• facebook
  • whatsapp
  • telegram

శ్రీనాథ యుగం కవులు 

    సాహిత్య చరిత్రలో 15వ శతాబ్దాన్ని శ్రీనాథ యుగం లేదా కావ్య యుగం అంటారు. కవిత్రయంతో తులతూగగల కవి శ్రీనాథుడు. అందుకే 15వ శతాబ్దానికి యుగకర్తగా శ్రీనాథుడిని పేర్కొంటారు. అనేక రచనలు చేసి, కావ్య ప్రక్రియను పరిపుష్టంచేసి, పద్యానికి ప్రాచుర్యం కల్పించి, అనంతర కవులపై ప్రభావం చూపిన కవిగా శ్రీనాథుడు ప్రసిద్ధికెక్కాడు. కాల్పట్టణం ఇతని జన్మస్థలం. అయితే ఇది ఎక్కడ ఉందనే అంశం వివాదాస్పదం. శ్రీనాథుడు బహుభాషా, పురాణ, శాస్త్రాలలో విద్వాంస శిఖరం.

      శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు. రాజమహేంద్రవర ప్రభువు వీరభద్రారెడ్డి ఆస్థాన కవి. వినుకొండ వల్లభామాత్యుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు, ప్రౌఢ దేవరాయలు, సాంపరాయని మైలారురెడ్డి, తెలుగు రాయలు మొదలైనవారి ఆస్థానాలను సందర్శించి తన పాండిత్య ప్రదర్శనతో గౌరవం పొందాడు.
* ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో డిండిమభట్టు అనే మహావిద్వాంసుడిని ఓడించి 'కవిసార్వభౌమ' బిరుదు పొందడంతోపాటు కనకాభిషేకం చేయించుకున్నాడు. ఈ వాదవివాదాలకు చంద్రభూష క్రియాశక్తి రాయలు మధ్యవర్తిగా ఉన్నాడు.
* మామిడి సింగన శ్రీనాథుడిని ఇలా ప్రశంసించాడు...
     'బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు...ఈశ్వరార్చన కళాశీలుడవు..
     ...బ్రహ్మజ్ఞాన కళానిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే'
* శ్రీనాథుడి బావమరిదిగా పోతనను పేర్కొనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే చరిత్రకారులు పోతన కాదని, దగ్గుపల్లి దుగ్గన శ్రీనాథుడి బావమరిదని నిర్ణయించారు. దుగ్గన తన 'నాసికేతోపాఖ్యానం' కావ్యంలో శ్రీనాథుడిని బహువిధాలుగా కీర్తించాడు.


* శ్రీనాథుడు తన రచనలపై 'చిన్నారి పొన్నారి చిఱుతకూకటినాడు...' అనే సీస పద్యం రాశాడు. దీని ఆధారంగా తెలిసే అంశాలు:

1. చిన్నారి పొన్నారి వయసులో - 'మరుత్తరాట్చరిత్ర' రాశాడు. ఇది అలభ్యం. శ్రీనాథుడి తొలి కావ్యం. మామిడి వేమనకి అంకితమిచ్చాడు.

2. నూనూగు మీసాల వయసులో - 'శాలివాహన సప్తశతి' రాశాడు. ఇది కూడా అలభ్యం. దీన్ని గాథాసప్తశతికి అనువాదంగా భావించవచ్చు.

3. 'పండితారాధ్య చరిత్ర' రాసి మామిడి ప్రెగడయ్యకు అంకితం ఇచ్చాడు. ఇదీ లభ్యం కాలేదు.

4. 'నిండు జవ్వనం'లో - శృంగార నైషధం రాశాడు. శ్రీహర్షుడి నైషధాన్ని శ్రీనాథుడు ఒక అనువాద ప్రణాళికతో తెనిగించాడు. దీన్ని మామిడి సింగనకి అంకితమిచ్చాడు. ఇందులో ప్రధాన వస్తువు - నల, దమయంతుల వివాహ వృత్తాంతం.

5. 'హరవిలాసం' శివుని మహిమలు, లీలల గురించి రాసింది. తన బాల్య సఖుడైన అవచి తిప్పయశెట్టికి అంకితమిచ్చాడు. చిరుతొండనంబి కథ, గౌరీ కల్యాణం, కిరాతార్జునీయం లాంటి కథలున్నాయి.

6. ప్రౌఢ వయసులో శ్రీనాథుడు 'భీమఖండం' రాశాడు. ఇది స్కాంద పురాణంలోని గోదావరీ ఖండానికి అనువాదం. దీన్ని వీరభద్రారెడ్డి మంత్రి, తన బంధువు అయిన బెండపూడి అన్నయామాత్యునికి అంకితం ఇచ్చాడు. ఇందులో ద్రాక్షారామ క్షేత్ర మాహాత్మ్యం ప్రధాన వస్తువు.

7. ప్రాయమింతకు కైవ్రాలకుండ (వృద్ధాప్యం సమీపిస్తుండగా) రాసింది - 'కాశీఖండం'. ఇది స్కాంద పురాణంలోని కాశీఖండానికి అనువాదం. ఇది వీరభద్రారెడ్డికి అంకితం. వింధ్య పర్వత విజృంభణం, వ్యాసుని కోపం, గుణనిధి కథ లాంటి ఇతివృత్తాలున్నాయి. కాశీఖండం అయఃపిండం (ఉక్కుముద్ద) లాంటిది అన్నారు. శ్రీనాథుని పాండిత్య పటిమకు ఇది నిదర్శనం.

8. 'శివరాత్రి మాహాత్మ్యం' అనే కావ్యాన్ని శ్రీనాథుడు వృద్ధాప్యంలో రాశాడని పేర్కొంటారు. ఇది స్కాంద పురాణంలోని 'ఈశాన్య సంహిత'కు అనువాదం. ఇందులో ముఖ్యమైంది సుకుమారుని కథ. ఈ కావ్యాన్ని శ్రీశైల మఠాధిపతి ముమ్మడి శాంతయ్యకు అంకితమిచ్చాడు.

9. శ్రీనాథుడు 'పలనాటి వీరచరిత్ర'ను ద్విపద కావ్యంగా రాసి మాచర్ల చెన్నకేశవస్వామికి అంకితమిచ్చాడు. ఇది తెలుగులో తొలి వీరగాథా కావ్యం. ఇందులో అలరాజు, నలగామరాజు, బ్రహ్మన్న, నాగమ్మ, బాలచంద్రుడు లాంటి పాత్రలున్నాయి.

10. శ్రీనాథుడి రచనగా వివాదాస్పదమైంది క్రీడాభిరామం. దీన్ని వినుకొండ వల్లభామాత్యుడు రాశాడనేది కొందరి అభిప్రాయం. ఇది తెలుగులో తొలి వీధి రూపకం. శృంగారం పాలు ఎక్కువ. క్రీడాభిరామం కాకతీయుల కాలంనాటి సాంఘిక పరిస్థితులను వెల్లడిస్తుంది.

11. చాటుపద్యాలు రాసి ప్రజల దగ్గరకి పద్యాన్ని తీసుకెళ్లినవాడు శ్రీనాథుడు. 'చాటువు' అనే పదానికి 'ప్రియమైన' అని అర్థం. అప్పటికప్పుడు ఏ వస్తువుపైనైనా చెప్పే పద్యాన్ని (ఆశువుగా) 'చాటువు' అంటారు. శ్రీనాథుడి వ్యక్తిత్వాన్ని, ఆనాటి సమాజాన్ని అతని చాటువులు తెలియజేస్తాయి.

 

ముఖ్యమైన ఉదాహరణలు:
 
     'దివిజ కవివరు గుండియల్దిగ్గురనగ
      అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి'
      'సిరిగలవానికి చెల్లును తరుణుల...'
      'నా కవిత్వంబు నిజము కర్ణాట భాష'
* శ్రీనాథుడిని సంస్కృత పండితులు 'డుమువుల కవి' అంటూ హేళన చేశారు. నందనందన చరిత్ర, ధనుంజయ విజయం అనేవి శ్రీనాథుడి రచనలుగా పేర్కొంటారు. అయితే అవి లభించలేదు. ఆధారమూ లేదు.
* శ్రీనాథుడు సీసపద్య రచనలో అందెవేసిన చేయి. శ్రీనాథుడి కవిత్వంలో ఉభయవాక్ఫ్రౌఢి, ఉద్దండలీల, సూక్తివైచిత్రి, రసాభ్యుచిత బంధం అనే కవితా గుణాలుఉన్నాయి. శ్రీనాథుడిపై ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి మొదటగా పరిశోధన చేసి బృహత్ గ్రంథం వెలువరించారు.
* శ్రీనాథ యుగంలో మరొక మహాకవి, 'సహజ పాండిత్య' బిరుదాంకితుడు బమ్మెర పోతన. ఈయన వరంగల్ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు. ఒంటిమిట్టలో జన్మించాడనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది అంగీకరించలేదు. పోతన కర్షక వృత్తిని చేపట్టి ఉంటాడని తెలుస్తోంది. పోతన అనగానే భాగవతం గుర్తుకు వస్తుంది. అయితే ఇతర రచనలూ ఉన్నాయి.
* వీరభద్ర విజయం (తొలి రచన)
* భోగినీ దండకం (తొలి దండకం - పోతన రాయలేదని కొందరి అభిప్రాయం)
* నారాయణ శతకం 
* ఆంధ్ర మహాభాగవతం
* వీరభద్ర విజయం శైవ కావ్యం. మొదట శైవుడే పిదప వైష్ణవునిగా మారాడు. రాజనింద చేసి దైవాన్ని నమ్ముకున్న భక్త శిఖామణి పోతన. 'సత్కవుల్ హాలికులైననేమి' అని ప్రకటించినవాడు. భాగవతంలోని 12 స్కంధాలలో పోతన 8 స్కంధాలు రాశాడు. మిగిలినవి బొప్పరాజు గంగయ, ఏర్చూరి సింగయ, వెలిగందల నారయ రాశారు. వీరు పోతన శిష్యులు.
* 'పలికెడిది భాగవతమట - పలికించు విభుండు రామభద్రుండట...' అంటూ భాగవతాన్ని శ్రీరామచంద్రునికే అంకితమిచ్చాడు. భాగవతంలో శ్రవణం, కీర్తనం, స్మరణం లాంటి నవవిధ భక్తులున్నాయి. వైష్ణవ ప్రధానమైన భాగవతంలో ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కల్యాణం, వామనావతారం, గజేంద్ర మోక్షం, కుచేలోపాఖ్యానం, గోపికల రాసలీల, శ్రీకృష్ణ లీలలు లాంటి రసవత్తర ఉపాఖ్యానాలున్నాయి.

 

భాగవతం నుంచి ముఖ్యమైన ఉదాహరణలు:
* 'విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపఱతు'
* 'నేనందఱ మెప్పింతు కృతులనయ్యైయెడలన్'
* 'దీనిని తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెద...'
* 'మందార మకరంద మాధుర్యమున తేలు...'
* 'ఇందుగలడందు లేడని సందేహమువలదు...'
* 'కమలాక్షునర్చించు కరములు కరములు...'
* 'కారే రాజులు రాజ్యముల్ గలుగవే...'
* 'ఊరకరారు మహాత్ములు...'
* 'లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యె...'
* ఇలాంటి పోతన గురించి విశ్వనాథ సత్యనారాయణ 'పోతన తెలుగుల పుణ్యపేటి' అన్నారు. పోతన కవిత్వంలో శబ్దాలంకార మాధుర్యం ఎక్కువ.
* 'వాణి నా రాణి' అన్న 15 వ శతాబ్దినాటి కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. 'శృంగార శాకుంతలం' కావ్యం రాసి చిల్లర వెన్నయమంత్రికి అంకితమిచ్చాడు. 'జైమినీ భారతం' కావ్యం రాసి సాళ్వ నరసింహరాయలకి అంకితమిచ్చాడు. 'శృంగార శాకుంతలం' కావ్యానికి శాకుంతల పరిణయం అనే పేరు కూడా ఉంది.
* శ్రీనాథుని కాలంలో కావ్యాలే కాదు - కథా కావ్యాలు కూడా వెలువడ్డాయి. చిత్రవిచిత్రాలైన మలుపులు, మహిమలు, వినోదాలు, చమత్కారాలు, జానపద భావజాలం ఉన్నవాటిని కథాకావ్యాలు అంటారు. కేతన రాసిన 'దశకుమార చరిత్ర' మొదటి కథాకావ్యం.

 

శ్రీనాథుని కాలంలో కథా కావ్యాలు రాసినవారు:
జక్కన: 'విక్రమార్క చరిత్ర' రాశాడు. వెన్నెలకంటి సిద్దయమంత్రికి అంకితమిచ్చాడు. విక్రమార్కుని సాహస, ఔదార్యాలను వివరించే అద్భుత కథలు ఇందులో ఉన్నాయి.
అనంతామాత్యుడు: 'భోజరాజీయం' అనే కథాకావ్యం రాసి అహోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు. ప్రసిద్ధ 'గోవ్యాఘ్ర సంవాదం' కథ ఇందులోదే. అనంతుడు 'ఆంధ్ర భాషా భూషణం' అనే లక్షణ గ్రంథం కూడా రాశాడు.
కొఱవి గోపరాజు: ఇతడు 'సింహాసన ద్వాత్రింశిక' అనే కథాకావ్యం రాశాడు. దీన్ని హరిహరనాథుడికి అంకితంఇచ్చాడు. ఈ కావ్యానికి వెంపరాల సూర్యనారాయణశాస్త్రి వ్యాఖ్యానం రాశారు. ఇందులో 32 రసవంతమైన కథలున్నాయి. 'తెనంగు దేశియును తద్భవముంగలయంగజెప్పెదన్' అన్నాడు. రెడ్డిరాజుల కాలం నాటి సాంఘిక స్థితిగతులకు ఈ కావ్యం దర్పణం

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌