• facebook
  • whatsapp
  • telegram

పిలుస్తోంది.. నౌకా దళం!

పది నుంచి పీజీ అర్హతలతో ఎన్నో కొలువులు!

 

 

చిన్న వయసులోనే చెప్పుకోదగ్గ ఉద్యోగాలు అందించేవాటిలో భారతీయ నౌకా దళం ఒకటి. ఇక్కడ పదో తరగతితోనే పదిలమైన ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఇంటర్‌ అర్హతతో నేరుగా ఆఫీసర్‌ అయిపోవచ్చు. యూజీ, పీజీలతో కొలువులో చేరిపోవచ్చు. దాదాపు అన్ని పోస్టులకూ ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడుతున్నాయి. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకుని, సన్నద్ధత కొనసాగించవచ్చు. ఎంపికైతే ఆకర్షణీయ వేతనంతోపాటు  ప్రోత్సాహకాలు అందుకోవచ్చు! 

 

భూమండలంపై మానవ మనుగడ అత్యంత సురక్షితంగా ఉండాలంటే సముద్రాలు మన అధీనంలోకి రావాలని దేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ అన్నారు. ఆయన చేసిన ఈ ఒక్క వ్యాఖ్య చాలు.. భారతీయ నౌకా దళం సేవలు ఎంత కీలకమో చెప్పడానికి. భారతదేశానికి 7500 కి.మీ.పైగా ఉన్న సముద్రతీరం ఎన్నో అవకాశాలు అందిస్తూ, దేశ రక్షణలో కీలకంగా నిలుస్తోంది. ఇందుకోసం సుశిక్షితులైన మానవ వనరుల సేవలు అనివార్యం. అందువల్లే ఏటా క్యాలండర్‌ ప్రకారం నేవీలో నియామకాలు చేపడుతున్నారు. ఇందులో ఉద్యోగాలు రెండు రకాలుగా ఉంటాయి. పది, ఇంటర్‌ విద్యార్హతలతో అవకాశం కల్పించే సెయిలర్‌ ఎంట్రీ పోస్టులు; ఉన్నత అవకాశాలు సొంతం చేసే ఆఫీసర్‌ ఎంట్రీ ఉద్యోగాలు.

 

సెయిలర్‌ ఎంట్రీ

ఈ విభాగంలో ఆర్టిఫీషర్‌ అప్రెంటీస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌), మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌) మ్యుజీషియన్, స్పోర్ట్స్‌ ఉద్యోగాలు ఉంటాయి. 

మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌): పదో తరగతి ఉత్తీర్ణులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. చెఫ్, స్టివార్డ్, హైజీనిస్ట్‌ ఉద్యోగాలు లభిస్తాయి. 17 నుంచి 21 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు.

సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌): ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివినవారు ఈ పోస్టులకు అర్హులు. వయసు 17 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. 

ఆర్టిఫీషర్‌ అప్రెంటీస్‌ (ఏఏ): ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్, ఫిజిక్స్‌తో కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఈ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. వయసు 17 నుంచి 20 ఏళ్లలోపు ఉండాలి. 

మ్యుజీషియన్‌: నేవీ బ్యాండ్‌లో పనిచేయడానికి మ్యుజీషియన్లను ఎంపిక చేస్తారు. సంగీత పరికరాలపై ప్రావీణ్యం ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. సంగీత ప్రావీణ్యం, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.

స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ: పదో తరగతి విద్యార్హతతో ఈ విభాగంలో చేరవచ్చు. ఏదైనా క్రీడ/ ఈవెంట్లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. 

ఎంపిక విధానం: ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ ఈ మూడు రకాల ఉద్యోగాలకీ ముందుగా పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు ఉంటాయి. వీటిలోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులను శిక్షణకు ఎంపిక చేస్తారు.విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. శిక్షణ సమయంలో రూ.14,600 స్టైపెండ్‌ అందుతుంది. ఉద్యోగంలో లెవెల్‌-3 రూ.21,700 మూల వేతనంగా లభిస్తుంది. రూ.5200 ఎంఎస్‌పీతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ...మొదలైనవి అందుతాయి. అంటే మొదటి నెల నుంచే రూ.35,000కు పైగా వేతనంగా తీసుకోవచ్చు. 

ఎంఆర్‌ ఉద్యోగాలకు మ్యాథ్స్, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ పోస్టులకు మ్యాథ్స్, సైన్స్, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల్లో ఇంటర్‌ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఈ మూడు ఉద్యోగాలకూ ఎంపికైనవారు భవిష్యత్తులో మాస్టర్‌ చీఫ్‌ పెటీ ఆఫీసర్‌ స్థాయి వరకు చేరుకుంటారు. సాధారణంగా ఒక్కో విడతలో 3400 ఖాళీలు భర్తీ చేస్తుంటారు. వీటిలో సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) 2500, ఆర్టిఫీసర్‌ అప్రెంటీస్‌ (ఏఏ) 500, సైలర్స్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌) 400 పోస్టులు ఉంటాయి. రాష్ట్రాలవారీ కొన్నేసి పోస్టులు కేటాయిస్తారు. 

 

ఆఫీసర్‌ ఎంట్రీ

ఎగ్జిక్యూటివ్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎడ్యుకేషన్, మెడికల్‌ విభాగాల్లో ఆఫీసర్‌ ఎంట్రీ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ విభాగాలకు సంబంధించి ఒక్కో దానిలోనూ వివిధ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

ఎగ్జిక్యూటివ్‌ విభాగం

ఇందులో జనరల్‌ సర్వీస్, హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీసర్, పైలట్, అబ్జర్వర్, నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్షన్, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌...తదితర పోస్టులకు బీఈ/ బీటెక్‌ విద్యార్హతతో పోటీ పడవచ్చు. వీటిలో కొన్నింటికి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి. 

లాజిస్టిక్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎస్సీ, బీకాం...తదితర విద్యార్హతలతో పోటీ పడవచ్చు. 

జడ్జ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (జాగ్‌) లేదా లా ఆఫీసర్‌ పోస్టులకు ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసుకున్నవారు అర్హులు. 

స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏదైనా పీజీ లేదా బీటెక్‌ చదివుండాలి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ నుంచి డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌ లేదా ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌ కోర్సులు పూర్తిచేసినవారికి ప్రాధాన్యం లభిస్తుంది. అలాగే ఏదైనా క్రీడలో జాతీయ స్థాయి సీనియర్‌ విభాగంలో ప్రతిభావంతులై ఉండాలి. 

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, బీఎస్సీల్లో ఎందులోనైనా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు చదివినవారు అర్హులు. బీసీఏ, ఎంసీఏ పూర్తిచేసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

మ్యుజీషియన్‌ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ కోర్సు చదివినవారు అర్హులు. సంగీతంలో ప్రత్యేక ప్రావీణ్యం ఉన్నవారైతే ఇంటర్‌ విద్యార్హతతోనూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్కెస్ట్రా/ బ్యాండ్‌ / మ్యూజిక్‌ టీచర్‌ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 

 

ఇంజినీరింగ్‌ విభాగం

ఇందులో ఇంజినీరింగ్‌ జనరల్‌ సర్వీస్‌ ఆఫీసర్, సబ్‌ మెరైన్‌ ఇంజినీర్‌ ఆఫీసర్, నావల్‌ ఆర్కిటెక్చర్‌ ఉద్యోగాలున్నాయి. 

జనరల్‌ సర్వీస్‌: సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్‌ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సబ్‌ మెరైన్‌: ఈ విభాగంలో ఉద్యోగానికి సంబంధిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్‌ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

నేవల్‌ ఆర్కిటెక్చర్‌: మెకానికల్‌/ సివిల్‌/ ఏరోనాటికల్‌/ మెటలర్జీ/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌.. వీటిలో ఏ విభాగంలోనైనా కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

మెడికల్‌ విభాగం

నేవీ ఆసుపత్రుల్లో వైద్యులుగా సేవలందించడానికి మెడికల్‌ విభాగంలో పోస్టులు భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా ఎంపికలు ఉంటాయి. వయసు గరిష్ఠంగా 45 ఏళ్లకు మించరాదు. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, బీడీఎస్, ఎండీఎస్‌ విద్యార్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

ఎడ్యుకేషన్‌ విభాగం

ఈ విభాగంలో పోస్టులకు కనీసం ద్వితీయ శ్రేణితో పీజీలో మ్యాథ్స్‌ / ఫిజిక్స్‌ / కెమిస్ట్రీ / ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. పీజీలో మ్యాథ్స్‌ చదివినవారు యూజీలో ఫిజిక్స్‌ అలాగే ఫిజిక్స్‌ పూర్తిచేసుకున్నవారు యూజీలో మ్యాథ్స్‌ చదివుండడం తప్పనిసరి. పీజీలో కెమిస్ట్రీ చదివినవారు యూజీలో ఫిజిక్స్, పీజీలో ఇంగ్లిష్‌ అభ్యర్థులు కనీసం ఇంటర్‌ స్థాయిలో మ్యాథ్స్‌ లేదా ఫిజిక్స్‌ చదివుండాలి. మెకానికల్, ఎల్రక్టికల్, కంప్యూటర్‌ సైన్స్, ఐటీ విభాగాల్లో ఇంజినీరింగ్‌ విద్య పూర్తిచేసినవారూ అర్హులే. అలాగే ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు యూజీ స్థాయిలో ఫిజిక్స్‌ లేదా మ్యాథ్స్‌ చదివుండాలి. ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ వీటిలో ఎందులోనైనా పీజీ చదివినా ఎడ్యుకేషన్‌ విభాగం పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

ఎల్రక్టికల్‌ విభాగం

ఇందులో జనరల్‌ సర్వీస్, సబ్‌ మెరైన్‌ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.

జనరల్‌ సర్వీస్‌ (ఎల్రక్టికల్‌ ఆఫీసర్‌): ఈ ఉద్యోగాలకు కనీసం 60 శాతం మార్కులతో ఎల్రక్టికల్‌/ ఎల్రక్టానిక్స్‌/ టెలి కమ్యూనికేషన్‌ వీటిలో ఏ విభాగంలోనైనా లేదా అనుబంధ విభాగంలో బీఈ/ బీటెక్‌ పూర్తిచేసుండాలి. 

సబ్‌ మెరైన్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌: ఎల్రక్టికల్‌/ ఎల్రక్టానిక్స్‌/ టెలి కమ్యూనికేషన్‌/ కంట్రోల్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌/ పవర్‌ ఎల్రక్టానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ వీటిలో ఏ విభాగంలోనైనా కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

నౌకాదళ నియామకాలు ఎప్పుడెప్పుడు?

భారతీయ నౌకా దళంలో ఏ పోస్టుకు ఎంపికైనా ఆకర్షణీయ వేతనంతోపాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. దీనిలోని దాదాపు అన్ని పోస్టులకూ ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడుతున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకునేవారు నిశ్చింతగా తమ సన్నద్ధత కొనసాగించవచ్చు! 

 

యూపీఎస్‌సీ ఏడాదికి రెండు సార్లు చొప్పున ఎన్‌డీఏఅండ్‌ఎన్‌ఏ, సీడీఎస్‌ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా నేవీలో ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతోనే ఉన్నత స్థాయి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 

 

ఎన్‌డీఏ: ఆర్మీ, నేవీ, ఏర్‌ ఫోర్సుల్లో పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో నేవల్‌ వింగ్స్‌ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ) పోస్టులకు ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. రెండో సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటలిజెన్స్, పర్సనాలిటీ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. నేవీలో ఖాళీలకు ఎంపికైనవారికి ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాలలో శిక్షణతోపాటు బీటెక్‌ విద్య అందిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి బీటెక్‌ డిగ్రీని జేఎన్‌యూ, న్యూదిల్లీ ప్రదానం చేస్తుంది. సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఇంజినీరింగ్‌ విధుల్లోకి వీరిని తీసుకుంటారు.

 

సీడీఎస్‌ఈ: ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఏర్‌ ఫోర్స్‌ ఉన్నతోద్యోగాలు భర్తీ చేస్తారు. ఇందులో నేవీ ఉద్యోగాలకు బీటెక్‌ పూర్తి చేసినవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. 

 

ఆఫీసర్‌ ఎంట్రీలో ఏ విభాగంలో ఎంపికైనప్పటికీ సంబంధిత శిక్షణ పూర్తిచేసుకున్నవారికి సబ్‌ లెఫ్టినెంట్‌ హోదా కేటాయిస్తారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఎంఎస్‌పీ అదనంగా లభిస్తాయి. శిక్షణలో ఉన్నప్పుడూ రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఎంపికైనవారికి ఎంటెక్‌ చదువుకునే అవకాశం లభిస్తుంది. వీళ్లు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రముఖ సంస్థల్లో సంబంధిత ట్రేడుల్లో స్పెషలైజేషన్‌ కోసం ఉన్నత విద్య అభ్యసించవచ్చు. ఈ సమయంలో పూర్తి వేతనం చెల్లిస్తారు.

 

10+2 టెక్నికల్‌ ఎంట్రీ

ఈ విధానంలో ఎంపికైనవారు కేరళలోని నేవల్‌ అకాడెమీ- ఎజిమాలలో ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా మెకానికల్‌ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి ఉచితంగా చదువుకోవచ్చు. జేఎన్‌యూ, న్యూదిల్లీ నుంచి బీటెక్‌ పట్టా పుచ్చుకుని వెంటనే నేవీలో ఇంజినీర్‌ విధులు సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నిర్వర్తించవచ్చు.
విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అలాగే జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించినవారై ఉండాలి. ఈ స్కోర్‌ ప్రకారం షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించి కోర్సుకి ఎంపిక చేస్తుంది. 

 

ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్టు (ఐనెట్‌)

పైలట్, అబ్జర్వర్, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, జనరల్‌ సర్వీస్, హైడ్రో, నేవల్‌ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ క్యాడర్‌...విభాగాల్లో ఖాళీలను ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్టు (ఐనెట్‌)తో భర్తీ చేస్తున్నారు. వీటిలో కొన్ని పోస్టులు శాశ్వత ప్రాతిపదికన, మిగిలినవి తాత్కాలిక సేవల కింద తీసుకుంటారు. ఇందుకోసం ముందుగా వంద మార్కులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, రీజనింగ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ సైన్స్, మ్యాథమెటికల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అర్హులను సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. పరీక్ష, ఇంటర్వ్యూ మార్కులకు చెరిసగం వెయిటేజీ ఉంటుంది. ఎంపికైనవారికి శిక్షణ అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ ప్రకటన ఏడాదికి రెండుసార్లు వెలువడుతుంది.

 

ఉమెన్‌ ఎంట్రీ

నేవీలో కొన్ని పోస్టులకు మహిళలూ అర్హులే. అయితే వీరిని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో తీసుకుంటారు. గరిష్ఠంగా 14 ఏళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. ఏటీసీ, అబ్జర్వర్, లా, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, నావల్‌ ఆర్కిటెక్చర్, పైలట్, నావల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో వివిధ ఉద్యోగాలకు సంబంధిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్‌ చదివినవారికి అవకాశం కల్పిస్తున్నారు. 

 

ఏ ప్రకటన ఎప్పుడు ?

‣ సెయిలర్‌ (ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ) - జూన్, డిసెంబరు

‣ 10+2 (బీటెక్‌) -  జూన్, డిసెంబరు

‣ ఎస్‌ఎస్‌సీ (పైలట్, అబ్జర్వర్‌) - మార్చి, అక్టోబరు

‣ ఎస్‌ఎస్‌సీ (ఎగ్జిక్యూటివ్, టెక్, సబ్‌ మెరైన్‌ టెక్‌) - ఫిబ్రవరి, సెప్టెంబరు

‣ పీసీ (లాజిస్టిక్స్‌) - మార్చి

‣ పీసీ (ఎడ్యుకేషన్, నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ క్యాడర్‌) - నవంబరు

‣ పీసీ (లా, మ్యుజీషియన్‌) - ఖాళీలు ఉన్నప్పుడు

‣ ఎస్‌ఎస్‌సీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) - సెప్టెంబరు

‣ ఎస్‌ఎస్‌సీ (నేవల్‌ ఆర్మమెంట్, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, ఎడ్యుకేషన్‌) - ఏప్రిల్‌

‣ ఎస్‌ఎస్‌సీ (లాజిస్టిక్స్, నేవల్‌ ఆర్కిటెక్చర్‌) - నవంబరు

‣ ఎస్‌ఎస్‌సీ (లా, స్పోర్ట్స్‌) - ఖాళీలు ఉన్నప్పుడు

‣ ఎన్‌డీఏ- డిసెంబరు, జూన్‌

‣ సీడీఎస్‌ఈ- అక్టోబరు, ఆగస్టు

Posted Date : 03-02-2021

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌