• facebook
  • whatsapp
  • telegram

అవుతారా బ్యాంకు అధికారి? 

ప్రభుత్వోద్యోగాల పోటీపరీక్షలు రాసేవారు ఎంతో ఆసక్తిగా  ఎదురుచూసే ఐబీపీఎస్‌ పీఓ నోటిఫికేషన్‌ విడుదలైంది.  డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ఎస్‌బీఐ మినహా ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో 1417 ప్రొబేషనరీ ఆఫీసర్ల/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీల భర్తీకే ఈ ప్రకటన! వీటికి నిర్వహించే రాతపరీక్షకు ఎలా సంసిద్ధమవ్వాలో నిపుణుల సూచనలు...

ప్రొబేషనరీ ఆఫీసర్‌ అంటే అసిస్టెంట్‌ మేనేజర్‌గా పిలిచే స్కేల్‌-1 అధికారి. అర్హత పరీక్ష ద్వారా ఎంపికైనవారికి రెండేళ్లపాటు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ సమయంలో వారిని ప్రొబేషనరీ ఆఫీసర్లుగా పిలుస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను స్కేల్‌-1 అధికారులుగా నియమిస్తారు. పీఓలకు నెలకు దాదాపు 40 వేల వేతనం ఉంటుంది. ఫాస్ట్‌ట్రాక్‌ ప్రమోషన్‌ పద్ధతుల ద్వారా పదోన్నతులూ త్వరగా లభిస్తాయి. 
ఐబీపీఎస్‌ ప్రకటనలో కేవలం నాలుగు బ్యాంకుల ఖాళీల వివరాలే ఉన్నాయి. మిగతా బ్యాంకుల్లో ఖాళీల వివరాలను పేర్కొనలేదు. కాబట్టి, నియామక సమయానికి (ఏప్రిల్‌ 1, 2021- మార్చి 31, 2022) ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. ఆన్‌లైన్‌లో జరిగే ప్రిలిమినరీ (అర్హత పరీక్ష), మెయిన్‌ పరీక్ష, ఆపై ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
గత ఏడాదితో పోలిస్తే రాతపరీక్ష విధానంలో మార్పేమీ లేదు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో ఉండే మొత్తం సమయాన్ని ప్రతి విభాగానికీ విడివిడిగా కేటాయించారు. ఆ నిర్ణీత సమయంలోనే ఆ విభాగాన్ని పూర్తిచేయాలి. అలాగే ప్రతి విభాగానికీ విడివిడిగా కటాఫ్‌ మార్కులు ఉంటాయి.


ప్రిలిమ్స్‌లో ఏవి ముఖ్యం?
మూడు సబ్జెక్టులు- క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్‌ ఉన్నాయి. గత ఏడాది నిర్వహించిన పరీక్షలో వీటిలో ఏయే అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయో పరిశీలిస్తే వేటిపై దృష్టిపెట్టాలో అర్థమవుతుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో నంబర్‌ సిరీస్‌ (5-6 ప్రశ్నలు), క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ (4-6), సింప్లిఫికేషన్స్‌ (5), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (12-15), ఇతర అరిథ్‌మెటిక్‌ ప్రశ్నల (10-12)ను ఆశించవచ్చు (వివిధ రోజుల్లో వివిధ షిప్టుల్లో నిర్వహించిన పరీక్షలు, వాటిలో వచ్చిన వచ్చిన కనీస, గరిష్ఠ ప్రశ్నల సంఖ్యను బ్రాకెట్లలో గమనించవచ్చు).
రీజనింగ్‌లో పజిల్స్‌/ సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ (18-19), కోడింగ్‌- డీకోడింగ్‌ (4-5), సిలాజిజమ్‌ (3-5), ఇన్‌ఈక్వాలిటీస్‌ (4-5), బ్లడ్‌ రిలేషన్స్‌ (3), డైరెక్షన్స్‌ (3), ఆర్డర్‌ ర్యాంకింగ్‌ (1-2), లెటర్‌/ నంబర్‌ సిరీస్‌ (2-3) చూసుకోవాలి.
ఇంగ్లిష్‌లో.. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (7-8), క్లోజ్‌ టెస్ట్‌ (6), ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ (3-6), స్పాటింగ్‌ ఎర్రర్స్‌ (5-7), వర్డ్‌ రిప్లేస్‌మెంట్‌ (3-6), ఫ్రేజ్‌ రిప్లేస్‌మెంట్‌ (3), పారా జంబుల్డ్‌ (5), ఇతర మోడల్స్‌ (3-4) అంశాలను చూసుకోవాలి.


మెయిన్స్‌కు ఇవి అదనం
మెయిన్స్‌లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో అదనంగా డేటా సఫిషియన్సీ, క్వాంటిటీ ఆధారిత ప్రశ్నలుంటాయి. అలాగే ప్రశ్నల కఠినత్వంలో తేడా ఉంటుంది. ముఖ్యంగా  డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలు హెచ్చు స్థాయిలో ఉంటాయి.
రీజనింగ్‌లో లాజికల్‌/ అనలిటికల్‌ రీజనింగ్‌ అంశాలు అదనంగా ఉంటాయి. ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, స్టేట్‌మెంట్‌- ఇన్‌ఫరెన్స్‌/ కన్‌క్లూజన్స్‌/ కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్‌/ అసంప్షన్స్, కాజ్‌-ఎఫెక్ట్, డేటా సఫిషియన్సీలు ఉంటాయి. ఇదే విభాగంలో కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలూ ఉంటాయి.
ఇంగ్లిష్‌లో అదనంగా కొత్త మోడల్‌ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. గ్రామర్‌పై పట్టు ఉంటే వీటిని తేలికగా సాధించవచ్చు. అదేవిధంగా డిస్క్రిప్టివ్‌ కూడా ఉంటుంది. లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ ఉంటాయి.
వీటితోపాటు జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం అదనంగా ఉంటుంది. దానిలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, స్టాటిక్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నుంచీ ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ల్లో ఉమ్మడిగా ఉన్నవాటికి, అదనపు వాటికి ప్రణాళిక వేసుకుని, సన్నద్ధమవ్వాలి.

 ప్రిలిమ్స్‌లో ప్రశ్నల స్థాయి తేలిక నుంచి మధ్యస్థంగా; మెయిన్స్‌లో మధ్యస్థం నుంచి హెచ్చు స్థాయిలో ఉంటుంది. 
 ప్రశ్నలను నిర్ణీత సమయంలోగా సాధించడం చాలా ముఖ్యం. మాదిరి ప్రశ్నపత్రాలు అందుకు సాయం చేస్తాయి. 
 వేగం, కచ్చితత్వం, నిలకడతనం ఐబీపీఎస్‌ పరీక్షలో చాలా ముఖ్యం. వీటిని దృష్టిలో ఉంచుకుని సాధన చేయాలి. 

చివరి ఏడాది వారికి అవకాశం?
ఏటా నోటిఫికేషన్‌ విడుదలయ్యే సమయానికి చివరి ఏడాది విద్యార్థులకు డిగ్రీ పూర్తి అయ్యి పరీక్ష రాసే వీలుండేది. కొవిడ్‌ ప్రత్యేక పరిస్థితుల రీత్యా వారి పరీక్షలు ఇంకా పూర్తవలేదు. దీంతో ఆగస్టు 26, 2020 నాటికి డిగ్రీ పూర్తిచేసినవారు మాత్రమే దరఖాస్తు చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ ప్రకారం ప్రస్తుతం చివరి ఏడాదిలో ఉన్నవారికి అవకాశం లేదు. ఐబీపీఎస్‌ దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు.

Posted Date : 07-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌