• facebook
  • whatsapp
  • telegram

సాంఘిక, సామాజిక శాస్త్రాల మధ్య పోలికలు  

      సమాజంలో ఒక వ్యక్తికి సంబంధించిన కార్యకలాపాల గురించి తెలియజేసే శాస్త్రాలు సామాజిక శాస్త్రాలు. దేశభక్తి, సహజీవనం, సోదరభావం, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహకార భావన, శాంతియుత జీవనాన్ని పెంపొందించే విజ్ఞానం, అవగాహన నైపుణ్యాలను అందించేది సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రానికి, సామాజిక శాస్త్రానికి పరస్పర సంబంధం అంటే విద్యార్థులు - విద్యార్థులు లేదా వయోజనులు - వయోజనుల మధ్య సహజీవనానికి సంబంధించిన పరస్పర సంబంధమే. దీని నుంచి పాఠశాల, సమాజం (పరిసరాలు), ఈ రెండింటితో మానవుడికి ఉన్న స్వరూప స్వభావాలను తెలుసుకోవచ్చు.
    మానవులు తమ పరిధిలోని ప్రాథమిక అవసరాలు ఎలా తీర్చుకుంటున్నారు? వాటిని ఎలా సమకూర్చుకుంటున్నారనేది సామాజిక, సాంఘిక శాస్త్రాల్లోని భూగోళం, చరిత్ర, పౌర విజ్ఞానం, అర్థశాస్త్రాలను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఇవి రెండూ పరస్పరం సహకరించుకోవడం ద్వారా మానవాభ్యున్నతికి తోడ్పడుతున్నాయి. ఈ రెండింటి స్వభావం ఒక్కటే.

 

భూగోళ శాస్త్రం: దీన్ని ఆంగ్లంలో 'జాగ్రఫీ' అంటారు. జాగ్రఫీ అనే పదం జియో, గ్రఫీయా అనే గ్రీకు పదాల కలయిక నుంచి వచ్చింది. భూమి గురించి వర్ణించేది అని దీని అర్థం. ఇది భూమిపై, భూ అంతర్భాగంలో ఉన్న ప్రకృతి వనరులు ప్రత్యేకంగా నదులు, పర్వతాలు, అడవులు, జంతు సంపద, ఖనిజ సంపద, వాతావరణం, మైదానాలు, ఎడారిప్రాంతాలు మొదలైనవాటి గురించి తెలియజేస్తుంది.


 

చరిత్ర: ఆంగ్లంలో దీన్ని 'హిస్టరీ' అంటారు. ఇది హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది. చరిత్ర పితామహుడు 'హెరిడోటస్'. నూతన విషయాల గురించి పరిశోధన, అన్వేషణ చేసి, దాని ద్వారా అభ్యసనం కొనసాగించడాన్ని 'హిస్టోరియా' అంటారు.
      చరిత్ర భూత - భవిష్యత్ - వర్తమానాలకు సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది. చరిత్ర అంటే గతానికి సంబంధించిన విషయాలను శాస్త్రీయంగా నమోదుచేసిన లిఖిత సమాచారం. గతాన్ని విస్మరిస్తే వర్తమానం లేదు, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఉజ్జ్వల భవిష్యత్తు లేదు అని వివరిస్తుంది. ప్రాచీన నాగరికతలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, రాజులు- వాళ్ల పాలన, యుద్ధాలు- వాటి ఫలితాల గురించి ఇది తెలియజేస్తుంది. చరిత్రను బోధించడం వల్లవిద్యార్థి చారిత్రక కట్టడాలు, వాటి జౌన్నత్యాన్ని గురించి తెలుసుకుని సంస్కృతిని కాపాడుకుంటాడు.

 

పౌరవిజ్ఞానం: పౌరనీతి, పౌర విజ్ఞానాన్ని అంగ్లంలో 'సివిక్స్' అంటారు. పౌరశాస్త్ర పితామహుడు 'అరిస్టాటిల్'. 'సివిటాస్' అనే లాటిన్ పదం నుంచి సివిక్స్ ఆవిర్భవించింది. సివిటాస్ అంటే పురం లేదా నగరం అని అర్థం. సమాజంలో మానవుడు అతడి సంబంధబాంధవ్యాల గురించి తెలియజేసే సామాజిక శాస్త్రమే పౌరశాస్త్రం. పౌరశాస్త్రం రాజ్యం ఆవిర్భవం, ప్రభుత్వ, పౌరుల బాధ్యతలు మొదలైన విషయాల గురించి తెలియజేస్తుంది.
 

అర్థశాస్త్రం: దీన్ని అంగ్లంలో 'ఎకనమిక్స్' అంటారు. ఓకియో, నామస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఎకనమిక్స్ వచ్చింది. ఓకియోనామస్ అంటే 'గృహనిర్వహణాధికారం' అని అర్థం. వస్తు సంపద- జనాభా, ఈ రెండు అంశాల మధ్య పరస్పర సంబంధాల గురించి అర్థశాస్త్రం తెలియజేస్తుంది. వస్తువుల ఉపయోగాలు కొరత, వాటికి విలువలను జమకట్టడం మొదలైన విషయాలను ఇది వివరిస్తుంది. అర్థశాస్త్ర పితామహుడు 'ఆడమ్‌స్మిత్'.
 

1952 సెకండరీ విద్యా సంఘం: భూగోళం, చరిత్ర పౌరవిజ్ఞానాన్ని బోధించాలని పేర్కొంది.
 

1964-66 కొఠారీ కమిషన్: ప్రాథమిక స్థాయిలో (1-7 తరగతుల్లో)సూక్ష్మంగా బోధించాలని కృత్యాధార బోధనను ప్రోత్సహంచి విద్యార్థి సాంఘిక జ్ఞానాన్ని కుటంబస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహించాలని పేర్కొంది.
 

1976-77 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ: పాఠ్యప్రణాళికలో ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానాన్ని బోధించాలని, సామర్థ్యాధార బోధనను ప్రోత్సహించింది.
యశ్‌పాల్ కమిటీ: పాఠ్యపుస్తకాల బరువును, విద్యార్థి ఇంటి పని భారాన్ని తగ్గించాలనీ, పరిసరాల విజ్ఞానం కనీస అభ్యసన స్థాయిని పెంపొందించాలని సూచించింది.
జాతీయ పాఠ్యప్రణాళిక 2005: సాంఘిక శాస్త్రం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పకపోయినా, బోధనలో స్థాయిలవారీగా వర్గీకరణచేసి బోధించాలని సూచించింది.

 

ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రం: ఎన్.సి.ఎఫ్. 2005 ప్రాథమిక తరగతులకు జ్ఞాన నిర్మాణం, విషయ అవగాహాన పటాలు గీసి, ప్రదేశాలను గుర్తించడాన్ని, యశ్‌పాల్ కమిటీ సూచనల ప్రకారం మానవతా, సాంఘిక విలువలను సూక్ష్మ స్థాయిలో బోధించాలని పేర్కొంది.
 

ప్రాథమికోన్నత స్థాయిలో సాంఘిక శాస్త్రం: ఎన్.సి.ఎఫ్.- (2005) 6,7 తరగతుల్లో భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థ శాస్త్రాలను బోధిస్తూనే పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసింపజేయాలని సూచించింది. ప్రభుత్వ స్వరూపం, స్థానిక స్వపరిపాలన పట్ల అవగాహన కలిగించాలని దీని ఉద్దేశం. సెకండరీ స్ధాయిలో సాంఘిక శాస్త్రం ఎన్.సి.ఎఫ్ 2005 ప్రకారం 8,9,10 తరగతుల్లో చరిత్ర, భూగోళం, అర్థ శాస్త్రం, రాజనీతి శాస్త్రాలతోపాటు సామాజిక అంశాలు, నిమ్న దళిత వర్గాల అభ్యున్నతి ఆర్థిక, సాంఘిక సవాళ్లు- పరిష్కార మార్గాల కోసం ఆలోచనను క్రియాత్మకతను పెంపొందించాలని సూచించింది.

కళాశాల స్ధాయిలో సాంఘిక శాస్త్రం: కళాశాల స్థాయిలో ఉన్నత ప్రమాణాలు, వృత్తి విద్యలను అదనంగా బోధించాలని సూచించింది. సాంఘిక శాస్త్రం/ పరిసరాల విజ్ఞానం విద్యార్థుల సంపూర్ణ వికాసానికి దోహదపడుతున్నాయి. విద్యార్థులకు నిర్మాణాత్మక జ్ఞానం, తార్కిక దృక్పథం, హేతుభావనలు, సంస్కృతి పరిరక్షణలకు సంబంధించిన అంశాలను పెంపొందిచాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.
* సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో ఉపాధ్యాయుడు ఒక గ్రామీణ వైద్యుడు.
* సాంఘిక శాస్త్రం సర్దుబాటుతత్వాన్ని నేర్పుతుంది.
* పరిసరాల విజ్ఞానం I, II లను వేర్వేరుగా బోధించాలని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977 పేర్కొంది. వీటిని 1979-80 విద్యా సంవత్సరం నుంచి వేర్వేరుగా ప్రవేశపెట్టారు.
* ఆంధ్రప్రదేశ్‌లో పరిసరాల విజ్ఞానం అధ్యయనాన్ని 1979-80 నుంచి ప్రాథమిక పాఠశాల్లో ప్రవేశపెట్టారు.
* జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం 1-2 తరగతుల్లో పరిసరాల విజ్ఞానంగా, 3-5 తరగతుల్లో పరిసరాల విజ్ఞానం-1, 6-10 తరగతుల్లో సాంఘిక శాస్త్రం అని వ్యవహరిస్తున్నారు.
* విద్యార్థులకు సమాచారం అందించడంలో అకడమిక్ మానిటరింగ్ కమిటీలు, (ఏఎంసీ) మండల వనరుల కేంద్రాలు (ఎంఆర్‌సీ), బాలల సంఘాలు తమ వంతు కృషిని కొనసాగిస్తున్నాయి. సాంఘిక శాస్త్రాన్ని సమైక్యతా విధానంలో బోధిస్తున్నారు.

* నేటి బాలలే రేపటి పౌరులు అనే సంకల్పంతో, బాలబాలికలే రాబోయే సమాజం పురోభివృద్ధికి తోడ్పడతారనేది సాంఘిక శాస్త్రం ముఖ్య ఉద్దేశం. సోదరభావం, శాంతి, సహనం, శాసన విధేయత, దేశసమగ్రత కోసం విద్యార్థులు భవిష్యత్తులో తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్., స్కౌట్స్, గైడ్స్ లాంటి శిక్షణలు ఇప్పించి దేశభక్తిని ప్రోత్సహిస్తుంది.
* పాఠశాల అనేది సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశమని గాంధీజీ పేర్కొన్నారు.

 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌