• facebook
  • whatsapp
  • telegram

మన విశ్వం (Our Universe)

కీలకభావనలు
* నక్షత్రాలుండే పెద్ద గుంపులను (లక్షలు, కోట్ల సంఖ్యలో ఉండే నక్షత్రాలు) 'గెలాక్సీ'లు అంటారు. అనేక కోట్ల గెలాక్సీలు మన విశ్వంలో ఉన్నాయి.
* పాలపుంత (Milky Way) గెలాక్సీకి చెందిన అనేక నక్షత్రాల్లో సూర్యుడు కూడా ఒక నక్షత్రం.
* ప్రతి గెలాక్సీ కూడా అనేక కోట్ల నక్షత్రాలను కలిగి ఉంటుంది. కొన్ని నక్షత్రాలు సూర్యుడిలా వాటి చుట్టూ అవి తిరుగుతూ ఉండే గ్రహాల సముదాయాన్ని కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రహాలకు మళ్లీ వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఉంటాయి. వీటన్నింటినీ మన విశ్వ కుటుంబం (Family of Universe) అంటారు.
 

విశ్వం చాలా విశాలమైంది
   
మనం భూమిని ఒక చిన్న గులక రాయితో పోలిస్తే, సూర్యుడు ఒక పెద్ద బంతి పరిమాణంలో ఉంటాడు. కొన్ని నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దగా ఉంటాయి. మనకు అతి సమీపాన ఉన్న నక్షత్రమైన సూర్యుడు 150,000,000,000 మీటర్ల (1.5 × 1011 మీ.) దూరంలో ఉంటాడు. మిగిలిన నక్షత్రాలు కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. దీన్ని బట్టి విశ్వం ఎంత విశాలమైందో తెలుసుకోవచ్చు.
* ఖగోళ శాస్త్రంలో అత్యధిక దూరాలను కొలవడానికి ఉపయోగించే పరిమాణాలను ఖగోళ శాస్త్ర ప్రమాణాలు అంటారు.


i) ఖగోళ ప్రమాణం (Astrenomical Unit - AU): సూర్యుడికి, భూమికి మధ్య ఉండే దూరాన్ని ఖగోళ ప్రమాణం అంటారు.
                        1 AU = 1.496 × 1011 మీ.


ii) కాంతి సంవత్సరం (Light Year): కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు.
     ఒక కాంతి సంవత్సరం = 9.46 × 1015 మీ. = 9.46 × 1012 కి.మీ. = 6.33 × 104 AU


iii) పార్‌సెక్ (Parsec): ఇది దూరానికి సంబంధించిన ప్రమాణాలన్నింటిలో పెద్దది. ఇది 3.26 కాంతి సంవత్సరాలకు సమానం.
* కాంతికిరణం ఒక సెకను కాలంలో మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
* నక్షత్రాలు సూర్యుడిలా స్వయంప్రకాశకాలు కాబట్టి అవి ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేస్తాయి. కొన్ని నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దగా, ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. కానీ మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి. దీనికి కారణం అవి చాలా దూరంలో ఉండటమే.
* నక్షత్రం లోపల ఉష్ణోగ్రత కొన్ని మిలియన్ డిగ్రీలు ఉంటుంది. అందువల్ల నక్షత్రాల్లోని పదార్థం వాయుస్థితిలో ఉంటుంది. నక్షత్రాలు హైడ్రోజన్, హీలియం వాయువులను చాలా ఎక్కువ పరిమాణంలో, మిగిలిన వాయువులను తక్కువ పరిమాణంలో కలిగి ఉంటాయి. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల హైడ్రోజన్ పరమాణువులు ఒక దాంతో ఒకటి ఢీకొని హీలియం పరమాణువులుగా మారతాయి. ఈ ప్రక్రియను కేంద్రక మేళనం (Nuclear Fusion) అంటారు.
* ఈ విధంగా కేంద్రక మేళనం జరిగినప్పుడు కొంత ద్రవ్యరాశి నశించి శక్తిగా మారుతుంది. కేంద్రక చర్యలు జరగడం వల్ల నక్షత్రాలు కాంతిని, శక్తిని విడుదల చేస్తాయి. కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత నక్షత్రాలు కాంతిని విడుదల చేయవు. అప్పుడు వాటిని చనిపోతున్న నక్షత్రాలు అంటారు. మళ్లీ కొన్ని నక్షత్రాలు పుడుతుంటాయి.
 

నక్షత్ర మండలాలు (Constellations)
* మనం మామూలుగా ఏ సాధనం లేకుండా మూడువేల నక్షత్రాలను చూడగలం. టెలిస్కోప్ సహాయంతో కొన్ని వేల మిలియన్ల నక్షత్రాల వరకు చూడవచ్చు.
* నక్షత్రాలను కొన్ని సముదాయాలుగా విభజించి వాటి అమరిక, ఆకారాన్ని బట్టి జంతువుల పేర్లు లేదా మనుషుల పేర్లు పెట్టి పిలుస్తారు. ఈ నక్షత్రాల సముదాయాలను నక్షత్ర మండలాలు అంటారు. ప్రస్తుతానికి 88 నక్షత్ర మండలాలను గుర్తించారు.
* ఒరియన్, కరోనా, బొరియాలిస్, సిగ్నస్, అర్సిమైనర్, ఆర్సామేజర్ అనేవి కొన్ని నక్షత్ర మండలాలకు ఉదాహరణలు.
 

ధృవ నక్షత్రం
* నక్షత్రాల స్థానాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అవి స్థిరమైన స్థానాల్లో ఉండకుండా కదులుతూ ఉంటాయి. భూమి దాని కేంద్రం ద్వారా వెళ్లే అక్షం చుట్టూ భ్రమిస్తూ ఉంటే నక్షత్రాల స్థానాలు కూడా మారతాయి. కానీ భూమి స్థానంతో పోలిస్తే ధృవ నక్షత్రం స్థానం మాత్రం మారదు.
* ధృవ నక్షత్రాన్ని ఆంగ్లంలో పొలారిస్ అంటారు. ఇది భూమి ఉత్తర ధృవానికి ఎదురుగా ఉంటుంది. ధృవ నక్షత్ర స్థానాన్ని సప్తర్షి మండలం, శర్మిష్ట రాశి సహాయంతో తెలుసుకోవచ్చు.
* సప్తర్షి మండలాన్ని ఇంగ్లిషులో గ్రేట్ బేర్ అంటారు. ఇది నాగలి ఆకారం లేదా గాలిపటం ఆకారంలో ఉంటుంది. సప్తర్షి మండలంలోని వెలుపలి రెండు నక్షత్రాలను కలుపగా ఏర్పడే సరళరేఖపై ధృవ నక్షత్రం ఉంటుందని ఊహించవచ్చు.
     


* సప్తర్షి మండలాన్ని ఆకాశంలో ఉత్తరం వైపు ఉండే దీర్ఘ చతురస్రాకార వలయభాగంలో గుర్తించవచ్చు. ఇది చలికాలంలో సూర్యోదయానికి కొద్ది గంటల ముందు ఆకాశంలో ఉదయిస్తుంది. ఈ కాలంలో శర్మిష్ట రాశి కూడా ఆకాశంలో ఉత్తరం వైపునే కనిపిస్తుంది. దీనిలోని ఆరు నక్షత్రాలు M ఆకారంలో ఉంటాయి. M ఆకారం మధ్యలో ఉన్న నక్షత్రం నుంచి ఊహించిన రేఖ ధృవ నక్షత్రాన్ని చూపుతుంది.


* ధృవ నక్షత్రం భూమి అక్షం దిశలో ఉండటం వల్ల అది తిరుగుతున్నట్లు కనిపించదు.
* ఒక సంవత్సరంలో నక్షత్రాల మధ్యగా గమించే సూర్యుడి గమన మార్గాన్ని ఎక్లిప్టిక్ అంటారు.
* ఈ రాశి చక్రంలోని 12 నక్షత్ర మండలాలకు 12 పేర్లు పెట్టారు. వీటినే రాశి గుర్తులు (Zodiac signs) అంటారు.
* సంవత్సరంలోని ఒక నెలలో ప్రతిరోజు సూర్యోదయం ఒకే రాశి వద్ద జరుగుతుంది.


12 నక్షత్ర మండలాల పేర్లు
      1. మేషం (Aries)
      2. వృషభం (Taurus)
      3. మిథునం (Gemini)
      4. కర్కాటకం (Cancer)
      5. సింహం (Leo)
      6. కన్య (Virgo)
      7. తుల (Libra)
      8. వృశ్ఛికం (Scorpio)
      9. ధనస్సు (Sagittarius)
      10. మకరం (Capricorn)
      11. కుంభం (Aquarius)
      12. మీనం (Pisces)
 


సౌర కుటుంబం (Solar System):
సూర్యుడు, దాని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటారు. దీనిలో గ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్లు, ఉల్కలు లాంటి అనేక అంతరిక్ష వస్తువులు ఉంటాయి. సూర్యుడికి ఆ అంతరిక్ష వస్తువులకు మధ్య ఉండే గురుత్వాకర్షణ బలం వల్ల అవి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇది కూడా సౌర కుటుంబంలోనిదే. భూమి ఒక గ్రహం, భూమి కాకుండా మరో ఏడు గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. సూర్యుడి నుంచి ఉండే దూరాన్ని బట్టి ఆ గ్రహాలు వరుసగా బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు (అంగారకుడు), బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్.


సూర్యుడు: మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడు. ఇది అత్యంత ఉష్ణం, కాంతిని నిరంతరంగా వెదజల్లుతుంది. భూమిపైన ఉన్న వివిధ శక్తి రూపాలకు సూర్యుడే ప్రధాన వనరు. భూమికే కాకుండా మన సౌర కుటుంబంలోని మిగిలిన అన్ని గ్రహాలకు కాంతిని, ఉష్ణాన్ని ఇచ్చే ప్రధాన వనరు సూర్యుడే.


గ్రహాలు: నిర్మలంగా ఉండే ఆకాశాన్ని రాత్రి సమయంలో పరిశీలిస్తే నక్షత్రాల కంటే ఎక్కువ ప్రకాశమంతంగా, స్థిరంగా ప్రకాశించే వస్తువులను చూడవచ్చు. వాటినే గ్రహాలు అంటారు. గ్రహాలు కూడా నక్షత్రాల్లా కనిపిస్తాయి. కానీ వాటికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. అవి తమపై పడిన సూర్య కాంతిని పరావర్తనం చెందించి వెలుగుతున్నట్లు కనిపిస్తాయి.
* ప్రతి గ్రహానికి రెండు రకాల చలనాలు ఉంటాయి. అవి:
    1) పరిభ్రమణం (Revolution)
    2) ఆత్మభ్రమణం లేదా భ్రమణం (Rotation)
 

పరిభ్రమణం: సూర్యుడి చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. ప్రతి గ్రహం సూర్యుడి చుట్టూ ఒక ప్రత్యేకమైన మార్గంలో పరిభ్రమిస్తుంది. ఈ మార్గాన్ని కక్ష్య (Orbit) అంటారు. ఒక గ్రహం సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని పరిభ్రమణ కాలం అంటారు. సూర్యుడి నుంచి గ్రహాలకు ఉండే దూరం పెరుగుతున్న కొద్దీ వాటి పరిభ్రమణ కాలం పెరుగుతుంది. ఈ విధంగా గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమించడం వల్ల భూమిపై రుతువులు ఏర్పడుతున్నాయి.
 

ఆత్మ భ్రమణం లేదా భ్రమణం: గ్రహాలు వాటి ద్వారా వెళ్లే అక్షం చుట్టూ బొంగరంలా తిరుగుతాయి (భ్రమణం చేస్తాయి). ఒక గ్రహం తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి (ఒక భ్రమణం చేయడానికి) పట్టే కాలాన్ని భ్రమణ కాలం అంటారు. భూమి ఆత్మ భ్రమణం వల్ల రాత్రి, పగలు ఏర్పడుతున్నాయి.
* సౌర కుటుంబంలోని కొన్ని గ్రహాలకు వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు కూడా ఉంటాయి. చంద్రుడు భూమికి ఉపగ్రహం. మానవ నిర్మిత ఉపగ్రహాలు అనేకం భూమి చుట్టూ తిరుగుతున్నాయి.
 

బుధుడు (Mercury): బుధుడు సూర్యుడికి అతి సమీపంగా ఉండే గ్రహం. సౌర కుటుంబంలో ఇది అతి చిన్న గ్రహం. సూర్యుడికి అతి దగ్గరగా ఉండటం వల్ల అది సూర్యుడి ప్రకాశంలో కలసిపోవడంతో దాన్ని చూడలేకపోతున్నాం. అయినా సూర్యోదయానికి కొద్ది సమయం ముందు లేదా సూర్యాస్తమయం వెంటనే దిక్‌మండ‌లానికి దగ్గరలో దీన్ని మనం చూడవచ్చు. బుధ గ్రహానికి ఉపగ్రహాలు ఉండవు.
 

శుక్రుడు (Venus): గ్రహాలన్నింటిలో భూమికి దగ్గరగా ఉండే గ్రహం శుక్రుడు. ఇది ఆకాశంలో కనిపించే గ్రహాలన్నింటిలో ప్రకాశవంతమైంది. ఇది ఆకాశంలో కొన్నిసార్లు తూర్పువైపు సూర్యోదయం కంటే ముందుగా, మరికొన్నిసార్లు పడమరవైపు సూర్యాస్తమయం తర్వాత కనిపిస్తుంది. ఇది నక్షత్రం కాకపోయినప్పటికీ దీన్ని వేగుచుక్క (Morning star), సాయం కాలం చుక్క (Evening star) అని పిలుస్తున్నారు. శుక్రుడికి కూడా ఉపగ్రహాలు లేవు.
 

భూమి (Earth): సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలో జీవాన్ని కలిగి ఉన్న గ్రహం భూమి మాత్రమే. భూమిపై జీవం పుట్టడానికి, మనగలగడానికి ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులే కారణం. భూమి సూర్యుడికి తగిన దూరంలో ఉండటం, భూమిపై సరైన ఉష్ణోగ్రత ఉండటం; నీరు, వాతావరణం ఉండటం, వీటిని ఆవరించి ఓజోన్ పొర ఉండటం లాంటివి భూమిపై జీవాన్ని ఉండేలా చేశాయి.
భూమిపై ఉన్న నేల, నీటి వల్ల కాంతి వక్రీభవనం చెందడంతో భూమిని అంతరిక్షం నుంచి చూసినప్పుడు నీలి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. భూమికి ఉండే ఒకేఒక ఉపగ్రహం చంద్రుడు.
 

కుజుడు/ అంగారకుడు (Mars): సౌర కుటుంబంలో భూ కక్ష్యకు వెలుపలి వైపు ఉన్న గ్రహాల్లో మొదటిది అంగారకుడు. ఇది కొద్దిగా ఎరుపు రంగులో ఉండటం వల్ల దీన్ని 'అరుణ గ్రహం' అంటారు. అంగారకుడికి రెండు సహజ ఉపగ్రహాలు ఉన్నాయి.
 

గురుడు/ బృహస్పతి (Jupiter): సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి. భూమి పరిమాణంతో పోలిస్తే ఇది 1300 రెట్లు పెద్దది. కానీ దీని ద్రవ్యరాశి మాత్రం భూ ద్రవ్యరాశికి 318 రెట్లు మాత్రమే. ఇది తన చుట్టూ తాను అతి వేగంగా తిరుగుతుంది. దీనికి అనేక ఉపగ్రహాలు ఉన్నాయి. దీని చుట్టూ ప్రకాశమంతమైన వలయాలు ఉన్నాయి.
 

శని (Saturn): బృహస్పతి తర్వాతి గ్రహం శని. ఇది పసుపు రంగులో కనిపిస్తుంది. దీని చుట్టూ ఉన్న వలయాలను మనం నేరుగా చూడలేకపోయినా, మామూలు టెలిస్కోప్‌తో సులభంగా పరిశీలించవచ్చు. ఈ వలయాలే దీని ప్రత్యేకత. శని గ్రహానికి కూడా అనేక ఉపగ్రహాలు ఉన్నాయి.
 

యురేనస్ (Uranus), నెప్ట్యూన్ (Neptune): ఇవి సౌర కుటుంబంలో సుదూరంగా ఉండే గ్రహాలు. అతిపెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రమే వీటిని చూడవచ్చు. శుక్ర గ్రహంలా యురేనస్ కూడా తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. దీని అక్షం అత్యధికంగా వంగి ఉంటుంది. ఈ విధంగా ఉండటమే దీని ప్రత్యేకత. అక్షం వంపు కారణంగా అది తనచుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతున్నట్లుగా కనిపిస్తుంది.
* మొదటి నాలుగు గ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు మిగిలిన గ్రహాల కంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉంటాయి. వీటిని అంతర గ్రహాలు అంటారు. వీటికి ఉపగ్రహాలు చాలా తక్కువగా ఉంటాయి.
* అంగారక గ్రహ కక్ష్యకు వెలుపలి వైపు ఉన్న గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు అంతర గ్రహాల కంటే సూర్యుడికి అత్యంత దూరంలో ఉంటాయి. వీటిని బాహ్య గ్రహాలు అంటారు. చుట్టూ వలయాలు ఉంటాయి. వీటికి ఉపగ్రహాలు ఎక్కువగా ఉంటాయి.


* సూర్యుడి వ్యాసం 13,92,000 కి.మీ.
* భూమి వ్యాసం 12,756 కి.మీ.
* చంద్రుడి వ్యాసం 3,474 కి.మీ.
* సూర్యుడి నుంచి భూమికి ఉండే దూరం 15,00,00,000 కి.మీ.
* భూమి నుంచి చంద్రుడికి ఉండే దూరం 3,84,399 కి.మీ.
* 2006, ఆగస్టు 25 వరకు సౌర కుటుంబంలో గ్రహాలు 9 అని చెప్పేవారు. 9వ గ్రహం 'ప్లూటో'ను అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య 26వ జనరల్ అసెంబ్లీలో అది గ్రహం కాదని నిర్ణయించింది. ఎందుకంటే 'ప్లూటో క్లియర్డ్ దనైబర్ హుడ్' (తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించకూడదు) అనే నియమాన్ని ఉల్లంఘించింది. కొన్ని సందర్భాల్లో నెప్ట్యూన్ కక్ష్యలోకి ప్రవేశించింది.

ఆస్టరాయిడ్లు:
కుజుడు, బృహస్పతి గ్రహ కక్ష్యల మధ్య ఉండే విశాలమైన ప్రదేశంలో అనేక చిన్న చిన్న వస్తువులు (శిలలు) సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటిని ఆస్టరాయిడ్లు అంటారు.


ఉల్కలు (Meteors): రాత్రి సమయంలో ఒక్కోసారి ఆకాశంలో ప్రకాశిస్తున్న వస్తువులు వేగంగా కిందకు పడిపోవడం చూస్తూ ఉంటాం. అవి బయటి అంతరిక్షం నుంచి పడిపోతున్న రాళ్లు, ఖనిజాలు. వీటినే ఉల్కలు అంటారు.
* ఈ ఉల్కలు భూమి వాతావరణంలోకి ఎక్కువ వేగంతో ప్రవేశిస్తాయి. గాలిలో ఉండే ఘర్షణ వల్ల అవి బాగా వేడెక్కి మండుతూ వెలుగుతుంటాయి. వాటిలో కొన్ని భూమిని చేరి, ఢీ కొట్టి గొయ్యిలను ఏర్పరుస్తాయి. ఈ విధంగా భూమిపై పడే ఉల్కను ఉల్కాపాతం అంటారు.


తోక చుక్కలు: ఇవి వాయువులతో కప్పి ఉండి చిన్న చిన్న ఘన పదార్థాలను కలిగి ఉంటాయి. తోక భాగంలో వాయువులు ఉంటాయి. తోక చుక్కలు సూర్యుడి చుట్టూ నిర్ణీత కాల వ్యవధుల్లో తిరుగుతాయి. అవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు, వేడి వల్ల వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఈ వాయువులు మండి ప్రకాశిస్తూ, తోకలా కనిపిస్తాయి. హేలీ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక తోకచుక్కను కనుక్కొని దానికి హేలీ తోకచుక్క అని పేరు పెట్టారు. ఇది 76 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. చివరగా మనం దీన్ని 1986లో చూశాం. మళ్లీ ఇది 2062లో కనిపిస్తుంది. జులై 1994లో బృహస్పతి గ్రహాన్ని షూమేకర్ - లేవీ - 9 అనే తోకచుక్క ఢీ కొట్టింది.
* భూమిపై తప్ప మిగతా గ్రహాలపై ప్రాణులు ఉండటానికి కావాల్సిన అనువైన వాతావరణ పరిస్థితులు లేవు. బుధ గ్రహం సూర్యుడికి అతి సమీపంగా ఉండటం వల్ల దాని మీద పగలు అతి వేడిగా, రాత్రి అతి చల్లగా ఉంటుంది. శుక్ర గ్రహం అతి దట్టమైన మేఘాలతో కప్పి ఉండటం వల్ల సూర్యకాంతి దాని తలాన్ని చేరలేదు. శని గ్రహం, కిలో మీటర్ల మందం ఉండే మంచు పొరలతో కప్పి ఉండటం వల్ల అతి చల్లగా ఉంటుంది. కాబట్టి వీటిపై ప్రాణులు ఉండటానికి అవకాశం లేదు. కుజ గ్రహం ఆక్సిజన్, నీటిఆవిరులతో ఉండే వాతావరణాన్ని కలిగి ఉంటుంది. కానీ దాని ఉష్ణోగ్రత 25°C – 40°C కు మధ్యలో ఉంటుంది. అయినప్పటికీ ఈ గ్రహం మీద రాళ్ల మధ్య జీవం ఉండటానికి అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
* భూమి చుట్టూ అనేక కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ఇవి మానవ నిర్మిత ఉపగ్రహాలు. వీటిని భూమి నుంచే ప్రయోగించారు. ఇవి భూమి చుట్టూ చంద్రుడి కంటే అతి దగ్గరగా పరిభ్రమిస్తుంటాయి. భారత దేశంలో మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం 'ఆర్యభట్ట'. INSAT, IRS, కల్పన - 1, EDUSAT అనేవి మన దేశం ప్రయోగించిన మరికొన్ని ఉపగ్రహాలు.
* 2008, అక్టోబర్ 22న మన దేశం చంద్రుడి గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ - 1 (చంద్రుడికి ఉపగ్రహం)ను ప్రయోగించింది.
 

చంద్రయాన్ - 1 ముఖ్య ఉద్దేశాలు
     i) చంద్రుడిపై నీటి జాడను వెదకడం.
     ii) చంద్రుడిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం.
     iii) హీలియం - 3ను వెదకడం.
     iv) చంద్రుడి త్రిమితీయ అట్లాస్‌ను తయారు చేయడం.
     v) సౌర వ్యవస్థ ఆవిర్భవానికి సంబంధించిన ఆధారాలను వెదకడం.
* చంద్రయాన్ - 1ను ప్రయోగించడంతో చంద్రుడికి ఉపగ్రహాలను పంపిన ఆరు దేశాల్లో మనదేశం కూడా ఉంది.
 

సూర్య గ్రహణం (Solar eclipse): చంద్రుడి నీడ భూమిపై పడటం వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది.
సూర్య గ్రహణాల్లో రకాలు
     i) సంపూర్ణ సూర్య గ్రహణం
     ii) పాక్షిక సూర్య గ్రహణం
     iii) వలయాకార సూర్య గ్రహణం
     iv) మిశ్రమ సూర్య గ్రహణం
 

చంద్ర గ్రహణం (Lunar eclipse): భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది.

చంద్ర గ్రహణాల్లో రకాలు
     i) సంపూర్ణ చంద్రగ్రహణం
     ii) పాక్షిక చంద్రగ్రహణం
     iii) ప్రచ్ఛాయ/ఉపచ్ఛాయ చంద్ర గ్రహణం
* భూమిలోని శిలలు మూడు పొరలతో ఉన్నాయి. అవి:
     1) భూ పటలం (Crust)
     2) మాంటిల్ (Mantle)
     3) కేంద్రం (Core)
* అన్నింటికంటే పైన ఉండే పొర భూ పటలం
 

భూ పటలం: భూ పటలంపై పర్వతాలు, సరస్సులు, పీఠభూములు, లోయలు, మహా సముద్రాలు, సముద్రాలు, నదులు ఉంటాయి. వీటి చుట్టూ దట్టమైన కంబళి లాంటి గాలిపొర - వాతావరణం ఉంటుంది. భూ పటలం మందం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. మహా సముద్రాల కింద 5 నుంచి 12 కి.మీ ఉంటుంది. భూ ఖండాల కింద 35 నుంచి 60 కి.మీ. ఉంటుంది. ఇది అగ్ని శిలలు, సెడిమెంటరీ శిలలు, రూపాంతర శిలలు అనే మూడు రకాల శిలలను కలిగి ఉంటుంది. మహా సముద్రాల అడుగు భాగంలో ఎక్కువగా బసాల్ట్ శిలలు ఉంటాయి. ఖండాల కింద ఎక్కువ భాగం గ్రానైట్ శిలలు ఉన్నాయి. గ్రానైట్ బసాల్ట్ కంటే తేలికైంది.
 


భూ ప్రావారం:
భూ పటలానికి, కేంద్రానికి మధ్య ఉండే పొరను భూ ప్రావారం అంటారు. దీని మందం 2900 కి.మీ. ఇది భూ పొరలన్నింటిలో చాలా మందంగా ఉంటుంది. ఇది ఎక్కువ భాగం ఇనుము, మెగ్నీషియం, సిలికేట్‌లను కలిగి ఉంటుంది. సాధారణంగా శిలలు ఘన స్థితిలో ఉన్నప్పటికీ దీర్ఘకాలంగా ఉన్న ఒత్తిడి వల్ల ఇవి నెమ్మదిగా ప్రవహిస్తాయి (కోల్‌తార్‌లా).
 

కేంద్ర మండలం: భూమిలో కేంద్ర భాగమైన కేంద్ర మండలం రెండు పొరలుగా ఉంటుంది. అవి బాహ్యకేంద్ర మండలం, అంతరకేంద్ర మండలం. అంతరకేంద్ర మండలం వ్యాసం 2600 కి.మీ. భూ అంతర్భాగంలోకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత క్రమేపి పెరుగుతుంది. కేంద్ర మండలం ఉష్ణోగ్రత సుమారు 6000 °C , పీడనం భూతల పీడనం కంటే 3 మిలియన్ రెట్లు ఉంటుందని అంచనా వేశారు. అత్యంత ఉష్ణోగ్రత, పీడనాల వల్ల అంతరకేంద్ర మండలం ఘనస్థితిలోనే ఉంటుంది. అంతరకేంద్ర మండలం పూర్తిగా ఇనుము; స్వల్ప పరిమాణంలో నికెల్, సిలికాన్‌లను కలిగి ఉండి అత్యధిక సాంద్రతకు కారణమవుతుంది.
     బాహ్యకేంద్ర మండలం 2300 కి.మీ. మందంతో భూ ప్రావారం కింద ఉంటుంది. ఈ మండలంలోని పీడనం అంతరకేంద్ర మండలం కంటే తక్కువగా ఉండటం వల్ల ఇనుము ద్రవస్థితిలో ఉంటుంది. ఇతర గ్రహాల మాదిరి భూమి కూడా 5 బిలియన్ల సంవత్సరాలకు పూర్వం ఉన్న వాయు, ధూళి, మేఘాలు ఘనీభవించడం వల్ల ఏర్పడింది.
* భూగర్భ శాస్త్రవేత్తలు రేడియో యాక్టివ్ డేటింగ్ ఆధారంగా భూమి వయసు 4.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువని అంచనా వేశారు. చంద్ర శిలల, ఉల్క శిలల అధ్యయనం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది.
* భూమి పుట్టుక గురించి ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో ధూళి - మేఘం (Dust – Cloud) ప్రతిపాదన చాలా మంది శాస్త్రవేత్తల ఆమోదం పొందింది.
* భూమి శిలా - శకలాల శీతల సముదాయంగా మొదలైంది. శకలాలు ఒకదాంతో మరొకటి ఢీ కొన్నప్పుడు వాటి గతిజశక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. యురేనియం, థోరియం, పొటాషియం లాంటి రేడియో ధార్మిక పరమాణువుల విఘటనం, ఉష్ణానికి తోడై సంపీడనం వల్ల ఈ ప్రక్రియలో ఒక ఘన - ద్రవస్థితిలో ఉండే పదార్థం ఏర్పడుతుంది. ఇది దాదాపు 800 మిలియన్ల సంవత్సరాలపాటు కొనసాగింది.
* కరిగిన భూ పదార్థమంతా గురుత్వాకర్షణ ప్రభావం వల్ల తనకు తానుగా పునర్ వ్యవస్థీకరించుకుంటుంది. కరిగిన భారమైన ఇనుప బిందువులు కేంద్రం వైపు ప్రయాణిస్తూ, తేలికైన ఇతర అనుఘటకాలు పై ప్రాంతాలకు చేరుతాయి. ఈ విధంగా భూమి పొరలుగా ఏర్పడటాన్ని 'డిఫరన్సియేషన్' అంటారు.
* ఆదిమ పదార్థంలో చిక్కుకున్న వాయువులు, నీటిఆవిరి డిఫరన్సియేషన్ ప్రక్రియలో విడివడి వాతావరణం, మహా సముద్రాలుగా ఏర్పడతాయి. ఉష్ణశక్తి అత్యంత అధిక ఉష్ణం ఉన్న కేంద్రకం నుంచి ఉపరితల శీతల ప్రాంతాలకు నిరంతరం ప్రవహిస్తుంది. ఈ ఉష్ణ సంవహన ప్రవాహాలు లోపల జరిగే అన్ని ప్రక్రియలను నియంత్రిస్తాయి. క్రమేపి పై పొరలు చల్లగా మారి భూ పటలం ఏర్పడుతుంది.
* సుమారు 400 మిలియన్ల సంవత్సరాల కిందటే దక్షిణార్ధ గోళంలో 'గోండ్వానా లాండ్', ఉతరార్ధ గోళంలో 'లారేసియా' అనే మహా ఖండాలు ఉండేవి. సుమారు 200 మిలియన్ల సంవత్సరాల వరకు భూ ఖండాలన్నీ కలసి ఒక పెద్ద మహాఖండం 'పాంజియా'గా ఏర్పడ్డాయి. సుమారు 200 మిలియన్ల సంవత్సరాల కిందట మహా సముద్ర భూభాగాలు నెట్టడం వల్ల పాంజియా ముక్కలై వివిధ భూ ఖండాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా ఖండాలు జరగడాన్ని భూ ఖండాల కదలిక అంటారు.
* ఉష్ణోగ్రత, పీడనాల వ్యత్యాసాలు, ప్రకృతి శక్తులు భూమిలో సంభవిస్తున్న మార్పులకు ప్రధాన కారణాలు.
* భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేడి నీటి ఊటలు, అగ్ని పర్వతాలు భూ గర్భంలోని ఉష్ణానికి తార్కాణాలు.
* భూ పటలం, భూ ప్రావారంలోని శిలలు పొందిన వికృతి పర్యవసానంగా భూకంపాలు ఏర్పడతాయి.
* భూ ప్రకంపనలు, అగ్ని పర్వతాలు, భూ అయస్కాంతత్వం, భూమ్యాకర్షణల అధ్యయనం వల్ల శాస్త్రవేత్తలు భూ అంతర్భాగాల గురించి తెలుసుకుంటారు.
 

అగ్ని పర్వతాలు
*
ఇది భూ తలంలో ఏర్పడిన రంధ్రం. దీని ద్వారా భూమి లోపలి నుంచి శిలలు, శిలాద్రవం, వేడి వాయువులు వేగంగా బయటకు వస్తాయి.
* ప్రపంచంలో 430 అగ్ని పర్వతాలున్నా కొన్ని మాత్రమే ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్నాయి. అగ్ని పర్వతాల నుంచి వెలువడే వాయువుల్లో ప్రధానమైంది నీటిఆవిరి, కార్బన్ డై ఆక్సైడ్, క్లోరిన్.
* భూ అంతర్భాగంలోని అత్యధిక ఉష్ణం, పీడనాల వల్ల శిలలు కరుగుతాయి. కరిగే శిలలు విడుదల చేసే వాయువులు శిలాద్రవంలో కలుస్తాయి. కరిగిన శిలాద్రవం భూమిలో ఉంటే దాన్ని 'మాగ్మా' అంటారు. అగ్ని పర్వతం నుంచి బయటకు వచ్చిన మాగ్మాను 'లావా' అంటారు.
* మాగ్మా ఉష్ణోగ్రత 600 °C నుంచి 1200 °C వరకు ఉంటుంది. ఉపరితలం కింద 80 నుంచి 160 కి.మీ. లోతులో మాగ్మా తయారవుతుంది. శిలల కంటే మాగ్మా తేలికగా ఉండటం వల్ల ఉపరితలం వైపు ప్రయాణిస్తుంది. మార్గంలో ఉన్న శిలలను కరిగించుకుంటూ పెద్ద రిజర్వాయర్ మాగ్మా ఛాంబర్‌గా ఏర్పడుతుంది. పైన ఉండే శిలలు, విడుదలైన వాయువుల వల్ల పెరిగిన ఒత్తిడికి మాగ్మా బలహీనంగా ఉన్న శిలలను కరిగించుకుని ఉపరితలం మీద మార్గాన్ని ఏర్పరచుకుంటుంది. ఉపరితలంలో ఏర్పడిన ఈ అగ్ని పర్వత ముఖ ద్వారం నుంచి ఎర్రగా మరిగిన శిలాద్రవం, వాయువులు భయంకర పేలుళ్లతో వేగంగా బయటకు వస్తాయి. దీన్నే అగ్ని పర్వతం బద్దలవడం అంటారు. బయటకు వచ్చిన శిలాద్రవం చల్లగా మారి వెంట్ చుట్టూ పర్వతంగా ఏర్పడుతుంది. లావా చల్లగా మారడం వల్ల ఏర్పడిన శిలలను అగ్ని శిలలు అంటారు.
* క్రియాశీలంగా ఉన్న అగ్ని పర్వతం తరచుగా శిలాద్రవాన్ని వెళ్లగక్కుతుంది. కొన్ని అగ్ని పర్వతాల నుంచి శిలాద్రవం నిర్ణీత కాల వ్యవధుల్లో వెలుపలికి వస్తుంది. నిద్రాణ అగ్ని పర్వతాలు తాత్కాలికంగా, క్రియారహితంగా ఉంటాయి.
* భూగర్భంలోని పదార్థాలను అగ్ని పర్వతాలు బయటకు తెస్తాయి. భూమి లోపల పేరుకున్న శక్తిని అగ్ని పర్వతాలు విడుదల చేస్తాయి. లావా చల్లగా మారి అత్యంత సారవంతమైన భూమి ఏర్పడుతుంది.
* భూమిపై మొదటి జీవం 3.5 బిలియన్ల సంవత్సరాల కిందటే నీటిలో ఏర్పడింది. మొదటి నిర్జీవ సేంద్రియ పదార్థాల నుంచి జీవం (ప్రోటో ప్లాసమ్) ఆవిర్భవించింది.

*
మొదట సరళ వృక్షజాతి ప్రాణులు, తర్వాత సరళ జంతుజాతి ప్రాణులు ఏర్పడ్డాయి. శిలాజాలు (పూర్వ జీవుల శిథిల శిలా రూపాలు) పూర్వకాలపు జీవుల సమాచారాన్ని అందిస్తాయి.
* మొదటి సరళ జీవుల నుంచి క్రమేపి మానవుల వరకు జీవులు పొందిన మార్పులను జీవపరిణామం అంటారు. జీవపరిణామం ప్రకృతి వరణాన్ని అనుసరించి ఉంటుందని డార్విన్ ప్రతిపాదించారు.
* జీవపరిణామంలో మానవుడు అత్యున్నత స్థాయిలో ఉన్నాడు. మానవులు సుమారు రెండు మిలియన్ల సంవత్సరాలుగా భూమి మీద నివసిస్తున్నారు. ఈ కాలం భూమి మీద జీవం ఏర్పడినప్పటి నుంచి ఉన్న కాలంలో వెయ్యో వంతు కంటే కూడా తక్కువే.
* పూర్వం ఉన్న అనేక జాతులు ప్రస్తుతం లేవు. జాతుల మధ్యపోరాటం, ప్రతికూల వాతావరణమే ఈ నాశనానికి కారణం. భూమి అనేక మార్పులను పొందింది. ఇంకా మార్పులు చెందుతూ ఉంది. కొన్ని మార్పులు వేగంగా, భయకరంగా ఉంటాయి. మరికొన్ని నెమ్మదిగా, నిశ్శబ్దంగా ఉంటాయి.
* అంచనా ప్రకారం భూమి సాంద్రత 5.5 గ్రా./సి.సి.
* భూ పటలం నుంచి మానవుడు వినియోగిస్తున్న శిలల సరాసరి సాంద్రత 2.8 గ్రా./సి.సి.
* ఏదైనా ఒక ప్రాణి సహజంగా లేదా ప్రకృతిలో సంభవించే ప్రమాదాల వల్ల మరణించినప్పుడు అది భూగర్భంలో కూరుకుపోతుంది. ఈ విధంగా కూరుకుపోయి ప్రాణి భౌతిక శరీరంపై పనిచేసే పీడన బలాలు దాన్ని శిలగా మారుస్తాయి. లేదా ఆ భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకొని ఉన్న పదార్థాలపై ప్రాణి భౌతిక శరీరం చిహ్నాన్ని (ముద్రని) ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఏర్పడిన శిలలను లేదా చిహ్నాలను సాధారణంగా 'శిలాజాలు' అని అంటారు.
* ప్రపంచంలో చెప్పుకోదగిన శిలాజ అడవులు యెల్లోస్టోన్ నేషనల్ పార్కు ప్రాంతంలో ఉన్నాయి.
* శాస్త్రవేత్తలు ఆఫ్రికా ఖండంలో రెండు మిలియన్ల సంవత్సరాల కంటే ముందే మానవ శిలాజాలను కనుక్కున్నారు. శిలాజాల అధ్యయనం వల్ల పురాతన జీవుల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌