• facebook
  • whatsapp
  • telegram

 ఉపాధ్యాయ సాధికారత అర్థం, సాధికారతకు చొరవలు

పాఠశాల వ్యవస్థలో ఉపాధ్యాయుడు అతి కీలకమైన వ్యక్తి. సమాజంలో కూడా ఉపాధ్యాయుడిదే అగ్రస్థానం. గురువుగా, తత్వవేత్తగా, ఆచార్యుడిగా, మార్గదర్శకుడిగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడు. అందుకే ఉపాధ్యాయుడు విద్యాపరంగా, మూర్తిమత్వపరంగా సమర్థుడై ఉండాలి. మారుతున్న సమాజానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మొదలైన వాటి సాయంతో ఉపాధ్యాయుడు తన సాధికారతను పెంచుకోవాలి.
సాధికారత - అర్థం: Empowerment అనే ఆంగ్ల పదానికి సాధికారత అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు.
* సాధికారత అంటే  శక్తియుక్తులను బలోపేతం చేయడం, సామర్థ్యాలను మెరుగుపరచడం, సమర్థులను చేయడం అని అర్థం.
గుడ్‌మన్ ప్రకారం సాధికారత ఉన్న ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మక పద్ధతులను, వనరులను ఉపయోగించి విద్యార్థుల్లో ఆలోచనలను రేకెత్తిస్తారు. వారికి విద్యానుభవాలను కలిగించి, సమర్థతను ఇనుమడింపజేస్తారు.
* Longman కూర్చిన Contemporary English నిఘంటువు (1998) ప్రకారం to give some one more control over their own life or situation అంటే ఒక వ్యక్తికి తన సొంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని కల్పించడం.
* పై నిర్వచనం ప్రకారం ఉపాధ్యాయుడు తన పనితీరును మెరుగుపరుచుకుని, వృత్తి సామర్థ్యాన్ని పెంపొదించుకోవడాన్ని సాధికారత అని చెప్పవచ్చు. సాధికారత అనేది సార్వజనీన భావన. ఉపాధ్యాయుడు దీన్ని సమర్థంగా ఉపయోగిస్తే ఆశించిన ప్రగతి సాధించవచ్చు.

ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు
1) ఉపాధ్యాయుల రూపచిత్రం (Profile), వారి లక్షణాంశాలు
2) ఉపాధ్యాయులకి లభించిన వృత్తిపూర్వ శిక్షణ
3) విద్యాప్రణాళికల మౌలిక లక్ష్యాలు
4) విద్యార్థుల ఉపలబ్ధి (సాధన) మూల్యాంకనం 
* ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాల్లో విషయ ప్రణాళికలు (Syllabus), పాఠ్య పుస్తకాలు  (Text Books) ముఖ్యమైనవి.
* ఉపాధ్యాయుల సాధికారత రెండు స్థాయులను ప్రభావితం చేస్తుంది. అవి:
     1) ఉపాధ్యాయుడి స్థాయి 2) పాఠశాల స్థాయి
* ఉపాధ్యాయుల స్థాయిలో సాధికారత అనేది విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించింది. దీనికి ఉపాధ్యాయుడి ప్రతిభా పాటవాలు, బోధనా నైపుణ్యాలు, బోధనా విషయాల్లో సాధికారత, బోధన వ్యూహాలపై అతడికుండే అధికారం తోడ్పడతాయి.
* ఇంకా విద్యార్థులకు అభ్యసనంలో సలహాదారు (Counsellor) గా వ్యవహరిస్తుంది. విద్యా ప్రక్రియ ఆశించిన లక్ష్యాలను సాధించడానికి కూడా తోడ్పడుతుంది.
* పాఠశాల స్థాయి సాధికారత సాధించడంలో సహ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వారి నాయకత్వ లక్షణాలు ప్రధానం.
* ఉపాధ్యాయులకు పాఠశాల సమకూర్చిన వృత్యంతర శిక్షణ, ప్రత్యేక సెమినార్లు, సింపోయిజమ్స్, కార్య శిబిరాల ఏర్పాట్లు ముఖ్యమైనవి.
* సాధికారత ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థుల సర్వాంగీణ వికాసాన్ని మూల్యాంకనం చేసి, వాళ్లు అత్యున్నత స్థాయి ఫలితాలు సాధించేలా చేయగలరు.

ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించే సంస్థలు/ వ్యవస్థలు /పథకాలు
* ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రత్యేక పథకాలు లాంటివి తోడ్పడుతున్నాయి.

నల్లబల్ల పథకం OBB (Operation Black Board)
జాతీయ విద్యావిధానం-1986 సిఫార్సుల మేరకు 1987లో ఈ పథకం అమల్లోకి వచ్చింది.

ప్రయోజనాలు:
* అదనపు తరగతి గదుల నిర్మాణం, అదనపు ఉపాధ్యాయుల నియామకం, బోధన, అభ్యాసన సామగ్రి      సరఫరా ప్రాముఖ్యం పొందాయి.
* దీని ద్వారా మన దేశంలో సార్వత్రిక ప్రాథమిక విద్య అమలుకు అధిక ప్రాధాన్యం లభించింది.
* ప్రతి పాఠశాలలో తరగతుల సంఖ్యకు అనుగుణంగా అదనపు గదుల నిర్మాణానికి ప్రత్యేక నిధులు   అందుబాటులోకి వచ్చాయి.
* సొంత భవనాల్లేని పాఠశాలలకు రెండు గదులతో కూడిన నిర్మాణాలు.
* ప్రతి పాఠశాలలో తరగతుల సంఖ్యకు అనుగుణంగా అదనంగా ఉపాధ్యాయుల నియామకం.
* ఒకరిద్దరు ఉపాధ్యాయులకు తోడు మరికొందరు ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం.
* మన రాజ్యాంగంలోని 45వ అధికరణంలోని సార్వత్రిక నిర్బంధ, ప్రాథమిక విద్య అనే భావనకు ఊతమిచ్చిన పథకం - నల్లబల్ల పథకం
* ఈ పథకాన్ని 1987-88లో ప్రారంభించి, దేశవ్యాప్తంగా మూడు దశల్లో (1987-88, 1988-89, 1989-90) అమలు చేశారు.
* ఈ పథకం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 80,000 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 85,000 మంది ఉపాధ్యాయులను నియమించారు.
* సుమారుగా 2 లక్షల అదనపు తరగతి గదులను నిర్మించారు.
* 2002-03 నాటికి ఈ పథకాన్ని జిల్లా ప్రాథమిక విద్యాపథకం, సర్వశిక్షా అభియాన్‌లో విలీనం చేశారు.
* ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో సుమారు 25,000 తరగతి గదులు నిర్మించారు. 20,000 మంది ఉపాధ్యాయులను నియమించారు.
* మొదట ప్రాథమిక పాఠశాలలకే పరిమితమైన ఈ పథకాన్ని, తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలలకు కూడా విస్తరించారు. దీని వల్ల పాఠశాలల్లో కనీసం అయిదుగురు ఉపాధ్యాయుల (వారిలో ఒక మహిళా ఉపాధ్యాయురాలు) నియామకానికి వీలు కలిగింది.
* ఈ పథకం ద్వారా పాఠశాలల్లో బాలబాలికల మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు లభించాయి.
* ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నిర్వహణ సానుకూలతను కలిగించి, వారి సాధికారతను పెంపొందించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం (Andhra Pradesh Primary Education Project):
* భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా ఓవర్‌సీస్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (ODA) ఆర్థిక, విద్యా విషయక విభాగం సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మన రాష్ట్రంలో రెండు దశల్లో (1984-87, 1989-95) అమలు చేశారు.

ఈ పథకం ఆశయాలు:
1) మానవ వనరుల అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంచడం
2) అభివృద్ధిపరిచిన నమూనాల్లో పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టడం
3) ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు ద్వారా, వారి బోధనా సామర్థ్యం మెరుగుదలకు తోడ్పడటం.
4) సార్వత్రిక నమోదు, సార్వత్రిక నిలుపుదల సాధించడం ద్వారా ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయడం
* ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభమైంది.
* ప్రాథమిక తరగతుల్లో గుణాత్మక బోధనకు ఈ పథకం ఆరు సూత్రాలను ప్రతిపాదించింది. ఇవి కృత్యాధార బోధనను (Activity Based Teaching) సులభతరం చేస్తాయి.
1) అభ్యసన కృత్యాలు కల్పించడం
2) అనుభవాల ద్వారా అభ్యసనం చేయడం
3) వ్యక్తిగతంగా, జట్టుగా మొత్తం తరగతి పనిని అభివృద్ధిపరచడం
4) వైయక్తిక భేదాలకు అవకాశం కల్పించడం
5) స్థానిక పరిసరాలు, వనరులను వినియోగించడం
6) విద్యార్థుల పనిని ప్రదర్శించడం ద్వారా ఆకర్షణీయమైన తరగతి గదిని రూపొందించడం
* ఈ పథకం ద్వారా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు, శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు
* ఈ కార్యక్రమాలకు బ్రిటిష్ నిపుణుల బృంద సహాయ సహకారాలు కూడా లభించాయి.
* ఉపాధ్యాయ కేంద్రాలు నెలకొకసారి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాయి.

 

జిల్లా ప్రాథమిక విద్యాపథకం (District Primary Education Programme)
* APPEP కార్యక్రమాలకు కొనసాగింపుగా ఈ పథకం 1996లో అమల్లోకి వచ్చింది.
* గ్రామీణ స్థాయిలో కూడా విద్యారంగ అభివృద్ధికి కృషి చేసిన పథకమిది.
* ఇది సార్వత్రిక విద్యా లక్ష్యాల సాధనతో పాటు, బాలికల విద్యకు ప్రాధాన్యం ఇచ్చింది.
* మన రాష్ట్రంలో మొదట అయిదు జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ముఖ్య లక్ష్యాలు:
1) బడి ఈడు పిల్లలకు పాఠశాలలు లేదా ప్రత్యామ్నాయ పాఠశాలలను ఏర్పాటు చేయడం.
2) 6-11 సంవత్సరాల బాలబాలికలు అందరికీ పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం.
3) నమోదు, నిలుపుదల, అభ్యసన స్థాయుల్లో బాలబాలికల మధ్య ఉండే వ్యత్యాసాలను తగ్గించడం.
4) పాఠశాల మానేసిన విద్యార్థుల సంఖ్యను (డ్రాపవుట్స్) 5% కంటే తక్కువ ఉండేలా చేయడం.
5) విద్యార్థుల సాధన సామర్థ్య స్థాయి లేదా ఉపలబ్ధిలో కనీసం 25% ఆధిక్యత సాధించడం. చదవడం, రాయడం, లెక్కలు చేయడం లాంటి సామర్థ్యాలతో విద్యార్థుల ప్రమాణాలను ప్రస్తుతం కంటే 40% అధికం చేయడం.
6) ప్రాథమిక విద్య అభివృద్ధిలో గ్రామస్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. దీనికోసం గ్రామ విద్యాకమిటీలను ఏర్పాటుచేసి, వాటికి పాఠశాల బాధ్యతలను అప్పగించడం.


జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం వల్ల జరిగిన కృషి
1) 200 మంది జనాభా ఉండి, 1 కి.మీ. లోపు పాఠశాల సౌకర్యం లేని ఆవాస ప్రాంతంలో కొత్త పాఠశాలలు నెలకొల్పి, ఉపాధ్యాయులను నియమించారు.
2) భవనాలు లేని చోట కొత్త భవనాలు, అవసరమైనచోట అదనపు తరగతి గదులు నిర్మించారు. భవన నిర్మాణ పనులను పూర్తిగా పాఠశాల కమిటీలకు అప్పగించారు.
3) పాఠశాలకు అవసరమైన వసతుల కల్పనకు, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడానికి ఏటా రూ.2000.
4) బోధన సామగ్రి రూపొందించుకోవడానికి ప్రతి ఉపాధ్యాయుడికి ఏటా రూ.500.
5) ఉపాధ్యాయులకు నిర్ణీత కాలవ్యవధిలో వృత్యంతర శిక్షణ ఇవ్వడం
6) సంవత్సరంలో పదిసార్లు ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు నిర్వహించడం. ఉపాధ్యాయుడికి ఎదురయ్యే బోధన సమస్యలను పరిష్కరించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం.
7) బాలికల నమోదు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు మరుగుదొడ్లు, మంచినీటి వసతి కల్పించడం
8) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో అక్షరాస్యత పెంపుదలకు వారి ఆవాస ప్రాంతాల్లోనే పాఠశాలలు నిర్మించడం.
9) వికలాంగులకు పాఠశాలల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం.
10) బాల కార్మికులను పాఠశాలలో చేర్చుకుని, సార్వత్రిక అక్షరాస్యతను సాధించడం.
11) ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వడం, ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు నిర్వహించి, అత్యాధునిక బోధన వ్యూహాలను పరిచయం చేయడం.
* ఈ పథకానికయ్యే ఖర్చులో 85% కేంద్ర ప్రభుత్వం, 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి.
* ఈ పథకానికి ఇంగ్లండ్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(DFID), ఆర్థిక సహాయం అందిస్తోంది.
* ఈ పథకం 2003 వరకూ ఉపాధ్యాయ సాధికారతను పెంచడానికి తోడ్పడింది.

సర్వశిక్షా అభియాన్ (Sarva Shiksha Abhiyan - SSA)
* దేశంలోని జిల్లా విద్యా పథకాలకు కొనసాగింపుగా 2003 నుంచి సర్వశిక్షా అభియాన్ అనే సార్వత్రిక ప్రాథమిక విద్యా పథకం ప్రారంభమైంది.
* దేశవ్యాప్తంగా 2010 నాటికి 6-14 సంవత్సరాల బాలబాలికలందరినీ పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో దీన్ని చేపట్టారు. సంతృప్తికరమైన, నాణ్యమైన, సార్వజనీన ప్రాథమిక విద్యను అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.
*  రాజ్యాంగంలోని 45వ అధికరణంలో పొందుపరిచిన ధ్యేయ సాధనకు అనువైన పథకమిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో భాగస్వాములు.
*  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొమ్మిదో పంచవర్ష ప్రణాళికలో 85 : 15, పదో ప్రణాళిక కాలంలో 75 : 25, తర్వాత 50 : 50 నిష్పత్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఎస్.ఎస్.ఎ. ప్రధాన లక్షణాలు:
1) సార్వత్రిక ఎలిమెంటరీ విద్య అమలుకు స్పష్టమైన కాలపరిమితి విధించడం.
2) గుణాత్మక ప్రాతిపదికన విద్యను అందించడం
3) అందరికీ సమన్వయాన్ని అందించడం
4) గ్రామస్థాయి సంస్థల సహకారంతో ఎలిమెంటరీ పాఠశాలల నిర్వహణ
5) రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు అనుగుణమైన ఎలిమెంటరీ విద్యా కార్యక్రమాలను, కేంద్ర ప్రభుత్వ సాయంతో ప్రారంభించడం


లక్ష్యాలు:
1) విద్యా హామీ పథకంలో భాగంగా బాలబాలికలందరినీ పాఠశాలలు లేదా ప్రత్యామ్నాయ పాఠశాలల్లో చేర్పించడం
2) బాలబాలికలందరూ 2007 నాటికి ప్రాథమిక విద్యను పూర్తి చేయడం
3) 2010 నాటికి విద్యార్థులందరూ ఎనిమిదేళ్ల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడం
4) నాణ్యమైన జీవితానికి ఉపయుక్తమైన విద్యను అందించడం
5) కుల, మత వర్గాల్లోని అంతరాలను తొలగించి, బాలబాలికలందరూ పాఠశాల విద్యను పూర్తి చేసేలా చూడటం
6) 2010 నాటికి పాఠశాలల్లో సార్వత్రిక నిలుపుదలను సాధించడం.
* ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధించడం, మూల్యాంకనాన్ని ప్రోత్సహించడంలాంటి ప్రధాన లక్ష్యాలు ఈ కార్యక్రమంలో ఉన్నాయి.
* ఈ పథకాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో రాజీవ్ విద్యామిషన్ (RVM) అనే పేరుతో వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం(Andhra Pradesh School Health Project - APSHP)
* ప్రాథమిక పాఠశాలల్లో బాలబాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం.

లక్ష్యాలు:
1) విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆరోగ్యకరమైన జీవనవిధానం పట్ల అవగాహన కల్పించడం.
2) నిర్ణీత వ్యవధుల్లో బాలబాలికలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం.
5) కుల, మత వర్గాల్లోని అంతరాలను తొలగించి, బాలబాలికలందరూ పాఠశాల విద్యను పూర్తి చేసేలా చూడటం
6) 2010 నాటికి పాఠశాలల్లో సార్వత్రిక నిలుపుదలను సాధించడం.
* ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధించడం, మూల్యాంకనాన్ని ప్రోత్సహించడంలాంటి ప్రధాన లక్ష్యాలు ఈ కార్యక్రమంలో ఉన్నాయి.
* ఈ పథకాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో రాజీవ్ విద్యామిషన్ (RVM) అనే పేరుతో వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం(Andhra Pradesh School Health Project - APSHP)
* ప్రాథమిక పాఠశాలల్లో బాలబాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం.

లక్ష్యాలు:
1) విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆరోగ్యకరమైన జీవనవిధానం పట్ల అవగాహన కల్పించడం.
2) నిర్ణీత వ్యవధుల్లో బాలబాలికలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం.
* ఈ కార్యక్రమాలు 'టెలిస్కూల్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందాయి.
* నిపుణుల బోధనా వ్యూహాలను అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు పరిచయం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
* ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వల్ల వృత్తి నిబద్ధతను, సాధికారతను పెంపొందించే కార్యక్రమంగా గుర్తింపు పొందింది అనడంలో అతిశయోక్తి లేదు.


సంసిద్ధతా కార్యక్రమాలు (Readiness Programmes)
* సార్వజనీన ప్రాథమిక విద్యా లక్ష్య సాధనకు ప్రాతిపదికగా ఈ కార్యక్రమం గుర్తింపు పొందింది.
* చేరడానికి ముందే విద్యార్థులు పాఠశాలలకు వచ్చి అక్కడ కొనసాగడానికి వీలైన వాతావరణం కల్పించడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.
* పాఠశాల అంటే పిల్లల్లో ఉన్న భయాన్ని తొలగించి ఆ పరిసరాలకు వారిని దగ్గర చేస్తుంది.

ఈ కార్యక్రమ లక్ష్యాలు:
1) వ్యక్తిగత, సాంఘిక సంసిద్ధత
2) మనోచలన ఇంద్రియాల సంసిద్ధత
3) విద్యాపరమైన సంసిద్ధత
ఇందులో బాలబాలికలు నేర్చుకునేవి:
1) పరిసరాల్లో లభించే వస్తువులను పరిశీలించడం, వాటిని వర్గీకరించడం.
2) రంగులు వేయడం, కత్తిరించడం, అతికించడం, మట్టితో బొమ్మలు చేయడం.
3) ఆకృతులు, నమూనాలు సిద్ధం చేయడం.
4) నడవటం, గెంతులు వేయడం, పరుగెత్తడం, ఆటలాడటం.
* ఈ కార్యక్రమం పూర్వ ప్రాథమిక విద్యలో భాగమే అయినా పాఠశాలల్లో బాలబాలికల నమోదుకు, వారిని పాఠశాలల్లో నిలిపి ఉంచడానికి ఉపాధ్యాయులకు తోడ్పడుతుంది.

 

ఆవాస పాఠశాలలు (Residential Schools)
* వీటినే ఆశ్రమ పాఠశాలలు అంటారు.
* మన రాష్ట్రంలో సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, షెడ్యూల్డ్ తెగల (గిరిజనుల) గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 'ఆవాస పాఠశాలలు' నిర్వహిస్తున్నారు.

* మైనారిటీలకు కూడా ప్రత్యేక ఆవాస విద్యాలయాలను స్థాపించారు.
* ఈ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు బోధిస్తారు.
* వీటిలో ఉచిత వసతి, భోజనం, విద్యాసౌకర్యాలతో పాటు నిపుణులైన ఉపాధ్యాయులతో బోధనకి ఏర్పాట్లు చేశారు.
* విద్యార్థులు తమ పర్యవేక్షణలో రోజూ గడపడం వల్ల తాము ఆశించిన రీతిలో వారిని తీర్చిదిద్దడానికి ఈ పాఠశాలల ఉపాధ్యాయులకు వీలుంటుంది.

 

దూరదర్శన్ పాఠాలు (Television Lessons)
* ఉపాధ్యాయులు తమ వృత్తి సామర్థ్యాలు, విద్యా సంబంధ ప్రతిభా పాటవాలను పెంపొందించుకోవడానికి దూరదర్శన్ జాతీయ ఛానల్ పలు కార్యక్రమాలను చేపడుతోంది.
* ఉపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, తమ విషయ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
* మన రాష్ట్రంలో కూడా 'సప్తగిరి' పేరుతో హైదరాబాద్ కేంద్రంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు టెలివిజన్ పాఠాలను ప్రసారం చేస్తున్నారు.


రేడియో పాఠాలు (Radio Lessons)
* ఉపాధ్యాయుల కోసం ఆకాశవాణి కేంద్రాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
* ఇవి ఉపాధ్యాయులు తమ విషయ పరిజ్ఞాన పరిధులను విస్తరించుకోవడానికి, బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి తోడ్పడతాయి.
* మనరాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఇలాంటి ప్రసారాలు చేస్తున్నాయి.

 

టెలికాన్ఫరెన్సింగ్ (Tele conferencing)
* ఇటీవలి కాలంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానం సాయంతో నిపుణులైన ఉపాధ్యాయులతో 'టెలికాన్ఫరెన్సింగ్' నిర్వహిస్తున్నారు.
*  టెలిఫోన్ (దూరవాణి) సౌకర్యం ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు ఈ కాన్ఫరెన్సింగ్ ద్వారా విద్యావిషయక చర్చల్లో పాల్గొని తమ ప్రతిభా వ్యుత్పత్తులను, బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు.

 

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమం (Special Orientation Programme for Primary Teacher - SPOT)
* ఈ కార్యక్రమాన్ని 1993, 1994, 1995 సంవత్సరాల్లో NCERT సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ SCERT రూపొందించి అమలు చేసింది.
* ఈ కార్యక్రమం కోసం నిపుణులతో పాఠాలు సిద్ధం చేయించి, కరదీపికల రూపంలో ముద్రించింది. APIEP కార్యక్రమాలతో సమాంతరంగా 10 రోజుల పాటు వివిధ కాలవ్యవధుల్లో సుమారు 1.5 లక్షల మంది ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రత్యేక వృత్యంతర శిక్షణ తరగతులు నిర్వహించారు.
* ఈ కార్యక్రమం OBB పథకానికి కొనసాగింపుగా చెప్పవచ్చు. 2001-02 లో ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా దీన్ని అందించారు.
*  ఉపాధ్యాయుల విషయ పరిజ్ఞానం, బోధనా నైపుణ్యాల మెరుగుదలకు ఇది తోడ్పడుతుంది.

 

సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం (Centre for Cultural Resources and Training - CCRT)
* ఇది జాతీయ స్థాయి సంస్థ. దేశవ్యాప్తంగా మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తోంది. మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడానికి ఉపాధ్యాయులకు ప్రత్యేక స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
* ఈ కోర్సులో చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం మొదలైన వివిధ లలితకళలు, కళారూపాలు ఉంటాయి.
* భావితరాలకు మన సంస్కృతి వారసత్వ సంపదను పదిలపరిచి అందించడానికి నిరంతర కృషి చేస్తున్న ఈ సంస్థ ఉపాధ్యాయుల సాధికారతకు ఎంతో తోడ్పడుతోంది.
వృత్యంతర విద్య - ఆవశ్యకత - పరిధి - ఉపాధ్యాయుల భాగస్వామ్యం:
* ఉపాధ్యాయ వృత్తి స్వీకరించిన వారు కాలానుగుణంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు తగినట్లు తమ నైపుణ్యాలను తీర్చిదిద్దుకోవాలి. విద్యాబోధన, అభ్యసన ప్రక్రియలో చోటుచేసుకున్న కొత్త ధోరణులను; అందుబాటులోకి వస్తున్న సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని వారు సొంతం చేసుకోగలిగితేనే విద్యార్థుల అవసరాలు, ఆకాంక్షలను తీర్చగలుగుతారు. అప్పుడే బోధనాభ్యాసన ప్రక్రియలో ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు.
* అన్ని కమిషన్లు, సంఘాలు వృత్యంతర విద్య ఆవశ్యకతను నొక్కిచెప్పాయి.
* వృత్తిపూర్వ, వ్యత్యంతర విద్యలు రెండూ విడదీయరానివని 1986 జాతీయ విద్యావిధానం నొక్కి చెప్పింది.
* 1986 జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి... ఉపాధ్యాయుల వృత్తి సాధికారత వృత్తి పూర్వశిక్షణతో ప్రారంభమై, వృత్తి నిర్వహణ కాలమంతా పరిపుష్టం అవుతుంది.
* మారుతున్న సమాజ అవసరాలు, ఆశయాలకు అనుగుణంగా బోధన లక్ష్యాలు, విద్యా విధానాలు, విద్యా ప్రణాళికల బోధనా వ్యూహాలు మూల్యాంకన పద్ధతుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమమే వృత్యంతర శిక్షణ. 

 

వృత్యంతర ఉపాధ్యాయ విద్య - పరిధి
1) బోధనాంశాల్లో నూతనత్వం, ఆధునిక బోధన, అభ్యసన వ్యూహాలు, శిశుకేంద్రీకృత, అభ్యసన కేంద్రీకృత బోధన పద్ధతులు.
2) బోధనాభ్యాసన సామగ్రి తయారీ, సేకరణ, ఎంపికకు తరగతిని వినియోగిస్తారు.
3) మూల్యాంకన విధానాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, బోధనాభ్యాసన ప్రక్రియపై మనోవిజ్ఞానశాస్త్ర ప్రభావం, విద్యార్థుల సహజ అభ్యసన అనుభవాలు, అంతర్గత శక్తులను అర్థం చేసుకునే విధానం.
4) అధునాతన దృశ్య శ్రవ్య సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ సమాచార సాంకేతిక విజ్ఞానం పరిచయం.
5) విద్యార్థుల స్థాయి గుర్తింపు, అందుబాటులో ఉన్న వనరుల వినియోగం.
* పై అంశాలన్నీ ఉపాధ్యాయ సాధికారతను పెంపొందిస్తాయి

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌