• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్ర బోధనా ఉపగమాలు - పద్ధతులు

* ఒక సబ్జెక్టును దేని ఆధారంగా బోధిస్తామో దాన్ని ఉపగమనం అంటారు.
ఉదా: విజ్ఞాన, జీవశాస్త్రాన్ని బోధించడానికి ఆగమనం, నిగమనాన్ని ఉపయోగిస్తాం. వీటినే ఉపగమాలు అంటారు.
* ఉపగమాలు, పద్ధతులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి.
* జీవశాస్త్రంలో ఉపగమాలు రెండు అవి:
     1) ఆగమనం       2) నిగమనం

 

ఆగమనం:

* ఆగమనం అంటే రాబట్టడం.
* మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలను
* ప్రత్యేకాంశాల నుంచి సాధారణ విషయాలను
* సరళమైన విషయాల నుంచి కఠినమైన విషయాలను
* తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలను
* ఉదాహరణల నుంచి సూత్రాలను రాబట్టడాన్ని ఆగమనం అంటారు.
* ఒక సందర్భంలో వాస్తవమైన విషయం లేదా సూత్రం ఇతర సందర్భాల్లో కూడా వాస్తవం అవుతుందని తెలిపే విధానమే ఆగమనం.

      ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం - జీవన్
      నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రూపొందించడమే ఆగమనం - ఫౌలర్
ఉదా: మల్లెపువ్వుకు సువాసన ఉంటుంది.
         విరజాజి పువ్వుకు కూడా సువాసన ఉంటుంది.
    పై సందర్భాల్లో సాధారణ విషయం సువాసన. పూలన్నీ రాత్రి వికసిస్తాయి కాబట్టి విద్యార్థులు రాత్రి వికసించే పూలకు సువాసన ఉంటుంది అనే విషయాన్ని సాధారణీకరిస్తారు.

 

ప్రయోజనాలు:
* ఇది శాస్త్రీయ పద్ధతి కాబట్టి శాస్త్రీయ వైఖరి అలవడుతుంది.
* వివేచనాశక్తి, పరిశీలన, అలవాట్లు అభివృద్ధి చెందుతాయి.
* విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి.
* ఇది తార్కిక, మనో విజ్ఞాన పద్ధతి.

పరిమితులు
* ప్రాథమిక తరగతులకు అనుకూలంగా ఉంటుంది.
* ఎక్కువ సమయం పడుతుంది.
* ఉపాధ్యాయుడు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.

 

నిగమనం:
* ఇది ఆగమనానికి వ్యతిరేకం.
* సిద్ధాంతీకరించిన సూత్రాలు, సిద్ధాంతాలను నూతన, ప్రత్యేకమైన సందర్భాల్లో అన్వయించి వాటి యథార్థతను తెలుసుకునే పద్ధతిని నిగమన పద్ధతి అంటారు.
* అమూర్త సామాన్యీకరణాల నుంచి మూర్త విషయాలను
* అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలను
* సాధారణ విషయాల నుంచి ప్రత్యేకాంశాలను
* కఠినమైన విషయాల నుంచి సరళమైన విషయాలను
* తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలను
* సూత్రాల నుంచి ఉదాహరణలను గుర్తించే విధానాన్నే నిగమనం అంటారు.
ఉదా: ఆమ్లాలు నీలి లిట్మస్‌ను ఎర్రగా మారుస్తాయి అనే సిద్ధాంతాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్‌కు అన్వయించి 'హైడ్రోక్లోరిక్ ఆమ్లం నీలి లిట్మస్‌ను ఎర్రగా మారుస్తుంది'. అనే విషయాన్ని విద్యార్థులు నిర్ధారిస్తారు.

ప్రయోజనాలు:
* కింది తరగతులకు అనువైంది.
* ఎక్కువ విషయాలను తక్కువ సమయంలో చెప్పవచ్చు.
* ఉపాధ్యాయుడికి పనిభారం తగ్గుతుంది.

 

పరిమితులు:
* శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభించదు. శాస్త్రీయ వైఖరులు పెరగవు.
* జ్ఞాపకం ఉంచుకునే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
* ఇది మనోవైజ్ఞానిక పద్ధతి కాదు.

ఆగమనం

నిగమనం

1) సుదీర్ఘ విధానం.

1) సంక్షిప్త విధానం.

2) తార్కిక, హేతువాదాలకు అవకాశం ఇస్తుంది.

2) తార్కిక, హేతువాదాలకు అవకాశం లేదు.

3) అవగాహన అవసరం.

3) జ్ఞాపకశక్తి అవసరం.

4) నేర్చుకున్న విషయాలు మరిచిపోయిన పునఃనిర్మాణానికి అవకాశం ఉంటుంది.

4) నేర్చుకున్న విషయాలు మరిచిపోతే పునఃనిర్మాణానికి అవకాశం ఉండదు.

5) సృజనాత్మక శక్తిని పెంపొందిస్తుంది.

5) సృజనాత్మకతను పెంపొందించదు.

6) అధిక శ్రమ, కాలం అవసరం.

6) శ్రమ, కాలాన్ని పొదుపు చేస్తుంది.

7) విద్యార్థి కనుక్కుంటాడు.

7) విద్యార్థి అనుకరిస్తాడు.

8) ఇది ప్రారంభ దశ.

8) ఇది అంత్య దశ.

9) పద్ధతులను నేర్చుకుంటారు.

9) ఫలితాలను రాబట్టడం నేర్చుకుంటారు.

10) ప్రాథమిక తరగతులకు పనికిరాదు.

10) ప్రాథమిక తరగతులకు ఉపయోగం.

11) మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలను రాబట్టవచ్చు.

11) అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలను రాబట్టవచ్చు.

12) కొత్త విషయాలను కనుక్కుంటాడు.

12) నూతన పరిస్థితుల్లో ఉపయోగించుకుంటాడు.

* శాస్త్రానికి ఆగమన, నిగమన పద్ధతులు రెండు కళ్ల లాంటివి. కాబట్టి వాటిని జోడించి బోధించాలి.
 

బోధనా పద్ధతులు:
* ఒక పాఠ్యాంశాన్ని లేదా సమాచారాన్ని విద్యార్థికి అందించే విధానాన్ని బోధనా పద్ధతి అంటారు.

 

జీవశాస్త్రంలో బోధనా పద్ధతులు రెండు రకాలు
     
1) ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి
     2) విద్యార్థి కేంద్రక పద్ధతి

 

బోధనా పద్ధతులు 2 రకాలు
* ఉపాధ్యాయ కేంద్రక బోధనా పద్ధతులు
ఉదా:     1) ఉపన్యాస పద్ధతి
         2) ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి
» విద్యార్థి కేంద్రక పద్ధతులు
ఉదా:     1) అన్వేషణ పద్ధతి
         2) ప్రకల్పన పద్ధతి

 

1. ఉపాధ్యాయ కేంద్రక బోధనా పద్ధతులు:
* ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు కేంద్రస్థానంలో ఉంటాడు.
* విద్యార్థి స్తబ్దుగా ఉంటాడు.
* దీనిలో ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి ముఖ్యమైనవి.

ఉపన్యాస పద్ధతి (Lecture Method):
* ఇది ప్రాచీనమైన పద్ధతి. Lecture అనే ఆంగ్లపదం Lectare అనే లాటిన్ పదం నుంచి వచ్చింది.
* Lecture అంటే Loud reading బిగ్గరగా చదవడం.
* Lecture అనే పదం చెప్పడం, వివరించడంగా మార్పు చెందింది.

       

* ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని తార్కిక కమ్రంలో అమర్చుకుని క్రమపద్ధతిలో వివరించడాన్ని ఉపన్యాస పద్ధతి అంటారు.
 

ప్రయోజనాలు:
* ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులను మంచి వక్తలుగా, సభా ఉపన్యాసకులుగా తయారు చేయవచ్చు.
* తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు బోధించవచ్చు.
* ప్రయోగాలు చేయడానికి సంక్లిష్టంగా ఉన్న విషయాలను ఉపన్యాస పద్ధతి ద్వారా బోధించవచ్చు.

* ఎంతమంది విద్యార్థులకైనా ఒకేసారి బోధించవచ్చు.
* ఉపాధ్యాయులకు, యాజమాన్యానికి అత్యంత ఇష్టమైన పద్ధతి.
* స్పష్టమైన భావ ప్రకటనకు ఇది తోడ్పడుతుంది.
గమనిక: ఉపన్యాస పద్ధతి జ్ఞానరంగం, సాంఘిక కృత్యాలకు సంబంధించిందే గానీ భావావేశరంగం, మానసిక చలనాత్మక రంగాలకు సంబంధించింది కాదు.

 

ఉపన్యాస పద్ధతిని ఉపయోగించుకోవాల్సిన సందర్భాలు
* ప్రేరణ కలిగించడానికి
* కొత్త పాఠ్యాంశం ప్రారంభించడానికి
* ప్రదర్శించడానికి వీలుకాని క్లిష్టమైన, సైద్ధాంతిక విషయాలు వివరించడానికి
* జరిపిన ప్రదర్శనను వివరించడానికి
* మూల్యాంకనం చేయడానికి
* నిర్ణీత కాల వ్యవధిలో పాఠ్య ప్రణాళికను ముగించడానికి ఉపయోగిస్తారు

 

లోపాలు:
* మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలైన అభిరుచులు, అవసరాలు, వైవిధ్యాలను దృష్టిలో ఉంచుకోవడం జరగదు.
* శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ, శాస్త్రీయ వైఖరులు పెరగవు.

* ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రానికి ఇది విరుద్ధం
* ప్రత్యక్ష అనుభవాలు కలుగవు
* విద్యార్థి తటస్థంగా ఉంటాడు
* ఉపాధ్యాయుడి ఆధిపత్యం ఎక్కువ
* ప్రజాస్వామ్య వాతావరణం ఉండదు
* అభ్యసనానికి ముఖద్వారమైన 5 జ్ఞానేంద్రియాల్లో కేవలం చెవి (వినడం) మాత్రమే జరుగుతుంది.

 

ఉపన్యాస పద్ధతిలో లోపాలు, సవరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* విద్యార్థులకు ముఖ్యాంశ లేఖనానికి తగిన వ్యవధి ఇవ్వాలి.
* మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఉండాలి
* ఆకర్షణీయమైన కంఠధ్వనితో హావభావాలను ప్రదర్శిస్తూ ఉండాలి
* చిరునవ్వు, హాస్యం, చతురోక్తులతో బోధించడం మంచిది

 

ఉపన్యాస ప్రదర్శన పద్ధతి:
      
ఉపాధ్యాయుడు ఒక పరికరాన్ని లేదా ప్రయోగాన్ని ప్రదర్శిస్తూ వివరించే పద్ధతిని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు.
* ఈ పద్ధతిలో విద్యార్థి చూస్తూ, వింటూ నేర్చుకుంటాడు. దీన్ని ప్రదర్శన పూర్వక ఉపన్యాస పద్ధతి అని కూడా అంటారు.

సెల్‌బర్గ్: ఉపన్యాసాన్ని, ప్రదర్శనలను జోడించి విజ్ఞానశాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుల్లో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నట్లు సెల్‌బర్గ్ అనే విద్యావేత్త మూడేళ్లపాటు పరిశోధన చేసి సామాన్య అంశాలను కింది విధంగా తెలిపారు.

* పరికరాలను సిద్ధం చేసుకోలేక‌పోవ‌డం
* ప్రయోగ లక్ష్యాన్ని వివరించలేకపోతున్నారు
* పరిశీలనకు తగిన వ్యవధి ఇవ్వడం లేదు
* నల్లబల్లను, ఇతర ఉపకరణాలను ఉపయోగించడం లేదు

 

మంచి ప్రదర్శన లక్షణాలు:
ప్రణాళిక: ప్రదర్శనను ముందుగానే సిద్ధం చేసుకోవాలి

 

లక్ష్యాల స్పష్టత: ప్రదర్శన ఉద్దేశాలు, లక్ష్యాలు ఉపాధ్యాయుడికి స్పష్టంగా తెలియాలి.
 

విద్యార్థుల సహకారం: ప్రయోగం చేసేటప్పుడు, పరికరాల సేకరణ, నమూనాలు చేయడం, పరికరాల అమరిక; పటాలు, నమూనాల సేకరణలో ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారాన్ని తీసుకోవాలి.
 

పరికరాల అమరిక: ప్రయోగానికి పనికి వచ్చే పరికరాలను ఎడమ చేతివైపు, ఉపయోగించిన పరికరాలను కుడిచేతివైపు పెట్టుకోవాలి.
 

దృష్టి స్పష్టత: ప్రదర్శనా బల్ల విద్యార్థుల బల్లల కంటే కొంచెం ఎత్తుగా ఉండాలి.
 

పరికరాల పరిమాణం: విద్యార్థులందరికీ కనిపించే విధంగా, వీలైనంత పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి.
 

గాలి, వెలుతురు: తగినంత గాలి, వెలుతురు తరగతిలో ఉండే విధంగా చూసుకోవాలి.
 

ప్రదర్శన: పరికరాలను మొత్తం ఒకేసారి విద్యార్థుల ముందు ఉంచకూడదు. అవసరమైన వాటిని మాత్రమే తీసి చూపాలి.

ప్రత్యామ్నాయ ఉపకరణాలు: ప్రయోగానికి, ప్రదర్శనకు కావాల్సిన పరికరాలు అందుబాటులో లేకపోతే ఉన్నవాటిని ఉపయోగించుకోవాలి.
 

సామాన్య-శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ: ప్రదర్శన అనేది విద్యార్థులకు ఒక సమస్యను సృష్టించి దానికి పరిష్కార మార్గం వెతుక్కునేలా ఉండాలి. అప్పుడే వారికి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభిస్తుంది.
 

ఉపాధ్యాయుడి కౌశలం: విద్యార్థులను ప్రశ్నిస్తూ, వారిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఉపాధ్యాయుడు సందర్భానుసారంగా నటనా చాతుర్యాన్ని ప్రదర్శించాలి.
 

నల్లబల్ల ఉపయోగం: క్లిష్టమైన, ముఖ్యమైన పదాలను నల్లబల్లపై రాయాలి.
 

సమయానుకూలత: ప్రదర్శన అనేది వాతావరణం, రుతువులు, సమయానికి అనుగుణంగా ఉండాలి.
ఉదా: కప్ప జీవితచరిత్రను బోధించేందుకు వర్షాకాలం అయితే బాగుంటుంది.
* ఫలితాలను ముందుగా విద్యార్థికి చెప్పకూడదు.
* ప్రయోగం విద్యార్థుల స్థాయికి తగినట్లు ఉండాలి.

 

మంచి ప్రదర్శనకు కావాల్సిన ఆవశ్యకాంశాలు:
* మంచి ఉపన్యాస, ప్రదర్శన గది.
* ఉపయోగించే పరికరాలు పరిమాణంలో పెద్దవిగా, కచ్చితమైనవిగా ఉండాలి.
* ప్రత్యామ్నాయ లేదా అదనపు పరికరాలు ఉంచుకోవాలి.

ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలోని సోపానాలు:
దీనిలో 6 సోపానాలు ఉంటాయి.
      1) ప్రణళికా రచన తయారీ
      2) పాఠ్యాంశ పరిచయం
      3) పాఠ్యాంశాన్ని వివరించడం
      4) ప్రయోగ నిర్వహణ
      5) నల్లబల్ల పని
      6) పర్యవేక్షణ
ప్రణాళికా రచన, తయారీ: ప్రదర్శనా పద్ధతి విజయవంతం కావడం అనేది ఉపాధ్యాయుడి సామర్థ్యం, ప్రణాళికా రచన, ప్రదర్శనకు ఉపాధ్యాయుడు పూర్తిగా తయారీ లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

 

పాఠ్యాంశ పరిచయం: పాఠ్యాంశాన్ని పరిచయం చేసేముందు వారిలో ప్రేరణ కలిగించాలి. దానివల్ల కొత్తవిషయాలు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఏర్పడుతుంది.
 

పాఠ్యాంశాన్ని వివరించడం: పాఠాన్ని తన ప్రణాళికా రచనను అనుసరించి సరైన ఉదాహరణలను ఉపయోగిస్తూ విద్యార్థుల ముందు ఉంచాలి.
 

ప్రయోగ నిర్వహణ: ప్రయోగ ప్రదర్శనలో గమనించిన విషయాలను విద్యార్థులు వారు నిర్వహించే ప్రయోగాల్లో ఉపయోగించుకుంటారు. అందువల్ల ప్రయోగాన్ని క్రమ పద్ధతిలో నిర్వహిస్తూ అది లక్ష్యాలను చేరుకునేలా నిర్వ‌హించాలి.

నల్లబల్ల పని: ప్రదర్శించే ప్రయోగం, బోధనాంశాన్ని అర్థం చేసుకోవడానికి నల్లబల్ల ఉపయోగపడుతుంది. నల్లబల్ల పని ఉపాధ్యాయుడి సామర్థ్యానికి సూచిక లాంటిది
 

పర్యవేక్షణ: ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో విద్యార్థులందరూ ప్రయోగంలో భాగస్వామ్యులు అయ్యేలా చేయవచ్చు. పర్యవేక్షణ ఎంత బాగుంటే ఉపన్యాన ప్రదర్శన అంత విజయవంతం అవుతుంది.
 

ప్రయోజనాలు:
* మూర్త భావనలు కలుగుతాయి.
* ఇది సమయాన్ని, ధన వ్యయాన్ని తగ్గిస్తుంది.
* ఈ పద్ధతి ముఖ్యంగా....
ఎ) ప్రయోగ పరికరాలు చాలా ఖరీదై అరుదుగా లభించే సందర్భాల్లో
బి) ప్రయోగంలో అపాయం సంభవించడానికి అవకాశాలున్న సందర్భాల్లో
సి) ప్రయోగంలో చిక్కులు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో
డి) ప్రయోగ పరికరాలను ఉపయోగించడంలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన సందర్భాల్లో బాగా ఉపయోగపడుతుంది.
     ఇది ప్రత్యక్ష పరిశీలన ద్వారా జ్ఞానానికి స్థిరత్వం కలిగే అవకాశాన్ని కలిగిస్తుంది. కొంతమేరకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభిస్తుంది.
లోపాలు: విద్యాబోధనలో ప్రధాన లక్షణమైన 'ఆచరించి నేర్చుకోవడం' అనే సూత్రానికి ఇందులో స్థానంలేదు. విద్యార్థులు ఉపాధ్యాయుడు చేసిన ప్రయోగాలు చూడటమే గానీ తాము చేసే అవకాశం చాలా తక్కువ.

* ఈ పద్ధతి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న తరగతిలో ఉపయోగపడదు.
* ఇది శిశుకేంద్రక పద్ధతి కాదు.

 

II. విద్యార్థి కేంద్రక పద్ధతులు (శిశు కేంద్రక పద్ధతులు):
* వీటిలో విద్యార్థి చురుకుగా ఉంటాడు.
* ఉపాధ్యాయుడు మార్గదర్శిగా ఉంటాడు.
* వీటన్నింటిలో ఇమిడి ఉన్న సూత్రం చేయడం ద్వారా నేర్చుకోవడం.
* పద్ధతులన్నింటిలో విద్యార్థే స్వయంగా సమస్యలను పరిష్కరించుకుంటాడు. కాబట్టి వీటిని సమస్యా పరిష్కార పద్ధతులు అంటారు.
వీటిలో చాలా రకాలు ఉన్నాయి అవి:
   1. హ్యూరిస్టిక్ (అన్వేషణ పద్ధతి)
   2. ప్రాజెక్టు పద్ధతి (ప్రకల్పన పద్ధతి)
   3. వైజ్ఞానిక పద్ధతి
   4. ప్రయోగశాల పద్ధతి
   5. ఆగమన పద్ధతి
   6. నిగమన పద్ధతి
   7. నియోజన పద్ధతి
   8. విశ్లేషణ పద్ధతి
   9. సంశ్లేషణ పద్ధతి

లాభాలు:
* విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరతాయి.
    ఎ) శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభిస్తుంది.
    బి) శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చెందుతాయి.
    సి) శాస్త్రీయ జ్ఞానం అందుతుంది.
* విద్యార్థి సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది.
* విద్యార్థి స్వయంగా సమస్యలను పరిష్కరించగలడు.
* పరిశీలన, సృజనాత్మక శక్తి అభివృద్ధి చెందుతుంది.
* నైపుణ్యాలు, సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి.
స్వయం అభ్యసన జరుగుతుంది.
* నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.

 

లోపాలు:
* సమయం, డబ్బు వృథా అవుతాయి.
* ఆర్థికంగా ఖరీదైంది.

* సిలబస్ పూర్తికాదు.
* సామర్థ్యం, నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు అవసరం అవుతారు.
* ఉపాధ్యాయుడికి పనిభారం ఎక్కువ.
* కాల నిర్ణయ పట్టికలో ఇమడ్చడం సాధ్యం కాదు.

 

1. అన్వేషణ పద్ధతి (హ్యూరిస్టిక్ మెథడ్):
* హ్యూరిస్టిక్ అనే ఆంగ్ల పదం Heurisco అనే గ్రీకు పదం నుంచి వచ్చింది.
* Heurisco అంటే అన్వేషణ లేదా కనుక్కోవడం.
* ఒక సమస్యను విద్యార్థి ప్రయోగశాలలో సొంతంగా పరిష్కరించడాన్ని అన్వేషణ పద్ధతి అంటారు.
* ఈ పద్ధతిని 'థార్న్‌డైక్ యత్నదోష సిద్ధాంతం' ఆధారంగా రూపొందించారు.
* అన్వేషణ పద్ధతికి మరోపేరు పరిశోధనా పద్ధతి.
* ఈ పద్ధతికి మూల పరుషుడు హెచ్.ఇ. ఆర్మ్‌స్ట్రాంగ్ (ఇంగ్లండ్)
* దీన్ని సమర్థించిన వ్యక్తి - వెస్టవే.
    అన్వేషణ పద్ధతి అనేది 'విద్యార్థికి శాస్త్రీయ విధానంలో శిక్షణ ఇచ్చేదిగా ఉండాలి. కానీ జ్ఞానం పొందడం దీని పరమార్థం కాదు.' - వెస్టవే
* ఈ పద్ధతిని జె.జె. థామ్సన్ విమర్శించాడు.

ఈ పద్ధతి ద్వారా విద్యార్థి శాస్త్రీయ పద్ధతిని మాత్రమే తెలుసుకుంటాడు. జ్ఞానానికి ద్వితీయ స్థానం ఇచ్చారు. కాబట్టి ఇది బోధనా పద్ధతిగా పనికిరాదు.     - జె.జె. థామ్సన్
ఈ పద్ధతిలో 4 సోపానాలు ఉన్నాయి.
      1. నిర్వచించడం
      2. ప్రయోగాలు నిర్వహించడం
      3. వివరించడం
      4. ముగింపు

గమనిక: ప్రయోగశాల పద్ధతిలో కూడా సూచనా పత్రాలు ఉంటాయి.

సూచన పత్రంలోని అంశాలు:
      
1. ప్రయోగ ఉద్దేశం
      2. ప్రయోగానికి కావాల్సిన పరికరాలు
      3. ప్రయోగం చేసే విధానం
      4. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
      5. సమస్య పరిష్కారానికి తోడ్పడే ప్రశ్నలు
      6. పరిశీలించాల్సిన అంశాలు

విధానం: ఈ పద్ధతిలో ఒక సమస్యను ఇస్తారు. సమస్య పరిష్కారానికి సూచనా పత్రాలను ఇస్తారు. విద్యార్థి సమస్యను అర్థం చేసుకొని సూచనా పత్రాలు చదివి సొంతంగా ప్రయోగాలు చేసి సమస్యను పరిష్కరించాలి.
 

లాభాలు:
* ఈ పద్ధతిలో శాస్త్రీయ శిక్షణ, వైఖరులు సులభంగా వృద్ధి చెందుతాయి.
* విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలను స్వయంగా పరిష్కరించుకుంటారు.
* కష్టపడి పని చేయడం, పని మీద గౌరవం పెరుగుతుంది.
* విద్యార్థులను భావి జీవితానికి సిద్ధపరుస్తుంది.
* విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సహకారం పెరుగుతుంది.
* ఉపాధ్యాయుడు విద్యార్థుల విషయంలో వ్యక్తిగత శ్రద్ధ చూపే వీలు కలుగుతుంది.

 

లోపాలు:
* ప్రాథమిక తరగతులకు అనువైంది కాదు.
* జీవశాస్త్రం అంటే కేవలం ప్రయోగశాలకు మాత్రమే పరిమితం అనే తప్పుడు భావన కలగడానికి అవకాశం ఉంది.
* విద్యార్థులు అన్ని విషయాలు స్వయంగా నేర్చుకోవడం కష్టం.
* పరిమితమైన సమయంలో నిర్ణీతమైన పాఠ్యప్రణాళిక అంతా ముగించడం సాధ్యపడదు.

* ఈ పద్ధతి చాలా తక్కువ మంది విద్యార్థులున్న తరగతులకు మాత్రమే ఉపయోగపడుతుంది.
ఉదా: కిరణజన్య సంయోగక్రియలో ఏ వాయువు విడుదల అవుతుంది?
     ఈ సమస్యను విద్యార్థికి ఇచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం సూచనా పత్రాలు ఇస్తారు. విద్యార్థి సూచనా పత్రాలు చదివి సమస్య పరిష్కరించుకోవాలి.

 

అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర:
* ఉపాధ్యాయుడు సలహాదారుడిగా, మిత్రుడిగా, మార్గదర్శకుడిగా ఉండాలి.
* సమస్య లేదా ప్రయోగానికి సంబంధించి పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలి.
* విద్యార్థులు అధిక జ్ఞానం పొందడానికి అవసరమయ్యే పుస్తకాల జాబితాను ఇవ్వగలిగి ఉండాలి.
* ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పాలి.
* విద్యార్థుల కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ తగిన సలహాలు ఇస్తూ ఉండాలి.
* ప్రశ్నలు వేయడంలో నేర్పరి అయి ఉండి, విద్యార్థులను కూడా ఆయా అంశాలపై ప్రశ్నలను అడిగి ప్రేరేపించాలి.

 

2. ప్రాజెక్టు పద్ధతి / ప్రకల్పన పద్ధతి:
* ప్రాజెక్టు పద్ధతి సంప్రదాయ బోధనా పద్ధతులపై ఒక తిరుగుబాటు.
* ప్రాజెక్టు పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొదటిసారిగా సూచించింది వ్యవహారిక సత్తావాది జాన్ ‌డ్యూయి.

* అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం హస్తకళలు ఎలా నేర్పించాలి అనే చర్చ జరుగుతున్నప్పుడు కిల్‌పాట్రిక్ మొదటిసారిగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కాబట్టి కిల్ పాట్రిక్‌ని 'ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్' అని అంటారు.
* ప్రాజెక్ట్ పద్ధతిని మొదటిసారిగా సైన్స్‌లో ప్రవేశపెట్టింది రష్యాకు చెందిన 'స్టీవెన్‌సన్'.
* కిల్ పాట్రిక్, స్టీవెన్‌సన్‌లు విడివిడిగా జాన్‌ డ్యూయి వ్యవహారిక సత్తావాదాన్ని వివరించే ఫలితమే ప్రాజెక్ట్ పద్ధతి.
* ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతికి మధ్య తేడా ఉంది.
* అన్వేషణ పద్ధతిలో విద్యార్థి అన్వేషణ స్థానంలో ఉండి ప్రయోగశాలలో సమస్యను స్వయంగా పరిశోధిస్తాడు.
* ప్రాజెక్టు పద్ధతిలో సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో తెలుసుకొని విద్యార్థి దాన్ని సహజ వాతావ‌ర‌ణంలో పరిష్కరిస్తాడు.
* అంటే ఈ రెండు పద్ధతుల్లో సమస్య పరిష్కారమయ్యే ప్రదేశంలో తేడా ఉంది.
* ఒక సమస్యను దాని సహజ వాతావరణంలో పరిష్కరించడమే ప్రాజెక్టు పద్ధతి.
* ప్రాజెక్టుపద్ధతిలో Learning by Doing అనే సూత్రంతో పాటు "Learning by living"(జీవించడం ద్వారా నేర్చుకోవడం) అనే అంశానికి ప్రాధాన్యం ఉంది.
* ప్రాజెక్టు అంటే బహిర్గత పరచడం లేదా ప్రక్షేపించడం.

 

ఉద్దేశం: కొందరు విద్యార్థులు కలిసి ఒక సమూహంగా ఏర్పడి లేదా వ్యక్తిగతంగా తరగతిలోని విద్యార్థులంతా కలిసి ఒక ప్రయోజనకరమైన ప్రాజెక్టును తీసుకొని దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడం ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం.
గమనిక: ప్రాజెక్టు అనేది ఒక ప్రయోజనకరమైన కార్యం. ఆ ప్రయోజనాన్ని సాధించడమే ఈ పద్ధతిలోని ముఖ్య ఉద్దేశం.

ప్రాజెక్టు పద్ధతిని సమర్థించిన వ్యక్తి హెన్రీ డేవిడ్.
   ఈ రోజుల్లో మానవులు ప్రపంచాన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా చూసి ఆనందిస్తున్నారే తప్ప సహజంగా జీవించడం లేదు. సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమత్వంలో జీవిస్తున్నారు. దీనివల్ల సహజత్వం లోపిస్తుంది.  - హెన్రీ డేవిడ్
గమనిక: సహజవాతావరణమే ప్రాజెక్టు పద్ధతికి ఆయువుపట్టు

 

నిర్వచనాలు:
కిల్‌పాట్రిక్: 'అనువైన సాంఘిక/సహజ వాతావరణంలో పూర్తి చేసే హృదయ పూర్వకమైన, ప్రయోజనాత్మకమైన కృత్యమే ప్రకల్పన.'

 

బల్లార్డ్: 'పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రాజెక్టు'
 

బర్డన్: చేయడంలో ముగిసే సమస్య ప్రాజెక్టు.
 

స్టీవెన్‌సన్: 'సమస్యా కృత్యాన్ని సహజవాతావరణంలో పరిష్కారించ‌డాన్నే ప్రకల్పన అంటారు.'
 

ప్రాజెక్టు పద్ధతిలోని సూత్రాలు:
ప్రయోజన సూత్రం: ప్రాజెక్టు అనేది ఒక ప్రయోజనకరమైన కార్యం, దాన్ని సాధించడమే ఈ పద్ధతిలోని ముఖ్య ఉద్దేశం.

 

ఉపయోగం, అన్వయసూత్రం: విద్యార్థులు నేర్చుకున్న అంశాలను నూతన పరిస్థితుల్లో అన్వయిస్తారు.
 

చేయడం ద్వారా నేర్చుకోవడం: విద్యార్థులు జ్ఞానాన్ని స్వయంగా వివిధ పనులు చేయడం ద్వారా నేర్చుకుంటారు.
 

సమస్యా పరిష్కార సూత్రం: విద్యార్థి సమస్యను కొన్ని కృత్యాల ద్వారా పరిష్కారిస్తాడు.
 

సహజ వాతావరణ సూత్రం: ఇది ప్రాజెక్టు పద్ధతికి వెన్నెముక లాంటింది.

సహకార సూత్రం: విద్యార్థులు ప్రాజెక్టు పనులు చేసేటప్పుడు ఒక బృందంగా ఏర్పడి సహకరించుకుంటారు.
 

లక్ష్యాత్మకత సూత్రం: విద్యార్థులు సమయోచితంగా ఉపాధ్యాయుడి సహకారంతో సమస్యలను పరిష్కారం చేయడం నేర్చుకుంటారు.
 

గమనిక:
   1) అన్వేషణ, సమస్యా పద్ధతుల్లో విద్యా ప్రణాళికకు కేంద్రం విద్యార్థి.
   2) ప్రకల్పనా పద్ధతిలో విద్యా ప్రణాళికకు కేంద్రం జీవితం.

 

ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలు:
  దీనిలో 6 సోపానాలు ఉన్నాయి.
     1. పరిస్థితిని కల్పించడం.
     2. ప్రాజెక్టును ఎంపిక చేసుకోవడం
     3. వ్యూహరచన
     4. ప్రాజెక్టు అమలు పరచడం
     5. ప్రాజెక్టు మూల్యాంకనం
     6. ప్రాజెక్టు నివేదిక తయారు చేయడం.

 

1. పరిస్థితిని కల్పించడం: విద్యార్థులు సమస్యను గుర్తించడానికి కావలసిన పరిస్థితిని ఉపాధ్యాయుడు సృష్టిస్తాడు.
 

2. ప్రాజెక్టు ఎంపిక చేయడం: విద్యార్థులే స్వయంగా ప్రాజెక్టును ఎన్నుకోవాలి.

3. వ్యూహరచన: ఒక ప్రాజెక్టు విజయం అనేది వ్యూహరచన మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థులే స్వయంగా దానికి కావలసిన వ్యూహరచన చేసుకోవాలి.
 

4. ప్రాజెక్టు అమలుపరచడం: వ్యూహరచన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థుల అభిరుచుల ఆధారంగా వారికి తగిన పనిని కేటాయించి, చేయిస్తాడు.
 

5. ప్రాజెక్టు మూల్యాంకనం: ప్రాజెక్టు సాధన విజయవంతం అయ్యిందా లేదా అనే విషయాన్ని మూల్యాంకనం ద్వారా తెలుసుకోవాలి.
 

6. నివేదిక తయారు చేయడం: విద్యార్థులు చేసిన పనిమొత్తాన్ని వివరంగా రికార్డులో రాసుకుంటారు.
 

మంచి ప్రాజెక్టుకు ఉండాల్సిన లక్షణాలు:
     
1. విద్యార్థుల అవసరాలకు తగినట్లు ఉండాలి.
     2. నిజ జీవితంలో ఉపయోగపడాలి.
     3. విద్యార్థి పొందే అనుభవాలు ఫలవంతంగా ఉండాలి.
     4. విద్యార్థులకు స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించాలి.
     5. డబ్బు, సమయాన్ని ఆదా చేయాలి.
     6. సమాజ అవసరాలతో సంబంధాన్ని కలిగి ఉండాలి.
     7. ప్రాజెక్టును విద్యార్థి పూర్తి చేయగలిగేలా ఉండాలి.

ప్రాజెక్టుల్లో రకాలు:
   
స్టీవెన్‌సన్ ప్రాజెక్టులను రెండు రకాలుగా వర్గీకరించాడు. అవి:
     1) భౌతిక సంబంధమైన ప్రాజెక్టులు
     2) మేధో సంబంధమైన ప్రాజెక్టులు

 

కిల్‌పాట్రిక్ ప్రాజెక్టులను 6 రకాలుగా వర్గీకరించాడు.
     
1. మేధో సంబంధ ప్రాజెక్టు
     2. భౌతిక సంబంధ ప్రాజెక్టు
     3. ఉత్పత్తి ప్రాజెక్టు
     4. వినియోగ ప్రాజెక్టు
     5. సమస్యా ప్రాజెక్టు
     6. శిక్షణా ప్రాజెక్టు

 

1. మేధో సంబంధ ప్రాజెక్టు: విద్యార్థి ఊహాశక్తిని, మేధాశక్తని పెంపొందిస్తుంది.
ఉదా: 1) విద్యార్థి రాబోయే 20 ఏళ్ల కాలంలో మానవ అవసరాలను ఊహించడం.
2) పరికరం నిర్మాణాన్ని ఊహించడం.

 

2. భౌతిక సంబంధ ప్రాజెక్టు: శారీరిక ప్రక్రియలకు సంబంధించింది.
ఉదా: ప్రయోగాలు చేయడం, బడితోటను పెంచడం, కీటకాల సేకరణ

3. ఉత్పత్తి ప్రాజెక్టు: ఒక వస్తువును ఉత్పత్తి చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
ఉదా: సబ్బులు, ఇంకులు తయారు చేయడం.

 

4. వినియోగ ప్రాజెక్టు: ఒక వస్తువును వినియోగించుకోవడం లేదా చూసి ఆనందించడం.
 

5. సమస్యా ప్రాజెక్టు: ఇది సమస్యలను పరిష్కరించే ప్రాజెక్టు.
ఉదా: పక్షులు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటాయి?

 

6. శిక్షణా ప్రాజెక్టు: ఇది కొత్త ప్రాజెక్టు కాదు.
* విద్యార్థుల్లో నైపుణ్యాలు, జ్ఞానం, అవగాహనను పెంపొందించడానికి చేసే ప్రాజెక్టు.
ఉదా: నమూనాలు మళ్లీ చేయించడం.

 

ప్రాజెక్టు పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర:
     
1. ఉపాధ్యాయుడు విద్యార్థులకు మిత్రుడిగా, మార్గదర్శకుడిగా ఉండాలి.
     2. ప్రజాస్వామ్య వాతావరణం కల్పించాలి.
     3. ఉపాధ్యాయుడు ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్వవేక్షిస్తూ ఉండాలి.

 

ప్రయోజనాలు:
మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది.
* థార్న్‌డైక్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతంలోని సంసిద్ధతానియమం, అభ్యసన నియమం, ఫలిత నియమంపై ఆధారపడి ఉంటంది.
          ప్రాజెక్టు ఎంపికలో - సంసిద్ధతా నియమం
          ప్రాజెక్టు అమలులో - అభ్యసన నియమం
          ప్రాజెక్టు పూర్తి చేయడం - ఫలిత నియమంపై ఆధారపడుతుంది.

కొఠారీ ప్రతిపాదించిన 'విద్యార్థులకు పని అనుభవం కల్పించాలి' అనే సూచనను పాటిస్తుంది.
విద్యార్థులకు స్వీయ వ్యూహరచనా సామర్థ్యం పెరుగుతుంది.
విద్యార్థుల్లో ప్రజాస్వామిక లక్షణాలు అలవడతాయి.
జీవించడం ద్వారా విద్యార్థి నేర్చుకుంటాడు.
విద్యార్థులు హృదయ పూర్వకంగా పనుల్లో పాల్గొంటారు.
ప్రాథమిక తరగతులకు అనుకూలమైంది.

 

పరిమితులు
తక్కువ జ్ఞానం సంపాదించడానికి కూడా ఎక్కువ సమయం ఖర్చు అవుతుంది.
ఉపాధ్యాయుడు అనేక విషయాల్లో బహుముఖ, సమగ్ర జ్ఞానం కలవాడై ఉండాలి.
సిలబస్ సకాలంలో పూర్తిచేయడం అసాధ్యం.
సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని పూర్తిస్థాయిలో పొందలేరు.
క్షేత్ర పరిశీలనలు చేయడం చాలా కష్టమైన పని.

 

ప్రాజెక్టు పద్ధతికి ఉదాహరణలు:
మన చుట్టూ ఉన్న పక్షుల గురించి తెలుసుకోవడం
కోళ్ల పెంపకం
బడితోట వేయడం

* అక్వేరియం నిర్వహణ
* కాలుష్యం - నివారణ పద్ధతులు
పక్షులు వలసపోవడం

 

3. ప్రయోగశాల పద్ధతి
* విజ్ఞాన శాస్త్రానికి ప్రయోగాత్మక పని వెన్నెముక లాంటిది.
* దీనిలో విద్యార్థి కొన్ని సిద్ధాంతాలను రుజువు చేస్తాడు.

 

ప్రయోగశాలలో కార్యక్రమాల నిర్వహణ:
* తరగతిలోని విద్యార్థుల సంఖ్యను, ప్రయోగశాలలో ఉన్న పరికరాలను, ప్రయోగ నిర్మాణాన్ని బట్టి దీన్ని మూడు పద్ధతుల్లో నిర్వహించవచ్చు.
1. పద్ధతి I / ఏక ముఖ పద్ధతి [Method I / Class Front Method / Individual Method]:
* విద్యార్థుల సంఖ్యకు సరిపడినన్ని ప్రయోగపరికరాలు ఉన్నప్పుడు దీన్ని చేస్తారు.
* ప్రయోగ పరికరాల ఖరీదు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఉపయోగిస్తారు.

 

2. పద్ధతి II/ సమూహ పద్ధతి / భ్రమణ పద్ధతి/ గ్రూప్ పద్ధతి/ రొటేషన్ పద్ధతి:
* విద్యార్థుల సంఖ్యకు సరిపడినన్ని ప్రయోగ పరికరాలు లేనప్పుడు దీన్ని ఉపయోగిస్తారు.
* ప్రయోగ పరికరాల ఖరీదు ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు.

3. పద్ధతి III / ఖండ పద్ధతి / నిర్ణీత భాగ నిర్వహణ/ పార్ట్‌మెథడ్/ డివిజన్ మెథడ్:
* చేయాల్సిన ప్రయోగం చాలా పెద్దదై, క్లిష్టంగా ఉన్నప్పుడు ఏ ఒక్క విద్యార్థి చేయడానికి వీలుకాని పరిస్థితుల్లో ఆ ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి, ఒక్కో భాగాన్ని ఒక్కో గ్రూపుకు లేదా ఒక్కో విద్యార్థికి ఇస్తారు.
ప్రయోజనాలు:
1. పాఠ్య విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించవచ్చు.
2. సమస్యపరిష్కార ధోరణి పెరుగుతుంది.
3. ప్రయోగ పరికరాలు అందుబాటులో లేనప్పుడు, ప్రత్యామ్నాయ పరికరాలను ఉపయోగించి ప్రయోగాలు చేసే శక్తి ఈ పద్ధతి ద్వారా వస్తుంది.

 

ప్రయోగ పద్ధతిలోని పరిమితులు:
* ఖర్చు ఎక్కువ
* ప్రయోగశాలలు, ప్రయోగ పరికరాలు ఉండకపోవచ్చు.
* మంచి శిక్షణ కలిగి, సమర్థుడైన ఉపాధ్యాయుడు లేకపోవడం.
* ప్రయోగాలకు ఎక్కువ సమయం పడుతుంది.
ఉదా: కిరణజన్య సంయోగ క్రియలో O2 వాయువు విడుదల అవుతుందని నిరూపించడం.

4. శాస్త్రీయ పద్ధతి:
* శాస్త్రజ్ఞులు అనుసరించే విధానం కాబట్టి దీన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు.
* సమస్యలను ఒక ప్రత్యేక రీతిలో క్రమబద్ధంగా పరిష్కరించడమే శాస్త్రీయ పద్ధతి.
* శాస్త్రీయ పద్ధతికి సోపానాలు సూచించిన మొదటి వ్యక్తి కార్ల్‌ పియర్‌సన్ (1937).
* శాస్త్రీయ పద్ధతికి సోపానాలు సూచించిన మరో వ్యక్తి కీస్లర్.

 

శాస్త్రీయ పద్ధతిలో అందరికీ ఆమోదయోగ్యమైన సోపానాలు తొమ్మిది.
   అవి:

    1. సమస్యను గుర్తించడం
    2. సమస్యను నిర్వచించడం
    3. సమస్య విశ్లేషణ లేదా లక్ష్య నిర్ధారణ
    4. దత్తాంశ సేకరణ
    5. దత్తాంశాలను ప్రతిక్షేపించడం
    6. ప్రాక్కల్పనలను ప్రతిపాదించడం
    7. ప్రాక్కల్పనలను పరీక్షించడం
    8. సాధారణీకరించడం
    9. కొత్త విషయాలకు అన్వయం

1. సమస్యను గుర్తించడం:
* విద్యార్థుల్లో ఆసక్తి, పరిశీలనా దృష్టి, ఆలోచనా శక్తి, తార్కికత్వం పెంపొందించే విషయాలను ప్రకృతిలో పరిశీలిస్తూ ఉన్నప్పుడు వారిలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తి విద్యార్థి సమస్యను గుర్తించేలా ఉపాధ్యాయుడు చేయాలి.
* దీన్నే సమస్యను గ్రహించడం లేదా ఎన్నుకోవడం అంటారు.

 

2. సమస్యలను నిర్వచించడం:
* గుర్తించిన లేదా ఎన్నుకున్న సమస్యను సమగ్రంగా, నిర్దిష్టమైన భాషలో నిర్వచించాలి.

 

3. సమస్య విశ్లేషణ:
* సమస్య నిర్వచనంలో ఇమిడి ఉన్న ముఖ్య పదాలను, పదజాలాలను గుర్తించి, వాటిని విశ్లేషించడం జరుగుతుంది.

 

4. దత్తాంశ సేకరణ:
* సమస్యకు సంబంధించిన సమాచారాన్ని ఉపాధ్యాయుడి సహకారంతో పుస్తకాలు ద్వారా, నమూనాలు, బొమ్మలు, క్షేత్ర పర్యటనలు, ప్రయోగాల ద్వారా సేకరిస్తారు.

 

5. దత్తాంశాలను ప్రతిక్షేపించడం:
* ఇది కష్టతరమైన, ముఖ్యమైన సోపానం.

 

6. ప్రాక్కల్పనలను ప్రతిపాదించడం:
* సమస్యను బట్టి తాత్కాలిక పరిష్కారాలను ఊహిస్తాడు. దీన్నే ప్రాక్కల్పనలను ప్రతిపాదించడం అంటారు.

7. ప్రాక్కల్పనలను పరీక్షించడం:
* చేసిన ప్రాక్కల్పనలు సరైనవో, కావో ప్రయోగపూర్వకంగా పరీక్షించి నిజాన్ని తెలుసుకుంటారు.
* వచ్చిన ఫలితాలను బట్టి ప్రాక్కల్పనలను అంగీకరించాలో, నిరాకరించాలో నిర్ణయిస్తారు.

 

8. సాధారణీకరించడం: వచ్చిన ఫలితాల నుంచి ఒక నిగమనాన్ని రాబట్టి దాన్ని ఒక సాధారణీకరణగా చెప్పవచ్చు.
 

9. కొత్త సంగతులకు అన్వయం: పైన చెప్పిన సాధారణీకరణాలను విద్యార్థులు తమ దైనందిన జీవితాల్లో అన్వయం చేసుకుంటారు.

బోధనా పద్ధతి

దానిలోని ముఖ్యాంశం

1. ఉపన్యాసం

ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని క్రమపద్ధతిలో అమర్చుకుని వివరిస్తాడు.

2. ఉపన్యాస ప్రదర్శన

ప్రయోగాన్ని / పరికరాన్ని ప్రదర్శిస్తూ ఉపాధ్యాయుడు వివరిస్తాడు.

3. అన్వేషణ

విద్యార్థి ఒక సమస్యను ప్రయోగశాలలో స్వయంగా పరిష్కరిస్తాడు.

4. ప్రాక్కల్పన

విద్యార్థి సహజ వాతావరణంలో ఒక సమస్యను పరిష్కరిస్తాడు.

5. ప్రయోగశాల

తెలిసిన విషయాలను ప్రయోగశాలలో ప్రయోగపూర్వకంగా రుజువు చేస్తాడు.

6. శాస్త్రీయ

శాస్త్రవేత్తలు అనుసరించే పద్ధతి విద్యార్థి ప్రయోగశాలలో ఒక సమస్యను నియంతృత పరిస్థితుల్లో పరిష్కరిస్తాడు.

బోధనా పద్ధతులపై వివిధ కమిషన్‌ల సూచనలు:
* ప్రపంచంలో ఉండే అనేక బోధనా పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించి లక్ష్మణస్వామి మొదలియార్ కొన్ని అభిప్రాయాలను తెలిపారు. అవి:
* బోధనా పద్ధతులు విద్యార్థికి కేవలం జ్ఞానాన్ని ప్రసాదించేవే కాకుండా, ఆశించిన విలువలు, చక్కటి దృక్పథాలు, పనిచేయడంలో అభ్యసనాన్ని కలిగించేవిగా ఉండాలి.
* బోధనా పద్ధతులు పనితో చక్కని సంబంధాన్ని కలిగించి దాన్ని సాధ్యమైనంత వరకు సమర్థంగా, నమ్మకంగా క్షుణ్ణంగా చేసేలా విద్యార్థిని ప్రోత్సహించేవిగా ఉండాలి.

 

బోధన పద్ధతులు - కొఠారీ కమిషన్ అభిప్రాయాలు:
1. విజ్ఞానశాస్త్ర తరగతి గదిలో సామాన్యంగా ఉపయోగించే బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాసాలు, ప్రయోగాలు జరిగే ప్రదేశంలో, పాఠ్య విషయ సమాచారాన్ని తీసుకుని విజ్ఞానశాస్త్ర సూత్రాల ఆధారంగా సమస్యలను విడదీసి పరిష్కరించడానికి ఆవశ్యకమైన నైపుణ్యాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ విలువలకు సంబంధించిన ఉత్తేజాన్ని వృద్ధి చేయడానికి సహాయపడవు.
2. ప్రాథమిక దశలో విజ్ఞానశాస్త్రం, వ్యవసాయం, పరిశ్రమల మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి.

3. సెకండరీ దశలో విజ్ఞానశాస్త్ర బోధనలో గృహ సాంకేతికత్వం ఒక అంశంగా ఉండాలి.
4. ప్రయోగశాల పని ప్రస్తుతం బోధనా పద్ధతుల్లో ఉన్న బలహీన లక్షణం.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌