• facebook
  • whatsapp
  • telegram

అవుతారా.. కేంద్ర ప్రభుత్వ ఇంజినీర్‌! 

‣ 968 పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ప్రకటన 


 


సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ చదివారా? అయితే మీకోసమే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌  ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 968 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటితోపాటు మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో మరికొన్ని పోస్టులు చేర్చనున్నారు. డిప్లొమా, ఇంజినీరింగ్‌ పట్టభద్రులైన నిరుద్యోగ, చిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.


ఈ పరీక్ష ద్వారా ఉద్యోగాల్లో నియమితులైనవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ/ విభాగాలు/ సంస్థల్లో గ్రూప్‌-బి (నాన్‌-గెజిటెడ్‌) నాన్‌ మినిస్టీరియల్‌ జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో విధులు నిర్వహిస్తారు. సెవెన్త్‌-పే ప్రకారం రూ.35,400 నుంచి రూ.1,12,400 స్కేలుతో మొదట దాదాపు రూ.50 వేల నుంచి రూ.55 వేల జీతం లభిస్తుంది.


జూనియర్‌ ఇంజినీర్‌గా నియమితులైతే బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ కేంద్ర ప్రజాపనుల శాఖ, కేంద్ర జలసంఘం, సైనిక ఇంజినీర్‌ సేవలు, జల వనరుల శాఖ జలశక్తి మంత్రిత్వ శాఖల్లోని బ్రహ్మపుత్ర బోర్డ్‌, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థల్లో, సంబంధిత విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. జూనియర్‌ ఇంజినీర్‌గా చేరితే ఆ విభాగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువ. డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ హోదాలకు పదోన్నతి పొందవచ్చు.


ఉద్యోగ బాధ్యతలు

పర్యవేక్షణ: ముందుగా చేయవలసిన ఉద్యోగ విధులకు సంబంధించిన విషయాలను పూర్తిగా పర్యవేక్షణ చేయాలి.  

ప్రణాళిక: తర్వాత చిన్న చిన్న ప్రణాళికల తయారీ, మరమ్మతులు/ పునరుద్ధరణ పనులకు అంచనాలు చేయాలి. ఆ విభాగంలో ప్రధాన కార్యాచరణకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలి.

అకౌంట్స్‌: కాంట్రాక్టర్ల ద్వారా చేయించిన పని రసీదులు, ఖర్చులకు బాధ్యత వహించాలి. ఆ విభాగంలోని స్టాక్‌ నిర్వహణ వీరి పనే.  

పథకాల అమలు: వివిధ ప్రభుత్వ పథకాలను అమలుచేయడంలో ముఖ్యపాత్ర వహించాలి. సంబంధిత పనులు సులభంగా జరిగే విధంగా చూసుకోవాలి.  

ఉన్నతాధికారులకు సహాయపడటం: జూనియర్‌ ఇంజినీర్‌  విభాగానికి అధికారి. సంబంధిత బాధ్యతలన్నీ తానే చూసుకోవాలి. కానీ ముఖ్యమైన ప్రాజెక్టులను చేసేటప్పుడు పైఅధికారులకు ప్రతి రోజూ నివేదిక పంపించాలి.


దరఖాస్తు  

ఈ పరీక్ష రాయదలిచినవారు ముందుగా వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ పద్ధతి ద్వారా వివరాలను కొత్త వెబ్‌సైట్‌ http://ssc.gov.in లో నమోదు చేయాలి. తర్వాత దరఖాస్తు పూరించాలి. పాత వెబ్‌సైట్‌లో నమోదు చేసిన వివరాలు ఈ కొత్త వెబ్‌సైట్‌లో ఉండవు.

 ఆన్‌లైన్‌ దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్‌ ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి.

 పరీక్ష రుసుము రూ.100. దీన్ని యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌.. వీటిలో ఏదో ఒకదానిద్వారా చెల్లించాలి.

 మహిళా అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ క్యాటగిరీల వారికి పరీక్ష ఫీజు లేదు.

 విద్యార్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌), తత్సమాన డిగ్రీ ఉండాలి.  

 వయసు: పోస్టుకు అనుగుణంగా 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంది.


ముఖ్యమైన తేదీలు

‣ దరఖాస్తుకు చివరి తేదీ: 18.04.2024 (రాత్రి 11.00 గంటల వరకు)

‣ ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష రుసుము చెల్లింపునకు చివరి తేదీ: 19.04.2024 (రాత్రి 11.00 గంటల వరకు)

‣ ఆన్‌లైన్‌ పరీక్ష (పేపర్‌-1): 04.06.24 నుంచి 06.06.24

‣ ఆన్‌లైన్‌ పరీక్ష (పేపర్‌-2): తర్వాత ప్రకటిస్తారు.

‣ పరీక్ష కేంద్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌): హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
‣ పేపర్‌-1లో మెరుగైన మార్కులు సాధించిన అభ్యర్థులను పేపర్‌-2 రాయడానికి అనుమతిస్తారు.

‣ పేపర్‌-1 లో సాధించిన మార్కులు తుది ఫలితాల్లో కూడా ఉపయోగపడతాయి. 

‣ పేపర్‌-2 పరీక్షకు స్లయిడ్‌ రూల్‌, కాలిక్యులేటర్‌, లాగరిథమ్‌ టేబుల్స్‌, స్టీమ్‌ టేబుల్స్‌ అమమతిస్తారు. వీటిని అభ్యర్థులు సొంతంగా తీసుకెళ్లాలి. వీటిని పేపర్‌-1లో అనుమతించరు.


దేనిలో ఎలా?

పేపర్‌-1

‣ ఇది మూడు భాగాలు. 200 ప్రశ్నలకు 200 మార్కులు. కానీ సమయం 120 నిమిషాలు. పరీక్ష రాసేటప్పుడు సమయపాలన అత్యంత కీలకమైనదని అర్థం చేసుకోవాలి.

‣ ప్రణాళికాబద్ధంగా కాన్సెప్టులపరంగా సరైన సాధనతో సన్నద్ధం కావాలి.

‣ ప్రశ్నలు సులభంగా, డిప్లొమా స్థాయిలో ఉంటాయి. థియరీ ఆధారిత ప్రశ్నలెక్కువ. అన్ని సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు తగినంత సమయం కేటాయించాలి. సరైన సమాధానాలు రాయడంతోపాటు ఎంత త్వరగా సమాధానాలు గుర్తించామనేదీ ముఖ్యం. సమాధానాలు త్వరగా రాయాలంటే విస్తృతమైన ప్రిపరేషన్‌ అవసరం.

‣ పరీక్షలో అభ్యర్థులు సూటిగా సమాధానం రాయగలిగిన ప్రశ్నలను మొదట ఎంచుకుని, తక్కువ సమయంలో పూర్తిచేయాలి. మిగిలిన వ్యవధిని ఎక్కువ సమయం పట్టే సంఖ్యాపరమైన, సూత్రాధారిత ప్రశ్నలకు కేటాయించవచ్చు.

1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: దీంట్లో ముఖ్యంగా వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, క్లాసిఫికేషన్‌, నంబర్‌ సిరీస్‌, అనాలిసిస్‌లో ప్రశ్నలు వస్తాయి. డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదివిన అభ్యర్థులకు ఈ అంశాలు చదివిన పాఠ్యాంశాల్లో లేనప్పటికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి సరైన పద్ధతిలో సాధన చేస్తే మంచి మార్కులకు అవకాశం ఉంటుంది.

2. జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలో అభ్యర్థి పరిసరాల్లో జరిగే సాధారణ విషయాల అవగాహనను, సమాజంపై అది చూపే ప్రభావాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. సాధారణంగా ఇలాంటి అంశాలపై డిప్లొమా, ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అవగాహన తక్కువగా ఉంటుంది. నిత్యం వార్తాపత్రికల అంశాలు, ప్రామాణిక పాఠ్యపుస్తకాలు సమగ్రంగా అధ్యయనం చేస్తే పరీక్ష సులువవుతుంది. ఉదా: చంద్రయాన్‌-3 వంటివి.

3. జనరల్‌ ఇంజినీరింగ్‌: ఇందులో సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంపై ప్రశ్నలు అడుగుతారు.  


సివిల్‌ ఇంజినీరింగ్‌: అభ్యర్థులు పూర్వ ప్రశ్నపత్రాల ద్వారా సరైన అవగాహన పొంది సన్నద్ధత మొదలుపెట్టడం మంచిది. గత ఏడాది ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బిల్డింగ్‌ మెటీరియల్స్‌, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్‌, సర్వేయింగ్‌, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌ సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనించవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్టులను ముందుగా అభ్యసించడం, మాదిరి ప్రశ్నలను సాధన చేయడం ఎంతో అవసరం.  

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే.. ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషిన్స్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో అధిక ప్రశ్నలు రావడాన్ని గమనించవచ్చు.

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: పూర్వ ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌, ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్‌, పవర్‌ సిస్టమ్స్‌ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చారు.


పేపర్‌-2:

‣ పేపర్‌-2లో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 300 మార్కులు కేటాయించారు. అంటే ప్రతి ప్రశ్నకూ 3 మార్కులు.

‣ పేపర్‌-2 పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికీ 3 మార్కులకు ఒక మార్కు చొప్పున రుణాత్మక మార్కులు. కాబట్టి పేపర్‌-2లో సమాధానాలు గుర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.


ఇలా సన్నద్ధం కండి!

‣ ఈ పరీక్షలో విజయం సాధించాలంటే మొదట సిలబస్‌ క్షుణ్ణంగా పరిశీలించాలి. పరీక్ష విధానం, పరీక్ష స్థాయిని పూర్తిగా అవగతం చేసుకోవాలి. ఇలా చేస్తే ఏ అంశాలు చదవాలో.. ఏ అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలో అర్థమవుతుంది.

‣ ప్రశ్నపత్రాలు డిప్లొమా సిలబస్‌ స్థాయిలో ఉంటాయి. కానీ డిప్లొమాతో పాటు డిగ్రీ విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పోటీ పడతారు కాబట్టి డిప్లొమా విద్యార్థులు సన్నద్ధతకు కొంత ఎక్కువ శ్రమపడాలి.

‣ ఇప్పటినుంచి రోజుకు 8 నుంచి 10 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించాలి.

‣ ఉత్తమ ప్రామాణిక పుస్తకాలు, అధ్యయన సామగ్రి (స్టడీ మెటీరియల్‌)ని ఎంచుకోవడం ప్రధానం.

‣ పరీక్షకు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రతి ఛాప్టర్‌, ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ముఖ్య అంశాలను చిన్న చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి.

‣ పునశ్చరణ అనేది సన్నద్ధతలో అత్యంత కీలకం. చదివిన ప్రతి అంశాన్నీ రివైజ్‌ చేసుకోవాలి.

‣ సన్నద్ధత క్రమంలో, సన్నద్ధత పూర్తయ్యాక వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయడం ముఖ్యం. ఒక్కో పరీక్ష రాశాక.. చేసిన తప్పులను గుర్తించి తర్వాత నమూనా పరీక్షల్లో వాటిని సవరించు కోవడం తప్పనిసరి.ప్రొ. వై.వి.గోపాలకృష్ణమూర్తి సీఎండీ, ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Posted Date : 11-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.