• facebook
  • whatsapp
  • telegram

భాష - మూల్యాంకనం  

          ఒక పని చేశాక అది ఎంతవరకు ఫలవంతమైందో పరిశీలించుకోవడం అవసరం. పని ప్రారంభించడానికి ముందే కొన్ని లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించడానికి కృషి చేసి, వాటినెంత వరకు సాధించగలిగామో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే మూల్యాంకనం. నికష, పరీక్ష, పరిగణన కంటే విశాలమైన అర్థం ఉన్న పదం మూల్యాంకనం.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్దిని మాపనం చేసేది మూల్యాంకనం. పాఠ్యాత్మక సముపార్జనం చేయడానికి తోడ్పడేది పరీక్ష. ఎలాంటి సంప్రదాయాలను పాటించకుండా స్వల్ప వ్యవధిలో నిర్వహించేది నికష.
* నికష
(Test): Testum అనే లాటిన్ పదం నుంచి test అనే పదాన్ని స్వీకరించారు. Testum అంటే some special type of earthen pot (ఒక విధమైన మూస).
* స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైంది నికష.
* ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైంది నికష.
* బోధించినవి మాత్రమే అడగదగింది నికష.
* నికషలు సంప్రదాయబద్ధమైనవి కావు.

           
* పరీక్షలు (
Examinations): Examen అనే లాటిన్ పదం నుంచి Examine అనే పదాన్ని గ్రహించారు. Examen అంటే the pointer of balance (త్రాసులోని ముల్లు).
* పూర్వకాలంలో పరీక్షలు మౌఖికంగా మాత్రమే ఉండేవి.
* కాంచీపురం, నలంద, తక్షశిల మొదలైన చోట్ల ఘటికా స్థానాలు (విద్యాపీఠాలు) ఉండేవి.
* ఆంగ్లేయుల రాకతో మన పరీక్షా విధానంలో అనేక మార్పులు వచ్చాయి.
* భాషా నైపుణ్యాల్లో మనం పరీక్షిస్తున్నది కేవలం లేఖనాన్ని మాత్రమే.
* పరీక్షలు సంప్రదాయబద్ధమైనవి.
* కేవలం పాఠ్యాత్మక సముపార్జనాన్ని మాపనం చేసేదే పరీక్ష.
* పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించేవిగా ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో 'నిలుపుదలరహిత విధానాన్ని'
(Non Detention System) 1971 లో ప్రవేశపెట్టారు. దీంతో నూతన మూల్యాంకనా విధానం అమల్లోకి వచ్చింది.
* విద్యార్థుల సముపార్జనను మదింపు చేయడంలో ఉపాధ్యాయుడు చేపట్టే చర్యల్లో ముఖ్యమైంది, సమగ్రమైందీ మూల్యాంకనం.
* విద్యార్థుల శారీరక, మానసిక, సామాజిక, వైజ్ఞానిక అభివృద్ధిని పరిగణించడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది.
* తరగతిలో ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఎంత వరకు గ్రహించారో తెలుసుకోవడానికి తీసుకునే చర్య - మూల్యాంకనం.

 


1. నిర్మాణాత్మక మూల్యాంకనం (Formative Evaluation): ఒక పాఠం పూర్తవగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరాయో లేదో తెలుసుకోవడానికి చేసేది.
* నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది భాషలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం మొదలైన నైపుణ్యాల్లో నిత్యం జరుగుతున్న మార్పులను నిర్ధారణ చేసి, విద్యార్థుల భాషావికాసానికి ఉపకరిస్తుంది.

 

2. సమగ్ర/ సంచిత మూల్యాంకనం (Summative Evaluation): విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం.
సంవత్సరంలో విద్యార్ధి అభ్యసించిన 'అన్ని' అంశాలను మదింపు చేసే మూల్యాంకనం. ఉదా: వార్షిక పరీక్షలు.

 

3. సామర్థ్యాధార మూల్యాంకనం (Competitive Evaluation): కనీస అభ్యసన స్థాయులను దృష్టిలో ఉంచుకుని చేసే మూల్యాంకనం.
లక్ష్యాధార మూల్యాంకనం - ఆధునికీకరణ
మూల్యాంకన ఆధునికీకరణ కింది మూడు అంశాలపై ఆధారపడుతుంది.
1. లక్ష్యాలు
2. అభ్యసనానుభవాలు
3. మూల్యాంకనం
                   లక్ష్యాలు 
       
      
 అభ్యసనానుభవాలు               మూల్యాంకనం

 

 


                                              ఉత్తమ నికష లక్షణాలు

1. ప్రామాణికత: ఉపాధ్యాయులు ఆశించిన ప్రయోజనాలను/ లక్ష్యాలను మాపనం చేయాలి.
2. విశ్వసనీయత: జవాబులకు 'ఎన్ని' పర్యాయాలు విలువ కట్టినా మార్కుల్లో మార్పు రాకూడదు.
3. సమగ్రత/ వ్యాపకత: 'అన్ని' బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి.
4. వస్తునిష్ఠత: సార్వజనీన లక్షణం కలిగి ఉండటం అవసరం. వ్యక్తులు, వస్తువుల ప్రభావం ఉండకూడదు.
5. ఔపయోగికత/ ఆచరణాత్మకత: తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండాలి.

 నికష: స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి వీలైంది.
* బోధించిన వెంటనే నిర్వహించేది. 
* బోధించిన అంశాన్ని విద్యార్థి అర్థం చేసుకున్నాడో లేదో గ్రహించడానికి ఉపాధ్యాయుడికి తోడ్పడుతుంది. 
* నికష అనే పదానికి ఆంగ్లంలో సమానార్థక పదం Test . ఇది
Testum  అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది.
*
Testum అంటే Some Special Type of Earthen Part (ఒక విధమైన మూస) అని అర్థం.

నికషలు - లక్షణాలు:
* గణన సూచి కలిగి, గణన సక్రమంగా ఉంటుంది.
* విద్యార్థుల వాస్తవ విద్యార్జనను సరిగ్గా అంచనా వేయవచ్చు. 
* విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని తెలుసుకోవడానికి వీలుంటుంది.
* ప్రశ్నపత్రాన్ని శాస్త్రీయంగా వివిధ పట్టికల ఆధారంగా తయారుచేస్తారు.

 

నికషలు - రకాలు:
1) సూత్రాధారిత నికష:
నికషల వల్ల లభించిన సామూహిక ప్రమాణాల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని ఇతర విద్యార్థుల ప్రగతితో పోల్చి చూసే నికష.

2) ప్రమాణాధారిత నికష: విద్యార్థి తానుగా సాధించిన ప్రమాణాల ఆధారంగా అతడి ఫలితాలను పోల్చి చూసే నికష. ఇది వైయక్తికమైంది.
3) ప్రామాణిక నికష: ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థి ప్రావీణ్యతను మదింపు చేసే నికష.
* విద్యార్థి అభిరుచి, ఆసక్తి, వైఖరులు, సృజనాత్మకతను పరిశీలించడానికి ఉపయోగపడుతుంది.
* ఇది మనోవైజ్ఞానిక నికష. 
* ఉపాధ్యాయ నిర్మిత నికషలు ప్రామాణిక నికషలై ఉంటాయి.

 

అప్రామాణిక నికషలు:
* విద్యార్థి అభ్యసనంలో ఎంత ఉప లబ్ధి పొందగలడో తెలుసుకోవడానికి ఉపకరించే నికష.
* ఛాత్రోపాధ్యాయుడి స్వీయ మూల్యాంకనం, బోధనా మూల్యాంకనం అప్రామాణిక నికషలో భాగాలు.
* భాషా పరమైన సామర్థ్యాలను పరిశీలిస్తుంది.

 

విద్యార్జన నికష/విద్యా ఉపలబ్ధి నికష/విద్యాసాధక నికష:
* తెలుగు వాచకంలో ఒక పాఠం, యూనిట్‌ బోధన తర్వాత విద్యార్థుల ప్రవర్తనలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకోవడానికి దోహదపడే నికష.
* ఇవి చిన్నగా ఉండి తరచుగా నిర్వహించడానికి, విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, మార్గదర్శనం చేయడానికి ఉపయోగపడతాయి.

పరీక్ష: విద్యార్థులకు కొన్ని ప్రమాణాలు నిర్ణయించి వారి విద్యాసముపార్జనా స్థాయి నిర్ణయించిన విద్యాప్రమాణాలతో సరితూగుతుందా లేదా అని తెలిపేదే పరీక్ష.
* సంప్రదాయాలను పాటించేదే పరీక్ష. ఇది కేవలం పాఠ్యాత్మక సముపార్జనను మాత్రమే మాపనం చేస్తుంది. 
*
Examination అనే పదం Examen అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది.
*
Examen అంటే The Pointer of a Balance (త్రాసులోని ముల్లు).

 

మాపనం: 
* మాపనం అంటే ‘కొలవడం’.
* ఒక వస్తువు గుణం, రూపం, పరిమాణం, స్వభావాన్ని (భౌతిక, బాహ్య రూపాన్ని) ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలతో జతపరచి పోల్చగలిగే విధానాన్ని మాపనం అంటారు. ఇది కనిపించే పరిమాణాత్మక వర్ణనకే పరిమితం.

 

మూల్యాంకనం:
* విద్యార్థుల సముపార్జనను మదింపు చేయడానికి ఉపాధ్యాయుడు చేపట్టే చర్యల్లో సమగ్రమైంది, ముఖ్యమైంది మూల్యాంకనం.
* మూల్యాంకనం నిరంతర ప్రక్రియ లేదా అవిరళ ప్రక్రియ.
* లక్ష్యాధార బోధన ఎంతవరకు జరిగిందో తెలుసుకునేందుకు దోహదపడుతుంది.

* మూల్యాంకన ఆధునీకరణ మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది
అవి: 1) లక్ష్యాలు
     2) అభ్యసన అనుభవాలు
     3) మూల్యాంకనం
* పిల్లల్ని భయంతో చదువుకునేలా ప్రేరేపించడం మూల్యాంకనం లక్ష్యం కాదు.   -NCF - 2005
* ఒక అంశానికి సంబంధించి బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత దాని ఫలితం కోసం పరీక్ష నిర్వహించడాన్నే మూల్యాంకనం అంటారు.
మదింపు: బోధనాభ్యసన ప్రక్రియలో పిల్లలకు తెలియకుండానే వారి సామర్థ్యాలను పరీక్షించడాన్ని మదింపు అంటారు. 
* మదింపు ఒక కోణానికి సంబంధించింది మాత్రమే.

 

మదింపు మూడు సందర్భాల్లో నిర్వహిస్తారు:
1) అభ్యసనం కోసం మదింపు
(Assessment for Learning): పిల్లలు అభ్యసన ప్రక్రియల్లో పాల్గొన్నప్పుడు అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడానికి చేసే మదింపు.
2) అభ్యసనం జరుగుతున్నప్పుడు మదింపు
(Assessment as Learning): పిల్లలు అభ్యసన సన్నివేశాల్లో పాల్గొని నేర్చుకుంటున్నప్పుడు వారిని మూల్యాంకనం చేయడాన్నే అభ్యసనం జరుగుతున్నప్పుడు మదింపు అంటారు.
* పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాలు పిల్లల సమగ్ర వికాసానికి దోహదపడేవిగా ఉండాలి.

 

అభ్యసనను మదింపు చేసే సందర్భాలు: 
* పాఠ్యాంశంపై జరిగే చర్చలో
* కృత్యాలు, జట్టుపనుల నిర్వహణ ద్వారా భావనల అవగాహన 
* ప్రాజెక్టు పనుల ద్వారా నేర్చుకోవడం
* నమూనాలు, పటాలు, మాదిరులు, గ్రాఫ్‌లు రూపొందిస్తున్నప్పుడు
* సృజనాత్మక కృత్యాల్లో పాల్గొంటున్నప్పుడు
* మైండ్‌ మ్యాపింగ్‌పై జరిగే చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నప్పుడు


3) అభ్యసనం యొక్క మదింపు: * పిల్లలు ఆయా సామర్థ్యాల్లో ఎంత అభివృద్ధి చెందారో, ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేదే అభ్యసనం యొక్క మదింపు.
* పిల్లల మార్కులు గ్రేడుల రూపంలో ప్రదర్శితమవుతాయి. 
* దీన్ని ఉపాధ్యాయులు మూల్యాంకనం చేస్తారు. 
* ఇది సంవత్సరానికి మూడు సార్లు జరుగుతుంది.
* ఈ విధానంలో విద్యార్థులను ఒకేవిధంగా మూల్యాంకనం చేస్తారు.

 

అభ్యసనం యొక్క మదింపు లక్షణాలు:
* కేవలం ఉపాధ్యాయులు లేదా బాహ్య నికషల ఆధారంగా పిల్లల ప్రగతిని అంచనా వేస్తుంది.
* పిల్లల ప్రగతి ఫలితాలు, మార్కులు గ్రేడుల ద్వారా ప్రదర్శితమవుతాయి.

 

మూల్యాంకనం - రకాలు
1) లోపనిర్ధారణ మూల్యాంకనం
(Diagnostic Evaluation):- విద్యార్థి వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి తోడ్పడే మూల్యాంకనం.
     విద్యార్థి ఏయే సామర్థ్యాల్లో వెనుకబడి ఉన్నాడో దానికి గల కారణాలను కనుక్కొని, వాటిని నివారించడానికి బోధనా వ్యూహాలు నిర్మించుకుని తగిన సామర్థ్యాలను అభివృద్ధి పరచడానికి దోహదపడే మూల్యాంకనం.
2) ప్రాగుక్తిక మూల్యాంకనం
(Prognostic Evaluation):- విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించే మూల్యాంకనం. రాబోయే కాలంలో ఒక జ్ఞాన క్షేత్ర అభ్యసన విధానంలో సాధించిన ప్రగతిని అంచనావేసే మూల్యాంకనం.
* విద్యార్థి భవిష్యత్‌ విద్యా జ్ఞాన ప్రగతిని సూచిస్తుంది.

 

మూల్యాంకనం - లక్షణాలు
వస్తు నిష్ఠత: సార్వజనీన లక్షణం కలిగి ఉండటమే కాకుండా వ్యక్తిగత అపేక్షలు, నిరపేక్షలకు అతీతమై ఉండటం.
* మదింపు చేసే దానిపై ఇతర ప్రభావాలేవీ పడకుండా జాగ్రత్త వహించడమే వస్తు నిష్ఠత.

ప్రామాణికత: ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేసే లక్షణం ప్రామాణికత.
ఔపయోగిత: విద్యావ్యవస్థలో భాగస్వాములైన అందరూ ఈ మూల్యాంకనా సాధనాలను సులభంగా వినియోగించుకోగలిగినప్పుడే వీటికి ఔపయోగికత లక్షణం ఉంటుంది.
నిరంతరత: మూల్యాంకనం ఏదో ఒక సమయంలో కాకుండా బోధనాభ్యసన ప్రక్రియలో నిరంతరం కొనసాగడం.
సమగ్రత: అన్ని అంశాలకు మూల్యాంకనంలో ప్రాధాన్యం ఉండటం. మూల్యాంకనాన్ని కేవలం పాఠ్యవిషయాలకే పరిమితం చేయకుండా సహపాఠ్య కార్యక్రమాలను కూడా పాఠ్య కార్యక్రమాల్లో భాగంగా మూల్యాంకనం చేయడం.

 

నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)
* విద్యాహక్కు చట్టం - 2009, అధ్యాయం - 5, సెక్షన్‌ − B, సబ్‌ సెక్షన్‌ − 2 ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలి.
* పాఠశాల లోపల, వెలువల పిల్లల శారీరక, మానసిక వికాసాలను క్రమపద్ధతిలో పరిశీలిస్తున్నామని వారికి తెలియకుండా పరిశీలించాలి.
* బోధనాభ్యసన ప్రక్రియలను ఏదో ఒక సంఘటనకో, సందర్భానికో పరిమితం కాకుండా అభ్యసనాలన్నింటినీ పరిశీలించడమే నిరంతరం సమగ్ర మూల్యాంకనం. 
* సమగ్రం అంటే పిల్లల సర్వతోముఖాభివృద్ధి. పిల్లలు శారీరక, మానసిక, నైతిక, సాంఘిక, భావోద్వేగ, జ్ఞానాత్మక రంగాల్లో అభివృద్ధి చెందడం.

 

నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం మూల్యాంకనం రెండు రకాలు
    1) నిర్మాణాత్మక మూల్యాంకనం
    2) సంగ్రహణాత్మక మూల్యాంకనం

 

నిర్మాణాత్మక మూల్యాంకనం
* CCE విధానంలో కీలకమైన మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం.
* నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని సంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహించాలి.
* నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొదటిది పిల్లల భాగస్వామ్యం - ప్రతి స్పందనలు.

 

పిల్లల భాగస్వామ్యం - ప్రతిస్పందనలకు ఆధారాలు
1) ఉపాధ్యాయుడి వైఖరి
2) పరిశీలన
* పిల్లల భాగస్వామ్యం - ప్రతిస్పందనల స్థానంలో ప్రస్తుతం పుస్తక సమీక్షను చేర్చారు.
* పిల్లలతో నిష్పక్షపాతంగా పుస్తక సమీక్ష చేయించాలి.
* విద్యార్థులు సాధించిన సామర్థ్యాలను నమోదు చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయ డైరీ దోహదపడుతుంది.
* పిల్లల డైరీ రాత పనులకు ఆధారం. వారి అభిరుచులు, ఆసక్తులను తెలుసుకోవడానికి పిల్లల డైరీ దోహదపడుతుంది.
* పిల్లలు రాసిన కవితలు, కథలు; గీసిన బొమ్మలు లాంటివన్నీ కలిపి పోర్టుఫోలియో అంటారు. 

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌