• facebook
  • whatsapp
  • telegram

క్లర్కు కొలువులకు పిలుపు

ప్రపంచంలోని తొలి వంద అతి పెద్ద బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒకటి. మన దేశంలో ఇదే అన్నిటి కంటే పెద్దది. సాధారణ డిగ్రీ అర్హతతో ఆ అత్యున్నత బ్యాంకులోకి ఉద్యోగిగా అడుగుపెట్టే అవకాశం. అభ్యర్థులు పరీక్ష స్వరూపాన్ని, అందుబాటులో ఉన్న సమయాన్ని, తమ బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే విజయాన్ని సాధించవచ్చు.

ఎస్‌బీఐ నియామకాలను రాష్ట్రాల వారీగా చేపడతారు. అభ్యర్థులు ఏ రాష్ట్రానికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఆ రాష్ట్రంలోనే రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు అక్కడి భాష (లోకల్‌ లాంగ్వేజి) పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు, అభ్యర్థులు ఎంపిక చేసుకునే లోకల్‌ లాంగ్వేజిపై నిర్వహించే టెస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్‌ పరీక్షలో ప్రతిభ చూపే అభ్యర్థుల్లో పోస్టుల సంఖ్యకు 10 రెట్ల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో సాధించిన మార్కులతో మెరిట్‌ లిస్ట్‌ తయారుచేస్తారు.

లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌
మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న లోకల్‌ లాంగ్వేజిని పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో చదివి ఉంటే లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌ రాయాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మెయిన్స్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే. 

ప‌రీక్షా స్వ‌రూపం
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష (ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టైప్‌): మొత్తం 100 ప్ర‌శ్న‌ల‌కు గంట‌లో స‌మాధానాలు గుర్తించాలి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక మార్కు. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1/4 వంతున కోత విధిస్తారు. ప్ర‌తి విభాగానికి ప్ర‌త్యేక స‌మ‌యం ఉంది. ప్ర‌తి విభాగంలో క‌నీస మార్కులు రావాల‌నే నిబంధ‌నేమీ లేదు. 
మెయిన్ ప‌రీక్ష (ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టైప్‌): మెయిన్ ప‌రీక్ష‌కు మొత్తం 2 గంట‌ల 40 నిమిషాలు కేటాయించారు. 190 ప్ర‌శ్న‌ల‌కు 200 మార్కులు. ప్ర‌తి విభాగానికి ప్ర‌త్యేక స‌మ‌యం ఉంది. స‌బ్జెక్టుల‌వారీ క‌నీసార్హ‌త మార్కులు లేవు. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1/4 వంతు మార్కులు త‌గ్గిస్తారు.

సాధన చేస్తే.. విజయం మనదే!
బీటెక్‌ పూర్తికాగానే బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపరేషన్‌ మొదలు పెట్టాను. దాదాపు ఏడాదిన్నరపాటు కోచింగ్‌ తీసుకుంటూ నిరంతరం శ్రమించాను. మొదటిసారి ఎస్‌బీఐ పీఓ ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. కానీ సెలక్షన్‌ రాలేదు. ఎస్‌బీఐ క్లర్క్స్‌కు మరింత జాగ్రత్త పడ్డాను. 93.5 (తెలంగాణ), 92.8 (ఆంధ్రప్రదేశ్‌) స్కోర్‌తో విజయం సాధించాను. ఒత్తిడికి లోనవకుండా ప్రణాళిక ప్రకారం చదివితే బ్యాంకు ఉద్యోగం కష్టమేమీ కాదు. మొదటి మూడునాలుగు నెలల పాటు రోజుకు 7 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఆ తర్వాత రోజుకు గంటన్నర మాత్రమే సాధన చేసేవాడిని. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలను ప్రతిరోజూ సాధన చేశాను. దీన్ని స్కోరింగ్‌ సబ్జెక్టుగా పెట్టుకున్నాను. రీజనింగ్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించాను. ఇంగ్లిష్, కరెంట్‌ అఫైర్స్‌ కోసం రోజూ న్యూస్‌ పేపర్లను చదివాను. బ్యాంకు పరీక్షలకు సాధనే కీలకమైంది. ఒక్క రోజు కూడా మిస్సవ్వకుండా ప్రాక్టీస్‌ చేయాలి. బ్యాంకు మేనేజర్‌ స్థాయికి ఎదగడం నా జీవిత లక్ష్యం.

- ఏలేటి పృథ్వీ తేజ; మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా

గెలిచే వరకు అలిసి పోవద్దు!
చిన్నప్పటి నుంచి బ్యాంకింగ్‌ రంగంలో రాణించాలన్న తపన ఉండేది. బీటెక్‌ పూర్తవగానే మొదట అమ్మానాన్నపై ఆధారపడ కూడదని లెక్చరర్‌గా కాలేజీలో చేరాను. తర్వాత పని చేస్తూనే మూడేళ్లపాటు బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యాను. సుమారు పదిహేను పరీక్షలు రాశాను. ఉత్తీర్ణత సాధించలేకపోయినా నిరుత్సాహపడకుండా రాస్తూనే ఉన్నాను. 92.5 (తెలంగాణ), 93.75 (ఆంధ్రప్రదేశ్‌) స్కోర్‌తో ఎస్‌బీఐ క్లర్క్స్‌లో విజయం సాధించాను. ఉద్యోగానికి ఎంపికయ్యాను. రోజుకు ఆరు గంటలపాటు అన్ని సబ్జెక్టులను సాధన చేసేవాడిని. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన విభాగాలను ప్రతిరోజూ చదివేవాడిని. జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ కోసం హిందూ న్యూస్‌పేపర్‌ రోజూ చదివాను. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునేవారికి న్యూస్‌ పేపర్‌ పఠనం ముఖ్యం. కష్టపడి ప్రయత్నిస్తే బ్యాంకు ఉద్యోగం సాధించడం సులభమే. బ్యాంకింగ్‌ రంగంలో అత్యున్నత స్థాయికి చేరాలన్నదే నా లక్ష్యం. 

- బొల్లం వీరనాగబాబు; పటవల, కాకినాడ

Posted Date : 21-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌