• facebook
  • whatsapp
  • telegram

దక్షిణ అమెరికా  

ఉనికి - విస్తరణ
* దక్షిణ అమెరికా దక్షిణార్ధ గోళంలోని మూడు ఖండాల్లో ఒకటి.
* దక్షిణ అమెరికాలో ఎక్కువ భాగం దక్షిణార్ధ గోళంలో ఉంది.
* ఈ ఖండంలో 2/3వ వంతు ఉష్ణ మండలంలోనే ఉంది.
* భూమధ్యరేఖ దక్షిణ అమెరికా ఉత్తరభాగం ద్వారా వెళ్తోంది.
* దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికోలను కలిపి లాటిన్ అమెరికా అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోని ప్రధాన భాషలకు లాటిన్ భాషే మూలం.
* దక్షిణ అమెరికా త్రిభుజాకారంగా ఉంది. దీని ఉత్తర భాగం విశాలంగా ఉండి, దక్షిణ భాగానికి వెళ్లేకొద్దీ సన్నబడుతుంది.
* ఈ ఖండం 12º ఉత్తర అక్షాంశం నుంచి 55º దక్షిణ అక్షాంశం వరకు, 35º పశ్చిమ రేఖాంశం నుంచి 81º పశ్చిమ రేఖాంశం వరకు విస్తరించి ఉంది.
* ప్రపంచ పటంలో ఇది ఒక ఆకులా కనిపిస్తుంది.
* ఇది పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉంది.

* ఈ ఖండం విస్తీర్ణం సుమారు 1,78,18,000 చదరపు కిలోమీటర్లు.
* ప్రపంచంలోనే పొడవైన పర్వతశ్రేణి (ఆండిస్), పొడవైన నది (అమెజాన్), పొడవైన దేశం (చిలీ) దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నాయి.

 

భౌతిక స్వరూపం - భూస్వరూపాలు
* దక్షిణ అమెరికాను నాలుగు ప్రధాన భౌతిక విభాగాలుగా విభజించవచ్చు.
   1. పశ్చిమ తీరమైదానం
   2. పశ్చిమ పర్వత శ్రేణులు
   3. మధ్య మైదానాలు
   4. తూర్పు మెట్టభూములు

 

పశ్చిమ తీరమైదానం
* ఇది దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో ఉత్తర కొన నుంచి దక్షిణం వరకు విస్తరించి ఉన్న సన్నని తీరమైదానం

 

పశ్చిమ పర్వత శ్రేణులు
* పశ్చిమ తీరానికి సమాంతరంగా కొన్ని వేల కిలోమీటర్లు ఈ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి.

* ప్రపంచంలోని పర్వతశ్రేణుల్లో ఆండిస్ పర్వతశ్రేణులు అత్యంత పొడవైనవి.
* ఆండిస్ పర్వత శ్రేణుల్లోని చాలా శిఖరాలు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల ఏడాది పొడవునా మంచుతో కప్పి ఉంటాయి.
* ఈ పర్వత ప్రాంతంలో భూకంపాలు, అగ్ని పర్వతాలు ఎక్కువ.

మధ్య మైదానాలు
* ఈ మైదానాలు ఆండిస్ పర్వతాలు, తూర్పు మెట్ట భూములకు మధ్య ఉన్నాయి.

* నీటి పరిమాణం పరంగా అమెజాన్ నది ప్రపంచంలోనే పెద్దది.
* అమెజాన్ నది ఆండిస్ పర్వతాల్లో పుట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తోంది.

 

తూర్పు మెట్టభూములు
* తూర్పు మెట్టభూములు ఆండిస్ పర్వతాల కంటే పురాతనమైనవి.
* వెనిజులాలోని ఏంజెల్ జలపాతం ప్రపంచంలోనే ఎత్తైనది. విమానాల నుంచి మాత్రమే దీన్ని చూడగలం.

 

శీతోష్ణస్థితి - ఉష్ణోగ్రత - వర్షపాతం
* దక్షిణ అమెరికా శీతోష్ణస్థితి చాలా వరకు భౌతిక స్వరూపాన్ని అనుసరించి ఉంది.
* దక్షిణ అమెరికాలో చాలాభాగం ఉష్ణమండలంలో ఉంది. అందువల్ల వేడి ఎక్కువ.
* భూమధ్యరేఖా ప్రాంతంలో ఉండే విలక్షణ శీతోష్ణస్థితి అమెజాన్ నదీ పరివాహకంలో ఉంటుంది.
* ఇది ఏడాది పొడవునా ఎక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతాన్ని కలిగి ఉంటుంది.

* దక్షిణ పెరు, చిలీలోని ఎడారి ప్రాంతంలో శీతోష్ణస్థితి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అటకామా ఎడారి అంటారు.
* మధ్య చిలీలో మధ్యధరా శీతోష్ణస్థితి ఉంటుంది.
* ఈ ప్రాంతంలో శీతకాలంలో వర్షం సంభవిస్తుంది. వేసవిలో వేడిగా ఉండే పొడిగాలులు వీస్తాయి.
* దక్షిణ చిలీలో ఏడాది పొడవునా వర్షపాతం ఉంటుంది.
* పెటగోనియా ఎడారి ఆండిస్ పర్వతాలకు తూర్పున ఉంది.
* ఇది వర్షాచ్ఛాయ ప్రాంతంలో ఉండటం వల్ల వాతావరణం పొడిగా ఉంటుంది.
* దక్షిణ అమెరికా విషయంలో సూర్యుడిని అనుసరించి వర్షం (ఎండావాన) అనే లోకోక్తి ఉంది.
* ఈ ఖండంలో సూర్యుడు ఉత్తరాన ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతంలో, దక్షిణాన ఉన్నప్పుడు దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి.
* దక్షిణ అమెరికాలో ఇంచుమించు అన్నిరకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి.
* ఉష్ణోగ్రత, ఆర్ద్రత, వర్షపాతంలో వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది.

అడవులు - వన్యజీవులు
* దక్షిణ అమెరికాలోని విస్తృతారణ్యాలు వన్యజీవులతో నిండి ఉంటాయి.
* ఈ ఖండంలోని చాలా భాగం అడవులతో ఉంటుంది.
* ప్రపంచంలోనే అత్యధికంగా గట్టి కలప అమెజాన్ నదీ ప్రాంతంలోని అరణ్యాల్లో లభిస్తుంది.
* అమెజాన్ పరివాహక ప్రాంతం రబ్బరు చెట్లకు ప్రసిద్ధి.
* బ్రెజిల్‌లోని కార్నాబా, పరానా, పైన్ చెట్ల నుంచి మైనం, కొయ్య గుజ్జు లభిస్తుంది.
* మోర్బా ఆకులను తేయాకులలాగా ఉపయోగిస్తారు.
* క్యుబిక్రో చెట్ల నుంచి తాళ్లను పదును చేయడానికి ఉపయోగించే పదార్థాలు వస్తాయి.
* వ్యవసాయం చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో అరణ్యాలను నరికివేస్తున్నారు.
* దక్షిణ అమెరికాలో అనేక రకాల 'వన్యజీవులు' అధికంగా ఉన్నాయి.
* 1500 జాతుల రంగు రంగుల పక్షులను కలిగి ఉండటం వల్ల దీన్ని 'పక్షిఖండం'గా పిలుస్తారు.
* ఇక్కడి చెట్లు రకరకాల వానరాలతో నిండి ఉంటాయి.
* ఎక్కువ ఉన్ని ఉన్న సాలీడు, ఉడత, గుడ్లగూబలను పోలిన కోతులు ఇక్కడ ఉన్నాయి.

* ఇక్కడి సరీసృపాల్లో కొండచిలువ, బోయో పాములు ముఖ్యమైనవి.
* ఆర్మాడిల్లో, పుమా ఈ ఖండంలో ఉండే వింత జీవులు.
* దక్షిణ అమెరికాలోని పర్వత ప్రాంతాల్లో బరువులు మోయడానికి 'లామా' అనే పొడవైన మెడ ఉన్న జంతువులను ఉపయోగిస్తారు.

 

జనాభా
* దక్షిణ అమెరికా జనాభా 230 మిలియన్ల వరకు ఉంటుంది.

* జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 13 మంది ఉన్నారు. జనాభా విస్తరణలో సమతౌల్యం లేదు.
* ఈ ఖండంలోని సగం ప్రాంతాల్లో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు ఇద్దరి కంటే తక్కువ.
* అమెజాన్ పల్లపు ప్రాంతాలు, గయానా మెట్ట ప్రాంతాలు, అటకామా, పెటగోనియా ఎడారుల్లోని చాలా ప్రాంతాలు నిర్జనంగా ఉంటాయి.
* ఈ ప్రాంతాలు మానవ నివాసానికి అనుకూలంగా లేవు.
* దక్షిణ అమెరికాలోని తీరప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ.
* జనాభాలో చాలావరకు రేవు పట్టణాలు, రాజధాని నగరాల్లోనే నివసిస్తున్నారు.
* దక్షిణ అమెరికా ప్రజలు అమెరికన్, ఇండియన్ నీగ్రో, యూరోపియన్ అనే మూడు ప్రధాన జాతులకు చెందినవారు. ఇప్పుడు అక్కడ అనేక మిశ్రమ జాతులవారు ఉన్నారు. ఈ జాతుల్లో మెస్టిజో జాతివారు ఎక్కువ.

 

వ్యవసాయం
* దక్షిణ అమెరికాలో ప్రధానంగా మొక్కజొన్న, గోధుమ, కాఫీ, చెరకు, పత్తిని పండిస్తారు.

* దక్షిణ అమెరికాలో మొక్కజొన్న, గోధుమను ఆహార పంటలుగా పండిస్తారు.
* మొక్కజొన్న తగిన వర్షపాతం ఉన్న కవోష్ణ ప్రాంతాల్లో పండుతుంది.
* బ్రెజిల్, అర్జెంటీనా మొక్కజొన్న ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలు.
* సమశీతోష్ణ మైదానాల్లో గోధుమ పండుతుంది.
* అర్జెంటీనా ప్రధానమైన గోధుమ ఉత్పత్తి ప్రాంతం.
* కాఫీ, చెరకు దక్షిణ అమెరికాలోని ప్రధాన వాణిజ్య పంటలు.
* బ్రెజిల్ ఆర్ధిక పరిస్థితి ఈ పంటలపైనే ఆధారపడి ఉంటుంది.
* ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో, ఎగుమతుల్లో బ్రెజిల్‌కు ప్రముఖ స్థానం ఉంది.
* బ్రెజిల్‌లోని ఈశాన్య ప్రాంతం చెరకు తోటలకు ప్రసిద్ధి.
* బ్రెజిల్‌లో పత్తి కూడా ఒక ప్రధాన పంట.

ఖనిజాలు
* పెట్రోలియం, ముడి ఇనుము, రాగి, తగరం, నైట్రేట్ దక్షిణ అమెరికాలోని ముఖ్య ఖనిజ సంపద.
* వెనిజులాలో ఖనిజ తైల నిక్షేపాలు అధికంగా ఉన్నాయి.
* ప్రపంచంలో 7వ వంతు ఖనిజతైలం దక్షిణ అమెరికాలోనే ఉత్పత్తి అవుతుంది.
* ముడి ఇనుము నిక్షేపాలు అధికంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి.
* దక్షిణ అమెరికాలోని ఖనిజ సంపదల్లో రాగి ఒకటిగా చెప్పవచ్చు.
* ప్రపంచంలో అయిదో వంతు రాగి ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది.
* ప్రపంచంలో తగరం ఉత్పత్తిలో బొలీవియా రెండో స్థానంలో ఉంది.
* మేలిరకం నైట్రేట్ల నిక్షేపాలు అటకామా ఎడారి ప్రాంతంలో ఉన్నాయి.
* దక్షిణ అమెరికాలో బాక్సైట్, మాంగనీస్, వెండి, ఆంటిమొని నిక్షేపాలు ఉన్నాయి.

పరిశ్రమలు
* దక్షిణ అమెరికా అపారమైన సహజ సంపద, జలవిద్యుత్ సంపద ఉన్న ఖండం.
* దక్షిణ అమెరికాలో ఇనుము - ఉక్కు, నూలు - వస్త్ర పరిశ్రమ, పంచదార, మాంస సంబంధమైన పరిశ్రమ, నూనెశుద్ధి, రాగి పరిశ్రమలు ముఖ్యమైనవి.
* బ్రెజిల్‌లో ఇనుము, ఉక్కు పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ మోటారు వాహనాలు, ట్రాక్టర్లు ముఖ్య ఉత్పత్తులు.
* బ్రెజిల్‌లో నూలు, వస్త్ర పరిశ్రమలు అత్యంత ముఖ్యమైనవి.
* ప్రపంచంలో అధికంగా మాంసం ఉత్పత్తి చేసే దేశాల్లో అర్జెంటీనా ఒకటి.
* అర్జెంటీనాలో ప్రధాన పారిశ్రామిక వృత్తులు - మాంసం ఎగుమతులు, ఆహార సంబంధ పరిశ్రమ, తోళ్లను పదును చేసే పరిశ్రమలు.
* రసాయన పదార్థాలను, మందులను అర్జెంటీనా ఉత్పత్తి చేస్తోంది.
* ఇక్కడ సిమెంట్ కర్మాగారాలు, నూనెశుద్ధి కర్మాగారాలు ఉన్నాయి.
* వెనెజులాలో నూనెశుద్ధి కర్మాగారాలు ఉన్నాయి.
* దక్షిణ అమెరికాలో కాగితం, రబ్బరు, విద్యుత్ పరికరాలను తయారు చేసే పరిశ్రమలు, రాగిని శుద్ధి చేసే కర్మాగారాలు ఉన్నాయి.

 

రవాణా సౌకర్యాలు
* దక్షిణ అమెరికాలో రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందలేదు.

* ఇక్కడ విస్తృతమైన అరణ్యాలు, ఎత్తైన పర్వత శ్రేణులు రవాణా సౌకర్యాల అభివృద్ధికి అవరోధాలుగా ఉన్నాయి.
* ప్రధాన రైలు, రోడ్డు మార్గాలు అర్జెంటీనా, బ్రెజిల్‌లో ఉన్నాయి.
* ఈ మార్గాలు చాలా వరకు తూర్పు పడమరగా ఉన్నాయి.
* ప్రపంచంలోని ఎత్తైన రైలు మార్గాలు చిలీలోని ఆండిస్ పర్వతాల మీదుగా వెళ్తున్నాయి.
* దక్షిణ అమెరికాలో వాయు మార్గాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
* బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ దేశాల రాజధానులను కలుపుతూ కొన్ని అంతర్జాతీయ వాయు మార్గాలుఉన్నాయి.

 

వాణిజ్యం - ఎగుమతి - దిగుమతులు
* దక్షిణ అమెరికాలో ఆర్ధికస్థితి అంతర్జాతీయ వ్యాపారంపై ఆధారపడి ఉంది.
* వ్యవసాయ, ఖనిజ, అటవీ ఉత్పత్తులు దక్షిణ అమెరికా ప్రధాన ఎగుమతులు.
* దిగుమతుల్లో తయారైన వస్తువులు ముఖ్యమైనవి.
* కాఫీని ఎగుమతి చేసే దేశాల్లో బ్రెజిల్ ముఖ్యమైంది.
* మాంసం ఉత్పత్తులు, గోధుమ అర్జెంటీనా ప్రధాన ఎగుమతులు.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌