• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

మొత్తం 2500 ఏఏ, ఎస్ఎస్ఆర్ సెయిల‌ర్ పోస్టుల‌కు ప్ర‌క‌ట‌న

యువ‌త‌కు ఎన్నో ఉద్యోగావ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ త్రివిధ ద‌ళాల్లో కొలువంటే ఆ హోదానే వేరు. అందులో ఏ చిన్న ఉద్యోగ‌మైనా దానికంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు త‌ప్ప‌క ఉంటుంది. పిన్న వ‌య‌సులోనే ప్ర‌తిభావంతులైన యువ‌త‌ను ఇవి ఏటా ఆక‌ర్షించి ఉన్న‌తంగా తీర్చిదిద్దుతున్నాయి. దేశ ర‌క్ష‌ణ‌లో భాగ‌స్వాముల‌ను చేస్తున్నాయి. ఈ ప్ర‌క్రియ‌లోనే భాగంగా ప్ర‌స్తుతం ఇండియ‌న్ నేవీ ప్ర‌క‌ట‌న ‌విడుద‌ల చేసింది. ఇంట‌ర్ అర్హ‌త‌తో ఆగ‌స్టు 2021 బ్యాచ్ సెయిల‌ర్ పోస్టుల కోసం అర్హులైన అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

విద్యార్థి ద‌శ‌లోనే చెప్పుకోదగిన ఉద్యోగాలు అందించే వాటిలో భారతీయ నౌకా దళం ఒకటి. ఇక్కడ పదో తరగతితోనే పదిలమైన ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఇంటర్‌ అర్హతతో నేరుగా ఆఫీసర్‌ అయిపోవచ్చు. యూజీ, పీజీలతోనూ కొలువులో చేరిపోవచ్చు. దాదాపు అన్ని పోస్టులకూ ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడుతున్నాయి. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకుని, సన్నద్ధత కొనసాగించవచ్చు. ఎంపికైతే ఆకర్షణీయ వేతనంతోపాటు ప్రోత్సాహకాలు అందుకోవచ్చు! 

 

ఎంపిక విధానం

ప్ర‌స్తుతం ఇండియ‌న్ నేవీ సెయిల‌ర్ ఎంట్రీ విభాగంలో 500 ఆర్టిఫీష‌ర్ అప్రెంటిస్(ఏఏ), 2000 సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్‌) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. కొవిడ్ మ‌హమ్మారి కార‌ణంగా సుమారు 10000 మంది అభ్య‌ర్థులకే ఈ ప‌రీక్ష‌లు రాసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు‌. ఈ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ముందుగా రాత‌పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మంలో ఉంటుంది. ఇంగ్లిష్‌, మ్యాథ్స్, సైన్స్, జనరల్‌నాలెడ్జ్‌ విభాగాల్లో ఇంటర్‌స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ప‌రీక్ష సమ‌యం ఒక గంట‌ (60 నిమిషాలు). రాష్ట్రాల‌ను బ‌ట్టి క‌టాఫ్ మార్కుల్లో వ్య‌త్యాసం ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్‌ ‌పరీక్ష(పీఎఫ్‌టీ) ఉంటుంది. ఏడు నిమిషాల్లో 1.6 కిలోమీట‌ర్ల ప‌రుగును పూర్తి చేయాలి. అలాగే 20 స్క్వాట్స్‌, 10 పుష్అప్స్ చేయాలి. వీటిలో త‌ప్ప‌కుండా అర్హ‌త‌ సాధించాల్సి ఉంటుంది. వీటిలో ఉత్తీర్ణులైతే వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులను శిక్షణకు ఎంపిక చేస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని విధుల్లోకి తీసుకుంటారు.  

 

అర్హ‌త‌లు

ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌సైన్స్‌ల‌లో ఏదో ఒక సబ్జెక్టు చదివినవారు ఈ పోస్టులకు అర్హులు. వీటిలో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. వయసు 17 నుంచి 20 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఫిబ్ర‌వ‌రి 01, 2001 నుంచి జులై 31, 2004 మ‌ధ్య‌ జ‌న్మించి ఉండాలి.

 

ద‌ర‌ఖాస్తు విధానం

ఆస‌క్తితోపాటు అర్హ‌తలు క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏప్రిల్ 26న ప్రారంభ‌మై ఏప్రిల్ 30, 2021న ముగుస్తుంది.‌ మెరిట్ జాబితాను జులై 23, 2021న అధికారిక వెబ్‌సైట్‌లో పొందుప‌రుస్తారు.

 

విధులు

ఆర్టిఫీషిర్ అప్రెంటిస్(ఏఏ) సెయిల‌ర్ల‌కు కేటాయించిన ట్రెడ్‌ల‌లో శిక్ష‌ణ ఇస్తారు. ఈ శిక్ష‌ణా కాలంలో వారు ముఖ్య‌మైన కాంప్లెక్స్ సిస్ట‌మ్స్‌, అధునాత‌న ప‌రిక‌రాల ప‌నితీరు, నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల ‌గురించి తెలుసుకుంటారు. ప్ర‌ధానంగా స్టీమ్ ప‌వ‌ర్డ్ మిష‌న‌రీ; డిజిల్‌, గ్యాస్ ట‌ర్బైన్స్‌; గైడెడ్ మిస్సైల్స్‌, ఇత‌ర ఆటోమెటిక్ కంట్రోల్డ్ వెప‌న్స్‌; సెన్సార్స్ ఎవియానిక్ ప‌రిక‌రాలు; కంప్యూట‌ర్స్ అండ్ హైలీ అడ్వాన్స్‌డ్ రేడియో; ఎల‌క్ట్రిక‌ల్ ప‌వ‌ర్ సిస్ట‌మ్స్‌పై ప‌ని చేస్తారు. సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్‌(ఎస్ఎస్ఆర్‌) ప‌ని కూడా దాదాపు ఏఏల ప‌నితో స‌మానంగానే ఉంటుంది. వీరు హైలీ టెక్నిక‌ల్ ఆర్గ‌నైజేష‌న్‌లో సెయిల‌ర్‌గానే సేవ‌లందిస్తారు. శ‌క్తివంత‌మైన‌, అధునాత‌న షిప్పుల త‌యారీ వంటి వాటిల్లో విధులు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఇక్క‌డ ప‌ని విభ‌జ‌న చేసి చాలా విభాగాల‌కు చెందిన వివిధ ఉద్యోగుల‌తో చేయిస్తారు. ముఖ్యంగా ఎయిర్‌క్రాప్ట్ కెరియ‌ర్స్‌; గైడెడ్ మిస్సైల్ డిస్ట్ర‌య‌ర్స్, యుద్ధ‌నౌక‌లు; రిప్లెనిష్‌మెంట్ షిప్స్‌; హైలీ టెక్నిక‌ల్ వ‌ర్క్స్‌; ఆక‌ర్షిత‌మైన స‌బ్‌మెరైన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు; రాడార్లు; సొనార్స్ లేదా క‌మ్యూనికేష‌న్స్‌; మిస్సైల్స్‌, వెప‌న్స్‌, రాకెట్స్ మొద‌లైన విభాగాల్లో వీరికి ప‌ని క‌ల్పిస్తారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఈ ప‌నులే కాకుండా ఎలాంటి ప‌ని చెప్పిన బాధ్య‌త‌గా నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది.‌‌

జీత‌భ‌త్యాలు

ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఆగ‌స్టు, 2021లో శిక్ష‌ణ ప్రారంభ‌మ‌వుతుంది. ఏఏల‌కు తొమ్మిది వారాలు, ఎస్ఎస్ఆర్‌ల‌కు 22 వారాలు ఐఎన్ఎస్ చిల్కా(ఒడిశా)లో ప్రాథ‌మిక శిక్ష‌ణ ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.14,600 స్టైపెండ్ అందుతుంది. ఉద్యోగంలో లెవెల్‌-3 కింద‌ రూ.21,700 మూల వేతనంగా లభిస్తుంది. రూ.5200 ఎంఎస్‌పీతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ మొదలైనవి అందుతాయి. అంటే మొదటి నెల నుంచే రూ.35,000కు పైగా వేతనంగా తీసుకోవచ్చు. భవిష్యత్తులో మాస్టర్‌ చీఫ్‌ పెటీ ఆఫీసర్‌ స్థాయి వరకు చేరుకోవ‌చ్చు. సాధారణంగా ఒక్కో విడతలో భారీగానే ఖాళీలు భర్తీ చేస్తుంటారు. ఇందులో రాష్ట్రాలవారీగా కొన్ని పోస్టులు కేటాయిస్తారు. 

 

వెబ్‌సైట్‌: http://www.joinindiannavy.gov.in

 

సిల‌బ‌స్ కోసం క్లిక్ చేయండి

Posted Date : 23-04-2021

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌