• facebook
  • whatsapp
  • telegram

భారీ స్థాయిలో ఉద్యోగ యోగం

బ్యాంకు పరీక్షలు రాసే అభ్యర్థులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసేవి.. ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు. వీటికి డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షా విధానంలో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష మొత్తానికి ఉన్న 60 నిమిషాల సమయాన్ని విభాగాల వారీగా ఒక్కొక్క దానికి 20 ని. చొప్పున మూడు విభాగాలకు కేటాయించారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్‌బీఐకి ఉండే ప్రత్యేకతల వల్ల ఎక్కువమంది ఈ పరీక్షకు పోటీ పడతారు. ఉద్యోగం సాధించి, దానిలో చక్కని ప్రతిభ చూపే అభ్యర్థులు తక్కువ సమయంలోనే ఉన్నతస్థానం చేరుకోవచ్చు. 25 సంవత్సరాల్లోపు పి.ఒ.గా చేరే అభ్యర్థులు  బ్యాంకు ఛైర్మన్‌ హోదా వరకూ చేరుకునే అవకాశం ఉంది.అందుచేత పరీక్ష కూడా ఇతర బ్యాంకు పరీక్షలతో పోల్చినపుడు హెచ్చుస్థాయిలోనే ఉంటుంది.  

కొత్త తరహా ప్రశ్నలు 
ఎస్‌బీఐ పీఓ పరీక్షలో ప్రతీసారీ కొన్ని కొత్త తరహా మోడల్‌ ప్రశ్నలు ప్రవేశపెడుతుంటారు. సాధారణంగా ఇతర పి.ఒ. పరీక్షలో ఉండే మోడల్‌ ప్రశ్నలతోపాటు వీటిని అదనంగా ఇస్తారు. అంతకుముందు చూడని ఆ తరహా ప్రశ్నలు సాధించడానికి సన్నద్ధమై ఉండాలి.

ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాత పరీక్షల్లో ఉన్న మొత్తం ఏడు విభాగాలను పరిశీలిస్తే.. ప్రిలిమినరీ పరీక్షలో ఉన్న మూడు విభాగాలు మెయిన్స్‌ పరీక్షలో కూడా ఉన్నాయి. ప్రిలిమ్స్‌లో ఉన్న క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, మెయిన్స్‌లో ఉన్న డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ ఒకే విభాగానికి చెందినవి. అందుచేత మెయిన్స్‌ పరీక్షకు సన్నద్ధమైతే ప్రిలిమినరీ పరీక్ష సన్నద్ధత కూడా దాదాపు పూర్తవుతుంది.

ఏ విభాగం ఎలా? 
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 
ప్రిలిమినరీ పరీక్షలో ఉన్న ఈ విభాగంలో ప్రశ్నలు, సింప్లికేషన్స్‌, అప్రాక్సిమేట్‌ వాల్యూస్‌, నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌, పర్ముటేషన్‌ కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ, వివిధ అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ నుంచి ఉంటాయి.

డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 
మెయిన్స్‌ పరీక్షలోని ఈ విభాగం సాధించడానికి అరిథిమెటిక్‌ టాపిక్స్‌ బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా పర్సంటేజెస్‌, ఏవరేజి, రేషియో-ప్రపోర్షన్‌లపై అవగాహన వుండాలి. కాలిక్యులేషన్స్‌ వేగంగా చేయగలగాలి. దీనిలో టేబుల్స్‌, లైన్‌గ్రాఫ్‌లు, బార్‌ డయాగ్రమ్‌లు, పై-ఛార్టులు, కేస్‌లెట్స్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలుంటాయి. ఒకటికంటే ఎక్కువ గ్రాఫ్‌లున్న మిక్స్‌డ్‌ గ్రాఫ్‌ మోడల్స్‌ కూడా ముఖ్యమే. గ్రాఫ్‌ల మధ్య వున్న సంబంధాన్ని త్వరగా తెల్సుకొని ప్రశ్నలు సాధించాలి. అలాగే పర్ముటేషన్స్‌-కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ, కొన్ని అరిథ్‌Çమెటిక్‌ ప్రశ్నలు కూడా వస్తాయి. ఈ విభాగానికి అభ్యాసం బాగా అవసరం.

రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 
ప్రిలిమినరీ, మెయిన్స్‌ రెండింటిలోనూ రీజనింగ్‌ వుంది. ఎస్‌బీఐ పీఓ రీజనింగ్‌ ప్రశ్నలు హెచ్చుస్థాయిలో వుంటాయి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్‌ టెస్ట్‌, కోడెడ్‌ ఇనీక్వాలిటీస్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌, డేటా సఫిషియన్సీ, ఎలిజిబిలిటీ టెస్ట్‌, స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు, ఇతర రీజనింగ్‌ టాపిక్స్‌ బాగా నేర్చుకుని సాధన చేయాలి. ముఖ్యంగా స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలలో ఆప్షన్లు అన్నీ సరైనవిగా భ్రమింపజేసేలా వుంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంగ్లిష్‌ పరిజ్ఞానం పెంచుకుంటే ఇలాంటి ప్రశ్నలు సులభంగా సాధించే అవకాశం వుంటుంది. కంప్యూటర్‌ నుంచి 5-10 ప్రశ్నలు రావొచ్చు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజి 
ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటితోపాటుగా డిస్క్రిప్షన్‌ టెస్టులోనూ ఈ విభాగం వుంది. అందుకని ఇది చాలా ముఖ్యం. ప్రశ్నలు వచ్చే సెంటెన్స్‌ కంప్లీషన్‌, పారా జంబుల్డ్‌, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, క్లోజ్‌ టెస్ట్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ మొదలైన మోడల్‌ ప్రశ్నలతోపాటు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌ ప్రశ్నలుంటాయి. పాసేజీని వేగంగా చదివి గ్రహించగలిగితే కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు సాధించవచ్చు. 
డిస్క్రిప్షన్‌ టెస్ట్‌లో లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌లు వుంటాయి. అభ్యర్థులు వీటిని బాగా సాధన చేయాలి. ఏదైనా విషయం తీసుకుని 150-200 పదాలతో ఎస్సే రాయగలిగేలా చూసుకోవాలి. ఎక్కువమంది బ్యాంకు పరీక్షల్లో ఫెయిలయ్యేది దీనిలోనే అని గుర్తుంచుకొని సాధన చేయాలి.

జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌
ఈ విభాగంలోని ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌, బ్యాంకింగ్‌ టర్మినాలజీ, స్టాండర్డ్‌ జి.కె.ల నుంచి వుంటాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలుంటాయి. గత 5, 6 నెలలకు సంబంధించిన తాజా పరిణామాలు బాగా చూసుకోవాలి. ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌, ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ మొదలైన అంతర్జాతీయ, నీతి ఆయోగ్‌ లాంటి జాతీయ ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఆర్‌బీఐ, స్టాక్‌ మార్కెట్‌, ఇతర జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న విషయాలు తెలుసుకోవాలి. కేవలం ప్రశ్న- జవాబు పద్ధతిలో కాకుండా పరిణామాలను విశ్లేషించేలా తయారవ్వాలి.

Posted Date : 07-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers