• facebook
  • whatsapp
  • telegram

ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

9144 ఖాళీల‌తో ప్ర‌క‌ట‌న విడుద‌ల‌


రైల్వేలో కొలువుల జాతర ప్రారంభమైంది. లోకో పైలట్‌ దరఖాస్తులు ముగిశాయి. ఇప్పుడు టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీటికి ఎంపికైనవారు ఆకర్షణీయ వేతనం పొందవచ్చు! 


గ్రేడ్‌-1, గ్రేడ్‌-3.. రెండు విభాగాల్లోనూ 9144 ఖాళీలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్‌-3లోని 8052 పోస్టులకు పదో తరగతి తర్వాత నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు. పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. 


అర్హతలు, ఆసక్తి ఉన్నవారు టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ)ల వారీ ఉంటాయి. పరీక్ష మాత్రం అందరికీ ఉమ్మడిగానే నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏదో ఒక ఆర్‌ఆర్‌బీ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలి. అందులోని జోన్ల ప్రాధాన్యాన్ని ఎంచుకోవాలి. ఈ పరీక్షలను తెలుగు మాధ్యమంలోనూ రాసుకోవచ్చు. గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 రెండు పోస్టులకూ అవసరమైన విద్యార్హతలు ఉన్నవారు కావాలనుకుంటే రెండింటికీ విడిగా దరఖాస్తు చేసుకుంటే పరీక్ష రాయడానికి వీలుంటుంది.


గ్రేడ్‌-3 సిలబస్‌  

మ్యాథమెటిక్స్‌: నంబర్‌ సిస్టం, బాడ్‌మాస్, డెసిమల్స్, భిన్నాలు, కసాగు, గసాభా, రేషియో అండ్‌ ప్రపోర్షన్, శాతాలు, మెన్సురేషన్, కాలం-పని, కాలం-దూరం, బారు, చక్ర వడ్డీలు, లాభ నష్టాలు, ఆల్జీబ్రా, చలన జ్యామితి, త్రికోణమితి, ప్రాథమిక సాంఖ్యకశాస్త్రం, ఘాతాలు, వయసు లెక్కలు, గడియారాలు, క్యాలెండర్లు, పైప్స్‌ అండ్‌ సిస్టర్న్‌.

జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: అనాలజీలు, ఆల్ఫాబెటికల్‌ అండ్‌ నంబర్‌ సిరీస్, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్, మ్యాథమెటికల్‌ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్‌ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ సఫిషియన్సీ, కన్‌క్లూజన్స్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్, పోలికలు- భేదాలు, అనలిటికల్‌ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్‌- ఆర్గ్యుమెంట్లు, అజంప్షన్లు. 

జనరల్‌ సైన్స్‌: పదో తరగతి సిలబస్‌ స్థాయిలో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 

జనరల్‌ అవేర్‌నెస్‌: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, క్రీడలు, సంస్కృతి, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఇతర ముఖ్యమైన అంశాల్లో తాజా పరిణామాలపై ప్రశ్నలు వస్తాయి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 8

దరఖాస్తు ఫీజు: గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 దేనికైనా..  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు   రూ.250. వీరు సీబీటీకి హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి, మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు. ఇతర వర్గాల వారికి ఫీజు రూ.500. వీరు సీబీటీకి హాజరైతే రూ.400ల్లో బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలినవి వెనక్కి ఇస్తారు. 

పరీక్షలు: అక్టోబరు నుంచి డిసెంబరులోగా నిర్వహించవచ్చు. 

వెబ్‌సైట్‌: https://rrbsecunderabad.gov.in/


  పోస్టు: టెక్నీషియన్‌ గ్రేడ్‌-3  

ఖాళీలు: 8052. (బ్లాక్‌ స్మిత్, బ్రిడ్జ్, క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్, క్రేన్‌ డ్రైవర్, డీజిల్‌ (ఎలక్ట్రికల్‌), డీజిల్‌ (మెకానికల్‌), ఎలక్ట్రికల్, ఈఎంయూ, ఫిట్టర్, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్, పర్మనెంట్‌ వే, రివటర్, ఎస్‌ అండ్‌ టీ, ట్రాక్‌ మెషీన్, టర్నర్, వెల్డర్‌ ట్రేడులు/ విభాగాల్లో ఉన్నాయి. 

విద్యార్హత: పదో తరగతి తర్వాత సంబంధిత ట్రేడులు/విభాగాల్లో ఐటీఐ.

వయసు: జులై 1, 2024 నాటికి 18-33 ఏళ్ల మధ్యలో ఉండాలి.   

వేతనం: గ్రేడ్‌-3 టెక్నీషియన్‌ అవకాశం వచ్చినవారికి లెవెల్‌-2 జీతం అందుతుంది. వీరికి రూ.19,900 మూల వేతనంతో డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు దక్కుతాయి. అన్నీ కలిపి మొదటి నెల నుంచే సుమారు రూ.40 వేల జీతం పొందవచ్చు. అనుభవం, అంతర్గత పరీక్షలతో గ్రేడ్‌-2, గ్రేడ్‌-1 టెక్నీషియన్లుగా పదోన్నతులు పొందవచ్చు. 

పరీక్ష: ఆన్‌లైన్‌లో వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. వంద ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు. మ్యాథమెటిక్స్‌ 25, జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25, జనరల్‌ సైన్స్‌ 40, జనరల్‌ అవేర్‌నెస్‌లో 10 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. 

 గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 పరీక్షల్లో అర్హత సాధించడానికి అన్‌ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యుఎస్‌లు 40, ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఎస్సీలు 30, ఎస్టీలు 25 మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ధ్రువ పత్రాలు పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహించి, అన్ని విభాగాల్లోనూ అర్హత సాధిస్తే ఉద్యోగంలోకి తీసుకుంటారు. 

 గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 రెండు పరీక్షల్లోనూ ప్రతి తప్పు సమాధానానికీ 1/3 వంతు మార్కు తగ్గిస్తారు. 

 పై రెండు పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు మూడేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. 


  గ్రేడ్‌-3 సన్నద్ధత   

 ఈ పరీక్షలకు కనీసం ఏడు నెలల నుంచి పది నెలల వ్యవధి ఉంది. అభ్యర్థులకు ఈ సమయం బాగా కలిసొచ్చే అంశం. ఇటీవలే కోర్సులు పూర్తిచేసుకున్న తాజా అభ్యర్థులు సైతం ఈ వ్యవధిలో పరీక్షకు సమగ్రంగా సన్నద్ధం కావచ్చు.

 ప్రకటనలో సిలబస్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించాలి. 

 వ్యవధి ఎక్కువ రోజులే ఉన్నందున ఏదైనా విభాగంలోని ఒక అంశాన్నే తీసుకుని మూడు రోజుల కేటాయించుకోవచ్చు. ప్రాథమికాంశాల నుంచి ప్రారంభించి, పూర్తిగా చదవాలి. అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అలాగే ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. 

 నాలుగు నెలల్లో సిలబస్‌ మొత్తం క్షుణ్నంగా చదువుకుంటూ, మాదిరి ప్రశ్నలు సాధన చేయడం పూర్తవుతుంది. అనంతరం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. పరీక్ష కోణంలో ఆలోచించి, ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వాలో తెలుసుకుని, మళ్లీ చదవడం, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించడం చేయాలి. 

 ఎక్కువ వ్యవధి ఉంది కాబట్టి కనీసం వంద మాక్‌ టెస్టులు రాయడానికి కుదురుతుంది. చివరి రెండు నెలలు మాక్‌ టెస్టులు రాయడానికి, వాటి ఫలితాలు విశ్లేషించుకుని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకుని, స్కోరు పెంచుకోవడానికి కృషి చేయాలి.

 రుణాత్మక మార్కులు ఉన్నందున సమాధానం తెలియని ప్రశ్నలను వదిలేస్తేనే మంచిది.  

 ప్రతి ప్రశ్నకు 54 సెకన్ల సమయం దక్కుతుంది. కొన్నింటికి ఈ వ్యవధి సరిపోకపోవచ్చు. అందువల్ల వేగానికి ప్రాధాన్యముందని గ్రహించాలి. మెలకువలు పాటించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

 ఈ పరీక్షతో నియామకాలు పూర్తికాగానే మళ్లీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుంటే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. 

 మ్యాథమెటిక్స్‌ విభాగంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్‌ అరిథ్‌మెటిక్‌ -ఆర్‌ఎస్‌ అగర్వాల్‌ పుస్తకం సరిపోతుంది. ఈ విభాగంలో త్రికోణమితి, ఆల్జీబ్రా.. మొదలైన అంశాల కోసం పదో తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి, వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. 

 జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగానికీ ఆర్‌ఎస్‌ అగర్వాల్‌ రీజనింగ్‌ పుస్తకం లేదా ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఏ పుస్తకం చదివినప్పటికీ పరీక్షలో పేర్కొన్న అంశాలకే పరిమితమై, వాటినే అధ్యయనం చేయాలి.

 జనరల్‌ సైన్స్‌పై ప్రత్యేక దృష్టి అవసరం. వంద మార్కుల పరీక్షలో ఈ విభాగానికే 40 కేటాయించారు. అందువల్ల వీలైనన్ని ఎక్కువ మార్కులు పొందాలి. 8,9,10 తరగతుల భౌతిక, రసాయన, జీవశాస్త్రాల పుస్తకాలు బాగా చదవాలి. అలాగే ఈ విభాగాల్లో ఏపీఆర్‌జేసీ, పాలిటెక్నిక్‌ పాత, మాదిరి ప్రశ్నలు బాగా చదివితే గరిష్ఠ మార్కులకు అవకాశం దక్కుతుంది. 

 జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం ఏదైనా వార్తాపత్రికను చదువుతూ ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలకు చెందిన తాజా వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది. 


  టెక్నీషియన్‌ గ్రేడ్‌-1  

ఖాళీలు: 1092 (ఇవన్నీ సిగ్నల్‌ విభాగంలోనే ఉన్నాయి)

విద్యార్హత: ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టుతో బీఎస్సీ/డిప్లొమా/బీఈ/బీటెక్‌. 

వయసు: జులై 1, 2024 నాటికి 18-36 ఏళ్ల మధ్యలో ఉండాలి.

వేతనం: గ్రేడ్‌-1 టెక్నీషియన్‌ సిగ్నల్‌ పోస్టులకు ఎంపికైతే లెవెల్‌-5 జీతం చెల్లిస్తారు. వీరికి రూ.29,200 మూల వేతనంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. మొదటి నెల నుంచే సుమారు రూ.60 వేల జీతం పొందవచ్చు. 

పరీక్ష: కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతిలో వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. వంద ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు. జనరల్‌ అవేర్‌నెస్‌ 10, జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 15, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ బేసిక్స్‌ 20, మ్యాథమెటిక్స్‌ 20, బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో 35 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.