో విడతలోనూ 90 మంది చొప్పున తీసుకుంటారు. దరఖాస్తులు షార్ట్‌లిస్ట్‌ చేసి, ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. అనంతరం మెడికల్‌ టెస్టులు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి అయిదేళ్ల శిక్షణ ఉంటుంది. వీరు ఐఎంఎ గయలో ఏడాదిపాటు ప్రాథమిక శిక్షణ అనంతరం నాలుగేళ్లు బీటెక్‌ విద్య అభ్యసిస్తారు. పుణె, మావ్, సికింద్రాబాదుల్లోని కేంద్రాల్లో ఏదో ఒక చోట చదివిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ బీటెక్‌ డిగ్రీ ప్రదానం చేస్తుంది. 

 

టీజీసీ(ఇంజినీర్స్‌): నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్‌ పూర్తిచేసుకున్నవారికి టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ) ఇంజినీర్స్‌ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఏటా జూన్, డిసెంబరుల్లో ప్రకటన వెలువడుతుంది. 20 - 27 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిసారీ 40 మందిని తీసుకుంటారు. షార్ట్‌లిస్టు చేసి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఎంపికైనవారికి ఐఎంఏ దేహ్రాదూన్‌లో ఏడాది శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.  

 

టీజీసీ ఎడ్యుకేషన్‌ (ఏఈసీ): ఈ పోస్టులకు ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీఏ, ఎంబీఏలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 23-27 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఎంపికైనవారికి ఐఎంఏ, దేహ్రాదూన్‌లో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

 

 

జడ్జ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (జాగ్‌) మెన్, ఉమెన్‌

ఎల్‌ఎల్‌బీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. ఓటీఏ, చెన్నైలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఏడాదికి రెండుసార్లు జూన్, డిసెంబరుల్లో ప్రకటన వెలువడుతుంది. 

 

షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ టెక్నికల్‌ (మెన్, ఉమెన్‌): ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ అవసరం.వయసు 20-27 ఏళ్లలోపు ఉండాలి. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఓటీఏ చెన్నైలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ విధానంలో ఎంపికైనవారు 14 ఏళ్లు సర్వీసులో కొనసాగుతారు. అనంతరం అవకాశాన్ని బట్టి కొనసాగుతారు లేదా వైదొలగాల్సి ఉంటుంది. ఏటా ఏప్రిల్, అక్టోబరుల్లో ప్రకటనలు వెలువడతాయి.

 

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ మెన్, ఉమెన్‌: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో పాటు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌లో ఎ లేదా బి గ్రేడ్‌ పొందాలి. వయసు 25 ఏళ్లలోపు ఉండాలి. ఈ విధానంలో ఏడాదికి రెండు సార్లు పోస్టులు భర్తీ చేస్తారు. సాధారణంగా పురుషులకు 50, మహిళలకు 5 ఖాళీలు ఉంటాయి. దరఖాస్తులు షార్ట్‌లిస్ట్‌ చేసి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఎంపికైనవారికి దాదాపు ఏడాదిపాటు ఓటీఏ, చెన్నైలో శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. గరిష్ఠంగా 14 ఏళ్లపాటు సర్వీసులో కొనసాగవచ్చు. ఏటా జూన్, డిసెంబరుల్లో ప్రకటనలు వెలువడతాయి.

 

యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్‌: ఈ విధానంలో ఏడాదికి ఒకసారి 60 మందిని తీసుకుంటారు. ఏటా మేలో ప్రకటన వెలువడుతుంది. ఇంజినీరింగ్‌ ప్రి ఫైనల్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-24లోపు ఉండాలి. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి ఏడాదిపాటు ఐఎంఏ దేహ్రాదూన్‌లో శిక్షణ ఉంటుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

 

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in

Posted Date : 17-02-2021

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌