• facebook
  • whatsapp
  • telegram

బోధనా పద్ధతులు, ఉపగమనాలు, మెలకువలు  

విద్యావిధానం సాఫల్యతగానీ, వైఫల్యంగానీ, దాని అమలుకు రూపొందించిన పాఠ్య విభాగం, బోధనపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి తరగతిలో ఉపాధ్యాయుడి ధోరణి తన కార్యక్రమంలోని వివిధ అంశాలను స్థిరపరుస్తుంది. ఈ ధోరణినే ఉపగమనం (approach) అంటారు. దీని ఆధారంగానే ఉపాధ్యాయుడు బోధనా వ్యూహాలను, బోధనా పద్ధతులను రూపొందించుకుంటాడు.

బోధనా ఉపగమనం - భావన: ఉపగమనం అంటే ఏదో ఒక దాన్ని ఆదరించడం, నిర్వహించడం అని అర్థం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రాన్ని బోధించే విధానాన్నే ఉపగమనంగా పేర్కొనవచ్చు. సాంఘిక అధ్యయనాలలో బోధనా పద్ధతులకు చాలా ప్రాముఖ్యం ఉంది. పద్ధతి అనేది ఒక క్రమమైన, తార్కిక విధానాన్ని సూచిస్తుంది. విజయవంతమైన బోధన ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి...

* ఉపాధ్యాయుడికి విషయ పరిజ్ఞానంపై ఉన్న పట్టు

* బోధనా నైపుణ్యం
బోధన అభ్యాసకుని స్థాయిని, అభిరుచి, పూర్వజ్ఞానాన్ని, అభ్యాసకునిలోని ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని జరపాల్సిన ప్రక్రియ.

బోధనా నియమాలు: ఉపాధ్యాయుడు సరైన బోధన వ్యూహాన్ని రూపొందించుకోవడానికి ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

1. సరళత నుంచి సంక్లిష్టతకు

2. తెలిసిన దాన్నుంచి తెలియనిదానికి

3. సులభం నుంచి కష్టతకు

4. మూర్తం నుంచి అమూర్తమునకు

5. నిర్దిష్టం నుంచి సాధారణీకరణకు

6. మొత్తం నుంచి భాగాలకు

బోధన పద్ధతి - భావన - నిర్వచనాలు

''అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధమే పద్ధతి" - వెస్లీ & రాన్‌స్కీ

''బోధన సామాన్యంగా పిలిచే చర్యల వరుసక్రమంలోని లాంఛనమైన స్వరూపం పద్ధతి" - బ్రేడి

''ఉత్తమమైన ప్రణాళిక, సరైన బోధన పద్ధతుల వల్ల, సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది. ఈ రెండూ లేకపోతే ఇవి నిర్జీవాలుగా తయారవుతాయి" - సెకండరీ విద్యా కమిషన్

మంచి బోధన పద్ధతి లక్షణాలు:

1. పాఠ్యాంశం పట్ల ఆసక్తి పెంపొందించేదిగా ఉండాలి.

2. విద్యార్థులు బోధన - అభ్యసన ప్రక్రియలో చురుగ్గా పాల్గొనడానికి అవకాశం కల్పించేదిగా ఉండాలి.

3. విద్యార్థులలో సృజనాత్మక శక్తులను వెలికితీసేదిగా ఉండాలి.

4. ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య అనుసంధానాన్ని ఏర్పరస్తూ ఉండాలి.

5. విద్యార్థులలో సరైన ఆసక్తులు, వైఖరులు వృద్ధిచేసే విధంగా ఉండాలి.

6. వైవిధ్యభరితమైన అభ్యసన అనుభవాలను కల్గించేదిగా ఉండాలి.

7. విద్యార్థులలో చొరవను పెంపొందించేదిగా ఉండాలి.

చర్చా పద్ధతి (Discussion Method)

* సాంఘిక అధ్యయనాలలో అత్యంత విలువైన బోధన పద్ధతి - చర్చా పద్ధతి. ఈ పద్ధతిని భారతదేశంలోని ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించారు. చర్చా పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి.
* చర్చా పద్ధతికి ''ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి" అనే సూక్తి పునాదిగా ఉంది. చర్చా పద్ధతి తరగతి గదిలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని సృష్టించి, విద్యార్థి తన ఆలోచనలను, భావాలను స్వేచ్ఛగా, నిర్భయంగా వ్యక్తీకరింపచేయడంలో సహకరిస్తుంది.

* ''విద్యార్థులు పాఠ్యాంశాన్ని చర్చాగోష్టుల ద్వారా అభ్యసించడాన్ని చర్చా పద్ధతి" అంటారు.
 

చర్చా పద్ధతి - ప్రధాన అంశాలు: చర్చలో ఉండాల్సిన ప్రధాన అంశాలు 5. అవి...
1. నాయకుడు 2. సభ్యులు 3. సమస్య 4. విషయ సమాచారం 5. మూల్యాంకనం

నాయకుడు: చర్చకు నాయకుడుగా ఉపాధ్యాయుడు వ్యవహరిస్తాడు. చర్చకు సంబంధించిన సమాచారం, చర్చించాల్సిన విషయం / అంశం లేదా సమస్య ఎంపిక, ప్రణాళిక రచన, చర్చ నిర్వహణ, మూల్యాంకనం మొదలైనవి నిర్వహించేది, నాయకుడిగా వ్యవహరించేది ఉపాధ్యాయుడే.

* చర్చ విజయవంతంగా ముగించడానికి ప్రధాన కారకుడు నాయకుడు (ఉపాధ్యాయుడే).

సభ్యులు: చర్చలో పాల్గొనే విద్యార్థులందరూ చర్చా సభ్యులే. చర్చలో ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞావంతులు, వెనుకబడిన విద్యార్థులు అందరూ పాల్గొంటారు.

సమస్య: చర్చకు ఎంచుకున్న సమస్య / చర్చనీయాంశం. ఈ అంశం విద్యార్థుల వయసు, స్థాయి, తరగతి స్థాయి, అభిరుచులకు తగినట్టుగా ఉండాలి. విద్యార్థులు సమస్యను ఎంచుకోవడంలో ఉపాధ్యాయుడి సహకారం ఉండాలి.

విషయ సమాచారం: చర్చించడానికి ఎంపిక చేసిన సమస్యకు అవసరమైన విషయాన్ని, దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. పుస్తకాలు, పత్రికలు, సంచికలు, దృశ్య-శ్రవణ ఉపకరణాలు అయిన చిత్రపటాలు, బొమ్మలు, నాణేలు, స్టాంపులు, రేడియో, టీవీ మొదలైన వాటి ద్వారా సమస్యకు సంబంధించి తగిన సమాచారాన్ని సేకరించవచ్చు.
 

మూల్యాంకనం: చర్చ ముగిసిన అనంతరం నిర్ణయించుకున్న విద్యాలక్ష్యాలు ఎంతమేరకు సాధించామో తెలియజేసేది మూల్యాంకనం. సమస్య ఎంపిక, ప్రణాళిక రచన, ప్రణాళిక అమలు / చర్చ నిర్వహణ మొదలైనవాటి అన్నింటిని ప్రారంభం నుంచి చివరి వరకు మూల్యాంకనం చేయడం జరుగుతుంది.

చర్చా పద్ధతి - ఉపాధ్యాయుని పాత్ర: చర్చ నిర్వహణలో ఉపాధ్యాయుడు సమన్వయకర్తగా (Moderator) ఉండి, చర్చను క్రమశిక్షణతో, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే విధంగా చూస్తాడు. ముగిసిన తర్వాత మోడరేటర్ చర్చలోని సారాంశాన్ని పునఃశ్చరణ చేసి, చర్చలోని ముఖ్యాంశాలన్నింటినీ క్లుప్తీకరించి, నిర్ణయించిన తీర్మానాన్ని ప్రకటిస్తారు.

సాంఘిక ఉద్గార పద్ధతి / సామాజీకృత కథనం (Socialized Recitation Method)

సామాజీకృత పద్ధతి అంటే ''సాంఘీకరణం చేసిన చర్చ" అని చెప్పవచ్చు. విద్యార్థులు చొరవ తీసుకుని చర్చలు, గోష్టులతో వివిధ పాఠ్యాంశాలను అభ్యసిస్తారు. సాంఘిక ఉద్గార పద్ధతి విద్యార్థులు బోధన - అభ్యసన ప్రక్రియలో చురుగ్గా పాలుపంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. విద్యార్థులలో సృజనాత్మకత, సహజత్వం, స్వీయ ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. సాంఘిక ఉద్గార పద్ధతి విద్యార్థి కేంద్రీకృతంగా ఉండి, సామూహిక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వారిలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందిస్తుంది.

సాంఘిక ఉద్గార పద్ధతి - యాకమ్ & సింప్సన్‌ల నిర్వచనం: ''విద్యార్థులు సహజ వాతావరణంలో సమస్యలపై / విషయాలపై సామూహిక చర్చలు జరిపి, ప్రశ్నలు వేస్తూ, ప్రకటనలు చేస్తూ, పథక రచన చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పాఠ్యాంశాన్ని అభ్యసిస్తారు"

సాంఘిక ఉద్గార పద్ధతి - ఉపాధ్యాయుని పాత్ర: సామాజిక పద్ధతిలో ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శకునిగా, సహాయకునిగా, నిర్దేశకునిగా వ్యవహరిస్తూ విద్యార్థులు తమంతట తామే విషయాలను అన్వేషించేందుకు తోడ్పడతాడు.

సామాజీకృత కథనం ఉద్దేశాలు - హెరాల్డ్ బెంజమిన్:

* విద్యార్థుల పూర్వజ్ఞానానికి అనుబంధ సమాచారం ఇవ్వడం.

* విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను వ్యక్తీకరించేటట్లు ప్రోత్సహించడం.

* ధ్యాన నిగమ్నమైన ఆలోచనలను ప్రేరేపించడం.

* జట్టు పనులలో ఉపయోగపడటానికి సాంకేతిక విధానాలు అభివృద్ధి చేయడం.
* సహకార పద్ధతులలో, విధానాలలో తగు శిక్షణ ఇవ్వడం. విద్యార్థులలో ఆశించిన సాంఘిక వైఖరులను పెంపొందించడం.

చర్చా పద్ధతి, సామాజీకృత పద్ధతి - వివిధ రూపాలు

1. సెమినార్: అనేకమంది విద్యార్థులు ఒక సమస్య గురించి పరిశోధన చేసి తమ తమ ఫలితాలు నివేదిస్తారు. నాయకుడు ప్రతి వ్యక్తికి చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తాడు.

2. వాగ్వాదం: ఒక ప్రత్యేకమైన సమస్యపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలున్న ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది తమ వాదనలు సమర్పిస్తారు.

3. సింపోజియం (Symposium): ఎంపిక చేసిన విషయంలో వివిధ అంశాలపై పాల్గొనే సభ్యులు తమ అభిప్రాయాలను, ఉపన్యాసాల ద్వారా, తాము రచించిన విషయాలు చదివి వినిపించడం ద్వారా చర్చా కార్యక్రమం నిర్వహించడం.

4. జట్టు చర్చ (Panel Discussion): విద్యార్థులు ఒక గ్రూప్‌గా, జట్టు (4 నుంచి 8 మంది)గా ఏర్పడి చర్చను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఒక ఛైర్మన్ ఉంటాడు.

5. కార్యశిబిరం (Workshop): వివిధ విషయాలపై వ్యక్తులు పరిశోధన పత్రాలను పఠించడం, ప్రసంగాలను చేయటం, చర్చలను నిర్వహించటం, ఆచరణ రూపక కార్యాన్ని (Workshop) నిర్వహించటం.

6. మేధోమథనం (Brainstorming): విద్యార్థులు ఒక అంశంపై తమ ఆలోచనా ప్రతిభను, ఇచ్చిన నిర్ణీత సమయంలో వ్యక్తం చేసేలా ప్రేరేపించడాన్ని మేధోమథనం అంటారు. ఒక సమస్యను పరిష్కరించడానికి విద్యార్థి తన మెదడును ఆలోచింపచేయడమే మేధోమథనం.

ప్రయోజనాలు:

* అభ్యసనకు ఉత్తమ ప్రేరణ కలిగిస్తుంది.

* నాయకత్వ శిక్షణ ఇస్తుంది.

* స్వీయ అభిప్రాయ ప్రకటనకు అవకాశమిస్తుంది.

* విద్యార్థులు ఇతరుల అభిప్రాయాలను, భావాలను గౌరవించడం నేర్చుకుంటారు.

* విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. సరైన వైఖరులు అభివృద్ధి చెందుతాయి.

* తార్కిక, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక ఆలోచన విధానం పెంపొందుతుంది. విద్యార్థి సాంఘికీకరణకు అవకాశం ఏర్పడుతుంది.

నష్టాలు / దోషాలు / పరిమితులు:

* కాలయాపనతో కూడింది.

* నిరర్థకమైన చర్చగా పరిణమించవచ్చు.

* అన్ని పాశ్యాంశాలను చర్చా పద్ధతిలో బోధించలేం.

* అనవసరమైన విషయాలు చర్చించే అవకాశం ఉంది.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌