• facebook
  • whatsapp
  • telegram

 ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థలు

*  ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకతను పెంపొందించి, విద్యా ప్రక్రియను సమర్థవంతం చేయడానికి మనదేశంలో పలు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. వాటిలో
1) జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (National Council for Teacher Education - NCTE)
2) జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (National Council for Educational Research and Training - NCERT)
3) కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ (Central Institute of Educational Technology - CIET)
4) ఇంగ్లిష్, విదేశీ భాషల కేంద్ర సంస్థ ((Central Institute of English and Foreign Languages - CIEFL). దీన్ని ప్రస్తుతం English & Foreign Language University (EFLU)అని వ్యవహరిస్తున్నారు.
5) రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (State Council of Educational Research and Training - SCERT)
6) రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ (State Institute of Educational Technology - SIET)
7) రాష్ట్ర వనరుల కేంద్రం (State Resource Centre - SRC)
8) ప్రాంతీయ విద్యాసంస్థలు (Regional Institutes of Education - RIE)
9) జిల్లా విద్యాశిక్షణ సంస్థలు (District Institutes of Education and Training - DIET)
10) మండల వనరుల కేంద్రాలు (Mandal Resource Centres - MRC)

 

జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (NCTE)
*  కేంద్ర ప్రభుత్వం 1973లో దేశమంతటా ఒకే విధమైన ప్రమాణాలతో ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలను నిర్వహించడానికి తగిన సలహా ఇచ్చేందుకు 'NCTE' అనే ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది.
*  కేంద్ర ప్రభుత్వం 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా చట్టబద్ధమైన స్వంతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా దీన్ని రూపొందించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
*  1995 మే 17న స్వతంత్ర ప్రతిపత్తి లభించిన తర్వాత దేశంలో నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను స్థాపించింది. అవి
1) జైపూర్ (ఉత్తర ప్రాంతం)
2) బెంగళూరు (దక్షిణ ప్రాంతం)
3) భువనేశ్వర్ (తూర్పు ప్రాంతం)
4) భోపాల్ (పశ్చిమ ప్రాంతం)
¤  మన రాష్ట్రం బెంగళూరులోని ప్రాంతీయ కార్యాలయం పరిధిలోకి వస్తుంది.


ఈ సంస్థ కార్యకలాపాలు:
1) పూర్వ ప్రాథమిక, ప్రాథమిక ఎలిమెంటరీ, సెకండరీ స్థాయుల్లో వృత్తిపూర్వ, వృత్యంతర శిక్షణ, దూర విద్యను అందించి వాటిలో గుణాత్మకతను పెంపొందించడానికి వ్యూహాలను రూపొందించడం.
2) ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి, ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించడం.
3) ఉపాధ్యాయ విద్యకు సంబంధించి సర్వేలు, కార్యగోష్టులు, సెమినార్లను జాతీయ, క్షేత్రస్థాయుల్లో నిర్వహించి ఉపాధ్యాయ విద్యానాణ్యతకు తోడ్పడటం.
4) ఉపాధ్యాయుల సమర్థతను, నిబద్ధతను పెంపొందించడానికి కృషి చేయడం.
5) ఉపాధ్యాయ విద్యలో ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ధోరణులను పరిశీలించి మన దేశానికి అనువైన ధోరణులను ప్రచారం చేయడం.

జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (NCERT)
*  1961 సెప్టెంబరు 1న న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ప్రకటించింది.
*  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు ఇది విద్యా సలహాదారుగా వ్యవహరిస్తుంది.
*  ఉపాధ్యాయ పథకాలు, పాఠశాల విద్య, విధాన నిర్ణయాల అమలుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ NCERT నిపుణతను ఉపయోగించుకుంటుంది.

ఈ సంస్థ కార్యకలాపాలు:
1) పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించడం, ప్రోత్సహించడం.
2) వివిధ అంశాలపై ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి, ఫలితాలను ప్రచురించడం.
3) పాఠశాల స్థాయి పాఠ్య, పఠనీయ గ్రంథాలను (Reference books) తయారు చేయడం.
4) రాష్ట్ర ప్రభుత్వాల విషయ ప్రణాళికల నిర్మాణానికి సూచనలివ్వడం, సమీక్షించడం.
5) పరీక్షల సంస్కరణలకు తోడ్పడటం.
6) బోధనాభ్యాసన సామగ్రి, పరికరాలు, నమూనాలు సిద్ధం చేయడం.
7) జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభాపాటవ పరీక్షను (NTSE) నిర్వహించి, ఎంపికైన విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వడం.
8) శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో శాస్త్రగోష్టులు (Science fairs) నిర్వహించడం.
9) అంతర్జాతీయ సంస్థల సహకారంతో విద్యా నాణ్యతను పెంపొందించడానికి వ్యూహరచన చేయడం.
10) కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు విద్యావిషయక సలహాదారుగా విధాన నిర్ణయాల్లో పాలుపంచుకోవడం.


కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ (CIET)
*  ఈ సంస్థను 1982లో ప్రారంభించారు. దీన్ని 'కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ' అని కూడా అంటారు. ఈ సంస్థ ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించడానికి కింది కార్యక్రమాలు చేపడుతోంది.
1) వీడియో, ఆడియో కార్యక్రమాలు; ఫిల్ములు, చార్టులు,  స్లైడ్లు రూపొందించి పాఠశాలలు, సంస్థలకు సరఫరా చేయడం.
2) గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం 'టెలిస్కూల్' కార్యక్రమాలను నిర్వహించడం.
3) ఉపాధ్యాయులకు ఖర్చులేని, తక్కువ ధర ఉండే బోధనోపకరణాల తయారీలో శిక్షణ ఇవ్వడం.


ఇంగ్లిష్, విదేశీ భాషల కేంద్ర సంస్థ (CIEFL)
*  ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. విశ్వవిద్యాలయ హోదా పొందిన ఈ సంస్థ ఆంగ్లభాషా బోధనతో పాటు ఇతర విదేశీ భాషలకు సంబంధించిన పలు కార్యక్రమాలు రూపొందించి ఉపాధ్యాయులకు అందిస్తోంది.
* ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో భాగంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను రూపొందించి వాటిని నియత విద్య, దూరవిద్య ద్వారా అందిస్తోంది.
* ఆంగ్లభాషా వాచకాల రచన, కూర్పు, సమీక్ష మొదలైనవి ఈ సంస్థ నిర్వహణలో ప్రధాన కార్యక్రమాలు.


రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (SCERT)
*  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా NCERT నమూనాలో పనిచేస్తున్న ఈ సంస్థ మన రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాల రూపకల్పనకు పాటుపడుతోంది.
* విషయ ప్రణాళికలను కూర్చడం, పాఠ్య పుస్తకాలు రాయించడంతోపాటు ఉపాధ్యాయులకు పలు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన విధివిధానాలను ఖరారు చేస్తోంది.
* బోధనలో ఆధునిక ధోరణులను పరిశోధించి, వాటి ఫలితాలను ఉపాధ్యాయులకు అందించి తద్వారా పాఠశాల విద్యలో నాణ్యతను పెంపొందించడం ఈ సంస్థ ప్రధాన విధుల్లో ఒకటి.
* ఇది రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు విద్యావిషయక సలహాదారుగా వ్యవహరిస్తోంది.
* రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొదట State Institute of Education అనే పేరుతో 1964లో హైదరాబాద్‌లో ఒక సంస్థను స్థాపించారు. అది 1976లో SCERT గా మారింది.


రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (SIET)
*  మన రాష్ట్రంలో 1985లో స్థాపించిన ఈ సంస్థను రాష్ట్ర దృశ్యశ్రవణ విద్యా వికాస కేంద్రం అని కూడా అంటారు.
* దీని స్థాపనకు ఆదర్శం CIET.
* ఈ కేంద్రం బాలబాలికల కోసం పలు కార్యక్రమాలు రూపొందించి 'టెలిస్కూల్' పేరుతో దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తుంది.
* ఉపాధ్యాయుల కోసం కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి, వారి సాధికారతకు తోడ్పడుతుంది.
* జాతీయ, రాష్ట్రస్థాయి సంస్థల సహకారంతో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో బోధనాభ్యాసన కృత్యాల్లో ఆవిర్భవిస్తున్న ఆధునిక ధోరణులను పరిచయం చేయడం, విద్యా నాణ్యతకు పాటుపడటం లాంటి లక్ష్యాల సాధన కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది.


రాష్ట్ర వనరుల కేంద్రం (SRC)
* ప్రాథమిక సార్వత్రిక విద్యలో భాగంగా వయోజన విద్యావ్యాప్తికి హైదరాబాద్‌లో ఆంధ్రమహిళా సభా ప్రాంగణంలో స్థాపించిన ఈ సంస్థ సంపూర్ణ అక్షరాస్యతా సాధన దిశలో పలు కార్యక్రమాలను చేపడుతోంది.
* వయోజన విద్యకు సంబంధించిన వాచకాల రచన, క్షేత్ర సిబ్బందికి మార్గదర్శకాలు ఉన్న కరపుస్తకాల   (Hand books) ముద్రణతోపాటు సిబ్బందికి, నిపుణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
* అక్షరాస్యతా వ్యాప్తికి సభలు, సమావేశాలు నిర్వహించడం, ఊరేగింపులు చేయడం ఈ సంస్థ కార్యకలాపాల్లో భాగం. ప్రత్యేకంగా స్త్రీల అక్షరాస్యతాభివృద్ధికి ఈ సంస్థ చేస్తున్న కృషి ఎనలేనిది.


ప్రాంతీయ విద్యా సంస్థలు (RIE)
*  దేశంలోని అయిదు ప్రాంతీయ విద్యాసంస్థల్లో దక్షిణ భారతదేశ అవసరాల కోసం మైసూర్ కేంద్రంగా, NCERT ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఈ సంస్థ BEd, MEd కోర్సులు నిర్వహించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్యంతర శిక్షణ, పునశ్చరణ తరగతులు కూడా నిర్వహిస్తోంది.
*  విద్యా రంగంలో పరిశోధనలు నిర్వహించి, బోధనాభ్యాసన ప్రక్రియ నాణ్యతకు కృషి చేస్తూ ఉపాధ్యాయ లోకానికి మార్గదర్శనం చేస్తోంది.

 

జిల్లా విద్యా శిక్షణా సంస్థ (DIET)
* 1990లో ప్రతి జిల్లాకు ఒక జిల్లా విద్యా శిక్షణా సంస్థను స్థాపించారు.
*  NCERT, SCERT నమూనాలో జిల్లా స్థాయిలో ఎలిమెంటరీ విద్యాభివృద్ధికి 1986 నాటి జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఏర్పాటు చేసిన సంస్థ ఇది.
*  ఇది ప్రాథమిక దశలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తి పూర్వ శిక్షణతో పాటు, పలు వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు, కార్యగోష్టులు, సెమినార్లు, సింపోజియమ్స్ నిర్వహించి ఉపాధ్యాయుల సాధికారత పెంపుదలకు తోడ్పడుతుంది.

 

మండల వనరుల కేంద్రం (MRC)
*  ఇది మండల స్థాయిలో మండల విద్యాధికారి పర్యవేక్షణలో, మండలస్థాయి విషయ నిపుణులైన ఉపాధ్యాయుల (MRP) సహకారంతో నిర్వహిస్తున్న సంస్థ.
*  ఈ సంస్థ పాఠశాల నిర్వహణ తీరును మెరుగుపరచడానికి మండల, ఉపాధ్యాయ కేంద్రం (Teacher Center), పాఠశాల సముదాయం స్థాయుల్లో కార్య శిబిరాలు నిర్వహిస్తోంది. అలాగే ఆదర్శ పాఠ్య బోధన, మూల్యాంకన పద్ధతుల్లో శిక్షణ ఇస్తోంది.
*  మండల స్థాయిలో ప్రాథమిక విద్యాకార్యకలాపాల పటిష్ఠ అమలుకు అవసరమైన విధానాలను సిద్ధం చేస్తూ ఉపాధ్యాయుల సాధికారతకు అండదండలు అందిస్తున్న సంస్థ ఇది.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌