• facebook
  • whatsapp
  • telegram

26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

పరీక్ష సరళి, సిలబస్‌ వివరాలు

ఫిబ్రవరి, మార్చిలో రాత పరీక్షలు



కేంద్ర సాయుధ దళాల్లో 26,146 కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతోనే వీటికి పోటీ పడొచ్చు. మహిళలూ అర్హులే. కంప్యూటర్‌ బేస్డ్, దేహదార్ఢ్య, శారీరక ప్రమాణ, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే  సుమారు రూ.40 వేల వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో పదోన్నతులుంటాయి.


సాయుధ దళాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దాదాపు ఏటా ప్రకటన విడుదల చేస్తోంది. పదో తరగతి విద్యార్హతతో, జనరల్‌ అభ్యర్థులు 23 ఏళ్ల వయసు వరకు పోటీ పడవచ్చు. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్నవారు విజయం సాధించడానికి అవకాశాలెక్కువ. ఎంపికైనవారు.. ఆసక్తి, మెరిట్‌ ప్రకారం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌)లో నచ్చిన విభాగంలో సేవలు అందించవచ్చు. వీటిలో ఎందులో చేరినప్పటికీ వేతనం మాత్రం అందరికీ సమానమే. వీరు శిక్షణ అనంతరం విధుల్లోకి చేరిన తర్వాత లెవెల్‌-3 మూలవేతనం రూ.21,700 పొందుతారు. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు దక్కుతాయి తొలి నెల నుంచే సుమారు రూ.40 వేలు అందుకోవచ్చు. విధుల్లో ప్రతిభ, విద్యార్హత, అనుభవంతో హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై స్థాయికి చేరుకోవచ్చు. శాఖాపరమైన పరీక్షల ద్వారా ఎస్సై, ఆపై స్థాయికీ ఎంపిక కావచ్చు.


పరీక్ష ఇలా 

గత ఏడాది నుంచి ప్రశ్నల సంఖ్యను 80కి పరిమితం చేశారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ప్రశ్నపత్రం 160 మార్కులకు ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్‌/ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 20 చొప్పున మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. వీటికి ఒక గంటలో సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు వస్తాయి. మాక్‌ టెస్టు ఎస్‌ఎస్‌బీ వెబ్‌సైట్‌లో పరీక్షకు కొద్ది రోజుల ముందు అందుబాటులో ఉంచుతారు. 


పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 30, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌లు 25, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌కు 5, బీ ఉంటే 3, ఏ ఉన్నవారికి 2 శాతం మార్కులు కలుపుతారు. ఇలా అర్హత మార్కులు పొందినవారి జాబితా నుంచి విభాగాల వారీ మొత్తం ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో అభ్యర్థులకు ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు.


పీఈటీ, పీఎస్‌టీ 

పీఈటీలో భాగంగా పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో, మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని 8 1/2 నిమిషాల్లో చేరుకోవాలి. పీఎస్‌టీలో.. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ పురుషులు 162.5, మహిళలు 150 సెం.మీ. ఉంటే సరిపోతుంది. పురుషుల ఛాతీ విస్తీర్ణం 80 సెం.మీ. (ఎస్టీలకు 76) తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ.పెరగాలి. ఎత్తుకు తగ్గ బరువుండాలి. 


అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారి జాబితా నుంచి వారు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం కేటగిరీలవారీ ఖాళీలకు 2 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెడికల్‌ టెస్టుకు ఎంపిక చేస్తారు. అందులోనూ విజయవంతం కావాలి. తుది నియామకాలు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్, విభాగాల వారీ ఖాళీలు, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు నింపినప్పుడే సర్వీసులవారీ ప్రాధాన్యం తెలపాలి. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు కానిస్టేబుల్‌ హోదాతో విధుల్లో కొనసాగవచ్చు.        


ఏ అంశాల్లో ప్రశ్నలు?

జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌: నంబర్‌ ఎనాలజీ, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు నంబర్‌ క్లాసిఫికేషన్, ఫిగర్‌ ఎనాలజీ, నంబర్‌ సిరీస్, కోడింగ్‌ - డీకోడింగ్, వర్డ్‌ బిల్డింగ్‌.. మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే వస్తాయి.


జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు రాయవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్‌ సోషల్, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జనవరి 2023 నుంచి ముఖ్యాంశాలపై దృష్టి సారించాలి.  


ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌: అంకెలతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. అంకెల మధ్య సంబంధం, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం - పని, కాలం - దూరం, వడ్డీ, డిస్కౌంట్, కొలతలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.


ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వ్యాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల నుంచే వీటిని అడుగుతారు హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.


సన్నద్ధత

సిలబస్‌ వివరాలు శ్రద్ధగా గమనించాలి. అందులోని అంశాలవారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిద్వారా ప్రశ్నల స్థాయి తెలుస్తుంది. సాధనను అందుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.  

పరీక్షలో 60 నిమిషాల వ్యవధిలో 80 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకూ  సమయం కేవలం 45 సెకన్లే. అందువల్ల అభ్యర్థులు తక్కువ వ్యవధిలో వీలైనన్ని సరైన సమాధానాలు గుర్తిస్తేనే విజయం సాధించగలరు.  

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికి ఎక్కువ సమయం కావాలి. పరీక్షకు ముందు ఎక్కువ సంఖ్యలో మాదిరి ప్రశ్నలు సాధన చేయడం, సూత్రాలు ఉపయోగించే విధానం, షార్ట్‌ కట్‌ మెథడ్స్‌పై పట్టు సాధిస్తే తక్కువ వ్యవధిలో జవాబు గుర్తించగలుగుతారు. 

సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పది మాక్‌ టెస్టులు రాయాలి. వాటి ఫలితాలను సమీక్షించుకుని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.

రుణాత్మక మార్కులు ఉన్నందున జవాబులు తెలియనివాటిని వదిలేయాలి. 

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌.. అగ్నివీర్‌ పరీక్షల ప్రశ్నపత్రాలూ అధ్యయనంలో ఉపయోగమే. పరీక్షకు ముందు ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచిన మాక్‌ టెస్టునూ రాయాలి. 

తర్వాత దశకు చేరుకోవడానికి పరీక్షలో అర్హత సాధించడం ముఖ్యం కాబట్టి దానిపైనే దృష్టి పెట్టాలి. అది ముగిసిన తర్వాత ఫిజికల్‌ టెస్టుల్లో ఉత్తీర్ణతకు సాధన చేయవచ్చు. 


ముఖ్య సమాచారం..

ఖాళీలు: 26,146. 

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)-6174 

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)-11025

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)-3337 

సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ)-635  

ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)-3189 

అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌)-1490 

సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)-296.

ఈ ఏడాది నార్కోటిక్‌ బ్యూరోలో ఖాళీలు లేవు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: జనవరి 1, 2024 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 2, 2001 - జనవరి 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 31 రాత్రి 11 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు. 

పరీక్ష: ఫిబ్రవరి, మార్చిలో. తేదీలను తర్వాత ప్రకటిస్తారు. 

పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్,    వరంగల్‌. 

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/
 


  Useful Study Material  


General Intelligence and Reasoning 

General Knowledge

General Awareness

Quantitative Aptitude

General English


 

Posted Date : 29-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌