• facebook
  • whatsapp
  • telegram

వర్షపాతం - రకాలు  

      మేఘాల నుంచి పెద్ద చుక్కలుగా నీరు కిందికి పడటాన్ని వర్షం అంటారు.
* వర్షపాతాన్ని వర్షమాపకంతో కొలుస్తారు.
* మేఘాల నుంచి వర్షం సంభవిస్తుంది. వాతావరణంలోని చిన్న నీటి బిందువులు, మంచు కణాల సమూహమే మేఘాలు.
* వర్షం కురవాలంటే ఈ చిన్న నీటి బిందువులు పెద్దవి కావాలి. అభిఘాతం, విద్యుత్‌శక్తి (ప్రేరణ) వల్ల చిన్న నీటి బిందువులన్నీ కలిసి పెద్దవి అవుతాయి.
* ఈ సూక్ష్మ నీటి బిందువులు గాలిలో తేలుతున్నంత వరకూ వర్షం సంభవించదు.
* వర్షం సంభవించే విధానాన్ని బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి:
i) సంవహన వర్షపాతం
ii) పర్వతీయ వర్షపాతం
iii) చక్రవాత వర్షపాతం

సంవహన వర్షపాతం
     నిరంతరం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ఉష్ణమండల ప్రాంతాల్లో సూర్యపుటం వల్ల భూ ఉపరితలం వేడెక్కుతుంది. దీని వల్ల దాన్ని ఆవరించి ఉండే వాయుపొరలు కూడా వహన క్రియ ద్వారా వేడెక్కుతాయి. వేడెక్కిన గాలి వ్యాకోచిస్తుంది. అందువల్ల దాని బరువు తగ్గుతుంది. బరువు తగ్గిన గాలి పైకి తేలిపోతుంది. అలా పైకి తేలిపోయే గాలి ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నంత ఎత్తుకు చేరినప్పుడు, ద్రవీభవన జరిగి ఎత్తుకు చేరినప్పుడు కుంభవృష్టీ లేదా వడగండ్ల వాన సంభవిస్తుంది.
     ఉరుములు, మెరుపులతో కూడిన ఈ రకం వర్షాన్ని సంవహన వర్షపాతం అంటారు.
   
* ఈ వర్షపాతం విశేషంగా భూ మధ్యరేఖా మండలంలో సంభవిస్తుంది. ఇది సాధారణంగా మధ్యాహ్న సమయాల్లో లేదా సాయంకాల సమయాల్లో సంభవిస్తుంది.
* భారతదేశంలో వేసవికాలంలో సంభవించే వర్షపాతం సంవహన వర్షపాతానికి ఉదాహరణగా చెప్పవచ్చు.
 

పర్వతీయ వర్షపాతం
       నీటి ఆవిరి ఉన్న పవనాల మార్గాల్లో పర్వతశ్రేణులు అడ్డువచ్చినప్పుడు ఆ పవనాలు పైకి లేస్తాయి. దీంతో వాయు పరిమాణం పెరిగి చల్లబడి నీటి ఆవిరిని వాటిలో ఉంచుకునే స్థితిని కోల్పోతాయి. అప్పుడు నీటి ఆవిరి ద్రవీభవించి వర్షం పడుతుంది. ఈ వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతం అంటారు.
* పర్వత ప్రాంతాల్లో పర్వతీయ వర్షపాతం వల్ల సాధారణంగా వర్షం వస్తుంది.
ఉదా: పశ్చిమ కనుమల్లో సంభవించే వర్షపాతం

 

చక్రవాత వర్షపాతం
     ఒక చక్రవాతం లేదా అల్ప పీడనం ఒక ప్రదేశం మీదుగా పయనించినప్పుడు ఈ రకం వర్షపాతం సంభవిస్తుంది. చక్రవాతాలు రెండు రకాలు అవి:
    i) ఉష్ణమండల చక్రవాతాలు
    ii) సమశీతోష్ణ మండల చక్రవాతాలు
* ఉష్ణమండల చక్రవాతాలు భూ ఉపరితలంపై ఉండే అల్పపీడన ప్రాంతాల్లో ఏర్పడతాయి.
     అల్పపీడన ప్రాంతానికి అన్ని వైపులా ఉన్న అధిక పీడన ప్రాంతాల నుంచి వర్తులాకారంలో గాలి వీస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా గాలి పైకి నెట్టబడుతుంది. పైకి లేసిన గాలి నుంచి భారీ వర్షం కురుస్తుంది.
* సమశీతోష్ణ మండలంలో శీతల వాయురాశి కవోష్ణ వాయురాశిని ఢీ కొన్నప్పుడు చక్రవాతాలు సంభవిస్తాయి. సాంద్రత ఎక్కువగా ఉండే చల్లని గాలి కంటే సాంద్రత తక్కువగా ఉండే వెచ్చని గాలి తేలికగా ఉండటం వల్ల అది పైకి నెట్టబడి వర్షపాతాన్ని కలుగజేస్తుంది.
* చక్రవాతాలను ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు అవి.

* వర్షపాతాన్ని కొలిచే పరికరం వర్షమాపకం.
* వర్షపాతం మొత్తాన్ని మిల్లీ మీటర్లలో(మీ.మీ.) నమోదు చేస్తారు.

 

వర్షపాతం ప్రపంచ విస్తరణ
     ఒకే రకమైన వర్షపాతాన్ని గ్రహించే వివిధ ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను 'సమవర్షపాత రేఖలు' అంటారు.

 

వర్షపాత విస్తరణ - ప్రాథమిక లక్షణాలు
     వర్షపాతం భూమధ్యరేఖ ప్రాంతాల్లో అత్యధికం. అది ధృవాలవైపుకి వెళ్లేకొద్ది క్రమంగా తగ్గిపోతుంది.
ఏ ప్రాంతంలో అయితే అల్పపీడనం ఏర్పడుతుందో ఆ ప్రాంతంలో వర్షపాతం అత్యధికం.
లోతట్టు ప్రాంతాల్లో కంటే సముద్ర తీర ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉంటుంది.
* ఖండాల తూర్పు తీరంలో 10º, 30º అక్షాంశాల మధ్య ఉండే ప్రాంతం, ఖండాల పశ్చిమ తీరంలోని 40º, 60º అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాలు ఆయా తీర ప్రాంతాల కంటే ఎక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి.
* ఎతైన ప్రదేశాలు పల్లపు ప్రాంతాలకంటే ఎక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి.
* పర్వతాల పవనాభిముఖ వాలు ప్రాంతాల్లో అవతలివైపు ప్రాంతాల కంటే ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది.
* కవోష్ణ సముద్ర ప్రవాహాలు సమీప భూభాగాల్లో సంభవించే అధిక వర్షపాతాన్ని, శీతల ప్రవాహాలు, సమీప భూభాగాల్లో ఏర్పడి ఉన్న ఎడారులను సూచిస్తాయి.

1. ఒక నిర్దిష్ట పరిమాణంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణవు నిష్పత్తిని ఈ విధంగా పిలుస్తారు.
  i) సాధారణ ఆర్ద్రత
  ii) నిర్దిష్ట ఆర్ద్రత
  iii) విశిష్ట ఆర్ద్రత
  iv) సాపేక్ష ఆర్ద్రత
2. మానవ చిత్రాలపై వర్షపాత విస్తరణను చూపించేందుకు ఉపయోగించే రేఖలు.
  i) సమభార రేఖలు
  ii) సమోష్ణోగ్రత రేఖలు
  iii) సమవర్షపాత రేఖలు
  iv) సమ లవణీయతారేఖలు


 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌