• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక కవులు, రచయితలు - పరిచయాలు

ఆధునిక సాహిత్యానికి కారణాలు.. సంఘ సంస్కరణ ఉద్యమాలు, వ్యావహారిక భాషోద్యమం, పత్రికా వ్యాప్తి, ఆంగ్ల విద్యాబోధన. గురజాడ అప్పారావును ఆధునిక సాహిత్యానికి యుగకర్తగా పేర్కొంటారు. గురజాడ అనగానే 'కన్యాశుల్కం' గుర్తుకు వస్తుంది. ఇది వాడుకభాషలో రాసిన తొలి సాంఘిక నాటకం. 'ముత్యాలసరాలు' అనే ఛందస్సులో గేయకవిత్వం రాశారు. పూర్ణమ్మ, కన్యక వీరి ప్రసిద్ధ రచనలు. ఈయన 1910లో 'దిద్దుబాటు' అనే తొలి కథానిక రాశారు. 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అన్నది గురజాడే.
* కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణ భావాలతో రచనలు చేశారు. 'వివేకవర్ధని' లాంటి పత్రికలు నడిపారు. తొలి నవలగా పేర్కొనే 'రాజశేఖర చరిత్ర', ఆంధ్రకవుల చరిత్ర, సత్యరాజాపూర్వ దేశయాత్రలు మొదలైనవి కందుకూరి రచనలు.
* రాయప్రోలు సుబ్బారావు భావకవిత్వోద్యమానికి నాయకులు. తృణకంకణం, స్నేహలత, ఆంధ్రావళి, జడకుచ్చులు ఈయన రచనలు. 'కోకిలస్వామి' అనే బిరుదు ఉంది.
                                  'ఏ దేశమేగినా ఎందుకాలిడినా
                                  ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
                                  పొగడరా నీ తల్లి భూమి భారతిని...' - రాయప్రోలు
* 'ప్రాచీన కవిత్వానికి భరత వాక్యం - నవీన కవిత్వానికి నాంది వాక్యం' అనిపించుకున్న జంట కవులు తిరుపతి వేంకట కవులు. వీరు అవధాన విద్యకి మారుపేరు. వీరి శిష్యులే విశ్వనాథ సత్యనారాయణ. 'కవి సమ్రాట్‌'గా పేరుగాంచిన విశ్వనాథ తెలుగులో 'జ్ఞానపీఠ్ పురస్కారం' అందుకున్న మొదటి రచయిత. ఆయన రాసిన 'శ్రీమద్రామాయణ కల్పవృక్షం' అనే ఇతిహాస రచనకు ఈ పురస్కారం దక్కింది. వేయిపడగలు, ఏకవీర, చెలియలికట్ట, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు మొదలైనవి ప్రసిద్ధి చెందిన రచనలు.

    
దేవులపల్లి కృష్ణశాస్త్రి
భావకవిత్వానికి పర్యాయ పదం దేవులపల్లి కృష్ణశాస్త్రి. కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి అనే ఖండకావ్యాలు వీరి ప్రతిభకి దర్పణాలు. సినీకవిగా, గేయ నాటికల రచయితగా ప్రసిద్ధులైన దేవులపల్లి 'అప్పుడుపుట్టి ఉంటే' అనే వ్యాస సంపుటి వెలువరించారు.
                'దిగిరాను దిగిరాను దివి నుండి భువికి' - కృష్ణశాస్త్రి

గుర్రం జాషువా
* కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, కవికోకిల లాంటి బిరుదులు జాషువా సొంతం. ప్రసిద్ధ రచన 'గబ్బిలం'. జాషువా రాసిన క్రీస్తు చరిత్రకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. నేతాజీ, బాపూజీ, ఫిరదౌసి, ముంతాజ్‌మహల్, నా కథ లాంటివి ఇతర రచనలు.

త్రిపురనేని రామస్వామి
* ఈయన హేతువాదకవి, రచయిత. 'కవిరాజు' అనే బిరుదు ఉంది. సూత పురాణం, శంబూకవధ, ఖూనీ, కుప్పుస్వామి శతకం మొదలైనవి ప్రముఖ రచనలు.
                'వీరగంధం తెచ్చినారము, వీరుడెవ్వడో తెల్పుడీ..' - త్రిపురనేని రామస్వామి
* నండూరి సుబ్బారావు జానపదుల భాషలో రాసిన గేయ కావ్యమే 'ఎంకి పాటలు'.
* దువ్వూరి రామిరెడ్డి కర్షక కవి. కవికోకిలగా సుప్రసిద్ధులు. కృషీవలుడు, పానశాల, వనకుమారి కావ్యాలు ఈయన ప్రసిద్ధ రచనలు.
* పుట్టపర్తి నారాయణాచార్యులు బహుభాషా కోవిదుడు. సరస్వతీపుత్ర అనే బిరుదు ఉంది. శివతాండవం ఈయనకు పేరు తెచ్చిపెట్టింది. పద్మశ్రీ బిరుదు పొందిన కవి. జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, పెనుగొండ లక్ష్మి లాంటి కావ్యాలు రాశారు. విశ్వనాథ రాసిన 'ఏకవీర' నవలను మలయాళంలోకి అనువదించారు.

 

శ్రీశ్రీ
* అభ్యుదయ ఉద్యమానికి మూలవిరాట్టు శ్రీశ్రీ. పూర్తిపేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 1910లో జన్మించిన శ్రీశ్రీ శబ్దబ్రహ్మ. ఈ శతాబ్దం నాది అని పలికిన శ్రీశ్రీ తొలి రచన ప్రభవ అనే పద్యకావ్యం. మహాప్రస్థానం ఈయన ప్రతిభకు దర్పణం. మరో ప్రస్థానం విప్లవ కావ్యం. సిరిసిరిమువ్వ అనే శతకం రాశారు. శ్రీశ్రీ స్వీయ చరిత్ర 'అనంతం'. శ్రీశ్రీ అధివాస్తవిక (సర్రియలిజం) కవిత్వం కూడా రాశారు.
'నేను సైతం ప్రపంచాగ్నికి
              సమిధనొక్కటి ఆహుతిచ్చాను' - శ్రీశ్రీ
* దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అభ్యుదయ, భావకవిత్వాలకు వారధి లాంటివాడు. ఎక్కువగా రాసింది కథలే అయినా, 'అమృతం కురిసిన రాత్రి' అనే కవితా సంపుటి పేరు తెచ్చిపెట్టింది.
              'నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' - తిలక్

 

దాశరథి
*దాశరథిగా కీర్తి పొందిన దాశరథి కృష్ణమాచార్యులు నిజాం పరిపాలనకి ఎదురొడ్డి జైలుకి వెళ్లారు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, దాశరథీ శతకం, గాలిబ్ గీతాలు మొదలైనవి ఈయన రచనలు. 'తిమిరంతో సమరం' కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
              'నా తెలంగాణ, కోటి రతనాల వీణ'
              'అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం
              అనాథునికీ ఆగర్భ శ్రీమంతునికీ మధ్య' - దాశరథి

 

కుందుర్తి ఆంజనేయులు
* వచన కవితా పితామహుడిగా పేరు పొందిన కుందుర్తి ఆంజనేయులు నయాగరా కవుల్లో ఒకరు. వచన కవిత్వ వ్యాప్తి కోసం 'ఫ్రీవర్స్ ఫ్రంట్' స్థాపించారు. తెలంగాణ, నగరంలో వాన, నాలోని నాదాలు, హంస ఎగిరిపోయింది లాంటి కావ్యాలు రాశారు. ఈయన ఆత్మకథ 'బతుకుమాట'.

 'పాతకాలం పద్యమైతే
              వర్తమానం వచన గేయం' - కుందుర్తి

 

ఆరుద్ర
* ఈయన అభ్యుదయ కవి. అసలు పేరు భాగవతుల శివశంకరశాస్త్రి. 'త్వమేవాహం' అనే ప్రతీకాత్మక కావ్యం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పజ్యాలు, వేమన్న వాదం, సినీగీతాలు మొదలైనవి రాశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే 13 సంపుటాల్లో రాసిన సమగ్రాంధ్ర సాహిత్యం మరో ఎత్తు.
              'నేనెక్కదలచుకొన్న రైలు ఎప్పుడూ
              ఒక జీవితకాలం లేటు' - ఆరుద్ర

 

గుంటూరు శేషేంద్ర శర్మ
* భావచిత్రాల ద్వారా వచన కవిత్వానికి పుష్టి చేకూర్చిన కవి గుంటూరు శేషేంద్రశర్మ. మండే సూర్యుడు, గొరిల్లా, నా దేశం నా ప్రజలు, నీరై పారిపోయింది, ఆధునిక మహాభారతం లాంటి కావ్యాలు రాశారు. కవిసేన మేనిఫెస్టో వీరి విమర్శ గ్రంథం. షోడశి ఈయన విమర్శ వ్యాసాల సంపుటి.
              'ఒక అందమైన పోయెం అంటే - దానికి ఒక గుండె ఉండాలి' - శేషేంద్ర శర్మ

 

కాళోజీ
*  ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజీకి తెలంగాణ మాండలికంపై మక్కువ ఎక్కువ. అసలు పేరు కాళోజీ నారాయణరావు. 'నా గొడవ' వీరి ప్రసిద్ధ రచన.
'ఉదయం కానే కాదనుకోవడం నిరాశ
              ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ' - కాళోజీ
    

 

సినారె
సింగిరెడ్డి నారాయణరెడ్డి సినారెగా సుప్రసిద్ధులు. జ్ఞానపీఠ్ పురస్కారం పొందారు. రాజ్యసభ సభ్యులు. అనేక విశ్వవిద్యాలయాలకు వైస్‌ఛాన్సలర్‌గా పనిచేశారు. మహాకవిగా, అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, సినీకవిగా బహుముఖ ప్రతిభావంతులైన సినారె అసంఖ్యాకమైన రచనలు చేశారు. వీరి 'విశ్వంభర' జ్ఞానపీఠ్ పురస్కారం తెచ్చిపెట్టింది.

'మంటలూ - మానవుడు' అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 'ప్రపంచ పదులు' మరో వినూత్న రచన. ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు - ప్రయోగాలు అనేది వీరి సిద్ధాంత గ్రంథం.
              'నా పేరు కవి - ఇంటిపేరు చైతన్యం' - సినారె

 

కథ, నవల, వ్యాసం లాంటి ప్రక్రియల్లో రచనలు చేసి సాహిత్యాన్ని అభివృద్ధి చేసిన రచయితలు చాలామంది ఉన్నారు.
వారిలో ముఖ్యమైన వారి గురించి క్లుప్తంగా...
* శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి: కథక చక్రవర్తి - కలుపు మొక్కలు, వడ్లగింజలు, గులాబి అత్తరు లాంటి కథలు, అనుభవాలు-జ్ఞాపకాలూ అనే స్వీయచరిత్ర.
* గుడిపాటి వెంకట చలం: బ్రాహ్మణీకం, మైదానం, అమీనా లాంటి నవలలు, ఓపూవు పూసింది (కథ).
* మునిమాణిక్యం నరసింహం: కాంతం కథలు.
* పాలగుమ్మి పద్మరాజు: ఈయన రాసిన గాలివాన కథ అంతర్జాతీయ బహుమతి పొందింది.
* బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు): చివరకు మిగిలేది (నవల, మనస్తత్వశాస్త్రానికి సంబంధించింది.)
* గోపీచంద్: అసమర్థుని జీవయాత్ర
* చాగంటి సోమయాజులు (చాసో): వాయులీనం, కుంకుడాకు, ఎంపు లాంటి కథలు.
* రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి): గోవులొస్తున్నాయి జాగ్రత్త, రత్తాలు - రాంబాబు, అల్పజీవి లాంటి నవలలు; పిపీలికం, ఆరుసారా కథలు, నిజం (నాటకం).
* ముళ్లపూడి వెంకట రమణ: బుడుగు, రాధాగోపాలం, గిరీశం లెక్చర్లు మొదలైనవి.
* కాళీపట్నం రామారావు: యజ్ఞం మొదలైన కథలు. ఈయన కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత.
* రావూరి భరద్వాజ: పాకుడురాళ్లు, జీవన సమరం లాంటి నవలలు, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.
* సింగమనేని నారాయణ: సీమ కథలు.
* పద్మశ్రీ భానుమతి: అత్తగారి కథలు - కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందింది.
* నవీన్: అంపశయ్య, కాలరేఖలు -
* చిలకమర్తి లక్ష్మీనరసింహం: గణపతి (తొలి హాస్యనవల)
* మొక్కపాటి నరసింహశాస్త్రి: బారిష్టరు పార్వతీశం.
* ఉన్నవ లక్ష్మీనారాయణ: మాలపల్లి (నవల)
* దాశరథి రంగాచార్య: చిల్లర దేవుళ్లు, జనపదం..
* నోరి నరసింహశాస్త్రి: రుద్రమదేవి, నారాయణభట్టు
* వట్టికోట ఆళ్వారుస్వామి: ప్రజల మనిషి (నవల)
* వడ్డెర చండీదాస్: హిమజ్వాల, అనుక్షణికం(నవలలు)
* రంగనాయకమ్మ: బలిపీఠం, జానకి విముక్తి
* ఓల్గా: స్వేచ్ఛ (నవల)
* పానుగంటి లక్ష్మీనరసింహం: సాక్షి వ్యాసాలు
* కట్టమంచి రామలింగారెడ్డి: కవిత్వతత్త్వ విచారం (విమర్శ)
* సురవరం ప్రతాపరెడ్డి: ఆంధ్రుల సాంఘిక చరిత్ర
* తాపీ ధర్మారావు: దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు, పెళ్లి - పుట్టుపూర్వోత్తరాలు, పాతపాళీ..
* ఉప్పల లక్ష్మణరావు: అతడు-ఆమె (నవల)
* అడవి బాపిరాజు: హిమబిందు (నవల)
* యస్.వి. రామారావు: తెలుగులో సాహిత్య విమర్శ - అవతరణ వికాసాలు
* డా. ఎన్.గోపి: ప్రజాకవి వేమన (సిద్ధాంత గ్రంథం)
* బి. రామరాజు: జానపద గేయ సాహిత్యం (సిద్ధాంత గ్రంథం)

* స్థానం నరసింహారావు: నటస్థానం (ఆత్మకథ)


కవులు - కావ్యాలు
పురిపండా అప్పలస్వామి: పులిపంజా
వానమామలై వరదాచార్యులు (అభినవ పోతన): పోతన చరిత్ర
తుమ్మల సీతారామమూర్తి (అభినవ తిమ్మన): రాష్ట్రగానం
వేంకట పార్వతీశ కవులు: ఏకాంతసేవ
నాయని సుబ్బారావు: సౌభద్రుని ప్రణయయాత్ర
వేదుల సత్యనారాయణశాస్త్రి (గౌతమీకోకిల): దీపావళి
జంధ్యాల పాపయ్యశాస్త్రి (కరుణశ్రీ): ఉదయశ్రీ
శిష్ట్యా ఉమామహేశ్వరరావు: విష్ణుధనువు, నవమి చిలుక
పఠాభి: ఫిడేలు రాగాల డజన్
బోయి భీమన్న: గుడిసెలు కాలిపోతున్నాయి
సోమసుందర్: వజ్రాయుధం

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌