• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర స్వభావం

'సైన్స్' అనే ఇంగ్లిష్ పదం 'సైన్షియా', 'సిరే' అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఈ పదాలకు 'జ్ఞానం' అని అర్థం.
* 'విజ్ఞానశాస్త్ర అన్వేషణకు యావత్ భౌతికవిశ్వం ముడి పదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, పూర్వచరిత్ర, జీవ ప్రపంచం కూడా దానిలోని భాగమే'. - కార్ల్ పియర్‌సన్
* 'ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమైన సంచిత, క్రమీకృత అభ్యసనమే విజ్ఞానశాస్త్రం'. - కొలంబియా ఎన్‌సైక్లోపీడియా
* 'విజ్ఞానశాస్త్రం ఒక పరిశోధనా విభాగం'. - ఐన్‌స్టీన్
* 'విజ్ఞానశాస్త్రం అంటే ఒక మాపనం. దీని వల్ల మనకు నిర్దిష్టమైన గణనలు, ఫలితాలు లభించడంతో పాటు ఒక విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా వివరించడానికి వీలవుతుంది'. - అర్హీనియస్
* 'ప్రయోగాల పరిశీలనల నుంచి అభివృద్ధి చెంది, ప్రయోగాత్మక పరీక్షలు, పరిశీలనలకు ఫలితాలనిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగిన భావనా పథకాల శ్రేణులే విజ్ఞానశాస్త్రం'. - జేమ్స్ బి. కొనాంట్
* 'విజ్ఞానశాస్త్రం అనేది సత్యాలు అనే రాళ్లతో నిర్మించినది. అయితే సత్యాలు పోగుపడటం వల్ల రాళ్ల కుప్పకు, సైన్స్‌కు పెద్ద తేడా ఉండదు'. - హెన్రీ పాయింకర్

 

విజ్ఞానశాస్త్ర ద్రవ్యాత్మక లేదా విషయాత్మక నిర్మాణం
యథార్థం:
ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే యథార్థం. (లేదా) సూటిగా పరిశీలించదగిన, ప్రదర్శించగల మారని వాస్తవమే 'యథార్థం'.
భావన: ఒక వస్తువు, సంకేతం లేదా పరిస్థితి సహాయంతో ఏదైనా అంశానికి సంబంధించిన సాధారణ భావం లేదా అర్థాన్ని వ్యక్తిలో ఏర్పరచడాన్నే 'భావన' అంటారు.
* జె.డి. నోవాక్ ప్రకారం 'ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞానశాస్త్ర భావనలు'.


సాధారణీకరణం: యథార్థాల మధ్య సంబంధాల వివరణే 'సాధారణీకరణం'. (లేదా) పరస్పర సంబంధం కలిగిన సత్యాల మధ్య సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించేదే 'సాధారణీకరణం'.
ప్రాకల్పన: ఒక దృశ్యం గురించి తాత్కాలికంగా ఆమోదించిన ప్రవచనం (లేదా) వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రాతిపదికగా చేసుకున్న ఊహే 'ప్రాకల్పన'.
'ప్రాకల్పన ఒక అభ్యుపగమం లేదా ప్రతిజ్ఞావాక్యం' - జి.జె. మాలి


ప్రాకల్పన రకాలు:
నల్ ప్రాకల్పన:
రెండు విషయాల మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిపేది.
ప్రకటనాత్మక ప్రాకల్పన: రెండు విషయాల మధ్య సంబంధం ఉందని చెప్పేది.
ప్రాగుక్తి ప్రాకల్పన: భవిష్యత్తులో ఏం జరగుతుందో ఊహించేదే ప్రాగుక్తి ప్రాకల్పన.
ప్రశ్న ప్రాకల్పన: ప్రశ్న రూపంలో ఉండే ప్రాకల్పన.

 

సిద్ధాంతం: నిరూపించలేకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరించే ఒక ప్రతిపాదనను 'సిద్ధాంతం' అంటారు. శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్నాల ఫలితాలే 'సిద్ధాంతాలు'.
* సిద్ధాంతాలు సూత్రాలను వివరిస్తాయి. ఇవి రెండు లేదా అంతకంటే ఎక్కువ పరిశీలనలను తెలియజేస్తాయి.

 

సూత్రం: ఒక కృత్యం లేదా తార్కికత్వానికి ఆధారమైన ప్రాథమిక సత్యాన్ని 'సూత్రం' అంటారు.
 

నియమం: విస్తారంగా పరీక్షించి, రూఢీ అయ్యే నిశ్చయమైన సిద్ధాంతాన్ని 'నియమం' అంటారు. ఇది సప్రమాణతను కలిగి, రెండు యథార్థాల మధ్య గల సంబంధాన్ని, దాని స్వభావాన్ని వివరిస్తుంది.
 

అనుమతి/ రాబట్టడం: ఒక విషయాన్ని యథార్థాల నుంచి తార్కికంగా పరిశీలన, ప్రయోగాల ద్వారా నిగమనం చేయడమే 'అనుమతి'.
సంశ్లేషణాత్మక (లేదా) ప్రక్రియాత్మక నిర్మాణం:

 

విజ్ఞానశాస్త్ర ప్రక్రియలు
1) పరిశీలన: ముఖ్యమైన ప్రాథమిక నైపుణ్యం.
2) మాపనం/ కొలవడం: కొలవడం ఆధారంగా వస్తువును పోల్చవచ్చు.
3) వర్గీకరించడం: పోల్చడం ద్వారా భేదాలను వర్గీకరిస్తారు.
4) ప్రయోగం చేయడం: అవసరమైన వస్తువుల సహాయంతో ప్రత్యక్షంగా పరిశోధించడం లేదా పరీక్షించడం.
5) ప్రాకల్పనలను రూపొందించడం: ఒక సంఘటన లేదా పరిశీలన గురించి సకారణంగా ఊహించడం.
6) ప్రాగుక్తీకరించడం: అందుబాటులో ఉన్న పరిస్థితులను, సమాచారాన్ని పరిశీలించి, పరీక్షించి, విశ్లేషించి ఒక ఫలితాన్ని చెప్పడమే 'నిర్ధారణ'.
7) దత్తాంశాన్ని ప్రతిక్షేపించడం: శాస్త్రీయ విశ్లేషణకు దోహదపడే దత్తాంశాన్ని పట్టికల రూపంలో లేదా గ్రాఫ్‌ల రూపంలో ప్రతిక్షేపించడం.
8) నమూనాలను తయారు చేయడం: హస్తలాఘవం, పరిశీలన లాంటి నైపుణ్యాలను పెంపొందించడం.
9) సమయం-స్థలం-సంబంధం: సమయం, స్థలానికి సంబంధించిన అంశాలను తెలియజేసేది.
10) భావ ప్రసారం/ సమాచార ప్రసారం: ఇది విషయాల్ని స్పష్టంగా వివరించడానికి అవసరమైన నైపుణ్యం. ఇది రాతరూపంలో, శబ్దాల(మాటల) రూపంలో లేదా చిత్రాల రూపంలో ఉంటుంది.

 

శాస్త్రీయ విచారణ: ఏ విషయాన్నైనా తెలుసుకోవడానికి స్వయంగా చేసే ప్రయత్నమే 'విచారణ'. ఒక వ్యక్తి నియత అభ్యసన ప్రక్రియలో ఒక ప్రత్యేక అంశం గురించి జ్ఞానాన్ని పొందిన తరవాత సంక్లిష్ట ఆలోచనా విధానంలో క్రమబద్ధ, పరిశోధనాత్మక నిష్పాదన అనే సామర్థ్యాన్ని 'శాస్త్రీయ విచారణ' అంటారు.
పరిశోధనా వైఖరులు: పరిశోధకుడిలో ఉండవలసిన పరిశోధనా వైఖరులను తెలియజేసేది. ఉదాహరణకు లక్ష్యాత్మకతను, విశాల దృక్పథాన్ని కలిగి ఉండటం, సహనశీలురుగా ఉండటం.

 

విజ్ఞానశాస్త్రం - భావవాదం - సమాజం
శాస్త్రజ్ఞులు తమ ప్రతిపాదనలను రెండు ప్రాథమిక ఉపగమాలుగా తెలియజేశారు. అవి:
మెటాఫిజికల్ ఉపగమం: ప్రాథమిక భావనలు ఎప్పటికీ మార్పు చెందవని తెలిపేది.
డయలెక్టిక్ ఉపగమం: భావనలు లేదా సిద్ధాంతాలు నిరంతరం మార్పు చెందుతూ, నూతన ఆలోచనా ధోరణిని రేకెత్తించేది.
* పదార్థం కంటే చైతన్యం ముఖ్యమని తెలియజేస్తుంది భావవాదం.
* విజ్ఞానశాస్త్రం భౌతిక ప్రపంచానికి ప్రతిబింబం అయితే భావవాదం ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబం.
* 'దేశ కాలపరిస్థితులు ఆధ్యాత్మికత యొక్క నిత్య సత్యాలు' - హర్నే
* భావవాదం విజ్ఞానశాస్త్రం కంటే మానవశాస్త్రానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.
* మానవుడి ఆలోచనా సరళినే భావవాదం అంటున్నారు. ఆ ఆలోచనా సరళిని తెలియజేసే ప్రక్రియే విజ్ఞానశాస్త్రం.
* అనుభవాత్మకమైన సైన్స్‌ను ఆధారంగా చేసుకుని విశ్వాన్ని, ప్రకృతిని గురించి అధ్యయనం చేసి, ప్రకృతి సూత్రాలను కనుక్కోవడానికి ప్రయత్నించేదే భావవాదం.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌