‣ 5454 క్లర్క్ క్యాడర్ పోస్టుల భర్తీకి ప్రకటన
‣ సరైన ప్రణాళికతో సాధన చేస్తే కొలువు ఖాయం
దేశంలోని అత్యధిక మంది యువత పని చేయాలనుకునే రంగాల్లోనూ బ్యాంకింగ్ ఒకటి. ఎస్ బీఐ లాంటి ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగమంటే ఆ ఆసక్తి రెట్టింపు అవుతుంది. డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థుల కోసం అలాంటి అవకాశం వచ్చేసింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకైనఎస్బీఐ 5454 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీ పడే అవకాశం ఉంది. హైదరాబాద్(తెలంగాణ)లో 275 ఖాళీలున్నాయి.
అర్హత ఏమిటి?
ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. డిగ్రీ చివరి ఏడాది/సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు ఏప్రిల్ 1, 2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు. అంటే ఏప్రిల్ 2, 1993 నుంచి ఏప్రిల్ 1, 2001 మధ్య జన్మించి ఉన్నవారు మాత్రమే అర్హులు. అయితే ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు ఉంది.
ఎంపిక ఎలా చేస్తారు?
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న లోకల్ లాంగ్వేజీపై టెస్ట్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్(ఫేజ్) లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు సిద్ధం చేసి ఎంపికలు పూర్తి చేస్తారు.
పరీక్ష విధానం
ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్లు (ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ) ఉంటాయి. సమయం గంట కేటాయించారు. ఈ పరీక్షలో రుణాత్మక మార్కులుంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. అందులో నాలుగు సెక్షన్లు (జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్) ఉంటాయి. ఇందులో మొత్తం 190 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. సమయం 2 గంటల 40 నిమిషాలు కేటాయించారు. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌లో, మెయిన్స్ జులై 31, 2021న నిర్వహిస్తారు.

లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
మెయిన్స్ పరీక్ష అనంతరం విడుదల చేసే మెరిట్ లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న లోకల్ లాంగ్వేజిని పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో చదివి ఉంటే ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇతరులు తప్పనిసరిగా రాయాలి.
ఇలా దరఖాస్తు చేయండి
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
జూనియర్ అసోసియేట్స్ విధులేంటి?
ఈ పోస్టులను నోటిఫికేషన్లో జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) గా పేర్కొన్నారు. అంటే ఖాతాదారులకు కావాల్సిన సేవలు అందిస్తూ బ్యాంకు అందించే అన్ని రకాల సేవలను (డిపాజిట్లు, రుణాలు, పథకాలు మొదలైనవి) తెలియజేయటం, ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షిస్తూ తద్వారా బ్యాంకు ఆదాయం పెంచడం.. దాదాపు బ్యాంకుకు సంబంధించిన అన్ని రకాల బాధ్యతలనూ తమ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీతభత్యాల సంగతి?
రూ.19,900 బేసిక్ పేతో మొదలై దేశంలో వారు పనిచేసే ప్రాంతాలను బట్టి మొత్తం నెలసరి వేతనాన్ని నిర్ణయిస్తారు. ముంబయి లాంటి మెట్రో నగరాల్లో అన్ని అలవెన్సులను కలుపుకుని ప్రారంభంలో రూ.29,000 వేతనం పొందే అవకాశం ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఇది మారుతుంది. వీటికి అదనంగా వారికి పెర్క్‌లు, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, మెడికల్ లాంటి అదనపు ప్రయోజనాలు, సదుపాయాలు ఉంటాయి. అయితే ఏ ప్రాంతంలో పనిచేసినా దాదాపు రూ.22-23 వేల నెల జీతం పొందగలరు.
పదోన్నతులు ఏ విధంగా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అద్భుతమైన పదోన్నతుల పద్ధతి ఉంది. దీనివల్ల త్వరగా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. పదోన్నతుల కోసం బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణులవడం ద్వారా మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయి వరకు అంచెలంచెలుగా చేరుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం వారి వయసు, ప్రతిభ తోడ్పాటు అవసరమవుతుంది.
ప్రిపరేషన్ ప్రణాళిక
బ్యాంకు పరీక్ష రాసే అభ్యర్థులకు ముందస్తు ప్రణాళిక అవసరం. ప్రిలిమ్స్‌కు రెండు నెలలు, మెయిన్స్‌కు మూడు నెలల సమయం ఉన్నందున ఇప్పటినుంచే స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాలి. ఈ క్రమంలోనే పరీక్షతీరు, ఏయే సబ్జెక్టుల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయనే వాటిపై దృష్టి పెట్టాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు విడివిడిగా కాకుండా రెండింటీకి కలిపి సిద్ధమవ్వాలి. నిత్యం ఎనిమిది నుంచి పది గంటలు నేర్చుకోవడం, సాధన చేయడం, మోడల్ పరీక్షలు రాయడంపైనే శ్రద్ధ పెట్టాలి. రెండు పరీక్షలకు సంబంధించి ఎనిమిది విభాగాల్లో ఒక్కో అంశాన్ని నేర్చుకుంటూ ప్రశ్నలను సాధన చేయాలి. మోడల్ పరీక్షలు రాయడం వల్ల ఎంత సమయంలో ఎన్ని సమాధానాలు గుర్తిస్తున్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి ముందు రోజుల్లో వేగంగా సమాధానాలు సాధించేలా ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా షార్ట్‌కట్స్ ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తే పరీక్షలో ఎంతోసమయం ఆదా అవుతుంది. ఆ సమయాన్ని కఠినమైన విభాగానికి వినియోగించుకోవచ్చు. మాదిరి పరీక్షల్లో మొదట తక్కువ మార్కులు వచ్చినా.. క్రమక్రమంగా పెరుగుతాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో రెండు మినహా మిగతా సబ్జెక్టులన్నీ ఒకే తరహాలో ఉన్నప్పటికీ ఇచ్చే ప్రశ్నల్లో తేడా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. పాత ప్రశ్న పత్రాలను గమనించడం వల్ల ఈ విషయం అవగతమవుతుంది. సన్నద్ధంలో భాగంగా వీలైనంత మేర ఎక్కువపాత ప్రశ్నపత్రాలను సాధిస్తే పరీక్షలో కూడా ఎలాంటి హడావుడి, భయం లేకుండా సమాధానాలు గుర్తించగలుగుతారు.
ఇంగ్లిష్ లాంగ్వేజీ: ఈ విభాగంలో మార్కులు సాధించాలంటే ఆంగ్లంపై కనీస అవగాహన అవసరం. గ్రామర్‌పై పట్టు సాధించాలి. సెంటెన్స్ అరెంజ్‌మెట్స్, సెంటెన్స్ కరెక్షన్ ప్రశ్నలు వస్తాయి. కాంప్రహెన్షన్ ప్యాసేజీలు ఇచ్చి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించమంటారు. వీటిపై శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజూ ఏదైనా ఆంగ్ల పత్రిక చదవడం అలవాటు చేసుకోవాలి. విధి నిర్వహణలో భాగంగా ఆంగ్లంలో వచ్చే రకరకాల పత్రాలను సరిగా అర్థం చేసుకోడానికి ఇంగ్లిష్ అవసరం. ఇందుకోసమే నియామక పరీక్షల్లో ఈ ప్రశ్నలు ఇస్తారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రీడింగ్ కాంప్రహెన్షన్, జంబుల్డ్ సెంటెన్సెస్, రూట్ వర్డ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
రీజనింగ్: అభ్యర్థుల తార్కిక ఆలోచనా విధానాన్ని పరిశీలించడం ఈ విభాగం ఉద్దేశం. సంఖ్యలు, డిజైన్ల మధ్య సంబంధాలను ఎలా అర్థం చేసుకుంటున్నారో చూస్తారు. కోడింగ్, డీ-కోడింగ్, అనాలజీ, సిరీస్, డైరెక్షన్స్, సీటింగ్ అరెంజ్ మెంట్స్, రక్తసంబంధాలు, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే వీలైనంత సాధన చేయడమే మార్గం. మిర్రర్ ఇమేజెస్, బొమ్మలతో కూడిన ప్రశ్నలను సాధించాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థుల్లోని తార్కిక, విశ్లేషనాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలను ఇందులో పరీక్షిస్తారు. ఆప్టిట్యూడ్ పరీక్షల్లో ప్రధానమైన విభాగం ఇది. సమస్యలను పరిష్కరించడంలో సామర్థ్యం, అంకెలు, సంఖ్యలపై పట్టు, గణిత నైపుణ్యాలను పరిశీలిస్తారు. ప్రతిరోజూ సాధన చేస్తేనే ఇందులో సఫలమవుతారు. ఈ విభాగంలో సమాధానాలను గుర్తించడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మిగతా వాటిని త్వరగా పూర్తి చేసి దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. గణితంలో కీలక భావనలైన కూడికలు, తీసివేతలు, భాగహారాల వంటి వాటిపై పట్టు సాధించాలి. నిష్పత్తులు, శాతాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, లాభ-నష్టాలు, కాలం-పని, కాలం-దూరం మొదలైన అంశాలను ప్రాథమిక స్థాయి నుంచి ప్రాక్టీస్ చేయాలి. వందశాతం మార్కులు సంపాదించుకోడానికి అనుకూలమైన విభాగం ఇది.
జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్: ఇటీవల జరిగిన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై పట్టు పెంచుకోవాలి. ఇది నిత్యం పత్రకలు చదివితేనే సాధ్యపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, క్రీడా టోర్నమెంట్లు, పుస్తకాలు, రచయితలు, బ్యాంకింగ్, ఆర్థిక నిబంధనలు, అంతర్జాతీయ సంస్థలు, ద్రవ్య, ఆర్థిక విధానాలపై దృష్టి పెట్టాలి. అభ్యర్థికి ఆర్థిక అంశాలపై ఎంత అవగాహన ఉందో ఈ విభాగం ద్వారా పరీక్షిస్తారు.
కంప్యూటర్ ఆప్టిట్యూట్: ప్రస్తుత రోజుల్లో ఏ పనైనా కంప్యూటర్‌పైనే. అందుకే కంప్యూటర్ అవగాహన తప్పనిసరి. కనీసం బేసిక్స్ తెలిసి ఉండాలి. ఈ విభాగంలోనూ వాటిపైనే ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్ విభాగాలు, సీపీయూ, ఇన్పుట్/అవుట్‌పుట్ డివైజెస్‌తోపాటు ఇంటర్నెట్, ఫైల్స్ అండ్ సిస్టమ్స్, డేటా కమ్యూనికేషన్, క్యారెక్టర్స్, ఫ్రాక్షన్స్, బైనరీ అండ్ హెక్సాడెసిమల్స్ రిప్రజెంటేషన్, బైనరీ అరిథ్‌మెటిక్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
న్యూమరికల్ ఎబిలిటీ: ఈ విభాగంలో నంబర్స్ సిస్టమ్, పర్సంటేజ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, స్వేర్ రూట్స్, ప్రాఫిట్ & లాస్, రేషియో & ప్రపొర్షన్, మెన్స్యురేషన్, ఆవెరేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్, టైం & వర్క్, క్లాక్స్ అండ్ క్యాలెండర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
చాలా సమయం.. సాధనే కీలకం
ప్రిలిమ్స్ పరీక్షకు 50 రోజులు, మెయిన్స్‌కు మరో 70 రోజుల సమయం ఉంటుంది. ఇప్పటికే ప్రిపేర్ అవుతున్న వాళ్లు ఈ పరీక్షకు మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఆయా సబ్జెక్టులపై ఏమేరకు పట్టు సాధించామనే విషయమై టెస్టులు రాయాలి. అప్పుడు వారి బలహీనతలు తెలుస్తాయి. వేటిపై తాము ఎక్కువ సమయం వెచ్చించాలనే విషయం అవగతమవుతుంది. ఇక బ్యాంకు పరీక్షలు మొదటిసారి రాస్తున్న వారు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. పాత ప్రశ్న పత్రాలు ఒక్కసారి పరిశీలిస్తే పరీక్షపై వారికి ఒక అవగాహన వస్తుంది. అనంతరం నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యమైన నాలుగు సబ్జెక్టులు ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్ నుంచి వచ్చే ప్రశ్నలపై అవగాహన పెంచుకోవాలి. ప్రిలిమ్స్ పరీక్ష నాటికే మెయిన్స్‌కి కూడా సన్నద్ధం కావాలి. ప్రిలిమ్స్‌లో బేసిక్ అంశాలపైనే ప్రశ్నలు అడుగుతారు. మెయిన్స్‌లో కాస్త కఠినంగా ఉంటాయి కానీ రెండు పరీక్షల్లో టాపిక్ ఒకటే కాబట్టి రెండింటి కోసం సాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా సాధారణ విద్యార్థులు కూడా బ్యాంకు క్లర్క్ ఉద్యోగం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 20, 2021.
వెబ్సైట్: https://www.sbi.co.in/web/careers#lattest
ప్రీవియస్ పేపర్లు | మోడల్ పేపర్లు | ఇంగ్లిష్ |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ | రీజనింగ్ | జనరల్ అవేర్నెస్ |