• facebook
  • whatsapp
  • telegram

'ప్రాథమిక ' మార్కులే ప్రధానం

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ సాధనలోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అఖిలభారత స్థాయిలో 21వ ర్యాంకు సాధించిన రంగనాథ రామకృష్ణ ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే... మొదటి ప్రయత్నంలోనే ఈ సర్వీస్‌ సాధించటం విశేషం. తన విజయ ప్రస్థానం గురించి అతడి మాటల్లోనే....

నేను పుట్టిపెరిగింది హైదరాబాద్‌లోనే. దిల్‌సుఖ్‌నగర్‌ హైస్కూల్లో ఆరు నుంచి పదో తరగతి వరకూ చదివాను. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నలిద్దరూ బ్యాంకింగ్‌ రంగానికి చెందినవారు. సివిల్‌ సర్వీసెస్‌లో చేరడానికి ప్రేరణ మాత్రం మా తాతయ్య నరసయ్య నాయుడు. ఆయన డివిజనల్‌/ డిస్టిక్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా చేశారు. నిజాయతీ, చిత్తశుద్ధి లక్షణాలను ఆయన నుంచే పొందాను. మధ్యప్రదేశ్‌ గుణలోని జేపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ & టెక్నాలజీలో బీటెక్‌- ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ పూర్తిచేశాను. ఆ తర్వాత ఎంబీఏ- ఫైనాన్స్‌ & మార్కెటింగ్‌ను ఎస్‌డీఎం ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌, మైసూరు నుంచి చేశాను. కొన్ని క్విజ్‌ కార్యక్రమాల్లో పాల్గొని, విజయం సాధించాను.

ఉద్యోగానుభవం

ఎంబీఏ పూర్తవగానే ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బెంగళూరు, ముంబై బ్రాంచీల్లో ఏడాదిపాటు ఉద్యోగం చేశాను. ఆ తరువాత ఇన్ఫోసిస్‌, హైదరాబాద్‌లో అసోసియేట్‌ కన్సల్టెంట్‌గా చేరాను. ఇన్ఫోసిస్‌లో నాకు సవాలుతో కూడిన ఉద్యోగం, మంచి కెరియర్‌ మార్గం దొరికాయి. కానీ, జీవితంలో సంతృప్తి కోసం సివిల్‌ సర్వీస్‌ మార్గం ఎంచుకున్నాను. ఎందుకంటే, దీని ద్వారా ప్రజలకు అతి దగ్గరగా ఉండే అవకాశం కలుగుతుంది.

మధ్యే మార్గం ఎంచుకున్నా

సివిల్స్‌ రాయాలంటే చిన్నతనం నుంచే సిద్ధమవాలి, సివిల్స్‌కు సన్నద్ధమవడానికి సంపూర్ణమైన అంకితభావం ఉండాలి, ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు సన్నద్ధమవడం కష్టం వంటి భావనలను సాధారణంగా వింటుంటాం. నా విషయంలో వదలలేని మంచి ఉద్యోగం నాకుంది. అంతేకాకుండా దేన్నో ఆశించి, చేతిలో ఉన్న అవకాశాన్ని వదిలేసుకోకూడదనే సిద్ధాంతాన్ని నమ్మే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. దీంతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యే మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాను.

ముందుగా 'బ్రెయిన్‌ ట్రీ' సంస్థకు వెళ్లి, డైరెక్టర్‌ గోపాలకృష్ణను కలిశాను. ఉద్యోగం చేస్తూ సన్నద్ధమడంలో ఉన్న సమస్యలు, పరిమితులను ఆయన నాకు వివరించారు. అక్కడ వారాంతపు బ్యాచ్‌లో శిక్షణకోసం చేరాను. జనరల్‌ స్టడీస్‌తోపాటు ఆప్షనల్స్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రోపాలజీల్లో శిక్షణ తీసుకున్నాను. వారాంతపు బ్యాచ్‌లో చేరడం వల్ల ఉద్యోగం కొనసాగిస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అవకాశం లభించింది. ఉద్యోగ బాధ్యతలు, చదువులకు సమప్రాధాన్యం ఇవ్వడంలో కొంత కష్టపడ్డాను. కానీ, సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలన్న బలమైన కోరిక ముందుకు సాగేలా చేసింది. ఈ విషయంలో కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయులు ఇచ్చిన సాయం, ప్రేరణ కీలకం.

ఇటీవల సివిల్‌ సర్వీసెస్‌ విధానంలో జరుగుతూవచ్చిన మార్పుల మూలంగా (సీశాట్‌ ప్రవేశపెట్టటం, మెయిన్స్‌లో 4 జీఎస్‌ పేపర్లు, ఆప్షనల్‌ను ఒకటికి తగ్గించటం) అనిశ్చిత స్థితి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదిలెయ్యటం పెద్ద రిస్కు అని భావించి ఉద్యోగం చేస్తూనే పరీక్ష సన్నద్ధత కొనసాగించాను.

మన అధీనంలో లేని విషయాలపై కాకుండా నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెట్టాలనేది నా ఉద్దేశం. మెయిన్స్‌/ప్రిలిమ్స్‌ జరిగే ముందు ఎన్నో రకాల వదంతులు అంతర్జాలంలో వెల్లువెత్తుతుంటాయి. సివిల్‌ ఆశావహులు ఇలాంటివి పట్టించుకుని ప్రశాంతతను చెడగొట్టుకోవడం మంచిది కాదు.

ప్రిలిమ్స్‌ పాసై 2012లో మెయిన్స్‌కు అర్హత సాధించాను. కానీ మౌఖికపరీక్షకు అర్హత పొందలేకపోయాను. 2013లో మరో ప్రయత్నం చేశాను. ఈసారి ఇంటర్‌వ్యూకు అర్హత పొందినా తుది కటాఫ్‌ మార్కులకు 23 మార్కుల దూరంలో ఆగిపోయాను.

ఐఎఫ్‌ఎస్‌ వైపు చూపు

2013 పరీక్షలో ముఖ్యమైన మార్పు- ఐఎఫ్‌ఎస్‌, సివిల్స్‌ ప్రాథమిక పరీక్షలను (ప్రిలిమినరీ) కలపటం. 2013లో ఐఎఫ్‌ఎస్‌ పరీక్షకు హాజరు కాలేదు- సివిల్స్‌ సన్నద్ధత దెబ్బ తింటుందని. కానీ తొలి ప్రయత్నంలోనే విద్యార్థులు ఐఎఫ్‌ఎస్‌లో ఉత్తీర్ణులవుతున్న ధోరణి గమనించి 2014లో సివిల్‌సర్వీస్‌ పరీక్షతో పాటు ఐఎఫ్‌ఎస్‌కు కూడా దరఖాస్తు చేశాను.

ఐఎఫ్‌ఎస్‌ పరీక్షలో ప్రిలిమ్స్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవటం చాలా కీలకం. ఎందుకంటే దీని జనరల్‌ కేటగిరిలో కటాఫ్‌... సివిల్స్‌లో కంటే 26 మార్కులు ఎక్కువ. అంటే ప్రిలిమ్స్‌ రెండో పేపర్‌లో ఎక్కువ స్కోరు చేయటం ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌కు అర్హత పొందటానికి ముఖ్యం. మెయిన్‌ సివిల్‌ సర్వీస్‌ సిలబస్‌లో కొన్ని అంశాలు కలిసొచ్చే ఆప్షనల్‌ను ఎంచుకోవటమూ మంచిదే. దీనివల్ల జనరల్‌ స్టడీస్‌ను వేగంగా పూర్తిచేయటానికి వీలుంటుంది.

2013 నుంచి సివిల్స్‌కూ, ఫారెస్ట్‌ సర్వీస్‌కూ ఉమ్మడి ప్రిలిమినరీ ఉండటం వల్ల మొదటి పేపర్లో పర్యావరణం, వ్యవసాయం అంశాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. మెరుగైన స్కోరు కోసం వీటిని శ్రద్ధగా చదవాలి. ఐఎఫ్‌ఎస్‌లో నా ఆప్షనల్స్‌కు (వ్యవసాయ శాస్త్రం- భూగర్భశాస్త్రం) సిద్ధమవటం కోసం అంతర్జాలాన్ని విరివిగా ఉపయోగించుకున్నాను.

అభివృద్ధి, పాలన, పల్లెలు, ముఖ్యంగా ప్రజలపై విభిన్న కోణాలను గ్రహించేలా చేసింది నా క్షేత్రానుభవం. మెయిన్స్‌లో, మౌఖికపరీక్షలో నా జవాబులు మెరుగ్గా తయారవటానికి ఇది ఉపకరించింది.

నమూనా ఇంటర్‌వ్యూలూ, హాజరైన సివిల్స్‌ ఇంటర్‌వ్యూ అనుభవమూ ఆత్మవిశ్వాసంతో జవాబులు చెప్పడానికి తోడ్పడ్డాయి.

అంతర్జాలంలోని వివిధ ఆధారాల నుంచి తాజా వార్తాంశాలను పొందటానికి ట్విటర్‌, ఫేస్‌బుక్‌లను ఉపయోగించుకోవాలి. అయితే- వచ్చే సమాచారాన్ని వడపోత పోయటం ముఖ్యం.

ఈలోగా ప్రైమ్‌ మినిష్టర్స్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫెలోస్‌ కోసం డిసెంబరు 2013లో ప్రకటన వెలువడింది. ప్రిలిమ్స్‌, ఆ తర్వాత వ్యాసం రాసి, ఇంటర్‌వ్యూకి కూడా హాజరయ్యాను; ఎంపికయ్యాను. 2014 మే నెల్లో PMRDFలో చేరాను.

మెట్రోలో ఐదంకెల జీతంతో సౌకర్యవంతంగా ఉండే ఇన్ఫోసిస్‌ నుంచి గ్రామీణప్రాంతానికి మారటం వల్ల దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాల్లోని జిల్లా అధికారవర్గంతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. నా విధుల్లో భాగంగా లభించిన క్షేత్ర అనుభవం... అభివృద్ధి, పాలన, పల్లెలు, ముఖ్యంగా ప్రజలపై విభిన్న కోణాలను గ్రహించేలా చేసింది. మెయిన్స్‌లోనూ, నా మౌఖికపరీక్షలోనూ నా జవాబులు మెరుగ్గా తయారవటానికి ఈ అనుభవం ఉపకరించింది.

విధి నిర్వహణ కొనసాగిస్తూనే అఖిలభారత సర్వీస్‌ సాధించగలిగానంటే అది సరైన సమయ నిర్వహణ వల్లనే. నిరంతరం, స్థిరంగా చదివే పద్ధతిని అనుసరించాను. మనసు, శరీరాలపై పడే భారం తగ్గించుకోవడానికి సినిమాలు చూడటం; స్నేహితులతో బయటకు వెళ్ళటం; ఇతర పుస్తకాలూ, కామిక్సూ చదవటం చేశాను.

ప్రిలిమ్స్‌కు చదివిన పుస్తకాలు

ప్రిలిమినరీలో ప్రాథమిక భావనలపై పట్టు అవసరం. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనమిక్స్‌. పాలిటీకి లక్ష్మీకాంత్‌, మోడర్న్‌ ఇండియా బై స్పెక్ట్రమ్‌, ఇండియన్‌ ఎకానమీ బై రమేష్‌ సింగ్‌, జాగ్రఫీకి గో చోంగ్‌, పర్యావరణానికి ఐసీఎస్‌ఈ, పాత ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఉపయోగం.

ఇంటర్వ్యూ కోసం...

ఐఎఫ్‌ఎస్‌ ఇంటర్‌వ్యూ కోసం, వివిధ చట్టాలపై హైలెవెల్‌ కమిటీ ఇటీవలి నివేదిక చదివాను. ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌, పీఈఎస్‌ఏ, పర్యావరణానికీ, అడవులకీ సంబంధించిన వివిధ చట్టాలను అవగాహన చేసుకున్నాను. వ్యక్తిగత వివరాలూ, రాష్ట్రం, దేశం గురించీ పటిష్ఠంగా తయారవ్వాలి. వీటినుంచే దాదాపు ప్రశ్నలన్నీ వస్తాయి.

యూపీఎస్‌సీ ఇంటర్‌వ్యూ కోసం హాజరైన నమూనా ఇంటర్‌వ్యూలూ, సివిల్స్‌లో అసలైన ఇంటర్‌వ్యూ అనుభవమూ నేను ఆత్మవిశ్వాసంతో జవాబులు చెప్పడానికి తోడ్పడ్డాయి. బోర్డు సభ్యులు స్నేహపాత్రంగా ఉండటంతో మొదట్లో ఏ మూలనో ఉన్న ఒత్తిడి మాయమైపోయింది. నేను చదివిన కామిక్స్‌ గురించీ, ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌, ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌, ఐసీడీఎస్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సర్వీసెస్‌, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌, దేశంలోని వివిధ రకాల అడవుల గురించీ ప్రశ్నలు అడిగారు. పీఎంఆర్‌డీఎఫ్‌లో నా విధులూ, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపులూ, భారతీయ పురాణాలకూ పర్యావరణ పరిరక్షణకూ ఉన్న సంబంధం; స్థిర అభివృద్ధి, పర్యావరణ ఉద్యమాల్లో మహిళల పాత్ర... ఈ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి.

అభ్యర్థులకు సూచనలు

సన్నద్ధత సమయంలో అంతర్జాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నెట్‌లోని వివిధ ఆధారాల నుంచి తాజా వార్తాంశాలను పొందటానికి ట్విటర్‌, ఫేస్‌బుక్‌లను ఉపయోగించుకోవాలి. అయితే వచ్చే సమాచారాన్ని వడపోత పోయటం తెలుసుకోవాలి.

ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమ్స్‌లో నెగ్గటం సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో నెగ్గటం కంటే కష్టం. కటాఫ్‌ మార్కులు ఎక్కువ ఉండటమే దీనికి కారణం.

ప్రిలిమినరీలోని పేపర్‌-2లో అత్యధిక మార్కులు తెచ్చుకోవాలి.

ప్రిలిమినరీకి సంబంధించిన ప్రాథమిక పుస్తకాలు సివిల్స్‌కూ, ఐఎఫ్‌ఎస్‌కూ ఒకటే.

పరీక్షల్లో చాలా ఉపయోగకరమైన పర్యావరణ అంశంపై ప్రిలిమినరీలో శ్రద్ధ చూపటం ప్రధానం.

నమూనా ఇంటర్‌వ్యూలు గానీ, యూపీఎస్‌సీ నిర్వహించే ఇంటర్‌వ్యూలు గానీ అభ్యర్థులకు ఎప్పుడూ ఉపయోగకరమే.

వైఫల్యం ఎదురైతే నిరాశపడిపోకూడదు. పొరపాట్లనుంచి నేర్చుకోవాలి గానీ, ప్రయత్నాన్ని విరమించుకోకూడదు.

Posted Date : 03-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌