• facebook
  • whatsapp
  • telegram

ఆసియా ఖండం  

ఉనికి: ఆసియా ఖండం 10o దక్షిణ అంక్షాంశాల నుంచి 80o ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.

* రేఖాంశాల పరంగా 28o తూర్పు రేఖాంశాల నుంచి 170o పశ్చిమ రేఖాంశాల మధ్య ఉంది.
* ఖండాలన్నింటిలో ఆసియా పెద్దది.
విస్తరణ: ఆసియా ఖండం విస్తీర్ణం 44.25 మిలియన్ల చ. కి.మీ. ఇది ప్రపంచ భూ విస్తీర్ణంలో 30 శాతం ఆక్రమించి ఉంది.

 

సరిహద్దులు:
* తూర్పు - పసిఫిక్ మహాసముద్రం
* పడమర - యూరల్ పర్వతాలు
* ఉత్తరం - ఆర్కిటిక్ మహాసముద్రం
* దక్షిణం - హిందూ మహాసముద్రం

 

ప్రధాన దేశాలు:
* ఆసియాలో అతి పెద్దదేశం - రష్యా
* అత్యధిక జనాభా కలిగిన దేశం - చైనా
* అత్యంత చిన్న దేశం - మాల్దీవులు
* ఆసియాలో సూర్యుడు మొదట ఉదయించే దేశం - జపాన్

ఎత్తైన ప్రాంతం: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఈ ఖండంలోనే ఉంది.
పీఠభూమి: ప్రపంచ పై కప్పు అని పిలిచే 'టిబెట్ పీఠభూమి' ఆసియాలోనే ఉంది.
ముఖ్యమైన నదులు: గంగా, సింధు, బ్రహ్మపుత్ర, హూ యాంగ్ హూ, టైగ్రిస్, యూప్రటీస్, సికియాంగ్ నదులు ఆసియాలో ఉన్నాయి.
వర్షపాతం: ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే 'మాసిన్ రాం' ఆసియాలోనే ఉంది.
ముఖ్యమైన ఎడారులు: ఆసియాలో థార్, అరేబియా, గోబీ ఎడారులు ఉన్నాయి.

 

ఉనికి-విస్తరణ
* ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఖండం.
* అత్యుష్ణ మండలం నుంచి అతిశీతల మండలం వరకు ఈ ఖండం విస్తరించి ఉంది.
* ఇది 10ºo దక్షిణ అక్షాంశాల నుంచి 80o ఉత్తర అక్షాంశాల మధ్య, 28º తూర్పు రేఖాంశం నుంచి 170o పశ్చిమ రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది.
* 66
o ఉత్తర అక్షాంశ రేఖ ఆర్కిటిక్ వలయం, 23oº ఉత్తర అక్షాంశ రేఖ కర్కాటక రేఖలు, 90o తూర్పు రేఖాంశం ఆసియా ద్వారా వెళ్తున్నాయి.
* ఈ ఖండానికి దక్షిణ ఆగ్నేయంగా భూమధ్యరేఖ వెళ్తోంది.

»* ఆసియాకు తూర్పున పసిఫిక్ మహాసముద్రం, పశ్చిమాన యూరల్ పర్వతాలతో పాటు యూరల్ నది, కాస్పియన్ సముద్రం ఉన్నాయి.

* దీనికి ఉత్తరంగా ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణంగా హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి.
* ఆసియా విస్తీర్ణం 44.25 మిలియన్ చ.కి.మీ.
* ప్రపంచ భూ విస్తీర్ణంలో ఇది 29.81 శాతం.
* భారతదేశ భూ విస్తీర్ణం 3.28 మిలియన్ చ.కి.మీ.
* ఆసియాలో అతిపెద్ద దేశం రష్యా(17.01 మిలియన్ చ.కి.మీ.), అతిచిన్న దేశం మాల్దీవులు (298 చ.కి.మీ).
ఆసియాలో విస్తీర్ణం పరంగా దేశాలు అవరోహణ క్రమంలో: రష్యా, చైనా, భారతదేశం, పాకిస్థాన్, మియన్మార్, అఫ్గానిస్థాన్, థాయ్‌లాండ్, జపాన్, శ్రీలంక, మాల్దీవులు.

 

భౌతిక స్వరూపం - భూ స్వరూపాలు, నదులు
భూస్వరూపాలు
మైదానాలు:
ఆసియా ఖండపు భూ విస్తీర్ణంలో 32 శాతం మైదానాలున్నాయి.

* ఉత్తర భాగంలో ఉన్న రష్యాలో సైబీరియా మైదానం యూరల్ పర్వతాల నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది.
* ప్రపంచంలోని అతి విశాలమైన ఒండ్రుమట్టితో కూడిన మైదానాల్లో భారతదేశంలోని గంగా, సింధు మైదానం ఒకటి.

* చైనాలోని హూ యాంగ్ హూ, యాంగ్ ట్సి యాంగ్, సికియాంగ్ నదుల మధ్య అత్యంత సారవంతమైన చైనా మైదానం ఉంది.
* ఇరాక్‌లో టైగ్రిస్, యూప్రటీస్, మయన్మార్‌లో ఐరావతి, ఆగ్నేయాసియాలో మెకాంగ్ నది మైదానాలు ముఖ్యమైనవి.

 

పర్వతాలు
* ఆసియా భూ విస్తీర్ణంలో 20 శాతం పర్వతాలు విస్తరించి ఉన్నాయి.
* భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి.
* ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం నేపాల్‌కి చెందిన హిమాలయ పర్వతశ్రేణిలో ఉంది. దీని ఎత్తు 8,848 మీటర్లు.
* చైనాలో టియాన్ షాన్ పర్వతాలు, రష్యాలో ఆల్టాయ్, యాచ్లోనోలి పర్వతాలు, అఫ్గానిస్థాన్‌లో హిందూకుష్ పర్వతాలు, ట్రాన్స్ హిమాలయ మండలంలో కున్‌లున్ పర్వతాలు ఉన్నాయి.
* విశాలమైన గోబీ శీతల ఎడారి ఈ ప్రాంతంలోనే ఉంది.

 

పీఠభూములు
* ఇరాన్, టిబెట్, పామీరు పీఠభూములు, టర్కీలోని అనటోలియా పీఠభూమి, మంగోలియాలోని కాబ్డో పీఠభూమి ఈ ఖండంలో ఉన్నాయి.
* భారత్‌లోని దక్కన్ పీఠభూమి, చైనాలో షాన్, టియాన్ షాన్ పీఠభూములు ప్రధానమైనవి.
* ఆసియాలో టిబెట్ పీఠభూమి ఎత్తైనది. ఇది హిమాలయాల్లో కున్‌లున్ పర్వతాల మధ్య ఉంది.

నదులు
* భారతదేశంలోని ప్రధాన నదులు సింధు, గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, కావేరి.
* ఇరాన్‌లో టైగ్రిస్, యూప్రటీస్ నదులు ఉన్నాయి.
* చైనాలోని ప్రముఖ నదులు హూ యాంగ్ హూ, యాంగ్ ట్సి యాంగ్, సికియాంగ్.
* మయన్మార్‌లో ఐరావతి, వియత్నాంలో మెకాంగ్, రష్యాలో యూరల్ నదులు ఉన్నాయి.
* రష్యాలోని అముర్ నది ఆసియా ఖండంలోని నదుల్లోకెల్లా పొడవైనది. దీని పొడవు 4,060 కి.మీ.
* వియత్నాంలోని మెకాంగ్ రెండో పొడవైన నది. దీని పొడవు 3,640 కి.మీ.

 

ఎడారులు
* భూఉపరితలం మీద నీరు లేకపోవడం వల్ల వ్యవసాయం లేని, మానవ స్థిర నివాసాలు ఏర్పడని విశాల ప్రాంతాలను ఎడారులు అంటారు.
* భారతదేశంలో పెద్ద ఎడారి 'థార్'.
* ఆసియాలో అరేబియా, సిరియా, గోబీ ఎడారులు ఉన్నాయి.

 

దీవుల సముదాయం
* ప్రపంచంలోనే పెద్దదీవుల సముదాయం ఇండోనేసియాలో ఉంది. దీనిలో 13,500 దీవులు ఉన్నాయి.
* జపాన్, ఫిలిప్పీన్స్, భారతదేశంలోని అండమాన్ - నికోబార్, లక్షదీవులు కూడా దీవుల సముదాయాలే.

* లోతైన ప్రాంతం మృతసముద్రం ఆసియాలోనే ఉంది.
* అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ ఇక్కడే ఉంది.
* ప్రపంచంలోనే లోతైన బైకాల్ సరస్సు ఈ ఖండంలోనే ఉంది.
* ఎత్తైన పీఠభూమి టిబెట్ ఆసియాలో ఉంది.
* పొడవైన దక్షిణ సముద్రం ఈ ఖండంలోనే ఉంది.
* ఆసియా ఖండంలో లోతైన అగాధం 'మేరియానా'.
* 'కోహిన్' (లావోస్) అనే జలపాతం ఆసియాలో ఉంది.

 

శీతోష్ణస్థితి
* ఆసియా ఖండం ధృవ ప్రాంతం నుంచి భూమధ్యరేఖ ప్రాంతం వరకు 1,71,89,432 కి.మీ. విస్తరించి ఉంది. అందుకే ఈ ఖండంలో వివిధ రకాల శీతోష్ణస్థితులు ఉంటాయి.
* ఆసియా ఖండం అంతర్భాగాలు సముద్రానికి దూరంగా ఉండటం వల్ల ఖండాంతర్గత శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది.
* ఈ ఖండం మధ్యభాగంలో ఉష్ణోగ్రత 30o సెంటిగ్రేడులు ఉండడంతో వేసవిలో ఎక్కువ వేడి, చలికాలంలో ఎక్కువ చలి, తక్కువ వర్షపాతం ఉంటుంది.
* వేసవిలో హిందూ మహాసముద్రం నుంచి వీచే ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటి నైరుతి రుతుపవనాలుగా ఈ ఖండంలోకి ప్రవేశించడం వల్ల దాదాపు 200 సెం.మీ. వర్షపాతం కురుస్తుంది.

* చలికాలంలో వీచే ఈశాన్య రుతుపవనాల వల్ల తూర్పు ఇండియా దీవుల్లో సుమారు 150 సెం.మీ వర్షపాతం నమోదవుతుంది.


* ఆసియాలో వర్షపాతం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటాయి.
* ఈ ఖండంలో వార్షిక వర్షపాతంలో వ్యత్యాసాలు ఉంటాయి.
* భారతదేశంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతాలు మాసిన్‌రాం, చిరపుంజి.
* థార్, అరేబియా ఎడారుల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది.
* ఆసియాలోని మధ్య నిమ్న పీఠభూముల్లో 25 సెం.మీ. వార్షిక వర్షపాతం కురుస్తుంది.
* అరేబియా సింధుశాఖ, నైరుతి ఆసియాలోని ప్రాంతాల్లో 25 సెం.మీ. కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుంది.
* భారతదేశంలోని మాసిన్‌రాంలో అత్యధికంగా 1141 సెం.మీ. వర్షపాతం కురుస్తుంది.
 

సహజ వృక్షజాలం - వన్యజీవులు
* ఒక ప్రదేశంలో పెరిగే సహజ వృక్షజాలం ఆ ప్రాంతంలోని శీతోష్ణస్థితిగతులపై తగిన ప్రభావాన్ని కల్గిస్తాయి.
* ఆసియా ఖండం ఉత్తరభాగం పూర్తిగా మంచుతో కప్పి ఉంటుంది. దీన్నే 'టండ్రా' అంటారు.
* టండ్రా ప్రాంతాల్లో ఎక్కువ మంచు, అత్యల్ప వర్షపాతం కారణంగా తృణజాతులు అధికంగా పెరుగుతాయి.
* ఇక్కడి ప్రధాన జంతువు 'రేన్‌డీర్'.» టండ్రాలకు దక్షిణంగా ఉండే టైగా మండలంలో శృంగాకారపు అడవులు ఉంటాయి.
* ఫైన్, ఫర్, స్ఫూల్స్, లార్చీబిల్బ్ ఈ అడవుల్లో పెరిగే ముఖ్య వృక్షజాతులు.
* ఈ వృక్షాల నుంచి వచ్చే మెత్తని కలపను అగ్గిపెట్టెలు, రేయాన్, ప్త్లెవుడ్, కాగితం తయారీకి ఉపయోగిస్తారు.
* టైగా ప్రాంతాల్లో నక్క, స్కేబుల్, మింక్, లేళ్లు, ఒంటెలు, గాడిదలు ఎక్కువగా ఉంటాయి.
* ఆగ్నేయాసియా దేశాలైన మలేసియా, ఇండోనేషియా, న్యూగినియా, భారతదేశం, మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో ఉష్ణమండల రుతుపవన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఏనుగు ఇక్కడి పెద్ద జంతువు.

* తూర్పు ఆసియాలోని అడవులను సమశీతోష్ణ అడవులు అంటారు.
* ఆసియా ఖండానికి దక్షిణాన భూమధ్యరేఖ ప్రాంతంలో పెరిగే అడవులను 'సతత హరిత అరణ్యాలు' లేక 'భూమధ్య రేఖ అరణ్యాలు' అంటారు.
* టేకు, మద్ది, మంచి గంధం ఇక్కడి ప్రధాన వృక్ష సంపద.
* టేకు, సాల్, ఎబోని, మహగని, రోజ్‌వుడ్ మొదలైన వృక్షజాతులు ఈ అరణ్యాల్లో విస్తారంగా పెరుగుతాయి. ఇవి మలేసియా, బోర్నియా, ఇండోనేషియా దీవుల్లో ఉన్నాయి.
* ఈ ప్రాంతంలో కోతులు, పాములు, ఏనుగులు, రకరకాల పక్షి జాతులు నివసిస్తాయి.

 

జనాభా విస్తరణ - ప్రధాన నగరాలు
* ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఖండం ఆసియా. దీని జనాభా దాదాపు 3900 మిలియన్లు. ప్రపంచ జనాభాలో సుమారు 65 శాతం ఈ ఖండంలోనే నివసిస్తున్నారు.
* ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. దీని జనాభా 1,397 మిలియన్లు.
* భారతదేశం సుమారు 1,324 మిలియన్ల జనాభాతో చైనా తర్వాతి స్థానంలో ఉంది.
* నదీ తీర ప్రాంతాలు, మైదానాలు, డెల్టా, నగరాల్లో జనాభా విస్తరించి ఉంది.
* వ్యవసాయానుకూల, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, రవాణా సౌకర్యాలున్న ప్రాంతాల్లో జనాభా అధికంగా నివసిస్తోంది.
* చైనా, భారతదేశం తర్వాత ఆసియాలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు జపాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా దీవులు.
* సైబీరియా ఉత్తర, తూర్పు ప్రాంతాలు, మధ్య ఆసియా ప్రాంతాలు, అరేబియా, థార్ ఎడారుల్లో అతి తక్కువ జనాభా నివసిస్తున్నారు.
* ఒక చ.కి.మీ దూరం విస్తీర్ణంలో నివసించే జనాభాను జనసాంద్రత అంటారు.
* బంగ్లాదేశ్‌లో జనసాంద్రత అత్యధికంగా చ.కి.మీ.కి 967 ఉండగా, మంగోలియాలో అత్యల్పంగా చ.కి.మీ.కి నలుగురు మాత్రమే నివసిస్తున్నారు.

* ఆసియా దక్షిణ భాగంలో ఉన్న భారతదేశంలో దిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు ముఖ్య నగరాలు.
* అనేక దేశాల, జాతుల ప్రజలు నివసించటం వల్ల దిల్లీని విశ్వనాగరిక పట్టణంగా పిలుస్తున్నారు.
* అత్యధిక జనాభా కలిగిన చైనాలో బీజింగ్, షాంఘై, కాంటన్, నాన్నింగ్, పాకిస్థాన్‌లో కరాచి, లాహోర్, ఇస్లామాబాద్, బంగ్లాదేశ్‌లో ఢాకా, చిట్టగాంగ్ ప్రముఖ నగరాలు.
* ఆగ్నేయాసియాలో మలేసియా రాజధాని కౌలాలంపూర్, సింగపూర్ రాజధాని నగరమైన సింగపూర్ సిటీ ముఖ్య నగరాలు.
* జపాన్‌లో టోక్యో, ఒసాకా, నాగసాకి ప్రధాన నగరాలు.
* ఆసియాలోని పెద్ద నగరాల్లో ఒకటిగా టోక్యో ప్రసిద్ధి చెందింది.

 

వ్యవసాయం
* ఆసియాలో 70 శాతం జనాభాకు వ్యవసాయమే జీవనాధారం.
* ఈ ఖండంలో సారవంతమైన నేలలు, శీతోష్ణస్థితి, తగిన నీటిపారుదల లాంటివి వ్యవసాయాభివృద్ధికి అనుకూలమైనవి.
* ఆసియాలోని వ్యవసాయ పద్ధతుల్లో ముఖ్యమైనవి విస్తాపన, సాంద్ర, విస్తృత పద్ధతులు.
* విస్తాపన వ్యవసాయ విధానంలో ఆటవిక జాతుల ప్రజలు చెట్లను నరికి నేలను చదును చేసి వ్యవసాయం చేస్తారు.
* భూసారం తగ్గిన తర్వాత దానిని వదిలి మరొక ప్రదేశంలో వ్యవసాయం కొనసాగిస్తారు. దీన్నే 'పోడు' వ్యవసాయం అంటారు.

* సాంద్ర వ్యవసాయ పద్ధతుల్లో పొలాన్ని దున్నటానికి జంతువులను ఉపయోగిస్తారు.
* దీనికి ఎక్కువ మంది పనివారు అవసరం అవుతారు.
* ఈ పద్ధతిలో భూ పరిమితి తక్కువగా ఉంటుంది.
* ఆసియాలో ఎక్కువగా సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంది.
* విస్తృత వ్యవసాయంలో ఎక్కువ భూభాగాన్ని సాగు చేస్తారు.
* వ్యవసాయ పన్నులన్నింటిని యంత్రాల సహాయంతో చేస్తారు. మధ్య ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో విస్తృత వ్యవసాయం అమల్లో ఉంది.
* ఆసియాలోని ప్రధాన పంటలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి ఆహార, వాణిజ్య పంటలు.

* ఆహారంగా ఉపయోగించే పంటలను ఆహార పంటలు అంటారు.
ఉదా: వరి, గోధుమ, రై, ఓట్లు, చిరుధాన్యాలు (జొన్న, రాగులు, సజ్జలు) మొదలైన ఆహార పంటలు.
* చైనా, భారత్, బంగ్లాదేశ్, జపాన్, ఆగ్నేయాసియా దేశాల్లో వరి, చైనా, ఉత్తర భారతదేశంలో గోధుమను ఎక్కువగా పండిస్తారు.
* ధన సముపార్జనే ధ్యేయంగా పండించే పంటలను నగదు పంటలు లేదా వాణిజ్య పంటలు అంటారు.
ఉదా: పత్తి, జనుము, చెరకు, పొగాకు, టీ, పసుపు, కాఫీ.

ఖనిజాలు - పరిశ్రమలు
* సహజంగా ప్రకృతిలో శైథిల్య క్రియ వల్ల ఏర్పడిన పదార్థాన్ని ఖనిజం అంటారు.
* గనుల తవ్వకం ద్వారా భూమి నుంచి ఖనిజాలను వెలికి తీస్తారు.
* కొన్ని ఖనిజాలు భూ అంతర్భాగంలోనూ, భూ ఉపరితలం మీద లభిస్తున్నాయి.
* గనుల తవ్వకం పారిశ్రామికీకరణకు దోహదకారి అవుతుంది.
* ఒక దేశ పారిశ్రామికాభివృద్ధి ఆ దేశ ఖనిజాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

 

ఆసియా - ఖనిజాలు
* ఖనిజాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి లోహ, అలోహ, ఇంధన ఖనిజాలు

 

లోహ ఖనిజాలు
* ఇనుము, మాంగనీస్, బాక్సైట్, రాగి, సీసం, జింకు, క్రోమైట్, బంగారం, వెండి ఆసియాలోని ముఖ్య లోహ ఖనిజాలు.
* భారతదేశంలో నాణ్యమైన ఇనుప ఖనిజం, మాంగనీస్ నిక్షేపాలు ఉన్నాయి.
* ఆగ్నేయాసియా ప్రాంతాల్లో తగరం, సీసం, జింకు, రాగి ఇతర విలువైన ఖనిజాలు లభిస్తున్నాయి.
* ప్రపంచంలో ఇనుప ఖనిజం ఉత్పత్తిలో రష్యా ప్రథమ స్థానంలో ఉంది. మొత్తం ఉత్పత్తిలో చైనా 11 శాతం వాటా కలిగి ఉంది.
* రష్యా, చైనా దేశాల్లో పాదరసం లభిస్తోంది.


అలోహ ఖనిజాలు
* అబ్రకం, ఆస్‌బెస్టాస్, ముత్యాలు, గ్రాఫైట్, ఉప్పు ఆసియాలో లభించే ముఖ్యమైన అలోహ ఖనిజాలు.


* అబ్రకం ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది.
* భారతదేశంలోని రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు రాతినారను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.
* చైనా, రష్యా, భారతదేశాలు ఉప్పును అధికంగా సేద్యం చేస్తున్నాయి.
* జపాన్, చైనా, శ్రీలంక, భారత్, ఒమన్ దేశాల్లో ముత్యాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి.

 

ఇంధన ఖనిజాలు
* బొగ్గు, లిగ్నైట్, ముడిచమురు, సహజవాయువులు ఆసియాలో లభించే ముఖ్య ఇంధన ఖనిజాలు.
* ఆసియాలో చైనా, రష్యా, ఇండియా, ఉత్తర కొరియా వంటి దేశాలు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. రష్యాలో లిగ్నైట్ అధికంగా లభిస్తోంది.
* ముడిచమురు నిల్వలు రష్యా, సౌదీ అరేబియా, చైనా, ఇండోనేషియాలో ఎక్కువగా ఉన్నాయి.
* రష్యా, ఇండోనేషియా, చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా, బ్రూనై, ఇరాన్, యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ దేశాల్లో సహజవాయు నిక్షేపాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.

 

రవాణా - వాణిజ్యం
* తగినన్ని రవాణా సౌకర్యాలు ఉండటం వల్ల పారిశ్రామిక, వాణిజ్యాభివృద్ధి సాధ్యం అవుతుంది.
* దేశాల అభివృద్ధిలో రవాణా కీలక పాత్ర వహిస్తోంది.

 

రోడ్లు, రైల్వేలు:
* ఆసియాలో అత్యుత్తమ రహదారులు ఉన్నాయి.
* భారత్, జపాన్ లాంటి దేశాల్లో మంచి రహదారులు ఉన్నాయి.
* టర్కీలోని ఇస్తాంబుల్, సింగపూర్‌లను కలుపుతూ అంతర్జాతీయ రహదారి ఉంది.
* పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన జపాన్‌లో రహదారులు ఎక్కువగా ఉన్నాయి.
* రష్యా ఉత్తర ప్రాంతంలో తీవ్ర శీతోష్ణ పరిస్థితుల వల్ల రోడ్డు రవాణా సాధ్యం కాదు.
* సైబీరియా, మధ్య ఆసియా, ఉత్తర ఆసియా లాంటి విశాల ప్రాంతాల్లో శీతోష్ణస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల రోడ్ల అభివృద్ధి చాలా నిరాశాజనకంగా ఉంది.
* భారతదేశంలో ప్రధాన నగరాలను కలుపుతూ జాతీయ రహదారులున్నాయి. దేశం మొత్తం 3.34 మిలియన్ల కి.మీ పొడవైన రహదారులు విస్తరించి ఉన్నాయి.
* ఆసియాలో సాంద్ర రైల్వే వ్యవస్థ జపాన్‌లో ఉంది. ఈ దేశంలో మొత్తం రైలు మార్గం పొడవు 32.2 వేల కి.మీ.

* భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలోని పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటి. దీని ద్వారా రోజుకు 28 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు, 15.5 లక్షల టన్నుల సరకుల రవాణా జరుగుతోంది.
* భారత్‌లో రైలు మార్గం పొడవు 67,312 కి.మీ.
* రష్యాలో రైల్వేలు ప్రధాన రవాణా సాధనాలు.
* వోల్గాగ్రాడ్ నుంచి వ్లాడివోస్టాక్ వరకు ఉన్న 8,640 కి.మీ.ల రైల్వే మార్గం ప్రపంచంలోనే అతి పొడవైనది.

 

జల రవాణా
* భారీ నౌకల నిర్మాణం వల్ల ప్రపంచ వాణిజ్యం ఎక్కువగా సముద్రమార్గాల ద్వారా జరుగుతుంది.
* భారత్‌లో గంగా, బ్రహ్మపుత్ర, చైనాలోని యాంగ్ట్సీ, మయన్మార్‌లో ఐరావతి, రష్యాలో వోల్గా, డాన్ నదులు జల రవాణాకు ఉపయోగపడుతున్నాయి.
* సముద్రయానం ద్వారా భారతదేశాన్ని చేరడానికి సూయజ్ కాలువ అతి ముఖ్యమైనది.
* దీన్ని తవ్విన తర్వాత భారతదేశానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కి మధ్య సుమారు 6,500 కి.మీ.ల దూరం తగ్గింది.
* ఈ మార్గంలో ఆసియాలో మనీలా నుంచి హాంకాంగ్, షాంఘై మీదుగా సియోటెల్ వరకు; మనీలా నుంచి నాగసాకి, కోబా, యెకోహోమా మీదుగా వాంకోవర్ వరకు ఉన్న జలరవాణా ప్రధానమైనదిగా చెప్పవచ్చు.

 

వాయు మార్గాలు
* దూర ప్రాంతాలకు అతివేగంగా వస్తువులను, ప్రయాణికులను చేరవేయడానికి వాయు రవాణా దోహదం చేస్తుంది.
* ఆసియాలో అతి ముఖ్యమైన అంతర్జాతీయ విమాన మార్గాలు ఉన్నాయి.

 

ప్రధాన వాయు మార్గాలు
* సింగపూర్ - శాన్‌ఫ్రాన్సిస్కో
* న్యూదిల్లీ - ముంబయి - కోల్‌కతా - కొలంబో
* టోక్యో - మనీలా - హాంకాంగ్ - బ్యాంకాక్ - కొలంబో - ముంబయి/దిల్లీ
* మాస్కో నుంచి బీజింగ్, న్యూదిల్లీ, కాబుల్ ముఖ్యమైన వాయు మార్గాలు.

 

అంతర్జాతీయ వ్యాపారం
* వివిధ దేశాల మధ్య జరిగే వర్తకాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటారు.
* జపాన్ ఆహార పదార్థాలను, ముడి సరకులను, పెట్రోలియం, ఇనుప ఖనిజం, బొగ్గు, పత్తిని దిగుమతి చేసుకుంటోంది. పారిశ్రామిక ఉత్పత్తులను, యంత్ర పరికరాలను ఉక్కు, ఆటోమొబైల్స్, రసాయనాలను ఎగుమతి చేస్తోంది.
* జపాన్ ఆసియాలోని ఇతర దేశాలతో పాటు ఉత్తర అమెరికా, యూరప్ దేశాలతోనూ వ్యాపారం చేస్తోంది.
* అధిక జనాభా వల్ల చైనా అంతర్జాతీయ వ్యాపారంలో అంతగా పాలు పంచుకోవడం లేదు.

* ఆగ్నేయాసియా దేశాలు ప్రధానంగా రబ్బరు, కాఫీ, పామాయిల్, పంచదార, ఇనుప ఖనిజం, పెట్రోలియం, తగరం లాంటి వాటిని దిగుమతి చేస్తున్నాయి.
* ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ దేశాలు ప్రధానంగా పెట్రోలియంను ఎగుమతి చేస్తున్నాయి.
* భారతదేశపు ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాలు, తేయాకు, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఉత్పత్తులు, తోలు, రెడీమేడ్ వస్త్రాలు, యంత్రాలు, ఇనుప ఖనిజం, రసాయనాలు ప్రధానమైనవి.
* భారతదేశపు దిగుమతుల్లో పెట్రోలియం, యంత్రాలు, ఆహార ధాన్యాలు, వంటనూనెలు, ఇనుము, ఉక్కు, ఎరువులు, రసాయనాలు ముఖ్యమైనవి.

 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌