• facebook
  • whatsapp
  • telegram

ఎనభైకి ఎనభై తెచ్చుకోవడం ఎలా?

ఐబీపీఎస్-ఆర్ఆర్‌బీ పరీక్షలో వందశాతం మార్కులకు వ్యూహం

ఐబీపీఎస్-ఆర్ఆర్‌బీ పరీక్షలో వంద శాతం మార్కులు సాధించడం ఎలా? అంటే.. అది సన్నద్ధతపైనే ఆధారపడి ఉంటుంది. తొలిసారి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కూడా 80/80 మార్కులు సంపాదించుకోవచ్చు. పరీక్షకు కనీసం 50 రోజుల నుంచి రెండు నెలల సమయం ఉంది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే విజయం సొంతమవుతుంది. ఎస్బీఐ, ఆర్బీఐ ఇతర బ్యాంకుల పరీక్షలతో పోలిస్తే ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పరీక్ష సులభంగా ఉంటుంది. మిగతా వాటిలో మూడు సెక్షన్లు ఉంటే ఇందులో ఆప్టిట్యూట్, రీజనింగ్ రెండే ఉంటాయి. సమయం 45 నిమిషాలు ఇస్తారు. అంటే ప్రతి ప్రశ్నకు దాదాపు 33 సెకన్ల సమయం ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి ఇది చాలు. ప్రణాళిక ప్రకారం సన్నద్ధమై పరీక్ష రాస్తే రెండు సెక్షన్లు కలిపి 80 మార్కులు సాధించవచ్చు. 

ఎలా సాధ్యమంటే..

ముందుగా ప్రశ్నల సరళిని తెలుసుకోవాలి. అందుకు 2020 ఏడాది ప్రశ్నపత్రాన్ని పరిశీలించాలి. ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అర్థమవుతుంది. స్కేల్-1, ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలకు దాదాపు ఒకటే ప్రిపరేషన్. స్కేల్-1 పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్, రీజనింగ్ ఉంటే.. ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటాయి. రెండింటిలో రీజనింగ్ కామన్. సమయం కూడా ఒకేలా ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన అంశాలు ఒక్కటే. వీటిలో తేడా ఏమీ ఉండదనే విషయాన్ని గుర్తించాలి. కానీ రెండింటికీ మధ్య ప్రశ్నల సరళిలో వ్యత్యాసం ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు సుల‌భంగా ఉంటే.. ఆప్టిట్యూట్ ప్రశ్నలు కాస్త కఠినంగా ఉంటాయి. 

ప్రశ్నల వారీగా చూస్తే..

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్/ న్యూమరికల్ ఎబిలిటీ;  సింప్లిఫికేషన్స్/  ఆప్రాక్సిమేట్ వాల్యూస్ నుంచి 10-12 ప్రశ్నలు ఆఫీస్ అసిస్టెంట్ల పరీక్షలో వస్తాయి. స్కేల్-1 ఆఫీసర్ల పరీక్షలో సుమారు 5 ప్రశ్నలు అడుగుతారు. నంబర్ సిరీస్ నుంచి 5, క్వాడ్వాట్రిక్ ఈక్వేషన్-5, డేటా ఇంటర్ప్రెటేషన్ నుంచి 5-10, అరిథ్మెటిక్ ప్రశ్నలు 5-10 వరకు రెండింటిలోనూ వస్తాయి. 

రీజనింగ్: ఎక్కువ ప్రశ్నలు 15-20 సీటింగ్ అరేంజ్ మెంట్, పజిల్స్ నుంచే ఉంటాయి. ఇనీక్వాలిటీస్ నుంచి 4-5, కోడింగ్-డీకోడింగ్ 3-5, అల్ఫాబెటికల్ సీక్వెన్స్ 3-5, సిలాజియమ్ 3-5, బ్లడ్ రిలేషన్స్ 3-4, డైరెక్షన్స్ నుంచి 2-3 ప్రశ్నలు వ‌స్తాయి. వెయిన్స్ పరీక్షలో వీటితోపాటు లాజికల్ రీజనింగ్ నుంచి స్టేట్‌మెంట్‌కు సంబంధించినవి, ఇన్‌పుట్‌అవుట్‌పుట్‌, కాజ్ అండ్ ఎఫెక్ట్ తదితర ప్రశ్నలు అడుగుతారు. 

ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్: ఈ విభాగాలు మెయిన్స్ ప‌రీక్ష‌లోనే ఉంటాయి. ఇంగ్లిష్‌లో గ్రామ‌ర్‌, ఒకాబ్యుల‌రీ, రీడింగ్ కాంప్ర‌హెన్ష‌న్‌పై దృష్టి పెట్టాలి. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌కు సంబంధించి దినప‌త్రిక‌ల‌ను చ‌ద‌వాలి. జాతీయ‌, అంత‌ర్జాతీయ అంశాలు, ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను చ‌ద‌వాలి. కంప్యూట‌ర్ నాలెడ్జ్ కోసం అవ‌గాహ‌న పెంచుకుంటే స‌రిపోతుంది. 

నమూనా పరీక్షలు రాయండి

సన్నద్ధతలో చదవడంతోపాటు నమూనా పరీక్షలు రాయడం అత్యంత ముఖ్యం. దీని ద్వారా లోపం ఎక్కడ ఉందో తెలుస్తుంది. మళ్లీ ప్రయత్నించాలి. సులువైన, కఠినమైన ప్రశ్నలను గుర్తించి సమాధానాలు రాయాలి. అలా లోపాలన్నీ సరిదిద్దుకునే వరకు నమూనా పరీక్షలు రాస్తూనే ఉండాలి. దీంతో రోజురోజుకీ కచ్చితంగా మార్కులు పెరుగుతాయి. అలా 80 మార్కులను లక్ష్యంగా పెట్టుకోవాలి. 

- డా. జీఎస్ గిరిధ‌ర్‌
 

Posted Date : 15-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌