• facebook
  • whatsapp
  • telegram

రైల్వేలో 5,696 ఏఎల్‌పీ కొలువులు

పరీక్ష సరళి, సన్నద్ధత వివరాలు

ఐటీఐ, డిప్లొమాలో దరఖాస్తుకు అవకాశందేశంలో రక్షణ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోన్నది రైల్వేనే. రోజూ సుమారు 2.4 కోట్ల మంది భారతీయ రైల్వేలో ప్రయాణిస్తున్నారు. అలాగే రోజుకి దాదాపు 204 మిలియన్‌ టన్నుల సరకు రవాణా అవుతోంది. ఇందులో లోకో పైలట్‌(డ్రైవర్‌) సేవలే కీలకం. ఆసక్తి ఉన్నవారు అసిస్టెంట్‌ లోకో పైలట్‌గా విధులు నిర్వర్తించే అవకాశం ఇప్పుడొచ్చింది. మరి మీరు సిద్ధమేనా..


బతుకు బండికి కరెన్సీ నోట్లు ఎంత కీలకమో.. రైలు బండి కదలడానికి లోకో పైలట్‌ సేవలూ అంతే ప్రధానం. అందువల్లే రైల్వేలో ఎక్కువ నియామకాలు ఈ పోస్టులోనే ఉంటాయి. ఇలా అవకాశం వచ్చినవారు భద్రమైన ఉద్యోగంతోపాటు, ఆకర్షణీయ వేతనమూ అందుకోవచ్చు. పదో తరగతి తర్వాత నిర్దేశిత ట్రేడ్‌/ బ్రాంచీల్లో.. ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీఈ/ బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులకు పోటీ పడొచ్చు. వివిధ పరీక్షల్లో చూపిన ప్రతిభతో నియామకాలుంటాయి. ఈ పోస్టుల్లో చేరినవారికి లెవెల్‌-2 మూల వేతనం రూ.19,900 దక్కుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. అంటే మొదటి నెల నుంచే వీరు సుమారు రూ.40,000 పొందవచ్చు.  


ఎంపిక ఇలా..

ఫస్ట్‌ స్టేజ్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు(సీబీటీ-1), సెకండ్‌ స్టేజ్‌ (సీబీటీ-2), కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు(సీబీఏటీ), ధ్రువపత్రాల పరిశీలన, వైద్యపరీక్షలతో అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. సీబీటీ-1, సీబీటీ-2లను తెలుగులోనూ రాసుకోవచ్చు. దరఖాస్తు నింపేటప్పుడే ఏ మాధ్యమంలో రాయాలనుకుంటున్నారో తెలపాలి. సీబీఏటీ కేవలం ఇంగ్లిష్, హిందీల్లోనే ఉంటుంది. అభ్యర్థులు ఏదో ఒక ఆర్‌ఆర్‌బీలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే అందులోని జోన్లవారీ ప్రిఫరెన్సు ఎంచుకోవాలి. 


ఫస్ట్‌ స్టేజ్‌ (సీబీటీ-1): ఇది సీబీటీ-2కు వడపోత పరీక్ష. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. పరీక్ష వ్యవధి ఒక గంట. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 75 ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించడానికి యూఆర్, ఈడబ్ల్యుఎస్‌ 40, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఎస్సీ 30, ఎస్టీలు 25 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హుల జాబితా నుంచి ఆ విభాగాల్లో ఉన్న ఖాళీలకు 15 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను సీబీటీ-2కు ఎంపిక చేస్తారు. 


సీబీటీ-2: ఇందులో రెండు విభాగాలుంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మొత్తం 175 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-ఏలో వంద ప్రశ్నలు. వ్యవధి గంటన్నర. పార్ట్‌-బీలో 75 ప్రశ్నలు. వ్యవధి గంట. పార్ట్‌ ఏ, బీల్లో ప్రతి తప్పు సమాధానానికీ 1/3 మార్కు తగ్గిస్తారు. పార్ట్‌-ఏలో అర్హత సాధించడానికి యూఆర్, ఈడబ్ల్యుఎస్‌లు 40, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఎస్సీలు 30, ఎస్టీలు 25 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు పొందినవారి పార్ట్‌-బీ సమాధానాలు మూల్యాంకనం చేస్తారు. ఇందులో అన్ని విభాగాల వారూ 35 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. 


సిలబస్‌


సీబీటీ-1:

మ్యాథమెటిక్స్‌: నంబర్‌ సిస్టమ్, బాడ్మాస్, డెసిమల్స్, భిన్నాలు, కసాగు, గసాభా, రేషియో అండ్‌ ప్రపోర్షన్, శాతాలు, కాలం-పని, కాలం-దూరం, బారువడ్డీ, చక్రవడ్డీ, లాభనష్టాలు, ఆల్జీబ్రా, చలనజ్యామితి, త్రికోణమితి, ప్రాథమిక సాంఖ్యకశాస్త్రం, వర్గ మూలాలు, వయసు లెక్కలు, క్యాలెండర్‌ అండ్‌ క్లాక్, పైప్స్‌ అండ్‌ సిస్టర్న్‌.

మెంటల్‌ ఎబిలిటీ: అనాలజీ, ఆల్ఫాబెటికల్‌ అండ్‌ నంబర్‌ సిరీస్, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్, మ్యాథమెటికల్‌ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్‌ డయాగ్రం, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ సఫిషియన్సీ, కన్‌క్లూజన్స్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్, పోలికలు-భేదాలు, అనలిటికల్‌ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్లు, స్టేట్‌మెంట్‌-ఆర్గుమెంట్లు, అజెంప్షన్లు. 

జనరల్‌ సైన్స్‌: ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్‌(బయాలజీ) పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. 

జనరల్‌ అవేర్‌నెస్‌: వర్తమాన వ్యవహారాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, క్రీడలు, సంస్కృతి, వార్తల్లో వ్యక్తులు, ఆర్థికాంశాలు, రాజకీయాలు, ముఖ్య సంఘటనలు.. వీటి నుంచి ప్రశ్నలు ఉంటాయి. 


సీబీటీ-2:

ఇందులో పార్ట్‌-ఎలో సీబీటీ-1లోని మ్యాథమెటిక్స్, మెంటల్‌ ఎబిలిటీ అంశాల్లోనే ప్రశ్నలుంటాయి. దీనికి అదనంగా బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ నుంచి.. ఇంజినీరింగ్‌ డ్రాయింగ్, ప్రమాణాలు, కొలతలు, ద్రవ్యరాశి, సాంద్రత, పని శక్తి సామర్థ్యం, వేగం, ఉష్ణం, బేసిక్‌ ఎలక్ట్రిసిటీ, లీవర్స్‌ అండ్‌ సింపుల్‌ మెషీన్లు, ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్, పర్యావరణ విద్య, ఐటీ లిటరసీ అంశాల్లో ప్రశ్నలడుగుతారు. 

పార్ట్‌-బీ: ఈ విభాగంలో ప్రశ్నలు పలు ట్రేడుల నుంచి వస్తాయి. అంటే ఇవి ఐటీఐ ట్రేడులు, డిప్లొమా/ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో ఉంటాయి. అన్ని విభాగాలవారూ పార్ట్‌-బీలో 35 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. అలాగే ఈ విభాగంలోని మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. 


సీబీఏటీ:

సీబీటీ-2 పార్ట్‌-ఏలో అర్హత మార్కులు పొంది, పార్ట్‌-బీలోనూ అర్హత సాధిస్తే.. ఈ జాబితా నుంచి వారు సీబీటీ-2 పార్ట్‌-ఏలో పొందిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఆ కేటగిరీల వారీ ఖాళీలకు 8 రెట్ల అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు(సీబీఏటీ)కి ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు. సీబీఏటీలో నిర్వహించే ప్రతి పరీక్షలోనూ అన్ని కేటగిరీలవారూ 42 మార్కులు పొందితేనే అర్హులుగా పరిగణిస్తారు. 

తుది ఎంపికలో సీబీటీ-2 పార్ట్‌-ఏకు 70 శాతం, సీబీఏటీకి 30 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇందులో నిలిచినవారికి ధ్రువపత్రాలు పరిశీలించి, ఉద్యోగానికి అవకాశమిస్తారు.


సన్నద్ధత..

సిలబస్‌ వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించి, అందులోని అంశాలకే పరిమితమై, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.

గతంలో నిర్వహించిన లోకో పైలట్‌ ప్రశ్నపత్రాలూ బాగా అధ్యయనం చేయాలి. వాటి ద్వారా పరీక్షపై అవగాహనకు రావచ్చు. 

ఈ పరీక్షలో విజయానికి జనరల్‌ అంశాల్లో ప్రావీణ్యానికే ప్రాధాన్యం. అందువల్ల సీబీటీ-2 పార్ట్‌-ఏలో మెరుగైన స్కోరు పొందినవారే విజేత కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 

ట్రేడు/బ్రాంచీలో అర్హత మార్కులు పొందితే సరిపోతుంది. అందువల్ల సీబీటీ-2లోని పార్ట్‌-బీపై ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు. చదువుకున్న విభాగాల్లో పట్టు ఉంటుంది కాబట్టి అర్హత మార్కులు పొందడం తేలికే. అలాగని అశ్రద్ధ పనికిరాదు.

సీబీటీ-1, సీబీటీ-2లో పార్ట్‌ ఏ సిలబస్‌ ఒకటే. రెండింటిలోనూ మ్యాథమెటిక్స్‌ విభాగం, మెంటల్‌ ఎబిలిటీ (జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌) ఉన్నాయి. అందువల్ల అభ్యర్థులు ఒకే సన్నద్ధతతో సీబీటీ-1, సీబీటీ-2కు సిద్ధం కావచ్చు. తుది ఎంపికలో సీబీటీ-2 పార్ట్‌-ఏ మార్కులే కీలకం కాబట్టి ఈ అంశాలపై అధిక శ్రద్ధ వహించాలి. సీబీటీ-1, సీబీటీ-2 ప్రశ్నల స్థాయిలో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. సీబీటీ-1 వడపోత కోసం నిర్దేశించారు అందువల్ల ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలడుగుతారు. సీబీటీ-2లో మాత్రం ఆ అంశాల్లో కఠినమైన ప్రశ్నలే ఉంటాయి. అభ్యర్థులు ముందు ప్రాథమికాంశాలపై బాగా దృష్టి సారించి, వీలైనన్ని కఠినమైన ప్రశ్నలూ సాధన చేయాలి. 

ముందుగా విభాగంలోని అంశాలవారీ, ఆ తర్వాత మొత్తం సిలబస్‌ ప్రకారం వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి.  

రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నలు వదిలేయడమే మంచిది. అలాగే సమాధానం కోసం ఎక్కువ సమయం అవసరమయ్యేవాటిని చివరిలోనే ప్రయత్నించాలి. 

పరీక్షకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులైనా రాయాలి. ఈ ఫలితాలు విశ్లేషించుకుని, తప్పులు జరుగుతోన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే తర్వాతి పరీక్షలో తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలా చేయగలిగితేనే విజయానికి ఎక్కువ అవకాశాలుంటాయి. 

ఇప్పటికే ఆర్‌ఆర్‌బీ, బ్యాంకులు, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికి ఈ పరీక్ష కొంత సులువే. దాదాపు ఇవే అంశాలు వాటిలోనూ ఉండటమే ఇందుకు కారణం. తాజా అభ్యర్థులు సైతం ఉన్న సమయాన్ని ప్రణాళికతో సద్వినియోగం చేసుకుంటే విజయావకాశాలు దక్కుతాయి. 


వివరాలు..

ఖాళీలు: దేశవ్యాప్తంగా 5696 ఉన్నాయి. వీటిలో సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలోని.. ఈస్ట్‌ కోస్టు రైల్వేలో 199, సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో 559 ఖాళీలు ఉన్నాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 19.

ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఈబీసీలు, ట్రాన్స్‌జండర్లకు రూ.250. వీరు సీబీటీ-1కు హాజరైతే బ్యాంకు చార్జీలు మినహాయించి, మిగిలిన మొత్తాన్ని అకౌంట్‌కు జమచేస్తారు. మిగిలినవారు రూ.500 చెల్లించాలి. వీరు సీబీటీ-1కు హాజరైతే, బ్యాకు చార్జీలు మినహాయించి, రూ.400 అకౌంట్‌కు బదిలీ చేస్తారు. (పరీక్షకు హాజరుకానివారికి ఫీజు వెనక్కి రాదు)

అర్హత: నిర్దేశిత ట్రేడులు/ బ్రాంచీల్లో ఐటీఐ/ డిప్లొమా/ ఇంజినీరింగ్‌. ఏ-1 వైద్య ప్రమాణాలు అవసరం. వినికిడిలోపం, దృష్టిదోషం, వర్ణ అంధత్వం ఇవేవీ ఉండరాదు. 

వయసు: గరిష్ఠ వయసు పరిమితిని 30 నుంచి 33 ఏళ్లకు పెంచారు. దీని ప్రకారం జులై 1, 2024 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. జులై 2, 1991 - జులై 1, 2006 మధ్య జన్మించిన జనరల్‌ అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు లభిస్తుంది. 

పరీక్షల షెడ్యూల్‌: సీబీటీ-1 జూన్‌-ఆగస్టులోగా, సీబీటీ-2 సెప్టెంబరులో, సీబీఏటీ నవంబరులో, ధ్రువపత్రాల పరిశీలన నవంబరు/ డిసెంబరులో ఉండొచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పోస్టుకు ఎంపికైనవారు జనవరి, 2025 నుంచి విధుల్లో చేరే అవకాశముంది. 

వెబ్‌సైట్‌: https://www.recruitmentrrb.in/#/auth/landing
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌