• facebook
  • whatsapp
  • telegram

సూర్యపుటం - సూర్యపుటాన్ని ప్రభావితం చేసే కారకాలు  

సూర్యుడి నుంచి నిరంతరం విడుదలయ్యే శక్తిని సౌరవికిరణం అంటారు.
* సూర్యుడు మండుతున్న వాయుగోళం. ఈ గోళంలో అణుసంఘటనం అనే ప్రక్రియ ద్వారా నిరంతరం ఉష్ణం జనిస్తుంది. అది విశ్వాంతరాళంలోకి ప్రసరిస్తుంది.
* సూర్యుడితో పోల్చినప్పుడు భూమి చాలా చిన్నదిగా ఉంటుంది (సూర్యుడి వ్యాసం భూమి వ్యాసం కంటే 100 రెట్లు ఎక్కువ). భూమి సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉండటం వల్ల సూర్యుడు విడుదల చేస్తున్న శక్తిలో కొంత శక్తిని మాత్రమే గ్రహిస్తుంది.

 

సూర్యపుటం
* భూమి వైపు నిరంతరం ప్రసరించే సూర్యుడి శక్తిని 'సూర్యపుటం' అంటారు.

* సగటున భూమి ఒక చ.సెం.మీ. ఉపరితల విస్తీర్ణంలో నిమిషానికి 2 కేలరీల శక్తికి సమానమైన సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. దీన్నే 'సౌరస్థిరాంకం' అంటారు.

 

ఆల్బిడో: భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం చేస్తున్న శక్తి శాతాన్ని ఆల్బిడో అంటారు. భూమి ఆల్బిడోని 30% గా పేర్కొంటారు.
 

సూర్యపుటాన్ని ప్రభావితం చేసే అంశాలు
ఒక ప్రదేశం గ్రహించే సూర్యపుటాన్ని ప్రధానంగా కింది అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి:
   1. సూర్యకిరణాలు భూమి మీద పడే కోణం
   2. పగటి ప్రయాణం
   3. భూమి నుంచి సూర్యుడి దూరం
   4. వాతావరణ పారదర్శకత

 

సూర్యకిరణాలు భూమి మీద పడే కోణం
    ఒక ప్రదేశం గ్రహించే సౌరశక్తిని ఆ ప్రదేశంపై ప్రసరించే సూర్యకిరణాల వాలు రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది. సూర్యకిరణాల వాలు తక్కువగా ఉంటే సూర్యపుటం తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఉదా: సూర్యుడు  మిట్ట  మధ్యాహ్నం  వేళలో  నడినెత్తిన  ఉన్నప్పుడు  మనపై  పడే  వేడి  చాలా  ఎక్కువగా ఉంటుంది. అదేరోజు సాయత్రం సూర్యుడు ద్విచక్రంపై ఎక్కువ ఏటవాలుగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనికి కారణం ఆ సమయంలో సూర్యకిరణాలు భూమిని చేరే కోణం తక్కువగా ఉండటం. సూర్యకిరణాలు లంబంగా ప్రసరించే ఉష్ణమండల ప్రాంతాలు ఎక్కువ వేడిని కలిగి ఉంటాయి. ఏటవాలుగా ప్రసరించే ధృవ మండల ప్రాంతాలు తక్కువ వేడిని కలిగి ఉంటాయి.

పగటి ప్రమాణం
* ఒక ప్రాంతంపై సూర్యుడి వెలుగు ఎంత ఎక్కువ సమయం ప్రసరిస్తే ఆ ప్రాంతం అంత ఎక్కువ సూర్యపుటాన్ని గ్రహిస్తుంది.
* పగటి ప్రమాణం వేసవికాలంలో ఎక్కువగా, చలికాలంలో తక్కువగా ఉంటుంది. అంటే వేసవికాలంలో సూర్యపుటం ఎక్కువగా, చలికాలంలో తక్కువగా ఉంటుంది.
* పగటి ప్రమాణం భూమధ్య రేఖ నుంచి దూరంగా వెళ్లే కొద్దీ పెరుగుతుంది. దీనివల్ల పగటి ప్రయాణంతోపాటు సూర్యపుటంలో కూడా మార్పులు సంభవిస్తాయి.

భూమి నుంచి సూర్యుడి దూరం
     భూమి నుంచి సూర్యుడి సరాసరి దూరం 149.5 మిలియన్ కి.మీ. అయితే ఇది జులై 4న అపహేళి సమయంలో 152 మిలియన్ కి.మీ., జనవరి 3న పరిహేళి సమయంలో 147 మిలియన్ కి.మీ.గా ఉంటుంది. దూరంలో సంభవించే ఈ కొద్దిపాటి మార్పుల ఫలితంగా భూమి జులైలో కంటే జనవరిలో కొంత అదనంగా సూర్యపుటాన్ని గ్రహిస్తుంది.

 

వాతావరణ పారదర్శకత
   ఒక ప్రాంతం గ్రహించే సౌరశక్తి మొత్తాన్ని వాతావరణ పారదర్శకత విశేషంగా ప్రభావితం చేస్తుంది.
1) మేఘాల స్థితి
2) ధూళి కణాలు
3) నీటిఆవిరి పరిమాణం
4) వాతావరణాన్ని కలుషితం చేసే కొన్ని రకాల వాయువుల పరిమాణం
   పైవన్నీ ఒక ప్రాంత వాతావరణ పారదర్శకతను నిర్ధారించే అంశాలు. ఇవి సూర్యుడు విడుదల చేసే శక్తిని పరావర్తనం చేయడం, గ్రహించడం, విస్తరించడంలో ప్రభావాన్ని చూపిస్తాయి.
* భూమి ఉపరితలం ఒక సంవత్సరంలో గ్రహించే మొత్తం సూర్యపుటం ఉష్ణ మండలంలో అత్యధికంగా ఉండి, ధృవాల వైపు వెళ్లే కొద్దీ క్రమంగా తగ్గుతుంది.

 

ముఖ్యాంశాలు
భూ వికిరణం:
భూమి సూర్యపుటం ద్వారా తను గ్రహిస్తున్న శక్తినంతటినీ దీర్ఘ తరంగాలుగా విశ్వాంతరాళంలోకి తిరిగి పంపుతుంది.ఈ ప్రక్రియనే భూ వికిరణం అంటారు. వాతావరణం కింది పొరలు సౌర వికిరణం ద్వారా వేడెక్కవు. అవి భూ వికిరణం ద్వారా మాత్రమే వేడెక్కుతాయి.

 

ఉష్ణ సమతౌల్యం: సూర్యపుటం ద్వారా భూ ఉపరితలం ఎంతగా వేడెక్కుతుందో భూ వికిరణం ద్వారా అంతే చల్లారుతుంది. దీన్నే భూమి 'ఉష్ణ సమతౌల్యం' అంటారు.


 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌