• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు

 జీవశాస్త్రంలో గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు అనే పదాలను వేర్వేరు అర్థాల్లో వాడతారు.


1) గమ్యం: విశాలమైన, దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాన్ని తెలియజేస్తుంది.
ఉదా: విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడం.

 

2) ఉద్దేశం: గమ్యాల నుంచి ఏర్పడి, గమ్యాల కంటే నిర్దిష్టంగా ఉండి, తక్కువ కాలంలో సాధించే వాటిని ఉద్దేశాలు అంటారు.
ఉదా: విద్యార్థిలో జీవశాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగించడం.

 

3) లక్ష్యం: ఉద్దేశాల నుంచి ఉద్భవించి అనతికాలంలో చేరుకునే గమ్యాలను లక్ష్యాలు అంటారు.
ఉదా: a) విద్యార్థి పుష్ప భాగాలను అవగాహన చేసుకుంటాడు.
         b) విద్యార్థి ప్రత్యుత్పత్తి గురించి జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు.

'ఒక గమ్యం నుంచి అనేక ఉద్దేశాలు, ఒక ఉద్దేశం నుంచి అనేక లక్ష్యాలు ఆవిర్భవిస్తాయి'. - యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్
'ఉద్దేశాలకు, లక్ష్యాలకు ఉన్న సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుంది'. - రిచర్డ్ వైట్ ఫీల్డ్ (కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ)
* గమ్యాలు, ఉద్దేశాలు సాధించడానికి ఎక్కువకాలం పడుతుంది. కాబట్టి వీటిని దీర్ఘకాలిక లక్ష్యాలు అంటారు.
* గమ్యాలు, ఉద్దేశాలు విద్యార్థి నేర్చుకోవాల్సిన ప్రత్యేక విషయాన్ని తెలపవు. వాటిని సాధారణ స్థాయిలో రూపొందిస్తారు. కాబట్టి వీటిని సాధారణ లక్ష్యాలు అంటారు.
* లక్ష్యాల నుంచి ఉద్భవించిన స్పష్టీకరణలు విద్యార్థి ప్రవర్తనా రూపంలో రాయబడతాయి. కాబట్టి వాటిని ప్రవర్తనా లక్ష్యాలు అంటారు.
* దీర్ఘకాలిక లక్ష్యాలకు, ప్రవర్తనా లక్ష్యాలకు తేడా ఉంటుంది.

లక్ష్యాలు
* విద్యార్థి ప్రవర్తనలో ఆశించిన / వాంఛనీయమైన / తీసుకురావాల్సిన మార్పును లక్ష్యం అంటారు.

 

లక్ష్యాలు రూపొందించేటప్పుడు గమనించాల్సిన మూలాలు

 

లక్ష్యాల లక్షణాలు
* విద్యా విషయకంగా ప్రాముఖ్యం ఉండాలి.
* విద్యార్థిలో తీసుకురావాల్సిన ప్రవర్తన మార్పుల రూపంలో ఉండాలి.
* ఉపాధ్యాయుడికి సూచనప్రాయంగా ఉండాలి.

* మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉండాలి.
* సరళమైన భాషలో నిర్దుష్టంగా ఉండాలి.
* ప్రతి లక్ష్యానికి స్పష్టీకరణలు ఉండాలి.

లక్ష్యాల ప్రయోజనాలు
* నేర్చుకోవాల్సిన విషయాన్ని సూచిస్తాయి.

* ప్రవర్తనా మార్పును తెలియజేస్తాయి.

* లక్ష్య సాధనకు ఉపాధ్యాయుడిని బాధ్యుడిగా చేయవచ్చు.
గమనిక: ఒక లక్ష్యంలో రెండు భాగాలు ఉంటాయి.
1) విషయ భాగం 2) ప్రవర్తనా/ సంస్కరణ భాగం
ఉదా: విద్యార్థి నిజజీవితంలో కాలుష్యానికి సంబంధించిన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు.

 

1) విషయభాగం: కాలుష్యానికి సంబంధించిన జ్ఞానం.
2) ప్రవర్తనా భాగం: నిజ జీవితంలో ఉపయోగించుకోవడం.

 

బోధనా లక్ష్యాల వర్గీకరణ
       N.S.S.E. (నేషనల్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్) వారు తమ 31వ వార్షిక పుస్తకంలో జీవశాస్త్రానికి సంబంధించిన 38 సాధారణీకరణాలను ప్రతిపాదించారు.
* అమెరికా లాంటి దేశాలు వీటిని 1946 వరకు అమలుపరిచాయి. ఇవి పురాతనమైనవి కావడంతో వీటి అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.
* 1956లో బ్లూమ్స్ చేసిన వర్గీకరణ బోధనా లక్ష్యాల్లో గొప్ప మలుపు.

బ్లూమ్స్ బోధనా లక్ష్యాల వర్గీకరణ
* బి.ఎస్. బ్లూమ్స్ 1956లో బోధనా లక్ష్యాలను వర్గీకరించారు.
* బోధనా లక్ష్యాలను వర్గీకరిస్తూ 'బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్' అనే పుస్తకాన్ని రాశారు.
* ఈ వర్గీకరణకు స్ఫూర్తి వృక్ష, జంతు వర్గీకరణ.
* దీనికి ఆధారం విద్యార్థి ప్రవర్తన.

 

బ్లూమ్స్ బోధనా లక్ష్యాలను 3 రంగాలుగా వర్గీకరించారు.
1) సంజ్ఞానాత్మక రంగం లేదా జ్ఞానాత్మక రంగం
2) భావావేశ రంగం లేదా భావ క్షేత్రం
3) మానసిక చలనాత్మక రంగం లేదా మానసిక చాలక క్షేత్రం

గమనిక: బ్లూమ్స్ ప్రతి రంగంలోని అంశాలను ఆధిపత్యశ్రేణి క్రమంలో అమర్చారు.
* ఆధిపత్య శ్రేణి అంటే సరళం నుంచి సంక్లిష్టానికి అమర్చడం.
* ప్రతి రంగంలోని మొదటి అంశం ప్రాథమికమైంది, సరళమైంది.
* ప్రతి రంగంలోని చివరి అంశం అత్యున్నతమైంది, సంక్లిష్టమైంది.

 

I. జ్ఞాన రంగం (సంజ్ఞానాత్మక రంగం)
* బి.ఎస్. బ్లూమ్స్ ఈ రంగంపై విశేష కృషి చేశారు.
* జ్ఞానరంగానికి సంబంధించిన అవయవం మెదడు.
* ఆలోచనలు, తెలివితేటలు, ప్రజ్ఞ, సమస్య పరిష్కార శక్తి ఈ రంగానికి సంబంధించిన అంశాలు.
* ఈ రంగంలోని లక్ష్యాలను తెలుసుకోవడానికి స్పష్టమైన నికషలు, పద్ధతులు ఉన్నాయి.
* ఈ రంగంలోని లక్ష్యాలను ఆరు వర్గాలుగా విభజించారు.
1) జ్ఞానం / పరిజ్ఞానం
2) అవగాహన / అవబోధం
3) అన్వయం / వినియోగం
4) విశ్లేషణ
5) సంశ్లేషణ / సంయోగం
6) మూల్యాంకనం
* 'వ్యక్తి ఏం చేయగలడు?' (can do) అనే అంశాన్ని జ్ఞానరంగం వివరిస్తుంది.

1. జ్ఞానం (పరిజ్ఞానం)
* ఇది మౌలికమైన, సులువైన లక్ష్యం.
* నేర్చుకున్న విషయాన్ని యథాతథంగా చెప్పడమే జ్ఞానం.
దీనిలో రెండు స్పష్టీకరణలు ఉన్నాయి.
ఎ) జ్ఞప్తికి తెచ్చుకోవడం (Recall)
బి) గుర్తించడం (Recognition)

ఎ) జ్ఞప్తికి తెచ్చుకోవడం: జ్ఞానేంద్రియాల సహాయం లేకుండా ఒక విషయాన్ని యథాతథంగా చెప్పడం.
బి) గుర్తించడం: జ్ఞానేంద్రియాల సహాయంతో ఒక విషయాన్ని యథాతథంగా చెప్పడం.
విద్యార్థి కింది అంశాలను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు లేదా గుర్తిస్తాడు.

* పేర్లు, తేదీలు
* శాస్త్రీయ పదజాలం
* యథార్థాలు
* భావనలు
* సిద్ధాంతాలు
* నిర్వచనాలు
* దృగ్విషయాలు
పై విషయాలను జ్ఞప్తికి తెచ్చుకున్న, గుర్తించగలిగినా జ్ఞాన లక్ష్యం నెరవేరినట్లే.
ఉదా: విద్యార్థి శ్వాసక్రియ నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు.

2. అవగాహన (అవబోధం)
* ఇది జ్ఞానరంగంలోని ఆధిపత్య శ్రేణిలో రెండో లక్ష్యం. జ్ఞానం కంటే క్లిష్టమైంది.
* విద్యార్థి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసి అర్థమయ్యే విధంగా మార్చుకోవడాన్ని అవగాహన అంటారు.
దీనిలో 3 సోపానాలు ఉన్నాయి.
a) అనువాదం (తర్జుమా చేయడం)
b) అర్థవివరణ (వ్యాఖ్యానించడం)
c) బహిర్షీశనం

 

a) అనువాదం: శాస్త్రీయ పదాలను, సమీకరణాలను, గుర్తులను, పట్టికలను, గ్రాఫ్‌లను అనువదిస్తారు.
 

b) అర్థవివరణ (వాఖ్యానించడం): వివిధ విషయాలను వర్ణించడం, సరిపోల్చడం, భేదాలను చెప్పడం, వివరించడం, ఉదహరించడం, దోషాలను గుర్తించడం లాంటివి చేస్తారు.
 

c) బహిర్షీశనం: తమ వద్ద ఉన్న విషయం ఆధారంగా ముందు జరగబోయే దాన్ని ఊహించగలుగుతారు.
* ఉపాధ్యాయుడు సోడియం అని చెప్తే, విద్యార్థి నోటు పుస్తకంలో Na అని రాసుకోవడాన్ని ఏమంటారు?
జ: అనువాదం.
* విద్యార్థి మైటోకాండ్రియా నిర్మాణాన్ని వర్ణించడాన్ని ఏమంటారు?
జ: అర్థ వివరణ
* దట్టంగా పట్టి ఉన్న మేఘాలను చూసి విద్యార్థి వర్షం పడుతుంది అని చెప్పడాన్ని ఏమంటారు?
జ: బహిర్షీశనం.

3. వినియోగం (అన్వయం)
* విద్యార్థి పొందిన జ్ఞానాన్ని అవగాహన చేసుకుని, నూతన పరిస్థితుల్లో ఉపయోగించడాన్ని వినియోగం అంటారు.
* ఇది జ్ఞానరంగంలోని ఆధిపత్య శ్రేణిలో మూడో లక్ష్యం.
* ఈ దశలో విద్యార్థి సమస్యలను స్వయంగా పరిష్కరించుకుంటాడు.
ఉదా: దోమ జీవిత చరిత్ర పాఠం విన్న విద్యార్థి దోమ తెరలను ఉపయోగించడం.

 

4. విశ్లేషణ
* ఇది జ్ఞానరంగంలోని ఆధిపత్య శ్రేణిలో నాలుగో లక్ష్యం.
* ఒక విషయాన్ని అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడమే విశ్లేషణ.
ఉదా: జీవావరణాన్ని ఆవరణ వ్యవస్థలు, రకాలు, ఆహారపు గొలుసు, ఆహారపు జాలకం, శక్తి ప్రసరణగా విడగొట్టడం.

 

5. సంశ్లేషణ
* ఇది జ్ఞానరంగంలోని ఆధిపత్య శ్రేణిలో అయిదో లక్ష్యం.
* ఇది విశ్లేషణకు వ్యతిరేకం.
* చిన్న భాగాలను ఒక పద్ధతిలో కలిపి వస్తువుగా లేదా విధానంగా రూపొందించడమే సంశ్లేషణ.
ఉదా: గాలి పీడనాన్ని అర్థం చేసుకొని గాలి మరలను తయారుచేయడం.

 

6. మూల్యాంకనం
* ఇది జ్ఞానరంగంలోని ఆధిపత్య శ్రేణిలో ఆరో, చివరి లక్ష్యం.
* ఇది అత్యున్నతమైంది, అత్యంత క్లిష్టమైంది.
* గ్రహించిన, సంశ్లేషించిన ఆధారాలను బట్టి నిర్ణయాలు తీసుకుని, తీర్పులు ఇవ్వడమే మూల్యాంకనం.

II. భావావేశ రంగం (భావక్షేత్రం)
* డేవిడ్ ఆర్ క్రాత్‌వెల్ ఈ రంగంపై విస్తృత పరిశోధన చేశారు.
* భావావేశ రంగానికి సంబంధించిన అవయవం హృదయం.
* భావావేశాలు (ఫీలింగ్స్), విలువలు, ఆదర్శాలు ఈ రంగానికి సంబంధించిన అంశాలు
* ఇది సాంఘికీకరణకు సంబంధించిన రంగం.
* 'వ్యక్తి ఏం చేస్తాడు?' (will do) అనే అంశాన్ని భావావేశ రంగం వివరిస్తుంది.
* 'అంతరవృద్ధి' అనే లక్షణంపై ఆధారపడి ఈ రంగాన్ని 5 వర్గాలుగా విభజించారు.
ఎ) గ్రహించడం
బి) ప్రతిస్పందించడం
సి) విలువ కట్టడం
డి) వ్యవస్థాపనం
ఈ) శీలస్థాపనం

 

ఎ) గ్రహించడం
    జీవశాస్త్రానికి సంబంధించిన సమాచార వనరులను గుర్తించడం, సమాచారం లభించే ప్రదేశాలను తెలుసుకోవడం, సమాచారాన్ని ప్రసారం చేసే మాధ్యమాలను తెలుసుకోవడం, వాటిని గ్రహించడం, గ్రహించడానికి ఇష్టపడటం, సంసిద్ధంగా ఉండటం, అవధానం కలిగి ఉండటం ఈ లక్ష్యంలోని అంశాలు.
ఉదా: విద్యార్థి పరిశుభ్రతకు సంబంధించిన సమాచారాన్ని ఉపాధ్యాయుడి నుంచి గ్రహిస్తాడు.

బి) ప్రతిస్పందించడం
* భావావేశ రంగంలో ఇది రెండో స్థాయి.
* దీనిలో విద్యార్థి ప్రేరణలకు ప్రతిస్పందనలు చూపుతాడు.
* ఈ దశలో ఆసక్తి, అభిలాష ఏర్పడుతుంది.
ఉదా: విద్యార్థి పరిశుభ్రతకు సంబంధించిన సమాచారాన్ని ఉపాధ్యాయుడి నుంచి గ్రహిస్తాడు.

 

సి) విలువ కట్టడం
* భావావేశ రంగంలో ఇది మూడో స్థాయి.
* నేర్చుకున్న భావాలు, అభిప్రాయాలు, విలువలు అంతర్లీనం చెంది, వాటికి కట్టుబడి ఉంటాయి.
* ఈ దశలో శాస్త్రీయ వైఖరులు ఏర్పడతాయి.
ఉదా: పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలనే వైఖరి.

డి) వ్యవస్థాపనం
* భావావేశ రంగంలో ఇది నాలుగో స్థాయి.
* ఇది మదింపు వ్యవస్థ.

 

ఈ) శీలస్థాపనం
* ఇది భావావేశ రంగంలోని చివరి అంశం.
* విలువలు, నమ్మకాలు, వైఖరులు, దృక్పథాలు విద్యార్థి ప్రవర్తనలో భాగంగా మారతాయి.

III. మానసిక చలనాత్మక రంగం (మానసిక చాలక క్షేత్రం)
* ఆర్.హెచ్. ధవే, ఎలిజిబెత్ సింప్సన్‌లు ఈ రంగంలో విస్తృత పరిశోధనలు చేశారు.
* కాళ్లు, చేతులు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన అవయవాలు.
* ఈ రంగంలో శారీరక చలనాలు ఉంటాయి.
* కండరాలకు, మెదడుకు మధ్య సమన్వయమే మానసిక చలనాత్మక రంగం.
* ఈ రంగంలో నైపుణ్యాలు అనే లక్ష్యాలు ఉంటాయి. దీన్ని 5 రకాలుగా వర్గీకరించారు.
ఎ) అనుకరణ
బి) హస్తలాఘవం / నిర్వహణ
సి) సునిశితత్వం
డి) సమన్వయం / ఉచ్ఛారణ
ఈ) సహజీకరణం/ స్వాభావీకరణం

 

ఎ) అనుకరణం
* నైపుణ్యాన్ని సాధించడానికి ఇది తొలి మెట్టు.
* విద్యార్థి జ్ఞానేంద్రియాల ద్వారా అనుకరిస్తాడు.
* ఈ దశలో విద్యార్థి చేసే పని కష్టతరమై పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

బి) హస్తలాఘవం
విద్యార్థి కొన్ని సూచనల ద్వారా పై అనుకరణను ఉపయోగించి ఒక పద్ధతి ప్రకారం పని చేస్తాడు.
* ఈ దశలో చేసే పనిపై నియంత్రణ/ అదుపు ఉంటుంది.

 

సి) సునిశితత్వం
* పనిని సరిగ్గా, కచ్చితంగా చేయడమే సునిశితత్వం.
* తప్పులను నియంత్రిస్తూ, పొరపాట్లను తొలగిస్తూ నిర్దిష్టంగా, కచ్చితంగా ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించడం.

 

డి) సమన్వయం
ఒక కృత్యాన్ని నిర్వహించాలంటే, దానికి సంబంధించిన ఉపకృత్యాలను అవసరాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి సమన్వయం చేయడం.

 

ఈ) స్వాభావీకరణం
* పనిని సులభంగా, సహజంగా, అనాలోచితంగా, అతి తక్కువ ప్రయాసతో చేయడం.
* నైపుణ్యం వ్యక్తి ప్రదర్శనలో భాగంగా ఇమిడిపోతుంది. అనేక నైపుణ్యాలు కలిసి వ్యక్తిలో ప్రావీణ్యతను తీసుకువస్తాయి. ఈ స్థాయినే సహజీకరణం లేదా స్వాభావీకరణం అంటారు.
పై దశలన్నింటినీ ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం.
1. కారును నడిపే వ్యక్తిని చూసి, ఎలా నడుపుతున్నాడో పరిశీలించి, తర్వాత అనుకరించడం. - అనుకరణ

2. అనుకరణలో గేర్లు సరిగ్గా వేయలేరు. సూచనల ప్రకారం స్టీరింగును నియంత్రించడం, గేర్లు మార్చడం ద్వారా సాధన చేస్తారు. - హస్తలాఘవం
3. సాధన వల్ల స్టీరింగును నియంత్రించడం, దూరాన్ని అంచనా వేయడంలో కచ్చితత్వం వస్తుంది. - సునిశితత్వం
4. స్టీరింగును నియంత్రిస్తూ, గేర్లు మార్చేటప్పుడు తడబడటం, కారుకు ఎదురుగా వస్తున్న జనాలను తప్పించుకోవడం కష్టం అవుతున్న సందర్భంలో ఒకదానితో మరొకదాన్ని సమన్వయం చేసుకోవడం. - సమన్వయం
5. కారుని ఎలాంటి తడబాటు లేకుండా అన్ని కృత్యాలను సహజంగా, కచ్చితంగా, తేలికగా, రద్దీలోనూ సునాయాసంగా నడపడం. - సహజీకరణం.
పై మూడు రంగాలను సంక్షిప్తంగా కిందివిధంగా తెలియజేయవచ్చు.

బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లోని పరిమితులు
* బ్లూమ్స్ భావావేశ, మానసిక చలనాత్మక రంగాల్లో కేవలం జ్ఞానరంగాన్ని మాత్రమే విపులంగా వివరించారు.
* భావావేశ, మానసిక చలనాత్మక రంగాలను స్థూలంగా వివరించారు.

 

ఆర్నెల్: బ్లూమ్స్ వర్గీకరణకు నేటికీ ప్రత్యామ్నాయం లేదు కానీ విలువల వర్గీకరణ సంతృప్తిగా లేదు.
 

బోధనా లక్ష్యాలు - స్పష్టీకరణలు రాయడం

బోధనా లక్ష్యం:
* విద్యార్థి ప్రవర్తనలో ఆశించిన, వాంఛనీయ లేదా కోరుకున్న మార్పు.
ఉదా: 1) కణం అనే పదాన్ని విద్యార్థి అవగాహన చేసుకుంటాడు.
2) విద్యార్థి కాలుష్యానికి సంబంధించిన జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకుంటాడు.
3) విద్యార్థి ప్రత్యుత్పత్తి గురించిన జ్ఞానాన్ని సముపార్జిస్తాడు.

 

స్పష్టీకరణ
   ఒక అధ్యాయాన్ని అభ్యసించిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన, నిర్దిష్టమైన ప్రవర్తనా రూపంలో వ్యక్తం చేసేవే ప్రవర్తనా లక్ష్యాలు లేదా స్పష్టీకరణలు.

 

స్పష్టీకరణ - లక్షణాలు
* విద్యార్థి ప్రవర్తనా రూపంలో ఉండాలి.
* అర్థవంతంగా, నిర్దిష్టంగా, స్పష్టంగా ఉండాలి.

* ప్రవర్తనలో పరిశీలించదగినవిగా ఉండాలి.
ఉదా: విద్యార్థి సోడియం సంకేతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం.
* విద్యార్థి కీటకాహార మొక్కలకు ఉదాహరణలు ఇస్తాడు.
* విద్యార్థి వృక్షకణానికి, జంతుకణానికి మధ్య తేడాలు చెప్తాడు.

 

III. జ్ఞానరంగం ప్రవర్తనా లక్ష్యాలు
1. జ్ఞానం: దీనిలో రెండు స్పష్టీకరణలు ఉన్నాయి.
ఎ) జ్ఞప్తికి తెచ్చుకోవడం
బి) గుర్తించడం

 

ఎ) జ్ఞప్తికి తెచ్చుకోవడం: విద్యార్థి జ్ఞానేంద్రియాల ప్రమేయం లేకుండానే ఒక విషయాన్ని యథాతథంగా చెప్తాడు.
ఉదా: విద్యార్థి క్లోరినేషన్ నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు.
బి) విద్యార్థి జ్ఞానేంద్రియాల ద్వారా ఒక విషయాన్ని యథాతథంగా గుర్తిస్తాడు.
ఉదా:
1. టెట్రాసైక్లిన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త?
1) ఫ్లెమింగ్ 2) వై.వి. సుబ్బారావు 3) ఎడిసన్ 4) జె.సి. బోస్
2. విటమిన్ 'డి' రసాయన నామం?
1) రెటినాల్ 2) కాల్సిఫెరాల్ 3) టోకోఫెరాల్ 4) ఫిల్లోక్వినోన్
3. రక్తం ఎక్కడ శుభ్రపడుతుంది?
1) మూత్రపిండాలు 2) ఊపిరితిత్తులు 3) గుండె 4) కాలేయం
జవాబులు: 1-2; 2-2; 3-3.
పై ప్రశ్నల ద్వారా ఏ లక్ష్యాన్ని కొలుస్తాం?
జవాబు: జ్ఞానం (స్పష్టీకరణ - గుర్తించడం)

2. అవగాహన - స్పష్టీకరణలు
ఎ) అనువాదం/ తర్జుమా చేయడం:
 జీవశాస్త్ర సంబంధిత పదాలను, గుర్తులను, పట్టికలను పుష్పక్రమ సూత్రాలను, దంత సూత్రాలను మాటల నుంచి సూత్రంలోకి, సూత్రం నుంచి మాటల్లోకి అనువదించడం.
ఉదా: సోడియం, Cl చర్య జరిపి సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది అని ఉపాధ్యాయుడు చెప్తుంటే విద్యార్థి తన నోటు పుస్తకంలో Na + Cl   Nacగా రాసుకున్నాడు.

బి) ఉదాహరణలు ఇవ్వడం: జీవశాస్త్ర భావనలకు, సిద్ధాంతాలకు, నిర్వచనాలకు, ప్రక్రియలకు ఉదాహరణలు ఇస్తాడు.
ఉదా: విద్యార్థి నిశాచర జీవులకు ఉదాహరణలు ఇస్తాడు.

 

సి) అర్థ వివరణ ఇవ్వడం: జీవశాస్త్ర సిద్ధాంతాలకు, భావనలకు, పారిభాషిక పదాలకు, పద్ధతులకు అర్థ వివరణ ఇస్తాడు.
ఉదా: విద్యార్థి జీవ పరిణామ సిద్ధాంతాన్ని వివరిస్తాడు.

 

డి) తప్పొప్పులను కనుక్కోవడం: జీవశాస్త్ర భావనలు, సూత్రాలు, సాధారణీకరణాల్లోని తప్పొప్పులను కనుక్కుంటాడు.
ఉదా: పుపుస సిరల్లో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది అనే వాక్యంలోని దోషాన్ని విద్యార్థి గుర్తిస్తాడు.

ఈ) భేదాలను/ తేడాలను గుర్తించడం: దగ్గర సంబంధం ఉన్న కొన్ని జీవశాస్త్ర భాగాలు, ప్రక్రియలు, భావనల మధ్య ఉన్న తేడాను గుర్తిస్తాడు.
ఉదా: విద్యార్థి ధమనులు, సిరలకు మధ్య తేడాలను గుర్తిస్తాడు.

 

ఎఫ్) వర్గీకరించడం: విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించిన భావనలను, యథార్థాలను, సూత్రాలను, నియమాలను, నిర్వచనాలను, జీవులను, ప్రక్రియలను, విధానాలను, పద్ధతులను వర్గీకరిస్తాడు.
ఉదా: విటమిన్‌ల ద్రావణీయతను బట్టి విద్యార్థి నీటిలో కరిగే విటమిన్‌లు, కొవ్వులో కరిగే విటమిన్‌లుగా వర్గీకరిస్తాడు.

 

జి) విశదీకరించడం: విద్యార్థి వివిధ చిత్రాలను, బొమ్మలను విశదీకరిస్తాడు.
ఉదా: విద్యార్థి మైటోకాండ్రియా పటాన్ని విశదీకరించాడు.

 

హెచ్) పోలికలు చెప్పడం: జీవశాస్త్ర సత్యాలను, భావనలను, ప్రక్రియలను ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూస్తాడు.
ఉదా: విద్యార్థి మానవుడి కంటిలోని కనుపాప తారకల పనిని కెమెరాలోని డయాఫ్రంతో పోలుస్తాడు.

 

ఐ) బహిర్షీశనం చేయడం: పాత గ్రాఫ్‌లు, సేకరించిన విషయాల ఆధారంగా వాతావరణ పరిస్థితిని బహిర్షీశనం చేస్తాడు.
ఉదా: విద్యార్థి దట్టంగా పట్టి ఉన్న మేఘాలను చూసి వర్షం కురుస్తుందని చెప్తాడు.

 

జె) భూసారం, వర్షపాత పరిస్థితుల జాబితాను పరిశీలించి, ఆ నేల పంటకు అనువైంది, లేనిదీ అంచనా వేస్తాడు.
 

3) వినియోగం - స్పష్టీకరణలు
ఎ) మంచి ఆరోగ్య లక్షణాలు, ప్రథమ చికిత్స పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ పద్ధతులు మొదలైన వాటిని నిజజీవితానికి అన్వయించుకుని పాటిస్తాడు.
ఉదా: విద్యార్థి కాలుష్య నివారణకు మొక్కలు నాటుతాడు.

బి) జీవకారుణ్యం, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వాటిలో సొంత
ఉదా: విద్యార్థి, కృత్రిమ ఎరువుల స్థానంలో సహజ ఎరువులను వాడాలని నిర్ణయించుకుంటాడు.
సి) శాస్త్రీయ పరిజ్ఞానం తన జీవన విధానానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటాడు.
ఉదా: విద్యార్థి వర్షాకాలంలో దోమతెరలను వాడాలని నిర్ణయించుకుంటాడు.
డి) జీవశాస్త్ర దృగ్విషయాలకు కారణాలను తెలియజేస్తాడు.
ఉదా: గ్లోబల్ వార్మింగ్ ఏర్పడటానికి గల కారణాన్ని విద్యార్థి తెలియజేస్తాడు.
ఈ) కారణానికి, ఫలితానికి మధ్య పరస్పర సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు.
ఉదా: కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుదలకు, గ్లోబల్ వార్మింగ్ ఏర్పడటానికి మధ్య సంబంధాన్ని విద్యార్థి గుర్తిస్తాడు.
జ్ఞానరంగంలోని స్పష్టీకరణలు సంక్షిప్తంగా

IV. భావావేశ రంగం
ఈ రంగంలో అభిరుచి (ఆసక్తి), శాస్త్రీయ వైఖరి, అభినందన అనే లక్ష్యాలు ఉన్నాయి.

 

1) అభిరుచి/ఆసక్తి
* విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించిన శాస్త్రీయ, స్వాభావిక దృగ్విషయాల పట్ల అభిరుచిని పెంపొందించుకున్నాడు.
* ఒక పనిని తరచుగా చేస్తే దానిపై అతడికి ఆసక్తి ఉందని అర్థం.

 

అభిరుచి/ ఆసక్తి స్పష్టీకరణలు
* విద్యార్థి తనకు తాను జీవశాస్త్ర సంబంధిత నవలలు, కథలు, పుస్తకాలు, వ్యాసాలు చదువుతాడు.
ఉదా: విద్యార్థి డిస్కవరీ, విజ్‌డం, చెకుముఖి లాంటి శాస్త్ర సంబంధ పుస్తకాలు చదువుతాడు.
* టీవీలో జీవశాస్త్ర సంబంధిత ప్రసారాలను తరచుగా చూస్తాడు.
ఉదా: టీవీలో యానిమల్ ప్లానెట్, డిస్కవరీ, నేషనల్ జాగ్రఫీ ఛానళ్లను చూస్తాడు.
* శాస్త్రజ్ఞుల జీవిత కథలను చదువుతాడు.
ఉదా: లామార్క్, డార్విన్, అరిస్టాటిల్ జీవిత చరిత్రలను చదువుతాడు.
* ఇంటర్నెట్ ద్వారా తన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటాడు.
ఉదా: స్టెమ్‌సెల్ టెక్నాలజీ ఎలా జరుగుతుందో విద్యార్థి ఇంటర్‌నెట్ ద్వారా తెలుసుకుంటాడు.
* వక్తృత్వ పోటీలు, ప్రాజెక్టులు, క్విజ్‌ల్లో పాల్గొంటాడు.
ఉదా: పర్యావరణం - కాలుష్యంపై నిర్వహించిన క్విజ్‌లో పాల్గొంటాడు.

* పాఠశాలల్లో జరిగే సైన్స్ ఫెయిర్‌లలో పాల్గొంటాడు.
ఉదా: విద్యార్థి, ఫిబ్రవరి 28న నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటాడు.
* బడితోట, మ్యూజియం, అక్వేరియంల నిర్వహణపై శ్రద్ధ వహిస్తాడు.

 

2) శాస్త్రీయ దృక్పథం/ శాస్త్రీయ వైఖరి
* శాస్త్రీయ పద్ధతిని ఆమోదించడం వల్ల విద్యార్థిలో శాస్త్రీయ వైఖరి పెరుగుతుంది.
* శాస్త్రవేత్తకు ఉండే వైఖరినే శాస్త్రీయ వైఖరి అంటారు.

 

శాస్త్రీయ వైఖరిలోని స్పష్టీకరణలు
* మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తాడు.
ఉదా: విద్యార్థి పిల్లి ఎదురొచ్చినప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
* సరైన సాక్ష్యాధారాలతోనే ఒక నిర్ణయానికి వస్తాడు.
* విద్యార్థి పట్టుదలను ప్రదర్శిస్తాడు.
ఉదా: క్లోనింగ్ ప్రక్రియను, గొర్రె పిల్ల డాలీ జీవిత చరిత్రను తెలుసుకోవడంలో విద్యార్థి పట్టుదలను ప్రదర్శిస్తాడు.
* నిష్పక్షపాత వైఖరిని కలిగి ఉంటాడు.
ఉదా: విద్యార్థి 'నేల - రకాలు' ప్రాజెక్టు నివేదిక తయారు చేసేటప్పుడు, తోటి విద్యార్థి తన కంటే ఎక్కువ ప్రతిభ చూపినప్పుడు దాన్ని అంగీకరిస్తాడు.

* నిదర్శనాలున్న సత్యాలను మాత్రమే ఒప్పుకుంటాడు.
* తన వ్యక్తిగత నమ్మకాలను పక్కనపెట్టి కొత్త ఆలోచనలను, ప్రయోగాలను పరిశీలిస్తాడు.
* పనిని దైవంగా భావిస్తాడు.

 

3) అభినందన/ ప్రశంస/ ప్రశంసనీయత/ పొగడ్త/ కొనియాడుట - స్పష్టీకరణలు
* జీవి పరిణామంలోని ఆంతరంగిక సంబంధాలను గుర్తించి ప్రశంసిస్తాడు.
ఉదా: జీవ పరిణామాన్ని, జాతుల ఉత్పత్తిని విద్యార్థి ప్రశంసిస్తాడు.
* భిన్నత్వంలో ఏకత్వం ప్రాముఖ్యతను అభినందిస్తాడు.
ఉదా: మొక్కల బాహ్య/ అంతర నిర్మాణంలో ఎంత వైవిధ్యం ఉన్నప్పటికీ వాటి జీవన విధానం ఒకటే అని అభినందిస్తాడు.
* శాస్త్రవేత్తల అన్వేషణలను, సామర్థ్యాలను గుర్తించి వారిని మార్గదర్శకంగా భావిస్తాడు.
ఉదా: 1. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చేసిన సేవలను ప్రశంసిస్తాడు.
          2. టెట్రాసైక్లిన్ గొప్పతనాన్ని విద్యార్థి అభినందిస్తాడు.

 

V. మానసిక చలనాత్మక రంగం
* ఈ రంగం ఏకైక లక్ష్యం నైపుణ్యం.
* ఒక పనిని వేగంగా, కచ్చితంగా, అందంగా చేయడమే నైపుణ్యం.

1) పటాలు గీయడం/ చిత్ర లేఖన నైపుణ్యం - స్పష్టీకరణలు
జీవశాస్త్రానికి సంబంధించిన పటాలను, పరికరాలను, మాదిరులను చూడముచ్చటగా, కచ్చితంగా చిత్రిస్తాడు.
ఉదా: విద్యార్థి నెఫ్రాన్ పటంలోని భాగాలను సరైన నిష్పత్తిలో గీసి వరుస క్రమంలో గుర్తిస్తాడు.
* చిత్రాలను తగిన వేగంతో గీస్తాడు.
ఉదా: విద్యార్థి నెఫ్రాన్ పటాన్ని తగిన వేగంతో గీస్తాడు.
* అసంపూర్ణ చిత్రాలను పూర్తి చేస్తాడు.
ఉదా: అసంపూర్ణంగా ఉన్న నెఫ్రాన్ పటాన్ని విద్యార్థి పూర్తి చేస్తాడు.

 

2) హస్తలాఘవ నైపుణ్యం (ఇది ప్రయోగాలకు సంబంధించింది) - స్పష్టీకరణలు
* విద్యార్థి శాస్త్రీయ పరికరాలను, ప్రయోగానికి ముందు, తర్వాత జాగ్రత్తగా శుభ్రపరుస్తాడు.
ఉదా: విద్యార్థి 'ఆమ్లాలు క్షారాలు' ప్రయోగానికి ముందు, తర్వాత పరీక్ష నాళికలను జాగ్రత్తగా శుభ్రపరుస్తాడు. పరికరాలను క్రమపద్ధతిలో అమరుస్తాడు.
* వీలైనంత వరకు ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేస్తాడు.
ఉదా: బొద్దింక ప్రవర్తనను అధ్యయనం చేయడానికి కార్డుబోర్డుతో 'ఛాయిస్ బాక్స్‌'ను తయారు చేస్తాడు.

 

3) సేకరించడం, భద్రపరచడంలో నైపుణ్యం - స్పష్టీకరణలు
* విద్యార్థి వృక్ష, జంతు ఆవాసాలను తెలుసుకుని వాటిని సేకరిస్తాడు.
ఉదా: విద్యార్థి గిజిగాడు గూడును సేకరిస్తాడు.

* జంతు సేకరణకు తగిన పరికరాలను, పద్ధతులను ఉపయోగిస్తాడు.
ఉదా: కీటకాలను సేకరించడానికి కీటక వలను ఉపయోగిస్తాడు.

 

4) పరిశీలనా నైపుణ్యం - స్పష్టీకరణలు
* జీవావరణాన్ని, నమూనాలను, దృగ్విషయాలను నిశితంగా పరిశీలిస్తాడు.
ఉదా: విద్యార్థి సీతాకోకచిలుక జీవిత చక్రాన్ని నిశితంగా పరిశీలిస్తాడు.
* పరికరాలు, నిర్మాణాలు, భాగాలు లాంటి వాటిని కచ్చితంగా వివేచన చేస్తాడు.

 

5) నివేదనా నైపుణ్యం (Reporting Skill) - స్పష్టీకరణలు
* విద్యార్థి తన ఆలోచనలను, అభిప్రాయాలను స్పష్టంగా వరుస క్రమంలో అందిస్తాడు.
ఉదా: విద్యార్థి 'నేలలు రకాలు - విత్తనాలు మొలకెత్తడం' ప్రయోగ ఫలితాలను స్పష్టంగా, క్రమంగా నివేదిస్తాడు.
* విషయాన్ని తార్కిక క్రమంలో అమర్చి సమర్పిస్తాడు.
* వివరాలు సేకరించేటప్పుడు ఏవి ముఖ్యమైనవో గ్రహించి వాటికి ప్రాధాన్యం ఇస్తాడు.

 

వివిధ స్థాయిల్లో జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు (వివిధ కమిటీల రిపోర్టుల ఆధారంగా)
I. All India Seminar on Teaching of Sciences:
          
1956లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ప్రచురించిన జాతీయ స్థాయి సైన్స్ బోధనా సదస్సు ప్రకారం లక్ష్యాలు, వివిధ స్థాయిలు కింది విధంగా ఉన్నాయి.

ఎ) ప్రాథమిక స్థాయి
1) విద్యార్థి తన చుట్టూ ఉన్న పరిసరాలపై ఆసక్తి పెంపొందించుకోవాలి.
2) ప్రకృతిపై ప్రేమ, ఆసక్తి పెంపొందించుకోవాలి.
3) పరిశీలన, శాస్త్రీయ ఆలోచన, అన్వేషణ ద్వారా నేర్చుకోవడంలో తర్ఫీదు పొందాలి.
4) ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి.

 

బి) మాధ్యమిక స్థాయి
పైన చెప్పిన లక్ష్యాలన్నిటితో పాటు కింది వాటిని కూడా సాధించాలి.
1) ముందు స్థాయిలో జీవశాస్త్ర అభ్యసనానికి కావాల్సిన పునాదిని ఏర్పరుచుకోవాలి.
2) మన జీవన విధానంపై సైన్స్ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి.
3) శాస్త్రీయ విషయాలను తమకు ఇష్టమైన క్రీడగా రూపొందించుకోవాలి.
4) శాస్త్రజ్ఞుల జీవితాలు, వారు కనుక్కున్న విషయాలపై దొరికిన కథలను విద్యార్థులు చదివేలా ఉత్తేజపరచాలి.

 

సి) సెకండరీ స్థాయి
విద్యార్థి తన చుట్టూ ఉన్న పరిసరాలకు తగిన రీతిలో తన జీవితాన్ని క్రమపరచుకోవాలి.
1) సమాజంలో తాను బతకడానికి కావాల్సిన విజ్ఞాన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.
2) శాస్త్రీయ పద్ధతికి సంబంధించిన అవగాహన కలిగి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలి.

II. కొఠారీ కమిషన్ (1964 - 66) సూచించిన లక్ష్యాలు
ఎ) నిమ్న, ప్రాథమిక దశలో లక్ష్యాలు

1) విద్యార్థి సాంఘిక, భౌతిక, జీవ వాతావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
2) పరిశీలనా దృష్టి పెంపొందించాలి.
3) విద్యార్థికి 4వ తరగతి నుంచే రోమన్ ఆల్ఫబెట్స్ నేర్పించాలి.

 

బి) ఉన్నత ప్రాథమిక దశ
1) జ్ఞాన సముపార్జనతో పాటు తార్కిక ఆలోచన చేసి సాధారణీకరణాలు జరిపి, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తర్ఫీదును ఇవ్వాలి.
2) జీవ, భౌతిక, రసాయన శాస్త్రాలు, భూ శాస్త్రాలను పాఠ్యభాగాలుగా బోధించాలి.

 

సి) సెకండరీ స్థాయి
1) ఉన్నత విద్యను అభ్యసించడానికి కావాల్సిన మానసిక తర్ఫీదును ఇవ్వాలి.
2) జీవ, భౌతిక, రసాయన శాస్త్రాలు, భూగోళ, విజ్ఞాన శాస్త్రాలను ఆవశ్యక భాగాలుగా నేర్పించాలి.

 

III. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ (1977)
* గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని కొఠారీ కమిషన్ కూడా అంగీకరించిందని, అందుకే 'పని-విద్య'కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
* దీని ప్రకారం SUPW అన్ని స్థాయిల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు.

IV. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ (1986)
* జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం కింది లక్ష్యాలను పునరుద్ఘాటించారు.
1) విద్యార్థులు ముఖ్యమైన భావనలను నేర్చుకోవడం ద్వారా సమస్య పరిష్కారంతో పాటు సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందుతుంది.
2) ఈ భావనలు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అన్ని రంగాలకు వర్తించి ఉండాలి.
3) విద్యార్థిలో నిర్దిష్టమైన సామర్థ్యాలను, విలువలను పెంచేదిగా ఉండాలి.
4) అన్వేషణా మనస్తత్వం, సృజనాత్మకత, ఆబ్జెక్టివిటీ, ప్రశ్నించే ధైర్యం, ప్రకృతిపై ప్రత్యేక మమకారం ఉండాలి.


రచయిత: రాధాకృష్ణ
 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌