• facebook
  • whatsapp
  • telegram

క్రీడా పద్ధతి

ఉత్సాహంగా.. ఉల్లాసంగా నేర్పించే శిక్షణ!


ప్రాథమిక దశలో చిన్నారులకు చదువులపై ఇష్టాన్ని పెంచాలంటే వారిని ఒప్పిస్తూ, మెప్పిస్తూ బోధించాల్సి ఉంటుంది. ఆట పాటలు అందులో భాగం కావాలి. ఉత్తేజపరిచే విధంగా, ప్రేరణ చెందించే రీతిలో, స్వేచ్ఛగా మనోవికాసం కలిగించే తీరులో ఆ బోధన సాగాలి. ఈ దిశగా ఉన్న ప్రామాణిక బోధనా పద్ధతుల గురించి కాబోయే ఉపాధ్యాయులు సమగ్రంగా తెలుసుకోవాలి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు పరిమితులపై అవగాహన పెంచుకోవాలి


హెన్రీ కాల్డ్వెల్‌ కుక్‌ తన అనుభవాల ఆధారంగా క్రీడాపద్ధతిని ప్రతిపాదించారు.పెర్సీనన్, గిఫ్రిత్, ఫ్రెడరిక్‌ ఫ్రోబెల్, మాంటిస్సోరి లాంటివారు విద్యారంగంలో క్రీడాపద్ధతికి విశేష ప్రాచుర్యాన్ని కల్పించారు.

 ఒక వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఇష్టపూర్వకంగా, ఉల్లాసంగా నిర్వహించే ఏ కృత్యమైనా క్రీడే అవుతుంది. ఈ క్రీడ ఆనందాన్ని ఇస్తుంది. - గల్లిక్‌

 క్రీడ అంటే జీవితంలో మున్ముందు దీక్షాభినివేశాలతో కార్యాచరణకు సమాయత్తపరిచే పీఠిక ప్రాయమైన సాధన. - కారల్‌ గ్రూస్‌

   పిల్లల సంపూర్ణ అభివృద్ధికి క్రీడాపద్ధతి చక్కటి సాధన. - ఫ్రోబెల్‌

   క్రీడల్లో బహిర్గతమయ్యే మానసిక శక్తిని విద్యావిధానంలో ఉపయోగించుకుంటే బోధన ఫలవంతం అవుతుంది. - పెర్సీనన్‌


క్రీడాపద్ధతిలోని ముఖ్యమైన అంశాలు

 ఈ పద్ధతి చైతన్యవంతమైంది.

 ఈ విధానంలో విద్యార్థుల మానసిక అవసరాలు  తీరుతాయి.

 విద్యార్థులకు సాధన, గుర్తింపు పట్ల ఉన్న అవసరం క్రీడాపద్ధతిలో తీరుతుంది.

పిల్లల్లోని కార్య కుతూహలత, నిర్మాణాత్మక, సామూహిక భావన లాంటి సహజాత లక్షణాలను క్రీడాపద్ధతి ఉపయోగించుకుంటుంది.

 ఈ విధానం ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.

 ఇది చక్కటి భాగస్వామ్యంతో అభ్యసన వాతావరణాన్ని కల్పిస్తుంది.

క్రీడాపద్ధతి ప్రయోజనాలు: భాషా బోధనలో క్రీడాపద్ధతి కింది ప్రయోజనాలను కలిగిస్తుంది.

 శారీరక, మానసిక వికాసానికి; సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి ఉపకరిస్తుంది.

విద్యార్థుల్లో భావనాశక్తి, సృజనాత్మక శక్తి పెరుగుతాయి.

అవధానం, గ్రహణ శక్తి, వివేచన, సహనం, సమయస్ఫూర్తి, స్మృతి జ్ఞానం పెంపొందుతాయి.

సహృదయత, సానుభూతి, సహకార భావన, ఆత్మవిశ్వాసం, ఆత్మనిగ్రహం అలవడతాయి.

కుతూహలం, ఆర్జన, ఉత్సాహం లాంటి సహజాతాలు వినియోగంలోకి వచ్చి ఆలోచన, ఆచరణ, అనుభవం అనేవి సమన్వయం పొందుతాయి.

హాస్యపూరిత ప్రసంగ ధోరణి, సంభాషణా చాతుర్యం, నటనా కౌశలం అలవడతాయి.

పరిమితులు

 అన్ని అంశాలను బోధించడానికి క్రీడాపద్ధతి ఉపయోగపడదు.

నేర్చుకోవడం కంటే ఆనందానికి ప్రాధాన్యం ఇచ్చే  అవకాశం ఉంది.


మాంటిస్సోరి పద్ధతి

దీనికి శిశు గృహం/క్లబ్‌ అనే పేర్లు ఉన్నాయి. దీన్ని   ప్రతిపాదించివారు మేరియా మాంటిస్సోరి.

ముఖ్యాంశాలు

 శిశువుల మనస్తత్వంపై ఆధారపడిన పద్ధతి.

 ఇదొక జీవన వికాస పద్ధతి.

 పంచేంద్రియాలకు శిక్షణ ఇచ్చే పద్ధతి.

 ఈ పద్ధతిలో విద్యార్థులకు ఒక క్లబ్‌  శిశు గృహం ఉంటుంది.

ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు పరిశీలకుడిగా ఉంటారు.

 దర్శకురాలి ఆధ్వర్యంలో పాఠశాల నడుస్తూ ఆమెకు సహాయకురాలిగా ఒక ఉపాధ్యాయురాలు, వైద్యురాలు ఉండే పద్ధతి.

 ఈ పద్ధతిలోని బాలబాలికల వయసు 37 ఏళ్లు.

దీనిలో ధన వ్యయం, కాల వ్యయం, స్వేచ్ఛ ఎక్కువ.

దీనిలో పిల్లలకు ఉపదేశాత్మక ఉపకరణాలు  డైడాక్టిక్‌ అవరాటస్ ఇస్తారు.

పిల్లల శారీరక ఎదుగుదలను కొలవడానికి వాడే   పరికరాన్ని పీడో మెట్రా అంటారు.

గిజుబాయి అభిప్రాయం ప్రకారం ఇదొక జీవన ఆదర్శం.


కిండర్‌ గార్టెన్‌ పద్ధతి


దీనికి బాల ఉద్యానవన/తరగతి గది పద్ధతి అని పేరు. పాఠశాల ఒక తోట; అందులోని బాలబాలికలు మొక్కల లాంటివారు అని భావించేదే కిండర్‌ గార్టెన్‌ పద్ధతి. దీన్ని ప్రతిపాదించినవారు ఫ్రోబెల్‌. ఈయన జర్మన్‌ దేశస్థుడు. ఫ్రోబెల్‌ రాసిన గ్రంథం ‘ది ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్లాన్‌’. 

స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగే మొక్కలు ఎలాంటివో బాలబాలికలు కూడా అలాంటి వారేనని ఈ పద్ధతి భావిస్తుంది.

ఈ పద్ధతిలో బాలబాలికలకు ఇచ్చే ఉపకరణాలకు ఫ్రోబెల్‌ కానుకలు అని పేరు. 

 దీనిలో ధన వ్యయం, కాల వ్యయం, స్వేచ్ఛ తక్కువ.

ఇందులో ఉపాధ్యాయురాలు మార్గదర్శకురాలిగా ఉంటారు. 

 మట్టితో నమూనాలు చేయించడం, రంగులు  కలపడం, కాగితాలు కత్తిరించడం, వివిధ ఆకృతులు తయారు చేయడం ఈ పద్ధతిలోని వ్యూహాలు.

మాదిరి ప్రశ్నలు


1. తోటలోని లేత మొక్కలను పెంచినట్లే శిశువులను కూడా జాగ్రత్తగా పెంచాలనే సిద్ధాంతంపై     ఆధారపడిన పద్ధతి?

1) కిండర్‌ గార్టెన్‌ పద్ధతి     2)  మాంటిస్సోరి పద్ధతి  

3)  డాల్టన్‌ పద్ధతి      4)  క్రీడాపద్ధతి


2. ‘ఫ్రోబెల్‌ కానుకలు’ అనే పేరుతో సాధన సామగ్రిని ఉపయోగిస్తూ బోధించే పద్ధతి?

1)  మాంటిస్సోరి పద్ధతి      

2)  కిండర్‌ గార్టెన్‌ పద్ధతి  

3)  ప్రాజెక్టు పద్ధతి      

4)  క్రీడాపద్ధతి


3. కిండర్‌ గార్టెన్‌ పద్ధతికి మరొక పేరు?

1)  ప్రకల్పనా పద్ధతి     2)  బాలోద్యాన పద్ధతి  

3)  శిశుగృహం       4)  వ్యక్తి పద్ధతి



4. కిండర్‌ గార్టెన్‌ పద్ధతి ఏ దశలోని వారికి మాత్రమే ఉపయోగం?

1)  ప్రాథమిక దశ     2)  ప్రాథమిక పూర్వదశ  

3)  1, 2       4)  మాధ్యమిక దశ



5.  కిండర్‌ గార్టెన్‌ పద్ధతిలో కాలపరిమితి?

1)  30 నిమిషాలు      2)  60 నిమిషాలు   

3)  45 నిమిషాలు      4)  40 నిమిషాలు



6. విద్యార్థులు ఆరోగ్యంతో పెరుగుతూ విద్యావంతులు కావాలనేది ఏ పద్ధతి? (పిల్లల ఆరోగ్యం - విద్య దీని లక్ష్యం)

1)  మాంటిస్సోరి పద్ధతి      

2)  కిండర్‌ గార్టెన్‌ పద్ధతి  

3)  డాల్టన్‌ పద్ధతి      

4)  క్రీడాపద్ధతి 



7. అదనంగా చదవడం - రాయడం అనే  నైపుణ్యాలను నేర్పించే పద్ధతి?

1)  డాల్టన్‌ పద్ధతి       

2)  క్రీడాపద్ధతి   

3)  మాంటిస్సోరి పద్ధతి     

4)  కిండర్‌ గార్టెన్‌ పద్ధతి 



8. శిశువు ప్రవర్తనను గమనిస్తూ, లోపాలు సవరిస్తూ విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచేవారు?

1)  దర్శకురాలు      2)  ఉపాధ్యాయుడు   

3)  వైద్యురాలు       4)  పర్యవేక్షకురాలు



9. మాంటిస్సోరి పాఠశాలకు మరొక పేరు?

1)  బాల మందిరం      2)  శిశు గృహం  

3)  పిల్లల తోట      4)  క్రీడా తోట



10. మేరియా మాంటిస్సోరి ఏ దేశస్థురాలు?

1)  ఇటలీ      2)  ఇంగ్లండ్‌  

3)  జర్మనీ       4)  అమెరికా



11. మాంటిస్సోరి పద్ధతిలోని ప్రయోజనం?

1)  పంచేంద్రియ జ్ఞానం పెంపొందుతుంది.

2)  స్వయంకృషి అలవడుతుంది.

3)  ఆరోగ్య విధులు తెలుస్తాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

4)  పైవన్నీ



12. మాంటిస్సోరి ఏ నగరంలో వైద్యురాలిగా పనిచేశారు?

1)  లండన్‌      2)  ఒట్టావా  

3)  రోమ్‌       4)  ఇంగ్లండ్‌



13. మాంటిస్సోరి విద్యావిధానంలో శిశువుకు నేర్పించే అంశాలు?

1)  కత్తెర, జిగురు, సుద్దముక్క, రంగులు లాంటి వాటితో కత్తిరించడం, చిత్రించడం, గీయడం నేర్పడం

2)  దేహ పారిశుద్ధ్యం, దుస్తులు, పుస్తకాలు సక్రమంగా ఉంచుకునేలా చూడటం 

3)  పెంపుడు జంతువులు, మొక్కలను పెంచడం

4)  పైవన్నీ



14. క్రీడాపద్ధతికి మరొక పేరు?

1)  ఎత్తుగడ పద్ధతి     2)  హౌస్‌ సిస్టం

3)  శిశు గృహం         4)  తరగతి గది పద్ధతి


15. ‘ఒక వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా నిర్వహించే ఏ కృత్యమైనా క్రీడే    అవుతుంది’ అని నిర్వచించినవారు?

1)  ఫ్రోబెల్‌      2)  స్టాన్లీహాల్‌  

3)  కారల్‌ గ్రూస్‌      4)  గల్లిక్‌



16. కిండర్‌ గార్టెన్‌ పద్ధతిని ప్రవేశపెట్టినవారు?

1)  కిల్‌ప్యాట్రిక్‌    2)  డాల్టన్‌   

3)  ఫ్రోబెల్‌    4)  మిస్‌గల్‌



17. విద్యా సిద్ధాంత మహాక్షేత్రంలో క్రీడాపద్ధతి కొమ్మ అయితే కిండర్‌ గార్టెన్, మాంటిస్సోరి పద్ధతులు?

1)  వేర్లు       2)  చెట్లు  

3)  వృక్షాలు      4)  రెమ్మలు



18. కిండర్‌ - గార్టెన్‌ అనే రెండు పదాలు ఏ భాషకు చెందినవి?

1)  గ్రీకు       2)  జర్మనీ  

3)  లాటిన్‌       4)  ఫ్రెంచ్‌



19. కిండర్‌ గార్టెన్‌ అనే పదానికి అర్థం?

1)  శిశువుల తోట       2)  లేత మొక్కలు 

3)  శైశవ రెమ్మలు      4)  లేతమొక్కల తోట



20. కిండర్‌ గార్టెన్‌ కింది ఏ పద్ధతికి భిన్నంగా  ఉంటుంది?

1)  ప్రాజెక్టు పద్ధతి       2)  మాంటిస్సోరి   

3)  క్రీడాపద్ధతి         4)  డాల్టన్‌ పద్ధతి 



21. మాంటిస్సోరి పద్ధతిలో విద్యార్థుల వయసు (సంవత్సరాల్లో)?

1)  3 నుంచి 5        2)  3 నుంచి 6   

3)  3 నుంచి 7        4)  3 నుంచి 9



22. కాల వ్యయం, ధన వ్యయం తక్కువగా ఉన్న పద్ధతి?

1)  మాంటిస్సోరి      2)  కిండర్‌ గార్టెన్‌   

3)  క్రీడా పద్ధతి       4)  డాల్టన్‌ పద్ధతి



23. కిండర్‌ గార్టెన్‌లోని విద్యా పద్ధతి?

1)  తరగతి పద్ధతి   

2)  చెట్ల కింద నేర్పే పద్ధతి

3)  ఎక్కడపడితే అక్కడ కూర్చొని స్వేచ్ఛగా నేర్చుకునే పద్ధతి

4) విధాన నిర్ణయం లేని పద్ధతి



24. క్రీడాపద్ధతిలోని మనో విజ్ఞానశాస్త్ర నియమాలపై ఆధారపడిన పద్ధతి?

1)  ప్రాజెక్టు పద్ధతి        2)  కిండర్‌ గార్టెన్‌ పద్ధతి   

3)  డాల్టన్‌ పద్ధతి         4)  మాంటిస్సోరి పద్ధతి



25. మాంటిస్సోరి పాఠశాలను ఎవరు నిర్వహిస్తారు?

1)  పర్యవేక్షకురాలు       

2)  వైద్యురాలు  

3)  దర్శకురాలు       

4)  ఉపాధ్యాయురాలు


సమాధానాలు

1-1; 2-2; 3-2; 4-3; 5-1; 6-2; 7-4; 8-2; 9-2; 10-1; 11-4; 12-3; 13-4; 14-1; 15-4; 16-3; 17-4; 18-2; 19-1; 20-2; 21-3; 22-2; 23-1; 24-4; 25-3.


 

 

 

రచయిత: సూరె శ్రీనివాసులు 

 

Posted Date : 01-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు