• facebook
  • whatsapp
  • telegram

ఆగవద్దు... ఆలస్యం వద్దు! ఇప్పుడే ప్రారంభించండి ప్రిపరేషన్

ఐబీపీఎస్ ఆర్ ఆర్ బీ పరీక్షల క్యాలెండర్ విడుదల

ముందస్తు సన్నద్ధతే విజయ ర‌హ‌స్యం!

 

 

పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అంత సులభం కాదు. అందులోనూ బ్యాంకు ఉద్యోగాల పరీక్షల్లో ఆ కష్టం కాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి. కష్టం కష్టం అని కూర్చుంటే కుదరదు కదా. ఆ పోటీలో నిలవాలి, గెలవాలి... గెలవాల్సిందే. ఈ స్థిర లక్ష్యంతోనే ప్రయాణం ప్రారంభించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ లక్ష్యంపై గురి తప్పకూడదు. ఇంతవరకు బాగానే ఉంది. లక్ష్యం పెట్టుకుంటే సరిపోతుందా? దానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి కదా! అందుకోసం అనుకూలమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అదే సిలబస్, అవే పుస్తకాలు, అవే పాఠాలు, అవే లెక్కలు... అందరూ అవే చేస్తుంటే విజయం కోరుకున్నవారికే ఎలా దక్కుతుంది? ప్రయత్నాలు, కష్టపడటం, బలాలు బలహీనతలపై సరైన అంచనాలతో ప్రిపేర్ కావడంలోనే అందరి మధ్య తేడాలు మొదలవుతాయి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టాలి? ఇది అభ్యర్థులందరికీ మొదట్లో తలెత్తే సమస్యే. లక్ష్యం తెలుసు, సిలబస్ తెలుసు, దానికి ఏం చేయాలో తెలుసు? ఇంక తెలియాల్సిందేముంది? కష్టపడటమే. అదే ఎప్పుడు మొదలు పెట్టాలి? ఎప్పుడో ఎందుకు ఇప్పుడే మొదలు పెట్టకూడదా? అంతే... ఇప్పుడే ఈ క్షణమే ప్రారంభించాలి? ప్రారంభించండి... మొదటి అడుగు పడిపోయినట్లే!

 

నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెట్టడమే చాలామంది చేసే పొరపాటు. ఐబీపీఎస్ (ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలక్షన్) ఈ సంవత్సరం నియామకాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేసింది. అందులో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు  వస్తుంది? పరీక్ష ఎప్పుడు జరగవచ్చు వంటి వివరాలను ప్రకటించింది. అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించడానికి ఈ సమాచారం సరిపోదా? నోటిఫికేషన్ వస్తుందో రాదో... వచ్చినప్పుడుచూద్దాంలే అనుకుంటే పోటీలో వెనుకపడిపోవడం దాదాపు ఖాయం అనే చెప్పాలి. 

 

పీఓ, క్లర్కు ఉద్యోగాలకు సమాంతర ప్రిపరేషన్

రీజినల్ రూరల్ బ్యాంకుల (ఆర్ ఆర్ బీ) పీఓ స్కేల్-1 ఆఫీసర్ ఉద్యోగాల పరీక్షను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్ ప్రకటించింది. ఆగస్టు రెండు, మూడో వారంలో ఆఫీస్ అసిస్టెంట్స్(క్లర్క్) పోస్టులకు పరీక్షలు జరుగుతాయి.  క్యాలెండర్ ప్రకారం ఐబీపీఎస్ ముందు ప్రకటించిన తేదీల్లోనే దాదాపు పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఆ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కేవలం ఎన్ని పోస్టులు ఉంటాయనే సమాచారం కోసమే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి. ఇక‌ ప్రిపరేషన్ ఇప్పటికే  మొద‌లుపెట్టిన వారు దాన్ని కొనసాగించాలి. ఇంకా ప్రారంభించ‌నివారు త్వరగా మొదలుపెట్టాలి. 

 

 

ఆగస్టు మొదట్లో ఆర్ ఆర్ బీ - పీఓ పరీక్ష, చివర్లో క్లర్క్ పరీక్షతోపాటు అక్టోబ‌ర్‌లో పీఓ ఉద్యోగాలకు మెయిన్స్ పరీక్ష జరనుంది. కాబట్టి ఆయా పరీక్షలకు రెండు, రెండున్నర నెలల సమయం ఉంది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. పీఓ, క్లర్క్ పోస్టులు రెండింటికీ ఒకటే ప్రిపరేషన్ ఉంటుంది.  పీఓకు సన్నద్ధమైతే క్లర్క్ పరీక్షకు కూడా అయినట్లే. సబ్జెక్టు మౌలికాంశాలు అవే ఉంటాయి. కానీ ప్రశ్నల సరళి, స్థాయిలో భేదాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించి ప్రిపరేషన్ సాగించాలి. ప్రాక్టీస్ చేయాలి.  ఎవరు ముందుగా ప్రిపరేషన్ మొదలుపెడతారో వారే విజయం సాధిస్తారని చాలా ఉదాహరణలు చూస్తే అర్థమవుతోంది. ఆలస్యంగా ప్రిపరేషన్ ప్రారంభిస్తే సమయం సరిపోదు. చివరి వచ్చే సరికి ఆందోళన పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్‌ ప్రారంభించండి. పట్టుదలతో కొన‌సాగించండి. కోరుకున్న ఉద్యోగాన్ని సాధించుకోండి.

Posted Date : 04-06-2021

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌