• facebook
  • whatsapp
  • telegram

అలంకారాలు

శబ్దాలతో చమత్కారం.. అర్థాలతో అతిశయం!


తెలుగు వ్యాకరణంలో అలంకారాలు ఒక భాగం. కావ్యానికి సొబగులు అద్ది, భావాన్ని మనోహరంగా తీర్చిదిద్దే ఈ ప్రక్రియ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం, నిత్యనూతనం చేసింది. పండిత పామరులందరినీ అమితంగా మెప్పించే అలంకారాలు, అందులోని రకాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. శబ్దాల కూర్పుతో భావాన్ని వీనులవిందుచేసే శబ్దాలంకారాలు, అర్థ విశేషాలతో భావాన్ని మనోహరంగా చెప్పే అర్థాలంకారాలను, వీలైనన్ని ఎక్కువ ఉదాహరణలతో సమగ్రంగా తెలుసుకోవాలి.

ఛందస్సు ‘లయ’ ప్రధానం కాగా, అలంకారం సౌందర్య ప్రధానం. వస్తువు ఆశ్రయించేది అలంకారం. చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది అలంకారం.

2 అలంకారాలు 2 రకాలు 


1. శబ్దాలంకారాలు

2. అర్థాలంకారాలు


శబ్దాలంకారాలు

శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉండేవి శబ్దాలంకారాలు. శబ్ద చమత్కారంతో పాఠకుడికి ఇవి మనోహరంగా భాసిస్తాయి. ఇవి ఆరు రకాలు.

1. వృత్యను ప్రాసాలంకారం

2. ఛేకాను ప్రాసాలంకారం

3. లాటాను ప్రాసాలంకారం

4. అంత్యాను ప్రాసాలంకారం

5. యమకాలంకారం

6. ముక్తపద గ్రస్తాలంకారం


1. వృత్యను ప్రాసాలంకారం: ఒక హల్లు లేదా రెండు, మూడు హల్లులు వేరుగా అయినా, కలిసి అయినా మళ్లీ మళ్లీ వస్తే వృత్యనుప్రాస అలంకారం అంటారు.

ఉదా: 

1) నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము.

2) అడిగెదనని కడువడిజనునడిగినదను మగుడ నుడుగడని నడయుడుగున్‌


2. ఛేకాను ప్రాసాలంకారం: రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా అర్థ భేదంతో మళ్లీ వస్తే దాన్ని ఛేకానుప్రాసాలంకారం అంటారు.

ఉదా: నీకు వంద వందనాలు.


3. లాటాను ప్రాసాలంకారం: ఒకే అర్థం ఉన్న పదాలు తాత్పర్య భేదంతో వ్యవధి లేకుండా వచ్చినట్లయితే అది లాటాను ప్రాసాలంకారం అంటారు.

ఉదా: తండ్రి! హరిజేరుమనియెడి తండ్రి తండ్రి


4. అంత్యాను ప్రాసాలంకారం: ఒకే హల్లు లేదా ఒకే పదం.. పాదం అంతం/ పదం అంతం/ వాక్యం అంతంలో  వస్తే దాన్ని అంత్యాను ప్రాసాలంకారం అంటారు.

ఉదా: ‘భాగవతమున భక్తి

భారతములో యుక్తి

రామకథయే రక్తి

ఓ కూనలమ్మ’

5. యమకాలంకారం: అర్థభేదం ఉండే అక్షరాల   సమూహాన్ని మాటిమాటికి ప్రయోగించడాన్ని యమకాలంకారం అంటారు.

ఉదా:

1) మానవా! నీ ప్రయత్నం మానవా?

2) లేమా! దనుజుల గెలువగ లేమా

3) ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది.


6. ముక్తపద గ్రస్తాలంకారం: ‘ముక్త’ అంటే విడిచిన, ‘పద’ అంటే పదాన్ని, ‘గ్రస్త’ అంటే గ్రహించడం. అంటే పాదాంతాన విడిచిన పదాన్ని తరువాతి పాదాదిన గ్రహించడాన్ని ముక్తపద గ్రస్తాలంకారం అంటారు.

ఉదా: మనవేటికి నూతనమా

తనమానిన ప్రేమతనకు దక్కితి ననుమా

ననుమానక దయ తనర

దనరంతులు మాని నరసభవు రమ్మనవే.


అర్థాలంకారాలు


1. ఉపమాలంకారం: ఉపమాన ఉపమేయాలకు  సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించడాన్ని ఉపమాలంకారం అంటారు.

ఉదా:

1) శ్రీమంత్‌ చొక్కా మల్లెపువ్వులా తెల్లగా ఉంది.

2) ఈ రోజుల్లో పిల్లల బుద్ధి పాదరసంలా పనిచేస్తుంది.


2. ఉత్ప్రేక్షాలంకారం: ఉపమాన ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు.

ఉదా: 

1) ఆ యేనుగు నడ గొండయా! అనిపించుచున్నది.

2) ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అనిపించుచున్నది.


3. రూపకాలంకారం: ఉపమేయ ఉమమానములకు భేదం ఉన్నా లేనట్లు చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.

ఉదా:

1) ఆయన మాటలు కఠినమైనా మనసు వెన్న.

2) లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు.

3) కుటుంబానికి తండ్రే హిమగిరి శిఖరం.


4. అతిశయోక్తి అలంకారం: గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు.

ఉదా:

1) వాడు తాటిచెట్టంత పొడవున్నాడు.

 2) మా పొలంలో బంగారం పండింది.


5. స్వభావోక్తి అలంకారం: జాతి గుణ క్రియాదుల్లో ఉన్న స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే దాన్ని  స్వభావోక్తి అలంకారం అంటారు.

ఉదా: అనుచున్‌ జేవురు మీరు కన్ను గవతో నాస్పంది దోష్ఠంబుతో ఘన ‘హుంకారముతో’


6. శ్లేషాలంకారం: రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలు స్ఫురించేలా వాక్యాన్ని రచిస్తే దాన్ని శ్లేషాలంకారం అంటారు.

ఉదా:

1) మిమ్ము మాధవుడు రక్షించును గాక

2) నీవేల వచ్చెదవు

3) మానవ జీవనం సుకుమారం


7. అర్థాంతరన్యాసాలంకారం: విశేష విషయాన్ని సామాన్య విషయంతో లేదా సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించి చెప్పడమే అర్థాంతరన్యాసాలంకారం అంటారు.

ఉదా:

1) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.

మహాత్ములకు సాధ్యంకానిది లేదుకదా!

2) శివాజీ కల్యాణి దుర్గాన్ని సాధించాడు.

వీరులకు సాధ్యం కానిది లేదు కదా!


మాదిరి ప్రశ్నలు


1. ఇంద్రుని తప్ప వేరెవ్వరిని యాచించని చాతక మొక్కటే పక్షులలో ధన్యమైనది - ఇందులోని అలంకారం?

1) అప్రస్తుత ప్రశంసాలంకారం    

2) విభావనాలంకారం  

3) పరికరాలంకారం           

4) సమాసోక్తి అలంకారం2. విశేషణము సాభిప్రాయ మగుచో అది?

1) విశేషోక్తి అలంకారం   2) సారాలంకారం

3) పరికరాలంకారం      4) కావ్యలింగాలంకారం3.  ‘ఓ రాజా నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు’ - ఈ వాక్యంలోని అలంకారం?

1) దీపకాలంకారం   2) దృష్టాంతాలంకారం   

3) ఉపమాలంకారం   4) ఉత్ప్రేక్షాలంకారం4. ‘దాతకు సౌమ్యతయే పూర్ణచంద్రునకు అకళంకత’ అనే వాక్యంలోని అలంకారం?

1) నిదర్శనాలంకారం    2) దృష్టాంతాలంకారం   

3) తుల్యయోగితాలంకారం    4) అతిశయోక్తి అలంకారం5. నల్లకలువల జంట నుంచి వాడి బాణములు   వెలువడుచున్నవి- ఇందులోని అలంకారం?

1) ప్రతీపాలంకారం   2) రూపకాతిశయోక్తి  

3) భేదకాతిశయోక్తి      4) ఉపమాలంకారం6. చంద్రుడు చంద్రునివలె కాంతిమంతుడు - ఈ వాక్యంలోని అలంకారం?

1) అతిశయోక్తి    2) దీపకాలంకారం  

3) అనన్వయాలంకారం    4) ఉత్ప్రేక్షాలంకారం7.  ఓ ముఖమా! కాంతిని నిన్ను పోలినవాడు చంద్రుడు కలడు. ఏల గర్వపడెదవు? ఇందులోని అలంకారం?

1) అతిశయోక్తి అలంకారం   2) ప్రతీపాలంకారం   

3) దృష్టాంతాలంకారం    4) శ్లేషాలంకారం8. ‘రాజు కువలయానందకరుడు’ ఈ వాక్యంలోని అలంకారం?

1) శ్లేషాలంకారం    2) సమాసోక్తి అలంకారం  

3) ప్రతీపాలంకారం    4) అతిశయోక్తి అలంకారం 9. ‘ఏనుగు మదము చేతను, రాజు ప్రతాపము చేతను ప్రకాశించును’ - ఇందులోని అలంకారం?

1) తుల్యయోగిత అలంకారం   2) సమాసోక్తి అలంకారం  

3) పరికరాలంకారం    4) దీపకాలంకారం10. ‘లేమా దనుజుల గెలువగలేమా’ - ఇందులోని అలంకారం?

1) యమకాలంకారం   2) రూపకాలంకారం  

3) ఉత్ప్రేక్షాలంకారం   4) అతిశయోక్తి అలంకారం11. ‘ఆకాశం కాటుకను వర్షించుచున్నట్లు ఉన్నది’ - ఇందులోని అలంకారం?

1) అతిశయోక్తి     2) ఉత్ప్రేక్షాలంకారం   

3) ఉల్లేఖాలంకారం   4) వృత్యనుప్రాస12. ‘ఓ రాజా! నీవు శత్రువులకు, మిత్రులకు అరిష్టము నిచ్చితివి’ - దీనిలోని అలంకారం?

1) అతిశయోక్తి అలంకారం  2) తుల్యయోగితాలంకారం   

3) ఉల్లేఖాలంకారం   4) దీపకాలంకారం13. ఇతడు చంద్రుడు కాడు. మఱి ఏమి? ఆకాశగంగలోని పద్మము - ఈ వాక్యంలోని అలంకారం?

1) పర్యస్తాపహ్నుతి   2) భ్రాంతాపహ్నుతి   

3) శుద్ధాపహ్నుతి    4) ఛేకాపహ్నుతి14. ప్రస్తుతం తెలిపినప్పుడు అప్రస్తుతం స్ఫురించినచో అది?

1) సమాసోక్తి అలంకారం  2) అప్రస్తుత ప్రశంసాలంకారం  

3) ప్రతీపాలంకారం    4) యధాసంఖ్యాలంకారం15. శీతాంశుని శిరమున దాల్చిన శివుడు మా తాపము నడచుగాక. ఇందులోని అలంకారం?

1) యమకాలంకారం    2) వ్యాజనింద అలంకారం  

3) అపహ్నవ అలంకారం   4) పరికరాలంకారం16. ఈ ఐంద్రీ ముఖమును చంద్రుడు రక్తుడగుచు ముద్దిడుచున్నాడు - అనే వాక్యంలోని   అలంకారం?

1) సమాసోక్తి అలంకారం  2) నిదర్శనాలంకారం  

3) పరిణామాలంకారం  4) వికల్పాలంకారం17. చంద్రోదయం కాగానే సరోజాలు జారిణీ స్త్రీల ముఖాలు సంకోచిస్తున్నాయి. ఇందులోని అలంకారం?

1) నిదర్శనాలంకారం    2) తుల్యయోగితాలంకారం 

3) సమాసోక్తి అలంకారం  4) అప్రస్తుత ప్రశంసాలంకారం18. విశేష్యము సాభిప్రాయమగుచో అది?

1) పరికరాలంకారం   2) సమాసోక్తి అలంకారం  

3) పరికరాంకురాలంకారం   4) విభావనాలంకారం19. కారణం లేకుండానే కార్యము కలిగినట్లు చెప్పిన అది?

1) విభావనాలంకారం   2) నిదర్శనాలంకారం  

3) వికల్పాలంకారం   4) పరికరాలంకారం20. ‘మన్మథుడు చంద్రుని వలెను, చంద్రుడు మన్మథుని వలెను విరహుల బాధించుట యందు దక్షులు’ - ఇందులోని అలంకారం?

1) ప్రతీపాలంకారం   2) ఉపమేయాపమాలంకారం  

3) అనన్వయాలంకారం   4) పరిణామాలంకారం 21. ‘ఈమె పాలసముద్రమందు పుట్టని అపరలక్ష్మి’ - ఈ వాక్యంలోని అలంకారం?

1) అభేదరూపకాలంకారం   2) తాద్రూప్యరూపకాలంకారం  

3) న్యూనతాద్రూప్యరూపకాలంకారం  4) అధిక తాద్రూప్యరూపకాలంకారం22. అతడు వాక్కులందు బృహస్పతి, కీర్తియందు అర్జునుడు, చాపమున భీష్ముడు - ఈ వాక్యంలోని అలంకారం?

1) అర్థాoతరన్యాసాలంకారం  2) సారాలంకారం  

3) వికన్వరాలంకారం  4) ఉల్లేఖాలంకారం


సమాధానాలు
 

1-1; 2-3; 3-2; 4-1; 5-2; 6-3; 7-2; 8-1; 9-4; 10-1; 11-2; 12-2; 13-3; 14-1; 15-4; 16-1; 17-2; 18-3; 19-1; 20-2; 21-3; 22-4.


రచయిత: సూరె శ్రీనివాసులు 

Posted Date : 15-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.