• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌లో భాషాభివృద్ధి కార్యక్రమాలు  

పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం:
* పిల్లలంతా చదవడం, రాయడం లాంటి సామర్థ్యాల సాధనకు రూపొందించిన కార్యక్రమమే పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం.
* 2005 - 06 విద్యా సంవత్సరాన్ని పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించి అమలుచేశారు. 
* సర్వ శిక్షా అభియాన్‌ 2005 - 06లో పాఠశాలల్లోని పిల్లలందరికీ చదవడం, రాయడం నేర్పి ప్రాథమిక దశలో ఆయా తరగతులకు నిర్దేశించిన సామర్థ్యాలు సాధించడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. 
* పిల్లల్లో సరైన భాషాభివృద్ధి జరగడానికి చదవడం, రాయడం లాంటి కనీస నైపుణ్యాలు సాధించాలి. వీటి ఆధారంగా భాషాభివృద్ధి సాధించవచ్చు.

 

పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమ లక్షణాలు:
* అవసరం ఆధారంగా రూపొందించిన కార్యక్రమం.
* ప్రత్యేక లక్ష్య సాధన కోసం రూపొందించారు. 
* స్థానిక అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా తయారుచేసిన కార్యక్రమం.
* వికేంద్రీకరణ ప్రాధాన్యత.
* వ్యక్తిగతంగా ఒక్కొక్కరిపై దృష్టి సారించే కార్యక్రమం.
* పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకునే కార్యక్రమం.

 

పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం - కార్యాచరణ ప్రణాళిక అమలు:
* పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం ప్రారంభానికి ముందే మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా స్థాయి నిర్ధారణ జరుగుతుంది. 
* జులై నెలలో ప్రారంభ స్థాయి మూల్యాంకనం చేయాలి.

 

చదవడం, రాయడం ఎంతమంది చేయగలరో గుర్తించడానికి కింది పరీక్షలు నిర్వహించాలి
చదవడం:
* బోధించిన పాఠాన్ని చదవమనాలి.
* గొణగకుండా, తప్పులు లేకుండా చదివితే చదవగలిగిన వారిగా గుర్తించాలి.

 

రాయడం:
* ఉక్తలేఖనంగా 20 పదాలను చెప్పాలి.
* 20 పదాల్లో 15 పదాలను బోధించిన పాఠాల్లోనుంచే డిక్టేషన్‌గా చెప్పాలి.
* ఈ 15 పదాల్లో 5 గుణింత పదాలు, 5 ద్విత్వాక్షర పదాలు, 5 సంయుక్తాక్షర పదాలు ఉండాలి. 5 పాఠ్యేతర పదాలు కూడా ఉండాలి.

* పాఠ్యేతర పదాల్లో తల్లిపేరు, తండ్రిపేరు, ఉపాధ్యాయుడి పేరు, ఇష్టమైన పేరు, ఇష్టమైన పండు, పువ్వు లాంటి అంశాలను పరీక్షించాలి.
* పిల్లల స్థాయిని గుర్తించిన తర్వాత చదవడం, రాయడం సామర్థ్యాలకు సంబంధించిన కృత్యాలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు.
* విద్యార్థి ప్రగతిని పరిశీలించడానికి పిల్లల స్థాయిని నెలవారీగా ప్రతి తరగతి ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

 

తరగతి, పాఠశాల గ్రేడింగ్‌:
* తరగతి వారీగా ఎంతమంది రాయడం, చదవడం చేయగలుగుతారో దాని ఆధారంగా తరగతి గ్రేడింగ్‌ ఇస్తారు. 
* 2, 3, 4, 5 తరగతుల్లోని మొత్తం పిల్లల్లో ఎంతమంది పిల్లలు చదవడం, రాయడం చేయగలుగుతారో దాని ఆధారంగా పాఠశాల గ్రేడింగ్‌ ఉంటుంది.

 
 

మూల్యాంకనం:
పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నవంబరులో మధ్యంతర మూల్యాంకనాన్ని నిర్వహించాలి.
* దీన్ని రాష్ట్ర స్థాయిలో ప్రశ్నపత్రం ఆధారంగా నిర్వహిస్తారు. 
* దీన్ని బయటి వ్యక్తులు నిర్వహిస్తారు.
* మార్చి నెల చివరిలో పిల్లల ప్రగతి, వారి సామర్థ్యాల అభివృద్ధిని పరిశీలించడానికి వార్షిక మూల్యాంకనం నిర్వహిస్తారు.
* ఇది కూడా రాష్ట్ర స్థాయిలో రూపొందించిన ప్రశ్నపత్రం ఆధారంగా జరుగుతుంది.
* దీని ఫలితాలను విశ్లేషించి ఏప్రిల్‌ నెలలో తగిన చర్యలు తీసుకుంటారు.
* ఈ పరీక్షను రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పరిశీలకులు పర్యవేక్షిస్తారు.

 

పిల్లల భాషాభివృద్ధి - ప్రత్యేక కార్యక్రమాలు:
గోడ పత్రిక: 

* ప్రతి తరగతిలో గోడపత్రిక నిర్వహించాల్సి ఉంటుంది.
* దీన్ని సాంస్కృతిక ప్రచార కమిటీ నిర్వహిస్తుంది.
* ఏ రోజు ప్రదర్శనాంశాలను ఆ రోజు తొలగించాలి. 
* దీని ముఖ్య ఉద్దేశం పిల్లలు నేర్చుకున్న, సేకరించిన విషయాలు; వారి అభిరుచులు, ఆసక్తులు ప్రదర్శించడం.

బాలల సంఘాలు:
* పాఠశాలలు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వాములను చేస్తాయి. వారికి అప్పగించిన కార్యక్రమాన్ని నిర్వహించే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి. 
* దీని కోసం నాలుగు బాలల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి.
అవి: 1) ఆరోగ్య పరిశుభ్రత కమిటీ
     2) సమాచార సాంస్కృతిక కమిటీ 
     3) గ్రంథాలయ కమిటీ 
     4) రివ్యూ కమిటీ

 

టీచర్‌ డైరీ:
* ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా చేసిన వాటిని నమోదు చేసుకోవడానికి, విద్యార్థుల సామర్థ్యాలు, ప్రగతి నమోదుకు టీచర్‌ డైరీ రాయాలి.
* సామర్థ్యాల అభివృద్ధికి కృత్య నిర్వహణలో ఎక్కడ లోపం జరిగింది, వాటిని పిల్లలు ఎందుకు చేయలేకపోయారు అనే అంశాలు రాసుకోవాలి.
* ఈ డైరీ తరగతి గది నిర్వహణ ఫలప్రదమవడానికి దోహదపడుతుంది.

 

భాషోత్సవం:
* తరగతి వారీగా వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, బొమ్మలు గీయడం, కథలు చెప్పడం లాంటి వాటిని పిల్లలతో నిర్వహించాలి.
* ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో వారం రోజుల పాటు నిర్వహించిన తర్వాత పాఠశాల సముదాయ, మండల స్థాయిలో ఒకరోజు నిర్వహించాలి.
* దీని వల్ల పిల్లల్లో పోటీతత్వం, ఆత్మస్థైర్యం, భాషాభివృద్ధి పెరుగుతుంది.

 

చిన్నారుల సభ:
* చిన్నారుల సభను ప్రతి పాఠశాలలో సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలి.
* పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి ఈ సభ దోహదపడుతుంది.
* ఇది భాషా వికాసానికి దోహదం చేస్తుంది.

 

పఠనోత్సవం:
* పాఠశాలలోని పిల్లలతో వారి స్థాయికనుగుణంగా లైబ్రరీ పుస్తకాలు చదివించాలి. చదివిన పుస్తకంలోని విషయం గురించి మాట్లాడించాలి.
* వార్తాపత్రికలు, కథల పుస్తకాలను చదివించి, క్విజ్‌ పోటీలు నిర్వహించాలి.

 

స్నేహబాల (1, 2 తరగతుల స్వయం అభ్యసనా సామగ్రి) 
*  స్నేహబాల అంటే స్నేహపూరిత వాతావరణంలో పరస్పర చర్చల ద్వారా జరిగే అభ్యసనం.
* పిల్లలు సొంతంగా ఆలోచిస్తూ, స్వయం అభ్యసనంతో జ్ఞాన నిర్మాణం జరగడానికి వీలుగా రూపొందించిన కార్డుల ద్వారా అభ్యసించే కార్యక్రమమే స్నేహబాల.
* స్నేహబాల స్వయం అభ్యసన కార్డులను 1, 2, 3 తరగతుల తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులకు రూపొందించారు.

 

స్నేహబాల కార్డుల ఆవశ్యకత:
* ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య స్వేచ్ఛా వాతావరణంలో సహజంగా, వివిధ సన్నివేశాల ద్వారా బోధనాభ్యసన ప్రక్రియ నిర్వహిస్తారు. 
* ప్రతి తరగతిలో విద్యార్థులు ఒక్కో స్థాయిలో నేర్చుకుంటారు. దీన్నే బహుళస్థాయి అభ్యసనం అంటారు.
* తరగతి బోధనలో స్థాయిలవారీగా అభ్యసనానికి సహాయపడతాయి.
* పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించడానికి, అభ్యసనం ఆనందంగా జరగడానికి దోహదపడతాయి.
* పాఠ్యాంశాలకు నిత్యజీవిత సన్నివేశాలను అనుసంధానం చేస్తారు. 
* 1, 2 తరగతులకు ఆశించిన సామర్థ్యాలు సులభంగా సాధించవచ్చు.
* NCF - 2005లోని మౌలిక సూత్రాలను స్నేహబాలకు అన్వయించి తయారుచేస్తారు.

 

స్నేహబాల కార్డుల రూపకల్పన నేపథ్యం:
* వీటిని చిత్తూరు జిల్లాలోని ‘రివర్‌
(Rishy Valley Educational Resource Centre) సంస్థ’ అందిస్తున్న బోధనా విధానం ఆధారంగా రూపొందించారు.
* రివర్‌ సంస్థలో 'పెట్టెలోని బడి
(School in Box)' కిట్‌ ద్వారా జరిగే విద్యా విధానాన్ని పరిశీలించిన తర్వాత దీన్ని కర్ణాటక రాష్ట్రంలో ‘నలికలి’ పేరుతో అమలుచేశారు.
* చెన్నై కార్పొరేషన్‌
ABC (Activity Based Cards) పేరుతో 40 పాఠశాలల్లో కిట్‌ వాడకాన్ని ప్రారంభించింది. 
* కృష్ణా జిల్లాలోని వెనుకబడిన ఏజెన్సీకి చెందిన 12 మండలాల్లో ‘కృష్ణవేణి’ పేరుతో ‘జనశాల’ ప్రాజెక్టు కింద కిట్‌లు తయారుచేసి పాఠశాలల్లో అమలుచేశారు.
* చిత్తూరు జిల్లాలో యునిసెఫ్‌ సహకారంతో ఈ కిట్‌ను తయారుచేసి స్నేహబాల పేరుతో కార్డులను రూపొందించి 1, 2 తరగతులకు అమలుచేశారు.
స్నేహబాల కార్డులు     -     మైలు రాళ్లు
       1వ తరగతి     -        28
      2వ తరగతి      -        23

* 1వ తరగతిలో ప్రతి మైలురాయిలో ఉండే కార్డులు 5.
అవి: 1) పాఠం వినడం, మాట్లాడటం
     2) చేయడం
     3) రాయడం
     4) మూల్యాంకనం
     5) చదువు - ఆనందించు
1వ తరగతి *తెలుగుకు మొత్తం కార్డులు 140 (28 × 5).
* 2వ తరగతిలో ఒక్కో మైలురాయికి ఉండే కార్డులు 6.
అవి: 1) పాఠం వినడం, మాట్లాడటం
     2) చేయడం
     3) రాయడం
     4) మూల్యాంకనం
     5) పదజాలాభివృద్ధి
     6) చదువు - ఆనందించు
* 2వ తరగతి తెలుగుకు మొత్తం కార్డులు 138 (23 × 6).
* 1వ తరగతిలో పదజాలాభివృద్ధి కార్డు ఉండదు.

* స్నేహబాల కార్డులు - లోగోల వివరణ:
* ప్రతి కార్డుకు ఒక లోగో ఉంటుంది.
* ప్రతి లోగో నిర్వహించాల్సిన కృత్యాలు అంటే పాఠం చెప్పడం, ఆయా సామర్థ్యాల అభివృద్ధికి సంబంధించినవి సూచిస్తారు. 
* ప్రతి కార్డు పైభాగాన ఎడమవైపు లోగో ఉంటుంది.
        

తరగతిగదిలో కార్డుల అమరిక - నిర్వహణ:
* తరగతివారీగా కార్డులు విభజించి విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యాలను సాధించాల్సింది ఉపాధ్యాయుడే.
* తరగతివారీగా కార్డులను ట్రేలో మైలురాయి ఆధారంగా అమర్చుకోవాలి.
* కార్డులను ఒక సంచిలో భద్రపరచాలి. వీటిని ఆయా తరగతుల విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి.
* జూన్‌ నుంచి ఏప్రిల్‌ వరకు నెలవారీగా మైలురాళ్లను క్రమంలో నిర్వహించాలి.
* ప్రతి మైలురాయి చివర మూల్యాంకనం కార్డు ఉంటుంది.
* 2వ తరగతికి చెందిన పదజాలాభివృద్ధికి సంబంధించిన కార్డులు పూర్తిచేసిన తర్వాత పిల్లలు అదనపు పదాలు తయారు చేసేవిధంగా ప్రోత్సహించాలి.
* 1, 2 తరగతుల్లో రాయడానికి సంబంధించిన కృత్యాలను రన్నింగ్‌ బ్లాక్‌ బోర్డ్‌పై విద్యార్థులతో రాయించాలి.
* 2వ తరగతిలోని పద్యాలను రాగయుక్తంగా పాడేలా ఉపాధ్యాయుడు ఆదర్శపఠనం చేసి పాడించాలి.

 

బాల సాహిత్యం:
* పిల్లల ఉద్వేగ, మానసిక వికాసాలు పునర్బలనం చెందాలనే ఉద్దేశంతో పాఠశాలలకు బాలసాహిత్యాన్ని అందిస్తున్నారు. 
* బాల సాహిత్యం పిల్లలను స్వతంత్ర పాఠకులుగా తీర్చిదిద్దడానికి, చక్కని పఠనాభిరుచిని పెంపొందించడానికి, గ్రంథ పఠనం ఒక అలవాటుగా మార్చడానికి తోడ్పడుతుంది.

* పది కథల పుస్తకాలు చదివిన తర్వాత పదకొండో పుస్తకంగా పాఠ్యపుస్తకం ఉండాలి.- ప్రొఫెసర్‌ కృష్ణకుమార్‌
* ‘వానచినుకులు’ కథా పుస్తకాలను పఠన ప్రారంభ సామగ్రిగా ఉపయోగించుకోవాలి.

 

చదువు - ఆనందించు - అభివృద్ధి చెందు: 
* రాష్ట్ర ప్రభుత్వం 2006 - 07లో మొదటిసారి ‘చదువు - ఆనదించు - అభివృద్ధి చెందు’ పేరుతో ఒక పఠనాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది.
* ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక తరగతులు పూర్తయ్యేసరికి పిల్లలందరికీ చదవడం ఒక అలవాటుగా మారాలి.
* ఈ కార్యక్రమం విద్యార్థుల విరామకాల సద్వినియోగానికే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి, సత్ప్రవర్తనలు అలవడటానికి, సముచిత మనోవైఖరుల పెరుగుదలకు తోడ్పడుతుంది.

 

READ కార్యక్రమ లక్ష్యాలు:
* పిల్లలందరూ చదవాలి. చదువుతూ ఎదగాలి.
* పఠనంతో ధారాళత రావాలి. వారిలో పఠనా శక్తిని పెంపొందించాలి.
* పఠనం ఒక అలవాటుగా, నిత్యకృత్యంగా మారాలి.
* పఠన సామర్థ్యంతోపాటు లేఖన నైపుణ్యాన్ని, దోష రహిత లేఖనాన్ని పెంపొందించాలి.
* ప్రకాశ పఠనం, మౌన పఠనం, విస్తార పఠనం, క్షుణ్న పఠనం లాంటి పఠన వ్యూహాలను విద్యార్థులకు పరిచయం చేయాలి.

 

పాఠశాలల్లో వినూత్న ప్రయోగాలు:
పిల్లల డైరీ:

* పిల్లలు తాము ప్రతిరోజు నిర్వహించాల్సిన కృత్యంగా దినచర్యను భావించాలి. 
* విద్యార్థుల్లో సమయపాలనా దృక్పథాన్ని పెంపొందిస్తుంది.
* విద్యార్థులు భవిష్యత్‌లో మంచి రచయితలుగా మారే అవకాశం ఉంటుంది.
* విద్యార్థులకు సమయ ప్రాధాన్యత తెలిసి, తాము ఏయే రంగాల్లో పాల్గొనాల్సి ఉందో తెలుస్తుంది.

 

గోడపత్రిక/పాఠశాల పత్రిక:
* విద్యార్థుల్లోని సృజనాత్మకత, ఊహలు, వారిలో ఉండే రచనాశక్తిని, పఠనాశక్తిని ప్రదర్శించడానికి తోడ్పడుతుంది.

 

పాఠశాల తపాల పెట్టె:
* విద్యార్థుల ఆలోచనలు, అభిప్రాయాలు, వారికి పాఠశాలలో ఎదురవుతున్న కష్ట నష్టాలను, ఇబ్బందులను స్వేచ్ఛగా వెల్లడించడానికి తోడ్పడుతుంది.

 

ఇతర ప్రయోగాలు
బడిబాట:

* ఆవాస ప్రాంతంలోని 5 - 14 ఏళ్ల వయసు గల పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్చే కార్యక్రమం.
* ముఖ్యంగా బాలకార్మికులు, ఆడపిల్లల నమోదుపై ప్రత్యేక దృష్టి చూపాలి.
* దీన్ని విద్యా సంవత్సర ప్రారంభంలో నిర్వహించాలి.

* పాఠశాల వార్షికోత్సవం:
* ప్రతి పాఠశాల విద్యా సంవత్సరం చివర, అనువైన సమయాల్లో పరీక్షల కంటే ముందే పాఠశాల వార్షికోత్సవాలను నిర్వహించాలి.

 

బాలల మేళ/పాఠశాల మేళ:
* ఈ మేళాను విద్యా సంవత్సరంలో ఒకటి రెండు సార్లు నిర్వహిస్తారు.
* దీనికోసం సమాజంలోని అన్ని వర్గాల వారి సహకారంతో పిల్లలు తమ అభ్యసనానికి అవసరమైన ఉపకరణాలను సేకరించాలి లేదా సిద్ధం చేయాలి. 
* పిల్లలు తయారుచేసిన సామగ్రిని ప్రదర్శించి తమ పాఠశాల విద్యార్థుల ప్రతిభాపాటవాలను సమాజానికి తెలియజేయాలి, తద్వారా తల్లిదండ్రులకు సంతృప్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ మేళాను నిర్వహిస్తారు. 
* దీని ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మక, కల్పనాత్మక, అన్వేషణాత్మక నైపుణ్యాలకు పదును పెట్టవచ్చు.
* రాష్ట్రంలో భాషాభివృద్ధిని సాధించడానికి పైన పేర్కొన్న కార్యక్రమాలన్నింటినీ అమలు చేసినట్లయితే పిల్లల్లో భాషాపరంగా అభివృద్ధిని సాధించవచ్చు.

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌