• facebook
  • whatsapp
  • telegram

మూల్యాంకనం

 మూల్యాంకనం - భావన
            ఒక పని చేసేటప్పుడు దాని పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం చేసే ప్రక్రియనే మూల్యాంకనం అంటారు.
                                            
* మూల్యాంకనాన్ని త్రికోణ రూపంలో చూపించవచ్చు. అంటే దీనిలో 3 అంశాలు ఉంటాయి.
1. లక్ష్యాలు
2. అభ్యసన అనుభవాలు
3. మూల్యాంకన సాధనాలు

లక్ష్యాలు
* విద్యార్థి ప్రవర్తనలో ఆశించిన మార్పు.
* విద్యాబోధనకు ఆధారం లక్ష్యాలు.
* మూల్యాంకన త్రికోణంలో ముఖ్యమైనవి లక్ష్యాలు.

 

అభ్యసన అనుభవాలు:
* లక్ష్య సాధనకు మార్గాలు అభ్యసన అనుభవాలు.
* అభ్యసన కృత్యాల వల్ల అభ్యసన అనుభవాలు ఏర్పడతాయి.
* విద్యార్థికి, విషయానికి మధ్య జరిగే పరస్పర చర్యనే అభ్యసన అనుభవం అంటారు.

 

మూల్యాంకనం:
* లక్ష్యాలు నెరవేరాయా లేదా తెలుసుకోవడానికి మనం చేసే ప్రక్రియనే మూల్యాంకనం.
* మూల్యాంకన సాధనాలు మూల్యాంకనం చేయడానికి తోడ్పడతాయి.
* మూల్యాంకనం ఒక అవిరళ ప్రక్రియ.  - కొఠారీ
గమనిక: ప్రాచీన పరీక్షా విధానం కేవలం జ్ఞాన రంగానికి, అందులో విద్యార్థి జ్ఞాపక శక్తికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ లోపాలు సవరించడానికి నూతన మూల్యాంకన విధానం ఉపయోగపడుతుంది.

నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE (Continuous Comprehersive Evaluation)
* దీనిలో ఉండే అంశాలు
1) మూల్యాంకనం లక్ష్యాధార ప్రక్రియ
2) మూల్యాంకనం విద్యార్థి కేంద్రీకృతం
3) మూల్యాంకనం ఒక సమగ్ర ప్రక్రియ
4) మూల్యాంకనం విషయ జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ప్రస్తుత లక్ష్యాలకు సమగ్రమైన విలువను ఇస్తుంది.

 

మూల్యాంకనం - ఉపయోగాలు:
* ఉపాధ్యాయుడి బోధనా సామర్థ్యాన్ని కొలుస్తుంది.
* విద్యార్థుల ప్రగతిని కొలవడానికి తోడ్పడుతుంది.
* విద్యార్థులకు పరిపుష్టిని అందిస్తుంది.
* విద్యార్థుల్లోని లోపాలను తెలుసుకుని, వాటిని సవరించడానికి తోడ్పడుతుంది.

 

మూల్యాంకనం రకాలు:
* మూల్యాంకనాన్ని జరిపే సమయం, ఉద్దేశాన్ని బట్టి 3 రకాలుగా విభజించారు.
అవి: 1) లోపనిర్ధారణ మూల్యాంకనం
       2) రూపణ/నిర్మాణాత్మక మూల్యాంకనం
       3) సంకలన మూల్యాంకనం

లోపనిర్ధారణ మూల్యాంకనం:
* దీన్ని తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియను ప్రారంభించే ముందు నిర్వహిస్తారు.


ఉద్దేశం: విద్యార్థుల సామర్థ్యాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు.
ఉదా: బేస్ లైన్ టెస్ట్స్

 

నిర్మాణాత్మక మూల్యాంకనం:
* దీన్ని బోధనాభ్యసన ప్రక్రియ మధ్యలోనే నిర్వహిస్తారు.


ఉద్దేశం: ఉపాధ్యాయుడి బోధనా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది.
* విద్యార్థి అభ్యసనాన్ని అంచెలంచెలుగా వెంటనే తెలుసుకోవచ్చు.
* దీన్ని ఒక అవిచ్ఛిన్న ప్రక్రియగా పేర్కొంటారు.
ఉదా: యూనిట్ పరీక్షలు, మౌఖిక పరీక్షలు
గమనిక: యూనిట్ పరీక్షలను ప్రస్తుత విద్యావ్యవస్థలో ఫార్మెటిన్ టెస్ట్‌లుగా పిలుస్తున్నారు.

 

సంకలనాత్మక మూల్యాంకనం:
* బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్వహిస్తారు.
* ఒక టర్మ్ లేదా ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత నిర్వహించే మూల్యాంకనం.


ఉద్దేశం: ఇది ఒక ప్రక్రియ ఫలితం లేదా విద్యార్థి సాధనపై తుది నిర్ణయం చేయడానికి తోడ్పడుతుంది.
గమనిక: ప్రస్తుతం టర్మ్ పరీక్షలను 'సమ్మెటివ్ టెస్ట్‌లు'గా పిలుస్తున్నారు.

పరీక్ష, మాపనం, మూల్యాంకనం:
పరీక్ష  మాపనం  మూల్యాంకనం.
                                                  
పరీక్ష:
* ఇది మూల్యాంకనంలో ఒక భాగం.
ఇది కొన్ని ప్రశ్నల సముదాయాన్ని కలిగి ఉంటుంది.
* మౌఖిక, రాత, ప్రయోగిక పరీక్షలు అనేవి పరీక్షల్లో రకాలు.

మాపనం:

* పరీక్ష ద్వారా వచ్చిన సంఖ్యా పరమైన విలువలను తెలియజేస్తుంది.
* ఇది పరిమాణాత్మక పదం.
* ఇది మూల్యాంకనంలో ఒక భాగం.
* పరీక్ష ద్వారా మాపనం, మాపనం ద్వారా మూల్యాంకనం చేస్తారు.

మూల్యాంకనం:

* మెజర్‌మెంట్ + జడ్జ్‌మెంట్ = ఎవాల్యూయేషన్
* ఇది ఒక నిరంతర ప్రక్రియ.
* విశాలమైంది, సమగ్రమైంది.
ఉదా: విద్యార్థికి జీవశాస్త్ర పరీక్షలో 70 మార్కులు వచ్చాయి. అంటే పరీక్ష నిర్వహించి ఆ పరీక్ష పత్రాన్ని గణించి 70 మార్కులు వచ్చాయి అని చెప్పడాన్ని మాపనం అంటారు.

మూల్యాంకన విధానం:
* దీనిలో 6 సోపానాలు ఉంటాయి.
1) బోధనా లక్ష్యాలను రూపొందించడం.
2) లక్ష్యాలను ప్రవర్తనా మార్పులుగా నిర్వచించడం.
3) అభ్యసన అనుభవాలను కల్పించడం.
4) సరైన మూల్యాంకన సాధనాల ఎంపిక ఉపయోగం.

 

బోధనా లక్ష్యాలను రూపొందించడం:
* ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని బోధించడం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను ముందుగా రూపొందించుకోవాలి.
ఉదా: విద్యార్థి పుష్ప భాగాలను అవగాహన చేసుకోవడం.
* లక్ష్యాలను ప్రవర్తనా మార్పులుగా నిర్వచించడం.
ఉదా: విద్యార్థి పుష్ప భాగాల పేర్లను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు.

 

అభ్యసన అనుభవాలను కల్పించడం:
* విద్యార్థికి, పాఠ్యప్రణాళికకు మధ్య ఉండే పరస్పర చర్యనే అభ్యసన అనుభవాలు అంటారు.
* ఈ పరస్పర చర్యలో ఉపాధ్యాయుడు ఉత్ప్రేకరంగా పని చేస్తాడు. తత్ఫలితంగా విద్యార్థి ప్రవర్తనలో వేగంగా మార్పులు వస్తాయి.

* ఉపాధ్యాయుడు రెండు విధానాల్లో అభ్యసన అనుభవాలను కలిగిస్తాడు. అవి:
ఎ) వైషమ్య విధానం
బి) గుర్తింపు విధానం

 

వైషమ్య విధానం: విద్యార్థుల ప్రవర్తనలోని తేడాలను బట్టి అభ్యసన అనుభవాలను కలగజేసే విధానం.
 

గుర్తింపు విధానం: ఉపాధ్యాయుడు తనను పాఠ్యాంశాన్ని అర్థం చేసుకునే విద్యార్థిగా భావించి, పాఠ్యాంశాల ద్వారా కలిగే మార్పులను గుర్తించి వాటి ఆధారంగా అభ్యసన అనుభవాలను కలగజేసే పద్ధతి.
 

మూల్యాంకన సాధనాలను ఎంపిక చేసుకోవడం: ఒక్కో రకమైన సామర్థ్యం, లక్ష్యం, నైపుణ్యాన్ని కొలవడానికి ఒక్కో రకమైన మూల్యాంకన సాధనాన్ని ఉపయోగించాలి.
 

మూల్యాంకన ఫలితాలను విశ్లేషించి వ్యాఖ్యానించడం: పరీక్షల్లో వచ్చిన మార్కులను విశ్లేషించడం ద్వారా లక్ష్యాలను ఎంతవరకు సాధించాం, విద్యార్థి ప్రవర్తనలో ఎంతవరకు మార్పు వచ్చింది. బోధనాభ్యసన కృత్యాలు ఎంతవరకు ఫలప్రదం అయ్యాయి అనే విషయాలు తెలుస్తాయి.
 

మూల్యాంకన ఫలితాల ద్వారా బోధనను మెరుగుపరచుకోవడం: మూల్యాంకన ఫలితాల విశ్లేషణ ద్వారా  విద్యార్థుల బలహీనతలు తెలుసుకొని, వాటిని లోప సవరణ బోధన ద్వారా తొలగించాలి.
 

ఉత్తమ పరీక్షకు ఉండే లక్షణాలు:

1) సప్రమాణత
2) విశ్వసనీయత
3) లక్ష్మాత్మకత
4) సమగ్రత
5) ఆచరణాత్మకత

 

సప్రమాణత:

* ఉత్తమ పరీక్షకు ఉండాల్సిన లక్షణాల్లో ఇది ముఖ్యమైంది.
* ఉపాధ్యాయుడు పరీక్షను ఏ ప్రయోజనం కోసం ఎన్నుకున్నాడో అది ఆ ప్రయోజనాన్ని మాపనం చేసినట్లయితే ఆ పరీక్షకు సప్రమాణత ఉన్నట్లుగా భావిస్తారు.
ఉదా: ఒక జీవశాస్త్ర పరీక్ష జీవశాస్త్ర లక్ష్యాలను కాకుండా అది గణిత సామర్థ్యాలను, భాషా ప్రక్రియలను పరీక్షించినట్లయితే ఆ పరీక్ష కోల్పోయిన లక్షణం సప్రమాణత.

 

విశ్వసనీయత:
* ఒక పరీక్ష స్థిరత్వాన్ని, పటిష్టతను కొలిచేది విశ్వసనీయత.
* ఒక పరీక్షను ఉపాధ్యాయుడు వేర్వేరు సందర్భాల్లో నిర్వహించినా/వేర్వేరు ఉపాధ్యాయులు నిర్వహించినా విద్యార్థికి దాదాపుగా ఒకే మార్కులు వచ్చాయి. అప్పుడు ఆ పరీక్షకు గల లక్షణం విశ్వసనీయత.

(లేదా)

ఒక విద్యార్థి ఒక పరీక్షను వేర్వేరు సందర్భాల్లో రాసినా దాదాపు ఒకే విధమైన మార్కులు రావడాన్ని విశ్వసనీయత అంటారు.

పరీక్ష విశ్వసనీయత కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
* పరీక్ష నిడివి
* మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత
* సరైన సూచనలు ఇవ్వడం
ఉదా: రవి అనే విద్యార్థి ఒక పరీక్షను 2015, మే 10, 11, 12 తేదీల్లో రాసినా అతడికి వచ్చిన మార్కుల్లో వ్యత్యాసం లేదు. అయితే ఈ పరీక్షకు గల లక్షణం విశ్వసనీయత.

 

లక్ష్యాత్మకత:
* ఒక పరీక్ష పత్రాన్ని ఒకే ఉపాధ్యాయుడు వేర్వేరు సమయాల్లో దిద్దినా లేదా వేర్వేరు ఉపాధ్యాయులు దిద్దినా మార్కుల్లో వ్యత్యాసం లేనట్లయితే ఆ పరీక్షకు ఉండే లక్షణం లక్ష్యాత్మకత.
ఉదా: జానకి రాసిన సమాధాన పత్రాన్ని సుష్మ, సుబ్బారావు, వర్ష, సందీప్ అనే ఉపాధ్యాయులు దిద్దినప్పటికీ ఆమెకు వచ్చిన మార్కుల్లో వ్యత్యాసం లేదు. అయితే ఆ పరీక్షకు ఉండే లక్షణం లక్ష్యాత్మకత.

 

సమగ్రత:
* లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసుకున్న పరీక్షా పత్రం అన్ని పాఠ్యాంశాల్లోని అన్ని విషయాలను సమగ్రంగా పరీక్షించాలి. అప్పుడు ఆ పరీక్షకు ఉండే లక్షణం సమగ్రత.
ఉదా: 9వ తరగతి పాఠ్యపుస్తకంలో 10 యూనిట్లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న మూడు యూనిట్ల నుంచి మాత్రమే ప్రశ్నలు ఇచ్చారు. అయితే ఆ పరీక్షకు గల లక్షణం సమగ్రత.

ఆచరణ యోగ్యత:
ఒక పరీక్షకు నిర్వహణ, గణన, వ్యాఖ్యాన సౌలభ్యం ఉంటే దానికి ఆచరణ యోగ్యత ఉన్నట్లు.

 

మూల్యాంకన సాధనాలు - రకాలు:
* విద్యార్థి మూర్తిమత్వంలో అనేక లక్షణాలు ఉంటాయి. ఒక్కో లక్షణాన్ని కనుక్కోవడానికి ఒక్కో మూల్యాంకన సాధనం ఉపయోగపడుతుంది. అవి:

1) వ్యాసరూప పరీక్షలు
2) లక్ష్యాత్మక పరీక్షలు
3) మౌఖిక పరీక్షలు
4) సహజ సామర్థ్య పరీక్షలు
5) నిష్పాదన పరీక్షలు
6) సమస్యా విధాన పరీక్షలు
7) ప్రామాణీకరణం చేసిన పరీక్షలు
8) పరిపృచ్ఛ
9) అభిరుచి శోధిక
10) ప్రశ్నావళి
11) జీవిత సంఘటన పత్రావళి
12) అంచనా మాపని
13) చెక్‌లిస్ట్
14) క్రమాభివృద్ధి పత్రావళి

వ్యాసరూప పరీక్షలు:

* ఒక ప్రశ్నకు ఎక్కువ వాక్యాల్లో సమాధానాన్ని రాయడాన్ని వ్యాసరూప పరీక్షలు అంటారు.

వ్యాసరూప పరీక్షల్లో....

* దత్తాంశాల ఆధారంగా వ్యాఖ్యానించడం, భావనల వివరణ; సూత్రాలు, సిద్ధాంతాల వినియోగం ఉంటాయి.

ప్రయోజనాలు:

* ఒక సమూహానికి వ్యాసరూప పరీక్షలను నిర్వహించడం సులభం.
* చదివే అలవాట్లను అభివృద్ధి చేస్తాయి.
* సులువుగా ప్రశ్నలను తయారుచేయవచ్చు.
* పరీక్ష రాస్తున్నప్పుడు విద్యార్థికి స్వేచ్ఛ ఉంటుంది.

 

ప‌రిమితులు

* మార్కులు ఇవ్వడంలో వైయక్తికత ఉంటుంది.
* వ్యాసరూప పరీక్షలో అదృష్టం అనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
* వ్యాసరూప ప్రశ్నల సమాధానాలు విద్యార్థుల జ్ఞాపక శక్తి మీద ఆధారపడి ఉంటాయి.
* దిద్దేటప్పుడు ఆత్మాశ్రయతకు అవకాశం ఉంటుంది.

గమనిక: వ్యాసరూప ప్రశ్నలను గణన చేయడానికి...

1) గణన విశ్లేషణ పద్ధతిని
2) గ్లోబల్ క్వాలిటీ స్కోరింగ్ మెథడ్‌ను ఉపయోగిస్తారు.
లక్ష్యాత్మక ప్రశ్నలు: లక్ష్యాత్మకతను పాటించే పరీక్షలను లక్ష్యాత్మక పరీక్షలు అంటారు.

 

యోగ్యతలు:
* ఆత్మాశ్రయతకు అవకాశం ఉండదు.
* లక్ష్యాత్మక పరీక్షా విధానం వల్ల విద్యార్థుల్లో కంఠస్థం చేసే అలవాటును తగ్గించవచ్చు.
* లక్ష్యాత్మక పరీక్షా పత్రాన్ని కచ్చితంగా, వేగంగా గణన చేయవచ్చు.

 

పరిమితులు:
* పరీక్షలు భావావేశ రంగంలోని పరిమాణాలైన ఆలోచనలను, దత్తాంశాన్ని తార్కికంగా వ్యవస్థీకరించడం; అభిప్రాయాలను వ్యక్తపరచడం లాంటి శక్తులను మూల్యాంకనం చేయలేవు.
* లక్ష్యాత్మక ప్రశ్నలను రూపొందించాలంటే తగిన సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు ఉండాలి.
* ఈ పరీక్షల నిర్వహణకు సమయం, పేపర్లు ఎక్కువగా ఖర్చు అవుతాయి.

మౌఖిక పరీక్షలు:

* విద్యార్థి, ఉపాధ్యాయుడు ఒకరికొకరు అందుబాటులో ఉన్నప్పుడు మౌఖికంగా జరిగే పరీక్షలు.
* ఇవి ప్రాచీనమైన పరీక్షలు

 

లాభాలు:
* చిన్నపిల్లల సాధనను పరీక్షించవచ్చు.
* విద్యార్థుల ఆలోచనా విధానాన్ని తెలుసుకోవచ్చు.
* అభివ్యంజన నైపుణ్యాలను తెలుసుకోవచ్చు.

 

లోపాలు:
* విద్యార్థుల పట్ల నిష్పక్షపాతంగా ఉండవు.
* పరీక్షలు నిర్వహించే వారి ఆత్మాశ్రయతకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
* ఇవి విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాన్ని పరీక్షించలేవు.

 

సహజ సామర్థ్య పరీక్షలు:
* మూర్త వస్తువులతో నిర్వహించే పరీక్షలను నిష్పాదన పరీక్షలు అంటారు.
* వీటిని విద్యార్థుల్లోని వివిధ నైపుణ్యాలను పరీక్షించడానికి ఉపయోగిస్తారు.
* ఈ పరీక్షల్లో ప్రక్రియ, ఫలితం అనే రెండు అంశాలు ఉంటాయి.

సమస్యా నిదాన పరీక్ష (లోప నిదాన పరీక్షలు):
* ఒక నైపుణ్యానికి సంబంధించిన వివిధ అంశాల్లో విద్యార్థి సామర్థ్యాలు, బలహీనతలు తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

 

ప్రమాణీకరణం చేసిన పరీక్షలు:
* వీటికి ప్రామాణికత ఎక్కువ.
* వీటిని కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు, ప్రమాణాల ఆధారంగా నిర్వహిస్తారు.

 

పరిపృచ్ఛ:
* ఏదైనా ఒక విషయం గురించి ఒక వ్యక్తి అభిప్రాయాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడాన్నే పరిపృచ్ఛ అంటారు.
పరిపృచ్ఛ రెండు రకాలుగా ఉంటుంది. అవి:
1) నియత పరిపృచ్ఛ
2) అనియత పరిపృచ్ఛ
నియత పరిపృచ్ఛ: దీనిలో అడగాల్సిన ప్రశ్నలను ముందుగానే రూపొందించుకొని ఒక నిర్దిష్టమైన పరిధిలో ప్రశ్నిస్తారు.
అనియత పరిపృచ్ఛ: దీనిలో ప్రశ్నలను ముందుగా కాకుండా పరిస్థితిని బట్టి సందర్భానుసారంగా రూపొందిస్తారు.

 

అభిరుచి శోధిక:
* విద్యార్థి అభిరుచులను కొలవడానికి ఉపయోగపడుతుంది.
* సాధారణంగా అభిరుచి శోధికలు వృత్తి, విద్యా విషయాలకు సంబంధించినవి.

ప్రశ్నావళి:
* కొన్ని ప్రశ్నలతో కూడుకున్నదే ప్రశ్నావళి.
* ఒక వ్యక్తి కుటుంబ, ఆరోగ్య, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి తయారుచేసే పత్రాన్ని ప్రశ్నావళి అంటారు.

 

జీవిత సంఘటన పత్రావళి:
* దీనికి మరొక పేరు ఉపఖ్యానక రికార్డు.
* ఒక వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను వర్ణించిన రాత పత్రాన్నే జీవిత సంఘటన పత్రావళి అంటారు.
* దీనిలో యథార్థ ప్రవర్తనను మాత్రమే నమోదు చేస్తారు.

 

అంచనా మాపని (రేటింగ్ స్కేలు):
* ఒక వ్యక్తి ప్రవర్తనా లక్షణాలను ఎంత ప్రమాణంతో కలిగి ఉన్నాడో నిర్ధారించడానికి ఉపయోగపడే సాధనమే అంచనా మాపని.
* ఈ అంచనా మాపనిలో మూడు, అయిదు, ఏడు పాయింట్లు ఉంటాయి.

 

క్రమాభివృద్ధి లేదా సంచిత పత్రావళి:
* ఒక వ్యక్తి సమాచారాన్ని నిర్ణీతకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు క్రమంగా దీనిలో నమోదు చేస్తారు.
* ఎప్పటికప్పుడు విద్యార్థికి సంబంధించిన కొత్త సమాచారాన్ని అందించవచ్చు.

ప్రమాణ లేదా సాధనా పరీక్ష - తయారీ (Scholasitc Achievement Test)
* పాఠ్య విభాగాన్ని లక్ష్యాత్మకంగా బోధించిన తర్వాత ఉపాధ్యాయుడు తాను ముందుగా రూపొందించుకున్న బోధన లక్ష్యాలు నెరవేరింది లేనిది పరీక్షించడానికి ఉపయోగించే చిన్న పరీక్షను యూనిట్ పరీక్ష అంటారు. ఇది ఉపాధ్యాయ నిర్మితం.
* యూనిట్ పరీక్ష తయారీలో మూడు దశలు ఉంటాయి. అవి:
1) యూనిట్ పరీక్షా పత్రం రూపకల్పన
2) యూనిట్ పరీక్షా పత్రాన్ని కూర్చడం
3) ప్రశ్నపత్రాన్ని సమీక్షించడం


 

సమగ్ర పథకం (బ్లూ ప్రింట్):
ఇది త్రీ డైమెన్షనల్ చార్ట్
* దీనిలో 3 అంశాలు ఉంటాయి. 
1) లక్ష్యాలు
2) పాఠ్య విషయాలు
3) ప్రశ్న రూపం
గమనిక: బ్లూప్రింట్‌లో చూపించని అంశం ప్రశ్న కాఠిన్యత స్థాయి.

 

బ్లూప్రింట్ ప్రయోజనాలు:
* పరీక్షా పత్రం పరిధిని తెలియజేయడానికి
* ప్రశ్నపత్రం తయారీకి తోడ్పడుతుంది.
ప్రశ్నానిధి: వైద్య రంగంలో రక్తనిధి లాంటిదే విద్యారంగంలో ప్రశ్నానిధి.

 

గణన విశ్లేషణ, వ్యాఖ్యానం:
* వీటి ఆధారంగా బోధన, అభ్యసన సన్నివేశాలను మెరుగుపరచవచ్చు. మందకొడి అభ్యసనకు నివారణోపాయాలను చేపట్టవచ్చు.
* పౌనఃపున్య విభాజన పట్టిక నుంచి గణనలు ఏ రకంగా విస్తరించి ఉన్నాయో తెలుసుకోవడాన్ని చర్యాశీలత మాపనాలు అంటారు. అవి:
1) వ్యాప్తి
2) చతుర్థాంశక విచలనం
3) మధ్యమ విచలనం

4) ప్రామాణిక విచలనం

5) విస్తృతి
 

ప్రస్తుత పరీక్షా విధానంలోని లోపాలు:
* విద్యా రంగంలోని విద్యా విషయ లక్ష్యాలను సంతృప్తికరంగా సాధించాలంటే పరీక్షలను క్రమ పద్ధతిలో రూపొందించాలి. విద్యారంగంలో ఏర్పాటు చేసిన కమిటీలు, కమీషన్లు అన్నీ కూడా పరీక్షా విధానాల్లోని లోపాలను ఎత్తి చూపాయి.

 

ప్రధానంగా కనిపించే లోపాలు:
* పరీక్షలను దృష్టిలో పెట్టుకుని బోధన చేయడం.
* విభిన్న బోధనా లక్ష్యాలను విస్మరించి జ్ఞాన లక్ష్యానికి, విద్యార్థి జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.
* ప్రశ్నపత్రాలు వ్యాసరూప ప్రశ్నలతో ఉండటం వల్ల పాఠ్యప్రణాళిక కొన్ని భాగాలను మాత్రమే పరీక్షించడానికి వీలవుతుంది. దాంతో ప్రశ్నపత్రాల సమగ్రత లోపిస్తుంది.

 

తారాదేవి రిపోర్టు - 1956:
          సిమ్లాలోని తారాదేవి శిఖరంపై 1956లో జరిగిన అఖిల భారత స్థాయి విజ్ఞాన శాస్త్ర సంబంధిత సెమినార్‌లో శాస్త్రవేత్తలు  సంస్కరణలను సూచించారు.

పాఠశాలలు నిర్వహించే అంతర్గత, బాహ్య పరీక్షలకు మధ్య పరస్పర సంబంధం ఉండి మార్కుల సర్దుబాటు కింది విధంగా ఉండాలి.

* క్రమేపి పాఠశాల రికార్డులకు ఇచ్చే ప్రాముఖ్యాన్ని పెంచుతూ, బాహ్య పరీక్షలను నిషేధించాలి.
* హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ స్కీంలో బాహ్య పరీక్షలు సామాన్య విజ్ఞాన శాస్త్రానికి వర్తించకూడదు.
* విద్యార్థులు ఎన్నిక చేసి చదివే బోధనాంశాలకు సంబంధించి వారి ప్రగతికి సాధనాలుగా బాహ్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, పాఠశాలలో విద్యార్థి సాధించిన ప్రగతికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్:
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించిన అభిప్రాయాలు, సంస్కరణలోని సాధారణ సిద్ధాంతాలు
* ఎవరైతే బోధిస్తారో వారే పరీక్షించడం ఆవశ్యకం అనే భావన ప్రకారం పాఠశాలలో నిర్వహించే అంతర్గత పరీక్షలు మూల్యాంకనంలో భాగం కావాలి.
* శ్రమించడానికి శక్తి - చురుకుదనం, ప్రేరణ, ఊహాశక్తి, కల్పన, నాయకత్వం, నైపుణ్యాలు లాంటి ఎన్నో ఆవశ్యకమైన ప్రవర్తనా మార్పులను సాధన పరీక్షల ద్వారా కొలవడానికి వీలుకాదు. వాటిని సెషనల్ లేదా సంచిత అంచనా పద్ధతుల ద్వారా మాపనం చేయాలి.
* విద్యార్థులు సాధించిన ప్రగతిని మార్కుల్లో రికార్డు చేయడం, తగినంత ఖచ్చితంగా, స్పష్టంగా కొలవడం సాధ్యం కాదు. వివిధ సబ్జెక్టుల్లోని స్థాయిలను నిర్ణయంచడం భిన్నంగా ఉంటుంది. కాబట్టి అంచనా విధానంలో గ్రేడులను సూచించాలి. మార్కులు వేయకూడదు.

 

గ్రేడుల నిర్ణయం, వాటి విలువలు
ఎ) అత్యుత్తమ శ్రేణి స్థాయి
బి) ఉత్తమ శ్రేణి స్థాయి
సి) సంతృప్తికర స్థాయి
డి) తక్కువ స్థాయి
ఇ) అసంతృప్తికర స్థాయి

* పట్టభద్రత స్థాయిలో వేర్వేరు సబ్జెక్టుల్లో జరిగే జాతీయ పరీక్షలు బాహ్య పరీక్షలై కేంద్రీయ అధికారుల ద్వారా నిర్వహించాలి. ఈ పరీక్షలు అభ్యర్థులు విషయాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారో, వారి సృజనాత్మకను పరీక్షించడానికి ఉద్దేశించినవై ఉండాలి. అంటే అవి వేర్వేరు విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థుల నిష్పాదన, అంచనాను తెలిపే జాతీయ స్థాయి సూచికలుగా ఉపయోగపడాలి.
 

కొఠారీ కమిషన్ సూచనలు - 1956
* ప్రాథమికోన్నత దశలో రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలకు కూడా తగినంత ప్రాధాన్యాన్ని ఇవ్వాలి.
* రాష్ట్రస్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటైన బోర్డులు బాహ్యపరీక్షా విధానం ద్వారా విద్యార్థులు పొందిన ఫలితాలను చూపే యోగ్యతా పత్రాలు, వేర్వేరు సబ్జెక్టుల్లో విద్యార్థుల నిష్పాదనాన్ని తెలిపేవిగా ఉండాలి. కానీ పరీక్షలో 'పాస్', 'ఫెయిల్' అని నిర్ణయించేవిగా ఉండకూడదు. విద్యార్థి తన నిష్పాదనాన్ని పెంచుకోవడానికి వీలుగా పరీక్షను లేదా ప్రత్యేక సబ్జెక్టును రాయడానికి అవకాశాన్ని కల్పించాలి.


రచయిత: రాధాకృష్ణ
 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌