• facebook
  • whatsapp
  • telegram

కేంద్రంలో 1324 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు

* స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన

కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో 1324 జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమేరకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉద్యోగాల్లో నియమితులైనవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖ/విభాగాల్లో గ్రూప్‌-బి (నాన్‌- గెజిటెడ్‌) నాన్‌ మినిస్టీరియల్‌ జూనియర్‌ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తారు. 

ఈ ప్రకటన ద్వారా జూనియర్‌ ఇంజినీర్లుగా నియమితులైనవారికి సెవెన్త్‌-పే-స్కేలు ప్రకారం రూ.35,400 నుంచి రూ.1,12,400తో  మొదటి నెలనుంచే రూ.50 వేల నుంచి రూ.55 వేల జీతం లభిస్తుంది. వీరు బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్, కేంద్ర ప్రజాపనుల శాఖ, కేంద్ర జలసంఘం, సైనిక ఇంజినీర్‌ సేవలు, జల వనరుల శాఖ, నదుల అభివృద్ధి, ఓడరేవులు, షిప్పింగ్‌ మొదలైనచోట్ల తమకు సంబంధించిన విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. అభ్యర్థులు తమకు సంబంధించిన ఇంజినీరింగ్‌ స్సెషలైజేషన్‌లోనే కేంద్రప్రభుత్వ ఉద్యోగంలో జూనియర్‌ ఇంజినీర్‌గా నియమితులవుతారు. తమ విభాగంలో పనిచేయడం ప్రతి ఉద్యోగికీ సౌలభ్యమే కాకుండా చేసే ఉద్యోగ విధులూ సంతృప్తికరంగా ఉంటాయి. 
  పేపర్‌-2 ఆన్‌లైన్లో..

ఈసారి నిర్వహించే ఎస్‌ఎస్‌సీ నియామక పరీక్ష పేపర్‌-1లో ఎలాంటి మార్పూలేదు. కానీ పేపర్‌-2లో మాత్రం భారీ మార్పు చోటుచేసుకుంది. 

ఆఫ్‌లైన్‌లో నిర్వహించే పేపర్‌-2 ఈసారి ఆన్‌లైన్‌ నిర్వహించనున్నారు. 

పేపర్‌-2 మార్కులు, సమయంలో ఎలాంటి తేడా లేదు.

పేపర్‌-2లో ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉన్నందున ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కుకు 0.25 చొప్పున.. మొత్తం 0.75 రుణాత్మక మార్కులుంటాయి. కాబట్టి పేపర్‌-2లో సమాధానాలు గుర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

పూర్వపు పరీక్ష విధానంలో సిద్ధమైనవారు ప్రస్తుత పేపర్‌-2లో మార్పులకు ఆందోళన చెందకుండా ముందు జరిగే పేపర్‌-1పై దృష్టి సారించాలి. 


  ఎవరు అర్హులు?

సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌ విభాగాల్లో డిప్లొమా/ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. 

వయసు: పోస్టులకు అనుగుణంగా 18- 32 సంవత్సరాల వయసువారు అర్హులు. వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయసులో కొంత సడలింపు ఉంటుంది. 

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 16.08.2023 

ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ: 16.08.2023

ఆన్‌లైన్‌ పరీక్ష (పేపర్‌-1): అక్టోబర్, 2023ఆన్‌లైన్‌ పరీక్ష (పేపర్‌-2): తర్వాత ప్రకటిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. 


   దరఖాస్తు ప్రక్రియ

ఈ పరీక్ష రాయదలిచిన అభ్యర్థులు http://ssc.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు పూరించి పంపాలి. 

‣ ఆన్‌లైన్‌ దరఖాస్తును సులభంగా పూరించడానికి నమూనా దరఖాస్తును పరిశీలించవచ్చు. 

‣ ఆన్‌లైన్‌ దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్‌ ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి. 

‣ పరీక్ష ఫీజు రూ.100. భీమ్‌ యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డ్, డెబిట్‌ కార్డ్‌..వీటిలో దేనిద్వారానైనా చెల్లించవచ్చు.  

మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ క్యాటగిరీలవారికి పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంది. 

   సన్నద్ధత ఎలా? 

ప్రశ్నపత్రాలు డిప్లొమా సిలబస్‌ ఆధారంగా సులభంగానే ఉంటాయి. కానీ డిప్లొమాతోపాటు డిగ్రీ విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పోటీపడతారు. కాబట్టి డిప్లొమా విద్యార్థులు కొంత ఎక్కువగా శ్రమపడాలి. 

థియరీ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. సరైన సమాధానాలు రాయడంతోపాటు ఎంత త్వరగా సమాధానాలు గుర్తించామనేది ముఖ్యం.  

ఈ పరీక్షలో విజయం సాధించాలంటే మొదట పరీక్ష విధానం, సిలబస్, పరీక్ష స్టాండర్డ్‌ను అవగతం చేసుకోవాలి.

‣ పరీక్ష రాసేటప్పుడు సమయ పాలన అనేది అత్యంత కీలకం. ప్రణాళికాబద్ధంగా సరైన సాధన అవసరం. 

‣ పరీక్ష సమయంలో అభ్యర్థులు సూటిగా సమాధానం రాయగలిగే ప్రశ్నలను ముందుగా ఎంచుకుని తక్కువ సమయంలో పూర్తిచేయాలి. మిగిలిన వ్యవధిని ఎక్కువ సమయం పట్టే సంఖ్యాపరమైన, సూత్రాధారిత ప్రశ్నలకు కేటాయించవచ్చు. 

పరీక్షకు ఉన్న సమయం దృష్టిలో ఉంచుకుని తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి.

‣ ఇప్పటి నుంచీ రోజుకు కనీసం 8- 10 గంటల సమయాన్ని సాధనకు కేటాయించాలి.

పరీక్ష సిలబస్‌ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ అంశాలు చదవాలో ఏ అంశాలపై ఎక్కువ శ్రద్ధపెట్టాలో అర్థమవుతుంది. 

ప్రామాణిక పుస్తకాలు, అధ్యయన సామగ్రిని (మెటీరియల్‌) ఎంచుకోవడం ప్రధానం.

పరీక్షకు సిద్ధమయ్యే క్రమంలో ప్రతి చాప్టర్, ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలను చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి.

ప్రిపరేషన్లో అత్యంత కీలకం పునశ్చరణ అని మరవొద్దు. చదివిన ప్రతి అంశాన్నీ పునశ్చరణ చేయాలి. 

‣ సన్నద్ధత క్రమంలో, అనంతరం వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయడం చాలా ముఖ్యం. ఇవి రాసిన తర్వాత చేసిన తప్పులను గుర్తించి సవరించుకోవాలి. 

వీలైనంతవరకూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. ఏ సమయంలోనూ ఒత్తిడికి గురికాకూడదు. 


ఏ సబ్జెక్టు ఎలా?

1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌

వెర్బల్, నాన్‌వెర్బల్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డెసిషన్‌ మేకింగ్, అరిథ్‌మెటిÚ, రీజనింగ్, క్లాసిఫికేషన్, నంబర్‌ సిరీస్, అనాలిసిస్‌ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదివిన అభ్యర్థులకు ఈ అంశాలు.. చదివిన పాఠ్యాంశాల్లో లేనప్పటికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి సరైన పద్ధతిలో సాధన చేస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. 

2. జనరల్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగంలో అభ్యర్థి పరిసరాల్లో జరిగే సాధారణ విషయాల అవగాహనను, సమాజంపై అది చూపే ప్రభావాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. ఇలాంటి అంశాలపై డిప్లొమా, ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ దైనందిన వార్తాపత్రికలు, ప్రామాణిక పాఠ్య పుస్తకాలు సమగ్రంగా అధ్యయనం చేస్తే పరీక్షలో ప్రశ్నల సాధన సులువవుతుంది. ఉదాహరణకు చంద్రయాన్‌-3 వంటి విషయాలు.

3. జనరల్‌ ఇంజినీరింగ్‌

ఇందులో సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ప్రశ్నలు అడుగుతారు. అంటే సివిల్‌ విద్యార్థులు సివిల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో కూడా ఆయా విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. 

సివిల్‌ ఇంజినీరింగ్‌: అభ్యర్థులు పూర్వ ప్రశ్నపత్రాల ద్వారా సరైన అవగాహనను పొంది తమ అభ్యాసాన్ని మొదలుపెట్టడం మంచిది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బిల్డింగ్‌ మెటీరియల్స్, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్, సర్వేయింగ్, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌ సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్టులను ముందుగా అభ్యసించడం, మాదిరి ప్రశ్నలు సాధనం చేయడం ఎంతో కీలకం. 

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే.. ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలి క్‌ మెషీన్స్, థర్మల్‌ ఇంజినీరింగ్, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో ఎక్కువ ప్రశ్నలు రావడం గమనించవచ్చు. 

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే.. ఎలక్ట్రికల్‌ మెషిన్స్, ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్, పవర్‌ సిస్టమ్స్‌ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 


 

- ప్రొ. వై.వి. గోపాలకృష్ణమూర్తి

సీఎండీ, ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడెమీ 

Posted Date : 03-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌