• facebook
  • whatsapp
  • telegram

భాషా సామర్థ్యాలు - విద్యా ప్రమాణాలు  

* మానవుడిలోని మానసిక, సాంఘిక, ఉద్వేగ, సాంస్కృతిక కళావికాసాలన్నింటికీ భాషే పట్టుగొమ్మ.
* మనిషి మూర్తిమత్వ వికాసానికి మూలం భాష.
* సమాజంలో ఫలవంతమైన జీవితాన్ని గడపడానికి అనేక విషయాల్లో సమర్థత ఉండాలి. దీనికి భాషా సామర్థ్యాలు దోహదం చేస్తాయి.

 

భాషా సామర్థ్యాల అభివృద్ధి - ప్రయోజనాలు
* పిల్లలు అర్థవంతమైన అవగాహనతో చదవగలుగుతారు.
* సొంతంగా తమ అభిప్రాయాలను రాయగలుగుతారు, చెప్పగలుగుతారు.
* చదవడం, రాయడం ఒక నిరంతర ప్రక్రియగా మారుతుంది.
* ఇతర విషయాల అభ్యసనానికి ఎంతగానో దోహదపడుతుంది.
* సృజనాత్మకతకు అవకాశం కల్పిస్తుంది.
* ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* పుస్తక పఠనం పట్ల చక్కని అభిరుచి ఏర్పడుతుంది.
* భాషా సామర్థ్యాల అభివృద్ధి మూర్తిమత్వ, ఉద్వేగ వికాసాలకు దారితీస్తుంది.

1. శ్రవణం:
* శ్రవణం అంటే వినడం. భాషా సామర్థ్యాల్లో మొదటిది శ్రవణం.
* శ్రవణేంద్రియాల ద్వారా జరిగే భాషా ప్రక్రియ శ్రవణం.
* పిల్లవాడికి ముఖ్యంగా ఉండాల్సింది నిశిత శ్రవణం. ఇది కుటుంబంతోనే ఆరంభమవుతుంది.
* ఉపాధ్యాయుడు పిల్లవాడు వినే విధంగా చక్కని భాషను స్పష్టంగా ఉచ్చరించాలి. విద్యార్థులు ఆ ఉచ్చారణను శ్రద్ధగా విని శ్రవణ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారు.

 

శ్రవణం - లక్షణాలు
* చక్కని భాషణ, పఠన లేఖనాలకు దోహదపడుతుంది.
* చక్కగా విన్న విషయాన్ని మాత్రమే పునరావృతం చేయగలుగుతారు.
* మంచి ఉచ్చారణ మంచి శ్రవణంతోనే సాధ్యపడుతుంది.
* దోషరహితంగా, భావయుక్తంగా మాట్లాడటానికి చక్కని శ్రవణం దోహదపడుతుంది.
* శ్రవణ నైపుణ్యంతో పెద్దపెద్ద ధ్వనుల మధ్య కూడా అవసరమైన విషయాలను గ్రహించగలుగుతారు.
* సందర్భోచితంగా మాట్లాడటానికి సహాయపడుతుంది.
* సామాజిక సంబంధాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

పిల్లలు ఎప్పుడు వింటారు?
* విషయాన్ని తమదిగా భావించినప్పుడు.
* స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నప్పుడు.
* పరిచయమైన సన్నివేశాల గురించి మాట్లాడించినప్పుడు.
* ఉత్సాహంగా బోధిస్తున్న అంశం మీద అభిరుచి ఉన్నప్పుడు.
* పిల్లలకు ఆసక్తిని కలిగించే అద్భుతరసంతో కూడిన కథలు చెప్పినప్పుడు.
* ఉపాధ్యాయుడు విద్యార్థిని లాలనగా పలకరించినప్పుడు, ఆంగిక కదలికలను చేస్తూ సంభాషిస్తున్నప్పుడు మాత్రమే విద్యార్థి వినడానికి ఇష్టపడతాడు.

 

శ్రవణం - ప్రయోజనాలు:
* శ్రవణం వల్ల విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు.
* స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది.
* విద్యార్థిలో పదజాలాభివృద్ధి జరుగుతుంది.
* ఆలోచనాశక్తి వృద్ధి చెందుతుంది.
* ఆనందానుభూతి పొందుతాడు.
* జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

2. భాషణం:
* భాషా నైపుణ్యాల్లో రెండో నైపుణ్యం భాషణం. భాషణం అంటే మాట్లాడటం.
* ఇది భావ వ్యక్తీకరణకు ఉపయోగించే సాధనం.
* ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వాగ్రూపంలో వ్యక్తీకరించడాన్ని భాషణం అంటారు.
* నిర్దుష్టమైన ఉచ్చారణ భాషణానికి ప్రాణంలాంటిది.
* భాషణానికే వాచిక చర్య అని పేరు.
* ‘వాచిక చర్య’ అంటే ఒక వ్యక్తి తనలోతాను మాట్లాడుకోవడం కాదు, ఎదుటివారితో మాట్లాడటం.
* భాషాబోధన వాచిక చర్యతో ప్రారంభమవుతుంది.
* వాచిక చర్యకు శిక్షణ ఇచ్చేటప్పుడు కింది నాలుగు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* నూతన శబ్ద పరిచయం 
* విషయ పరిచయం
* ఉచ్చారణ దక్షత 
* భావ ప్రకటనా కౌశలం
* వాచిక చర్యను క్రీడా పద్ధతిలో చేపట్టి విద్యార్థుల భాషాజ్ఞానం, విషయజ్ఞానం, ఆత్మవిశ్వాసం పెంపొందించవచ్చు.

* ఇందుకు బాలగేయాలు (శిశుగేయాలు), అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణం అనేవి మూడో తరగతి వరకు ఎక్కువగా ఉపకరిస్తాయి.
* ఉక్త రచన
(Oral Composition), వక్తృత్వ శిక్షణ (Elocution Training) 4, 5 తరగతుల్లో ప్రవేశపెట్టవచ్చు.

 

భాషణం ప్రయోజనాలు:
* భాషణం ద్వారా విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సరిచేసి, మంచివక్తగా తీర్చిదిద్దవచ్చు.
* భావ ప్రకటనలో నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు.
* నూతన పదాలను పరిచయం చేయవచ్చు.
* పాఠశాల ఉపాధ్యాయులపట్ల ఉన్న భయాన్ని పోగొట్టి వారి పట్ల ప్రేమాభిమానాలను పెంచవచ్చు.

 

పి. గుర్రే దృష్టిలో భాషణాన్ని నియంత్రించే అంశాలు:
1. ధ్వనులను వినియోగించే విధానం
2. భావ వినిమయానికి ఉపయోగించే భాషారూపం
3. వక్తకున్న వ్యక్తిత్వం

భాషణాన్ని మెరుగుపరిచే అంశాలు:
i) సంభాషణలు
ii) బాలగేయాలు (శిశు గేయాలు)
iii) అభినయ గేయాలు
iv) కథాకథనం
v) నాటకీకరణం
vi) ఉక్తరచన - వక్తృత్వ శిక్షణ

 

భాషణ దోషాలు - నివారణ చర్యలు:
భాషణ (వాక్‌) దోషాలు మూడు రకాలు. అవి:

 

i) భావదోషాలు:
* విషయం తప్పుచెప్పినట్లైతే అది భావదోషమవుతుంది.
* విద్యార్థికి విషయ పరిజ్ఞానం లేకపోవడం లేదా ఏదో ఊహించి చెప్పడం వల్ల భావదోషం ఏర్పడుతుంది.
* సభాకంపం వల్ల లేదా తడబడటం వల్ల భావదోషం ఏర్పడుతుంది.
ఉదా: తిక్కనకు గల బిరుదు ఆదికవి, నన్నయ బిరుదు కవిబ్రహ్మ, శ్రీనాథుడి బిరుదు సహజ పాండిత్యుడు.

ii) భాషాదోషాలు
* భాషకు సంబంధించిన దోషాలను భాషాదోషాలంటారు.
* కర్త, కర్మ, క్రియ, లింగం, వచనం, కాలం, నామవాచకం, విశేషణం, విభక్తి, సమాసం మొదలైన భాషా విషయాలను సరిగా గుర్తించకుండా మాట్లాడితే భాషాదోషాలు ఏర్పడతాయి.
* సరిగా సంధి చేయకపోవడం, వైరి సమాసాలు కూడా భాషాదోషాలే.
ఉదా: నేను రేపు దిల్లీ వెళ్లితిని.
          రాము గోపి కలిసి బడికి వెళ్లెను.
          పిల్లలు అల్లరి చేసినాడు.

 

భాషాదోషాలకు కారణాలు:
* విద్యార్థి ఎవరిని అనుకరించి భాష నేర్చుకున్నాడో, వారి భాషాజ్ఞానం సరైంది కాకపోవడం లేదా వారిని సరిగా అనుకరించ లేకపోవడం.
* సభాకంపం
* సమాసాలు విరివిగా వాడాలనే చాపల్యం
* భాషాసంస్కారం తమకు ఎక్కువ ఉందనే అహంభావం.

iii) ఉచ్చారణ దోషాలు:
* పై రెండు దోషాల కంటే కూడా ఎంతో జాగ్రత్తగా సవరించాల్సిన దోషాలివి.
* వీటిని ప్రాథమిక దశలోనే సరిచేయకపోతే క్రమంగా లిఖిత దోషాలకు దారితీస్తాయి.

 

ఉచ్చారణ దోషాలు - రకాలు:
1. వేగోచ్చారణ దోషం: 
* శ్రోతలు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం.
2. సమవేగ రాహిత్య దోషం:
* కొందరు మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి, తర్వాత వేగం పెంచి చివరలో అస్పష్టంగా, అర్థరహితంగా మాట్లాడటం.
3. సమస్వర రాహిత్య దోషం:
* మొదట బాగా వినబడేలా ప్రారంభించి, చివర్లో స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడటం.
4. ధారాళంగా మాట్లాడలేక పోవడం:
* ధారాళంగా మాట్లాడలేక మధ్యమధ్యలో ఏవో నిరర్థకమైన ధ్వనులు పలకడం.
* చివరి పదాన్ని తిరిగి అందుకుని మాట్లాడటం.
* మధ్య మధ్యలో ఆగుతూ కాలయాపన చేయడం.

 

ధారాళత లోపించడానికి కారణాలు:

* భావాలు వెంటవెంటనే స్ఫురించకపోవడం.
* స్ఫురించినా వాటికి తగిన మాటలు దొరక్కపోవడం.
* సభాకంపం ఈ దోషానికి కారణం.

 

3. ధ్వనుల తారుమారు:
* వీటినే ధ్వని దోషాలంటారు.
* ఎక్కువ శ్రద్ధతో సవరించాల్సిన దోషాలివి.

 

ధ్వనుల తారుమారు - రకాలు
* అచ్చుకు బదులు హల్లు పలకడం
ఉదా: ఇల్లు - యిల్లు అన్నం - వన్నం
* హల్లుకు బదులు అచ్చు పలకడం
ఉదా: వినాయక - ఇనాయక
      వీరయ్య - ఈరయ్య
* మహాప్రాణాలకు - అల్పప్రాణాలు పలకడం
ఉదా: భగవంతుడు - బగవంతుడు
      ఉపాధ్యాయుడు - ఉపాద్యాయుడు

* అల్పప్రాణాలకు - మహాప్రాణాలు పలకడం
ఉదా: విద్య - విధ్య
     నిర్దేశం - నిర్ధేశం 
* అనునాసిక ఉచ్చారణ దోషాలు
ఉదా: అన్న - అణ్ణ 
     జ్ఞానం - గ్నానం
     పరిణతి - పరినతి
* సంయుక్తాక్షరాలకు బదులు - ద్విత్వాక్షరాలు పలకడం
ఉదా: హరిశ్చంద్రడు - హరిచ్చంద్రుడు
      ఆశ్చర్యం - ఆచ్చర్యం
* ద్విత్వాక్షరాలకు బదులు - సంయుక్తాక్షరాలు పలకడం
ఉదా: పచ్చిపులుసు - పక్షిపులుసు
* అంతస్థాలలోని ‘య-వ’ అనే వర్ణాలు పదాదిన వచ్చినప్పుడు వాటిని పలకకపోవడం.
ఉదా: యంత్రం - అంత్రం
      వేప - ఏప
* వర్ణమార్పిడి దోషాలు (వర్ణవ్యత్యయం)
ఉదా: పగిలిన - పలిగిన
     మిగిలిన - మిలిగిన

 

పఠనం: 
* లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో, లోకజ్ఞానాన్ని పొందడానికి పఠనం అంతే అవసరం.
* భాషానైపుణ్యాల్లో మూడోది పఠనం. 
* భావగ్రహణ నైపుణ్యాల్లో పఠనం రెండోది.
* లిఖిత రూపంలో ఉన్న ఏదైనా అంశాన్ని మనసులో లేదా బిగ్గరగా చదివి దానిలోని భావాన్ని గ్రహించడం పఠనం.
* లోపరహితమైన శ్రవణ శక్తి లోపరహితమైన పఠనానికి దారితీస్తుంది.
* పఠనానికి శ్రవణ, భాషణ, లేఖనాలు ప్రాతిపదికలు అవుతాయి.

 

క్రీడల ద్వారా పఠన సంసిద్ధత పెంపొందించడం:
* చిత్రాలను, నమూనాలను, వస్తువులను చూపించి వాటిని చదివించడం, వాటిపై మాట్లాడించడం.
* కథా చిత్రాలు చూపుతూ కథలు చదివించడం.
* పొడుపు కథలు చదివించడం.

* పాటలు, గేయాలు, పద్యాలు చదివించడం.
* పదక్రీడలు చేయించడం
* నీతివాక్యాలు చదివించడం. 
* బాలల కథల పత్రికలు చూపుతూ కథలను చదివించడం.
* పాత పోస్టర్లు, కరపత్రాలు చూపి వాటిని చదివించడం.
* రోడ్లపై గుర్తులు, ఇతర సంకేతాలను చూపించి చదివించడం.

 

పఠనం - బోధన పద్ధతులు:
1. అక్షర పద్ధతి: ఇది 2 రకాలు
      ఎ) ప్రాచీనాక్షర పద్ధతి 
      బి) నవీనాక్షర పద్ధతి

 

ప్రాచీనాక్షర పద్ధతి:
* మనదేశంలో సాంప్రదాయికంగా వస్తున్న ప్రాచీన పద్ధతి.
* ప్రాచీన పద్ధతిలో అక్షరాభ్యాసంతో భాషా శిక్షణ ప్రారంభమైంది.
* అక్షరాలను దిద్దుతూ వరుస క్రమంలో నేర్చుకున్నాక, గుణింతాలను పాటగా దిద్దించే పద్ధతి.

నవీనాక్షర పద్ధతి:
* వర్ణమాలలో తరచుగా రాని అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పే పద్ధతి.
* తీసివేసిన వర్ణాలను క్రమంగా పై తరగతుల్లో నేర్పుతారు.
* అక్షరాలను ఆకార సామ్యాన్ని బట్టి కొన్ని వర్గాలుగా చేసి నేర్పిస్తారు.
* ఏ వర్గంలోనూ చేరని అక్షరాలను చివరలో ప్రత్యేకంగా నేర్పే పద్ధతి.
* గుణింతాల్లో కూడా సంయుక్తాక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని నేర్పే పద్ధతి.

 

2. పద పద్ధతి:
* పదాలను ప్రాతిపదికగా తీసుకుని విద్యార్థులు చూసి చదివేలా చేయడాన్ని ‘పదపద్ధతి’ అంటారు.
* తెలిసిన వాటినుంచి తెలియని వాటికి అనే విద్యాసూత్రం ద్వారా బోధించే పద్ధతి.
* ఈ పద్ధతిలో బోధించడానికి ఉపకరణాలుగా ఒక పదానికి 4 మెరుపు అట్టలు కావాలి.

 

3. వాక్య పద్ధతి:
* వాక్యాలను ప్రాతిపదికగా తీసుకుని విద్యార్థులు చూసి చదివేలా చేయడాన్ని వాక్యపద్ధతి అంటారు.
* ఈ పద్ధతిలో ముందుగా 4 లేదా 5 వాక్యాల్లో పఠనం మొదలుపెట్టడం మంచిది.
* ఈ పద్ధతి సమగ్రాకృతి సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది.

* పదపద్ధతిలో ఉపయోగించిన మెరుపు అట్టల విధానాన్ని దీనిలో కూడా ఉపయోగించవచ్చు.
* ప్రసిద్ధమైన పొడుపు కథలను కూడా వాక్య పద్ధతికి సాధనాలుగా ఉపయోగించవచ్చు.
* ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి ప్రశస్తమైంది ఈ పద్ధతి.

 

4. కథా పద్ధతి:
* దీనిలో కథాచిత్రాలను ప్రాతిపదికగా తీసుకోవాలి.
* కథలంటే బాలబాలికలకు సహజంగా అనురక్తి ఉండటం, వాక్యాల కంటే ఎక్కువ అర్థవంతం కావడం వల్ల ఇది మరింత ఉపయోగకరమని మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
* కథాచిత్రాలు పిల్లలను అమితంగా ఆకర్షించడం వల్ల మిగిలినవాటి కంటే ఈ పద్ధతి ప్రయోజనకారి.

 

పఠనం - భేదాలు:
చదివే రీతిని బట్టి పఠనం రెండు రకాలు:
    1) ప్రకాశ పఠనం
    2) మౌన పఠనం

 

ప్రకాశ పఠనం:
* లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగింద్రియాల సహాయంతో తగిన వేగంతో, శబ్దయోగంగా, హెచ్చుస్వరంతో, భావస్ఫోరకంగా పఠించడాన్ని ‘ప్రకాశ పఠనం’ అంటారు.

* ప్రకాశపఠనాన్ని రెండు రకాలుగా అభ్యాసం చేయించవచ్చు. అవి:
      i) సామూహిక పఠనం      ii) వైయక్తిక పఠనం
* విద్యార్థులందరిచేత ముక్తకంఠంగా ఒకేసారి పఠనం చేయించడాన్నే సామూహిక పఠనం అంటారు.
* సామూహిక పఠనంలో విద్యార్థుల పఠన దోషాలు గుర్తించలేం.
* తరగతిలోని ప్రతి విద్యార్థితోనూ వ్యక్తిగతంగా చదివించడాన్నే వైయక్తిక పఠనం అంటారు.
* వైయక్తిక పఠనంలో పఠన దోషాలను గుర్తించవచ్చు.

 

ప్రకాశ పఠనం - ప్రయోజనాలు:
* ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలను సవరించడానికి వీలుంటుంది.
* ప్రకాశపఠనం విద్యార్థులకు ఎక్కువగా ప్రాథమిక దశలో ఉపకరిస్తుంది.
* గేయాలు, పద్యాలు, పాటలు లయబద్ధంగా చదివి ఆనందానుభూతిని పొందవచ్చు.
* చదివిన అంశం మీద నుంచి మనసు అన్యాక్రాంతం కాకుండా సహాయపడుతుంది.
* విషయం బాగా గుర్తుండటానికి అవకాశం ఉంది.
* వాగింద్రియాలకు చక్కని శిక్షణ లభిస్తుంది.
* ఉచ్చారణ శిక్షణ లభిస్తుంది.
* కావ్య సౌందర్యాన్ని మెచ్చి ఆనందించడానికి తోడ్పడుతుంది.

* ప్రకాశ పఠనం - పరిమితులు:
* వాగింద్రియాలకు శ్రమ కలుగుతుంది.
* తక్కువ కాలంలో ఎక్కువ విషయాలు నేర్చుకోలేరు.
* అధిక సమయం అవసరమవుతుంది.
* నత్తి ఉన్నవారికి ఈ పఠనం ప్రతిబంధకమవుతుంది.
* గ్రంథాలయాల్లో ఈ పఠనం వీలుకాదు.

 

మౌన పఠనం:
* వాగింద్రియాలను కదిలించకుండా, చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయగ్రహణ చేస్తూ మనసులో చదవడాన్ని మౌన పఠనం అంటారు.
* దీన్నే గంభీర పఠనమనీ, నిశ్శ‌బ్ద పఠనమనీ అంటారు.
¤* ఈ పఠనంలో పలుకు మేరకు పరిమితి తప్పదు. కానీ చూపుమేరకు పరిమితి లేదు.

 

మౌన పఠనం - ప్రయోజనాలు:
* వాగింద్రియాలకు శ్రమ ఉండదు.
* ఎక్కువ సేపు పఠనం కొనసాగించవచ్చు.
* గ్రంథాలయాల్లో పఠించడానికి ఉపకరిస్తుంది.

* విషయ గ్రహణను, అర్థగ్రహణను పెంపొందిస్తుంది.
¤* విస్తార పఠనానికి ఇది నాంది.

 

మౌన పఠనం - పరిమితులు:
* ఉచ్చారణ దోషాలను, శబ్ద దోషాలను, విషయ దోషాలను తెలుసుకోలేం.
* మనసు అన్యాక్రాంతమవుతుంది.
* లయబద్ధంగా పైకి చదువుతున్నప్పుడు పొందే ఆనందం దీనిలో ఉండదు.
* విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనం రెండు రకాలు (అధ్యయన భేదాలు)
     i) క్షుణ్న పఠనం     ii) విస్తార పఠనం

 

1. క్షుణ్న పఠనం:
* ప్రతి అంశాన్ని వివరంగా చదవడాన్ని క్షుణ్న పఠనం అంటారు.
* ఈ పఠనానికి వాచకమే ఆధారం.

 

క్షుణ్న పఠనం - ప్రయోజనాలు:
* విద్యార్థులు పాఠ్యవిషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారు.
* సృజనాత్మకతను పెంపొందించుకుంటారు.
* తార్కికశక్తి, ఆలోచనాభివృద్ధి జరుగుతుంది.
* సాహిత్య సృష్టికి పూనుకుంటారు.

విస్తార పఠనం:
* వైవిధ్యభరితమైన గ్రంథాలను చదవడాన్నే విస్తార పఠనం అంటారు.
* విశేషజ్ఞాన సంపాదనయే విస్తార పఠనం యొక్క లక్ష్యం.

 

విస్తార పఠనం - ప్రయోజనాలు:
* అనేక గ్రంథాలను చదవడం ద్వారా విజ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని పొందవచ్చు.
* తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదవవచ్చు.
* విరామకాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు.
* విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదం చేస్తుంది.
* విషయంపై అవగాహన పెరిగి మంచి ఉపన్యాసాలు ఇవ్వగలుగుతారు.

 

విస్తార పఠన నైపుణ్యాభివృద్ధికి మార్గాలు:
     1) గ్రంథాలయాలు
     2) ఉపవాచకం
     3) పాఠశాల పత్రిక
     4) సారస్వతసంఘం
     5) పుస్తక ప్ర‌ద‌ర్శ‌న‌లు.

లేఖనం:
* చతుర్విధ భాషా నైపుణ్యాలలో నాలుగోది, చివరిది, కఠినతరమైంది.
* వాచిక చర్యకు అక్షర రూపమే లేఖనం.
* ధ్వని రూపంలోని భాషాంశం లిపి రూపాన్ని సంతరించుకోవడమే లేఖనం.
* శ్రవణ గోచరాలయిన భాషాధ్వనులను, అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడమే లేఖనం.
* లేఖనం అనే పదం ‘లింపతి’ అనే పదం నుంచి ఏర్పడింది.

 

లేఖనాన్ని బోధించే పద్ధతులు రెండు:
i) సాంప్రదాయిక పద్ధతి        ii) ఆధునిక పద్ధతి

 

సాంప్రదాయక పద్ధతి: 
* మొదట అక్షరాలను దిద్దించడం, ప్రతిరోజూ కొత్తవి చెప్పేముందు తెలిసినవన్నీ రాయమనడం ద్వారా అక్షరాలు, గుణింతాలు నేర్పే పద్ధతి సాంప్రదాయక పద్ధతి
* ఈ పద్ధతి పిల్లల్లో విద్యపట్ల ఆసక్తిని కలిగిస్తుంది.
* పిల్లల మానసిక తత్వానికి విరుద్ధమైంది ఈ పద్ధతి.

 

సాంప్రదాయిక లేఖనం విధానంలోని దోషాలు:
* విద్యార్థుల చేతి కండరాలకు, వేళ్లకు తగిన ప్రాథమిక అభ్యాసం లేకుండానే ఒకేసారి అక్షరాలను దిద్దించడం.
* పఠనంతోపాటు లేఖనం కూడా కలిపి నేర్పడం.
* పలకలపై అక్షరాలను తరచుగా దిద్దించడం.
* ఆకర్షణీయమైన బోధనోపకరణాలు ఉపయోగించకపోవడం.

 

ఆధునిక పద్ధతి:
* లేఖనాన్ని ప్రారంభించడానికి ముందుగా విద్యార్థి చేతి కండరాలు గట్టిపడటం కోసం వారికి ఆసక్తికలిగించే కొన్ని అభ్యాసాలు చేయించాలి.
* బలపంతో పలక మీద వివిధ రకాలైన గీతలు గీయించాలి.
* తెలుగు అక్షరాల్లో దాగివున్న నిలువు గీతలు, ఏటవాలు గీతలు, అరసున్నాలు, సున్నాలు గీయించే పద్ధతి.
* ఈ విధంగా విద్యార్థులను లేఖనానికి సంసిద్ధులను చేసిన తర్వాత, పఠనం ఏ క్రమంలో నేర్పామో, ఆ క్రమంలోనే ఆ పదాలతోనే లేఖన నైపుణ్యాల బోధన ప్రారంభించాలి.

 

మంచి దస్తూరిని నేర్పే మార్గాలు: 
1) చూచిరాత/దృష్టలేఖనం         2) ఉక్తలేఖనం


దృష్టలేఖనం:
* మంచి దస్తూరి అలవడేలా చేయడానికి ఇవ్వాల్సిన మొదటి అభ్యాసం చూచిరాత.
* ఇది రెండు విధాలుగా ఉంటుంది.

 

కాపీ రైటింగ్‌ (లేదా) ఒరవడి (లేదా) మేలుబంతి (పంక్తి) రచన:
* ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో వాక్యాన్ని రాసిస్తే విద్యార్థి ఆ రాతను ఆద‌ర్శంగా చేసుకుని అదే విధంగా రాయడాన్ని కాపీ అంటారు.
* మేలు బంతి రచన వల్ల స్పష్టత, అందం విద్యార్థి రాతకు అలవడతాయి.
* విరామ చిహ్నాలు పాటించాల్సిన సందర్భాలను తెలుసుకుని రాస్తారు.
* అక్షరాన్ని రాసేటప్పుడు ఎలా ప్రారంభించి, ఎలా ముగించాలో తెలుసుకుంటారు.

 

ఉక్తలేఖనం:
* ఉక్తమంటే చెప్పిన; లేఖనమంటే రాత అని అర్థం.
* ఉక్తలేఖనమంటే ఉపాధ్యాయుడు చెప్పే మాటలను లేదా వాక్యాలను విద్యార్థులు ధ్వనులను వింటూ అక్షరాకృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ రాయడం.
* ఉక్తలేఖనం చెప్పేటప్పుడు విద్యార్థులు మొదటిసారి వింటారు. రెండోసారి వింటూ పలకపై లేదా పుస్తకాల్లో రాస్తారు. మూడోసారి రాసింది సరిచూసుకుంటారు.

ఉక్తలేఖనం - ప్రయోజనాలు:
* శ్రవణ శక్తిని పరీక్షించవచ్చు.
* జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
* శ్రవణానికి, పఠనానికి, లేఖనానికి సమన్వయం ఏర్పడుతుంది.
* వేగంగా రాసే శక్తి పెంపొందుతుంది.
* లేఖన దోషాలను తేలికగా గుర్తించవచ్చు.
* విరామ చిహ్నాలను ప్రయోగించే అవగాహన పెరుగుతుంది.

 

3. సంక్షిప్త లేఖనం:
* వివరంగా ఉన్న విషయాన్ని కుదించి, అతిక్లుప్తంగా, సంగ్రహంగా రాయడాన్ని ‘సంక్షిప్త లేఖనం’ అంటారు.
* ఉన్నత, మాధ్యమిక దశలో ఉపవాచక అంశాన్ని సంక్షిప్తంగా, సంగ్రహంగా, కుదించి రాయించవచ్చు.
* పాఠ్యసారాంశాన్ని, పద్యాల భావాల్ని రాయడం సంక్షిప్త లేఖనాలే.

 

4. విస్తార లేఖనం:
* సంక్షిప్తంగా, సంగ్రహంగా, క్లుప్తంగా ఉన్న విషయాన్ని విస్తృతంగా వివరించి రాయడమే విస్తార లేఖనం.
* ఇది సంక్షిప్త లేఖనానికి భిన్నమైంది.
* దీనివల్ల విద్యార్థుల్లో అవగాహనాశక్తి, ఆలోచనాశక్తి పెరుగుతుంది.
భాషానైపుణ్య లక్షణాలు: స్పష్టత, నిర్దుష్టత, సమత, అందం, వేగం అనేవి భాషా నైపుణ్యాలకు పంచప్రాణాలు.

 

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌