• facebook
  • whatsapp
  • telegram

వాతావరణం - అమరిక, నిర్మాణం  

గాలి

మన చుట్టూ గాలి ఉంటుంది కానీ అది కంటికి కనిపించదు.
* గాలి వల్ల వర్షం వస్తుంది. వాతావరణం చల్లగా మారుతుంది. గాలి అప్పుడప్పుడు వేడిగా వీస్తుంది.
* భూమి ఆకర్షణ శక్తి, భూభ్రమణం, పరిభ్రమణాల వల్ల గాలి నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుంచి 
* మరొక ప్రదేశానికి వీస్తుంది.
* భూమిపై గాలి పరిమాణం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది.
* భూమిపై గాలి  బరువును వాతావరణ పీడనం అంటారు.

 

గాలి  ధర్మాలు
* గాలి ఒత్తిడిని కలిగిస్తుంది.
* గాలికి బరువు ఉంటుంది.
* గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుంది.

 

వాతావరణం
మన చుట్టూ ఉన్న గాలి ఒక దుప్పటిలా ఆవరించి ఉంది. ఈ పొరనే వాతావరణం అంటారు.

(లేదా)

భూమి చుట్టూ ఉన్న ఆవరణాన్నే వాతావరణం అంటారు.
* భూమి బాస్కెట్‌బాల్ అంత ఉంటే, వాతావరణం దాని చుట్టూ సన్నటి ప్లాస్టిక్ పొరలా ఉంటుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) నిర్వచించింది.
* వాతావరణం 1000 కి.మీ. మేర ఉంటుంది.
* వాతావరణంలో వాయువులు ఉండటం వల్ల వాయువులకు ఉండే గుణాలన్నీ దానికి ఉంటాయి.
* వేడి, మేఘాలు, గాలిలోని తేమ, ఒత్తిడి లాంటి విషయాల ద్వారా వాతావరణ స్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
* సంకోచ, వ్యాకోచ లక్షణాలు వాతావరణంలో ఉంటాయి.

 

వాతావరణంలోని అంశిభూతాలు
* వాతావరణంలో చాలా వాయువులు ఉంటాయి. వీటిలో ప్రధానమైంది ప్రాణవాయువు (ఆక్సిజన్). ఇది
* ఘనపరిమాణం రీత్యా సుమారుగా 21% ఉంటుంది.
* ఘనపరిమాణం రీత్యా నత్రజని సుమారుగా 78%, బొగ్గుపులుసు వాయువు 0.03% ఉంటాయి. ఇతర వాయువులైన ఆర్గాన్, నియాన్, మీథేన్, అమ్మోనియా, ఓజోన్‌లు తక్కువ పరిమాణంలో ఉంటాయి.
* మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘనపరిమాణం రీత్యా సుమారుగా 0.4% ఉంటుంది. అయితే దీనిలో అధిక భాగం భూమికి దగ్గరగా (6 కిలో మీటర్ల ఎత్తు లోపు) ఉంటుంది. నీటిఆవిరి కూడా వాయువే.
* ఆకాశంలోని మేఘాలు నీటి ఆవిరి కాదు. అవి నీటి తుంపరలు.

రేణువులు
* వాతావరణంలో వాయువులే కాకుండా సూక్ష్మమైన ధూళి కణాలు కూడా ఉంటాయి. వీటినే రేణువులు అంటారు.
* ఈ రేణువులు ప్రకృతి ప్రక్రియలు (ఎడారుల మీద ఇసుక తుపాన్లు, అడవుల్లో మంటలు), మానవ చర్యల
(అడవులను తగలబెట్టడం, పెట్రోల్ వినియోగం, పారిశ్రామిక వ్యర్థాలు) ద్వారా ఏర్పడతాయి.
* భూమి మీద జీవించడానికి అనుగుణంగా వాతావరణ పరిస్థితులను మారుస్తాయి.

 

రేణువుల వల్ల సంభవించే పక్రియలు
* సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు నారింజ రంగులో ఉండటానికి కారణం రేణువులు.
* వాన, వడగండ్లు కూడా ఈ రేణువుల వల్లనే సాధ్యమవుతాయి.
* ఉష్ణోగ్రత వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేయడం ద్వారా రేణువులు సమస్యలను సృష్టిస్తాయి.
ఉదా:  మనుషులు ఊపిరిపీల్చుకోవడం కష్టతరం చెయ్యవచ్చు.
* మొక్కల కిరణజన్య సంయోగక్రియను అడ్డుకోవచ్చు.

 

వాతావరణం - విస్తరణ
* మేఘాలు, గాలి వీయడం, తడి, పొడిదనం, చలి, ఎండ, వాన లాంటి అంశాల ద్వారా వాతావరణ విస్తరణ గురించి చెప్పవచ్చు.


a) వాతావరణంలోని వివిధ పదార్థాల ఆధారంగా
* వాతావరణంలోని వివిధ పదార్థాల ఆధారంగా దాన్ని రెండు ప్రధానమైన పొరలుగా విభజించారు.
     అవి: 1) సమరూప ఆవరణం
          2) బహురూప ఆవరణం.

సమరూప ఆవరణం: ఈ ఆవరణం 90 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. దీనిలో ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం అనే మూడు పొరలు ఉంటాయి. వీటిలో నత్రజని, ప్రాణవాయువు, ఆర్గాన్, బొగ్గుపులుసు వాయువు లాంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే రకంగా ఉంటుంది.

 

బహురూప ఆవరణం: 90 కి.మీ. ఎత్తు కంటే ఎక్కువగా ఉన్న వాతావరణ పొరను బహురూప ఆవరణం అంటారు. దీనిలో వాయువుల నిష్పత్తి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి దీన్ని బహురూప ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో థర్మో, ఎక్సో ఆవరణం అనే రెండు పొరలు ఉంటాయి.
 

b) సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా
* భూ వాతావరణంలోని ఉష్ణోగ్రత, సాంద్రత ఆధారంగా వాతావరణాన్ని అయిదు పొరలుగా విభజించారు. 
        అవి: 1) ట్రోపో ఆవరణం
             2) స్ట్రాటో ఆవరణం
             3) మీసో ఆవరణం
             4) థర్మో ఆవరణం
             5) ఎక్సో ఆవరణం

 

ట్రోపో ఆవరణ
* ఇది వాతావరణం అన్ని పొరల కంటే కింద ఉంటుంది. ధృవాల వద్ద 8 కి.మీ., భూమధ్య రేఖ వద్ద 18 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఈ పొర సగటు ఎత్తు 13 కి.మీ.
* భూమధ్య రేఖ వద్ద బలమైన సంవహన ప్రవాహాల వల్ల వేడి చాలా ఎత్తు వరకు వెళుతుంది. కాబట్టి ఇక్కడ ట్రోపో ఆవరణం ఎత్తు ఎక్కువగా ఉంటుంది.
* వాతావరణంలోని మొత్తం వాయువుల్లో 75 శాతం వరకు అంటే దాదాపుగా మొత్తం ధూళి కణాలు, \తేమ అంతా ఈ పొరలోనే ఉంటాయి.
* శీతోష్ణస్థితులు, వర్షపాతం లాంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి.
* ఈ పొరలో పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీన్నే 'సాధారణ క్షీణతా క్రమం' అంటారు.
* నీటి బిందువులు ఘనీభవించడం, బాష్పీభవనం చెందడం, ద్రవీభవనం, వర్షపాతం, తుపాన్లు లాంటివన్నీ ఈ పొరలోనే సంభవిస్తాయి.

 

స్ట్రాటో ఆవరణం
* ఈ పొర 50 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. దీనిలో మబ్బులు లేకపోవడం వల్ల వర్షపాతం, తుపాన్లు ఉండవు. కాబట్టి జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర చాలా అనువుగా ఉంటుంది.
* స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉండటం ఒక ముఖ్యమైన అంశం.
* ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

 

మీసో ఆవరణం
* ఈ ఆవరణం 80 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. విశ్వంలోని ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి.
* ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలోని ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

 

థర్మో ఆవరణం
* ఈ ఆవరణం 400 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. దీనిలో ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుంటాయి.
* ఈ పొరలో అయాన్‌లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉంటాయి. భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు ఈ అయాన్‌ల కారణంగా భూమికి తిరిగి పరావర్తనం చెందుతాయి. ఈ పొరనే అయానో ఆవరణం అని కూడా అంటారు.

 

ఎక్సో ఆవరణం
* ఇది వాతావరణంలోని అన్నింటికంటే చివరగా ఉండే పైపొర.
* ఈ పొర అత్యంత ఎత్తులో ఉంటుంది.

 

ముఖ్యాంశాలు
* వాతావరణం సౌరశక్తి ద్వారా వేడెక్కుతుంది. కానీ భూమిపై అన్ని భాగాలు ఒకే పరిమాణంలో సౌరశక్తిని పొందలేవు.
* ధృవాల కంటే భూమధ్య రేఖ ప్రాంతాలకు అధిక సౌరశక్తి లభిస్తుంది.
* ఉష్ణోగ్రతలోని భేదాలు గాలి కదలడానికి, వాతావరణం ఏర్పడటానికి కారణం అవుతున్నాయి.
* సూర్య కిరణాలు, గాలి, సముద్రాలు, నదులు, చెట్లు భూమిపైన ఉండే ప్రదేశం, ఎత్తు లాంటివి వాతావరణంలోని మార్పులకు కారణాలు.


 

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌