• facebook
  • whatsapp
  • telegram

రుతుపవన మండలం  

* అరబ్బీ భాషలో 'మౌసమ్' అనే మాటకు రుతువు అని అర్థం. ఇంగ్లిష్‌లోని 'మాన్‌సూన్' అనే పదం దీని ఆధారంగానే ఏర్పడింది.
* ఈ మండలంలో సంవత్సర కాలాన్ని వేసవికాలం (ఫిబ్రవరి - మే), వర్షాకాలం (జూన్ - సెప్టెంబరు), శీతకాలం (అక్టోబరు - జనవరి) అని మూడు భాగాలుగా విభజించారు.


ఉనికి
* ఖండాల తూర్పు తీరంలో 10o - 30o ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య రుతుపవన ప్రాంతాలు ఉంటాయి.

 

దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతం
* ఈ రుతుపవన మండలాలు ఉత్తరార్ధ గోళంలో పాకిస్థాన్‌లోని చాలా ప్రాంతం, భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, కంపూచియా, లావోస్, వియత్నాం, చైనా దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో, హైనాన్, తైవాన్, పశ్చిమ ఫిలిప్పీన్స్ ద్వీపాల్లో విస్తరించి ఉన్నాయి.

ఆస్ట్రేలియా, ఇండోనేషియా
* దక్షిణార్ధ గోళంలో ఆస్ట్రేలియాలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాలు, ఇండోనేషియాలోని తూర్పు ద్వీపాలు, న్యూగినియాలోని దక్షిణ మధ్య ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.

 

శీతోష్ణస్థితి
* విశాలమైన భూభాగాలు, జలభాగాలు వేడెక్కడం, చల్లబడటం లాంటి విషమ పరిణామాల వల్ల వాతావరణ పీడనంలో భేదాలు ఏర్పడి తత్ఫలితంగా రుతుపవనాలు ఏర్పడుతున్నాయి.
* ఈ మండల ప్రాంతాల్లో వర్షరుతువు ప్రారంభానికి ముందు అత్యధిక ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి.
* భారతదేశంలో మే నుంచి జూన్ మొదటి వారం మధ్యలో ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది.
* జనవరిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
* సంవత్సరమంతా కురిసే వర్షపాతంలో సుమారు 60 శాతం జూన్, జులై, ఆగస్టు నెలల్లో నమోదవుతుంది.
* ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే 'మాసిన్‌రాం' (1141.0 సెం.మీ.), 'చిరపుంజి' (1087.4 సెం.మీ)లు భారతదేశ ఈశాన్య ప్రాంతంలోని 'ఖాసీ' కొండల్లో ఉన్నాయి. ఇవి ప్రపంచంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
* ఈ ప్రాంతంలో జులైలో నమోదయ్యే సగటు వర్షపాతం 277 సెం.మీ., డిసెంబరులో 0.5 సెం.మీ.లు.
* రుతుపవనాలు తిరోగమనం చెందేటప్పుడు తైవాన్, వియత్నాంలోని 'అన్నాం' తీరం, భారత్‌లోని ఆగ్నేయ ప్రాంతాల్లో చలికాలపు వర్షపాతం సంభవిస్తుంది.

సహజ వృక్ష సంపద
* ఈ మండలంలో వర్షపాతం ఆయాప్రాంతాల్లోని సహజ వృక్ష సంపద విస్తరణను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది.

* వర్షపాతం 200 సెం.మీ. కంటే ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో దట్టమైన రుతుపవన వర్షారణ్యాలు, 100 - 200 సెం.మీ. ఉండే ప్రాంతాల్లో విశాలపత్ర ఆకురాల్చు అరణ్యాలు ఉన్నాయి.
* ఇక్కడి అరణ్యాల్లోని ప్రధాన వృక్షాల్లో టేకు, మద్ది, రోజ్‌వుడ్, వెదురు ముఖ్యమైనవి.
* వర్షం తక్కువగా ఉండే ప్రాంతాల్లో చిట్టడవులు, నదీ ముఖద్వారాలు, పల్లపు ప్రాంతాల్లో తీర ప్రాంతపు క్షార జలారణ్యాలు ఉన్నాయి.
* ఆస్ట్రేలియాలో యూకలిప్టస్ అరణ్యాలు ఉన్నాయి.

 

స్థానిక జంతు సంపద
* ఆసియాలో ఏనుగులు, పులులు, ఖడ్గమృగాలు, వివిధ రకాల పక్షులు, కీటకాలు, రాచనాగు లాంటి అనేక విషసర్పాలు ఉన్నాయి.
* అసంఖ్యాకంగా ఉండే పశువులు, మేకలు, గొర్రెలు, లేడి లాంటి జంతువులతో పాటు చెవుల పిల్లులు (కుందేళ్లు), డింగోలు, ఆస్ట్రేలియాకు 'సజీవ శిలాజ భూమి' అనే కీర్తిని కలగజేసిన కంగారులు ఉన్నాయి.

ప్రజలు
* రుతుపవన ప్రాంతాలు ప్రధానంగా ఆసియా ఖండ ప్రాంతాలు, ప్రపంచంలోని ప్రధాన జనప్రాంతాలుగా ఉన్నాయి.

* ప్రపంచ జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో నివసిస్తున్నారు.
* ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్, అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం బంగ్లాదేశ్. అత్యధిక జన సాంద్రత కలిగిన ద్వీపాల్లో ఒకటైన జావా ద్వీపం ఈ మండలంలోనే ఉంది.
* అతి విశాలమైన, పల్లపు ప్రాంతాలైన గంగా, సింధు మైదానాల్లో జన సాంద్రత చాలా ఎక్కువ.
* దీనికి భిన్నంగా ఆస్ట్రియాలోని అనేక లోతట్టు ప్రాంతాలు నిర్జీవంగా ఉన్నాయి.
* నేటికీ వేట, చేపలు పట్టడం, కందమూలాదుల సేకరణే జీవనాధారంగా జీవించే స్థానిక ఆదిమవాసులతో పాటు వాణిజ్య వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న ఎంతోమంది ప్రజలు అనేక తీరప్రాంతాల్లో నివసిస్తున్నారు.

ఆర్థిక ప్రగతి

వ్యవసాయం: అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ప్రధానంగా 'జీవనాధార వ్యవసాయం' అమల్లో ఉంది.
* చిన్న కమతాల్లో వరి పంటను అధికంగా పండిస్తారు. గోధుమ, జొన్న, చిరుధాన్యాలు, బార్లీ, మామిడి లాంటి ఉష్ణమండల పంటలు, నూనె గింజలు ఇక్కడి ఇతర పంటలు.
* జనుమును అధికంగా బంగ్లాదేశ్, భారత్‌లోనే పండిస్తున్నారు.
* ప్రపంచంలో తేయాకును ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్, శ్రీలంక ప్రముఖమైనవి.
* చెరకు సాగుకు అనువైన అతి విశాలమైన పంటభూమి భారతదేశంలో ఉంది.
* పత్తి, సుగంధ ద్రవ్యాలు, పొగాకు, కొబ్బరి తదితర పంటలను పండిస్తారు.
* ప్రపంచంలో బియ్యాన్ని పెద్ద మొత్తంలో ఎగుమతి చేసే ప్రధాన దేశాలైన మయన్మార్, థాయ్‌లాండ్‌లో వరిని వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు.

 

పశుచారణ
* ప్రపంచంలో ఉన్న గొర్రెల్లో సుమారు 40 శాతం ఆసియాలోని రుతుపవన మండల ప్రాంతాల్లో ఉన్నాయి.
* ప్రపంచంలో అత్యధిక పాడి పశువులు కలిగిన దేశం భారత్.

* రుతుపవన మండలాలన్నింటిలో ఆస్ట్రేలియాలో మాత్రమే వాణిజ్య పశుచారణ అమల్లో ఉంది.
* ఆస్ట్రేలియాలో ఉత్పత్తయ్యే పశుమాంసం దక్షిణ అమెరికాలోని సవన్నా ప్రాంతాల్లో ఉత్పత్తి చేసే పశుమాంసం కంటే నాణ్యమైంది.

 

అటవీ సంపద
* రుతుపవన మండలంలో టేకు అత్యంత విలువైన అటవీ ఉత్పత్తి. దీన్ని ప్రధానంగా మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు ఎగుమతి చేస్తున్నాయి.
* మద్ది, నల్ల ఇరుగుడు చేప (రోజ్‌వుడ్), వెదురు ఇతర విలువైన అటవీ ఉత్పత్తులు.

 

ఖనిజ సంపద
* భారతదేశపు ఖనిజ మేఖలలో నాణ్యమైన ఇనుప ఖనిజం, నేలబొగ్గు, సున్నపురాయి అధిక మొత్తంలో లభిస్తాయి.
* ప్రపంచంలో అభ్రకం, మాంగనీస్‌ను అధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి.
* ఆగ్నేయాసియాలో తగరం, టంగ్‌స్టన్, సీసం, యశదం (జింకు), రాగి, నేలబొగ్గు, పెట్రోలియం, నవరత్నాలు అనేక విలువైన ఖనిజాలు లభిస్తాయి.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌