• facebook
  • whatsapp
  • telegram

ద్వితీయ భూస్వరూపాలు (Secondary Land Forms)

ద్వితీయ భూస్వరూపాలు మూడు రకాలు. అవి:
     A) పర్వతాలు
     B) పీఠభూములు
     C) మైదానాలు
* భూస్వరూపాలు భూమి ఉపరితలం మీద వాతావరణ ప్రభావం, భూ అంతర్భాగంలోని ఉష్ణోగ్రత వల్ల, భూకంపాలు, అగ్నిపర్వతాల పేళ్లులు సంభవించడం ద్వారా ఏర్పడ్డాయి.


A) పర్వతాలు: సముద్రమట్టం నుంచి సుమారు 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండి, వాలు ఎక్కువగా ఉన్న భూస్వరూపాన్ని పర్వతం అని అంటారు.
ఉదా: ఆసియాలోని హిమాలయాలు, ఐరోపాలోని ఆల్ఫ్స్, ఆఫ్రికాలోని అట్లాస్ పర్వతాలు.
* పర్వతాలు ఏర్పడిన విధానాన్ని అనుసరించి వాటిని నాలుగు రకాలుగా వర్గీకరించారు.

అవి: i) ముడత పర్వతాలు
     ii) ఖండ పర్వతాలు
     iii) అగ్ని పర్వతాలు
     iv) అవశిష్ట పర్వతాలు

i) ముడత పర్వతాలు: భూమి అంతర్భాగంలో సంపీడన బలాలు పనిచేయడం వల్ల ఏర్పడిన పర్వతాలు ముడత పర్వతాలు.
* పర్వతాలు అన్నింటిలోకి ఇవి ఎత్తైనవి.
* ఇవి విశాలమైన భూభాగాలను ఆక్రమిస్తాయి.
ఉదా: ఆగ్నేయ ఆఫ్రికాలోని డ్రాకెన్స్‌బర్గ్ పర్వతాలు; భారతదేశంలోని వింధ్యా, సాత్పూర పర్వతాలు.

 

ii) ఖండ పర్వతాలు: భూ అంతర్భాగంలోని విరూపకారక చర్యల వల్ల విశాల భూభాగం నిలువునా చీలిపోయి మధ్య ప్రాంతం లోపలికి కుంగిపోవడం వల్ల, ఖండ పర్వతాలు ఏర్పడ్డాయి.
* పైన ఉన్న భూభాగాన్ని 'భ్రంశొద్ధి శిలా విన్యాసం' (Horst), అని లోపలికి కుంగిపోయిన భాగాన్ని 'గ్రేబెల్' (Grabel) అని అంటారు.
ఉదా: రైన్ వ్యాలీ, యూరప్‌లోని వొస్జేస్ పర్వతాలు.

 

iii) అగ్నిపర్వతాలు: భూమిపై కొన్ని ప్రదేశాల్లో భూ అంతర్భాగం నుంచి లావా అనే శిలాద్రవం బయటకు ప్రవహించడం వల్ల అగ్ని పర్వతాలు ఏర్పడతాయి.
* వీటి ఎత్తు ముడత పర్వతాల కంటే తక్కువగా ఉంటుంది.
* ఇవి పీఠభూమి అంచుల్లో ఉంటాయి.
ఉదా: మధ్య ఆఫ్రికాలోని కిలిమంజారో, ఇటలీలోని వెసూవియస్, జపాన్‌లోని ఫ్యూజియామ.

 

iv) అవశిష్ట పర్వతాలు: ఎన్నో మిలియన్ల సంవత్సరాల కిందట ఎంతో ఎత్తుగా ఉన్న పర్వతాలు క్రమంగా వికోషీకరణం చెంది ఎత్తును, పరిమాణాన్ని కొల్పోయి మిగిలిన పర్వతాలను అవశిష్ట పర్వతాలు అని అంటారు.
ఉదా: భారతదేశంలోని ఆరావళీ పర్వతాలు.

 

B) పీఠభూములు: కొద్దిపాటి మిట్టపల్లాల్లో ఇంచుమించు సమతలమైన ఉపరితలం ఉన్న భూస్వరూపాలను పీఠభూములు అంటారు.
* సాధారణంగా పీఠభూములు సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉంటాయి.
* పీఠభూములు మూడు రకాలు అవి:
i) పర్వతాంతర పీఠభూములు
ii) పర్వతపాద పీఠభూములు
iii) ఖండాంతర పీఠభూములు


i) పర్వతాంతర పీఠభూములు: పర్వతాలతో పరివేష్టితమై ఉన్న పీఠభూములను పర్వతాంతర పీఠభూములు అంటారు. ఇవి చాలా ఎత్తులో ఉంటాయి.
ఉదా: హిమాలయాలకు ఉత్తర భాగంలో ఉన్న టిబెట్ పీఠభూమి, దక్షిణ అమెరికాలోని బొలీవియా పీఠభూమి.

 

ii) పర్వతపాద పీఠభూములు: పర్వతాల కింద, వాటి పాదాల దగ్గర ఏర్పడే పీఠభూములను పర్వతపాద పీఠభూములు అంటారు.
¤ వీటికి ఒక వైపు పర్వతాలు, మరో వైపు మైదానం లేదా సముద్రం ఉంటుంది.

* ఇవి వైశాల్యంలో పర్వతాంతర పీఠభూముల కంటే చిన్నగా ఉంటాయి.
* భూ అంతర్భాగంలో జనించే ఊర్థ్వ బలాల వల్ల పైకి నెట్టడంతో పీఠభూములుగా ఏర్పడ్డాయి.
ఉదా: ఉత్తర అమెరికాలోని అపలేచియన్ పీఠభూమి.

 

iii) ఖండాంతర పీఠభూమి: ఖండాంతర పీఠభూములు తక్కువ వాలు ఉండి సముద్రమట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉంటాయి.
ఉదా: భారతదేశంలోని దక్కన్ పీఠభూమి, చోటానాగపూర్ పీఠభూమి.

 

C) మైదానాలు: మైదానాలను మూడు రకాలుగా విభజించారు.
అవి: i) తీర మైదానం
     ii) కోత మైదానం
     iii) నిక్షేపిత మైదానం.

 

i) తీరమైదానం: సముద్ర మట్టాన్ని ఆనుకుని సమతలంగా ఉన్న మైదానాన్ని తీరమైదానం అంటారు.
ఉదా: భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీర మైదానాలు.

 

ii) కోత మైదానం: గాలి, నీరు, హిమానీనదాలు కోతకు గురై, ఎత్తు తగ్గి ఆఖరి దశలో కోత మైదానాలుగా ఏర్పడతాయి.
ఉదా: కెనడాలోని షీల్డు, పశ్చిమ సైబీరియా మైదానం.

iii) నిక్షేపిత మైదానం: గాలి, నదులు, హిమానీనదాలు తదితర కారకాలు ఒండ్రుమట్టి, ఇసుక, గులకరాళ్లు లాంటి వాటిని కొంతదూరం మోసుకుపోయి నిక్షేపిస్తాయి. అలా ఏర్పడిన మైదానాలను నిక్షేపిత మైదానాలు అంటారు.
ఉదా: భారతదేశంలోని గంగా, సట్లేజ్ మైదానం.
* మైదానాలు జనాభా అధికంగా నివసించే ప్రధాన ప్రాంతాలు.


మహాసముద్ర భూతలం

* మహాసముద్రాలుగా చెప్పే అడుగునేలను మహాసముద్ర భూతలం అంటారు.
* మహాసముద్రాల లోతు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు.
* లోతును బట్టి మహాసముద్ర భూతలాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు.
* మహాసముద్రాల అడుగు భాగం భూ ఉపరితలం మాదిరిగానే ఉంటుంది.
* సముద్ర అడుగు భాగం సమతలంగా ఉండదు. ఇది కొండలు, పర్వతాలు, పీఠభూములు, అగాధాలు, టెర్రాస్‌ల లాంటి వాటిని కలిగి ఉంటుంది.
* మహాసముద్రాల్లో లోతు సముద్రమట్టానికి 3 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది.

* మహాసముద్ర భూతలాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి:
a. ఖండ తీరపు అంచు
b. ఖండ తీరపువాలు
c. సముద్ర మైదానాలు
d. మహాసముద్ర అగాధాలు

 

a) ఖండతీరపు అంచు: ఇది భూమికి, సముద్రానికి మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం.
* ఖండపు అంచు 200 మీటర్ల లోతు ఉండి, సముద్ర విస్తీర్ణంలో 7.6 శాతం వరకు ఉంటుంది.
* అతిపెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఖండపు అంచు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే

  ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ.
  ముడిచమురు, సహజ వాయువులు కూడా దొరుకుతాయి.
  ఇక్కడ ఓడరేవులను నిర్మించవచ్చు.

b) ఖండతీరపు వాలు: ఖండతీరపు వాలు 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు ఉంటుంది.
* దీంట్లో అనేక స్వరూపాలు ఉంటాయి.
* మహాసముద్రపు విస్తీర్ణంలో ఇది 15 శాతం వరకు ఉంటుంది.

* ఖండతీరపు వాలు సరిహద్దు ఖండాలను సూచిస్తుంది.
* ఈ ప్రాంతంలో సముద్రపు కాన్యాన్లు ఉంటాయి. హిమానీనదాలు, నదుల నీటికోత ప్రక్రియలతో ఇవి ఏర్పడతాయి.

 

c) మహాసముద్ర మైదానాలు: మహాసముద్రం నేలలోపల ఉన్న మైదానాలు చాలా తక్కువ వాలుతో ఉంటాయి.
* ప్రపంచంలో కెల్లా అత్యంత చదునుగా, నునుపుగా ఉండే ప్రాంతం ఇదే.
* ఇవి 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సముద్ర ఉపరితలంలో వీటి విస్తీర్ణం 76.2 శాతం.

 

d) మహాసముద్ర అగాధాలు: ఈ అగాధాలు సన్నగా, లోతుగా 6000 మీటర్ల వరకు ఉంటాయి.
* మనం ఊహించిన దానికి భిన్నంగా అత్యంతలోతైన అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి.
* ఫలక కదలికల అధ్యయనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

 

ముఖ్యమైన మహాసముద్ర అగాధాలు:

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌