• facebook
  • whatsapp
  • telegram

ఉపాధ్యాయులకు ప్రేరణ (Teacher Motivation)

* ఉపాధ్యాయులకు లభించే జీతభత్యాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన ఎదుగుదలకు కావాల్సిన సౌకర్యాలు వారు తమ విధుల్లో పూర్తిగా నిమగ్నం కావడానికి దోహదం చేస్తాయి.


ఉపాధ్యాయుల్లో ప్రేరణ కలిగించడం
* Dececco ప్రకారం - ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని పెంపొందించడానికి లేదా తగ్గించడానికి దోహదం చేసే కారకాన్ని 'ప్రేరణ' అంటారు.
* ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది. అవసరాలు అధికంగా, బలంగా ఉన్నప్పుడు ఉత్సుకత స్థాయి అధికంగా ఉంటుంది.
* అవసరాలు బలహీనంగా ఉంటే ఉత్సుకతస్థాయి తక్కువగా ఉంటుంది.
*  బహుమతులు, శిక్షణ, పొగడ్త, ప్రోత్సాహకాలు ప్రేరణస్థాయిని పెంచడానికి దోహదపడతాయి.

 

ఉపాధ్యాయుల్లో ప్రేరణ కారకాలు
* వేతనం, గుర్తింపు, వృత్తిపరమైన హోదా, ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాలు, సేవా నిబంధనలు, జవాబుదారీతనం, బాధ్యతల అప్పగింత, పోటీతత్వం, సాఫల్యం, పాఠశాల కల్పించే సదుపాయాలు, అవార్డులు, వృత్యంతర శిక్షణ, ప్రశంసా పత్రాలు, విద్యార్థుల పరీక్షా ఫలితాలు మొదలైనవి ఉపాధ్యాయుల్లో ప్రేరణ కలిగించే కారకాలుగా పనిచేస్తాయి.
ప్రేరణ కారకాలు:
1) అంతర్గత కారకాలు (Internal Factors)
2) బహిర్గత కారకాలు (External Factors)

 

1. అంతర్గత కారకాలు Internal Factors)
* శారీరక ఆరోగ్యం, కుటుంబ జీవనంలో తృప్తి ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్నిస్తాయి. దాంతో వాళ్లు విధి నిర్వహణలో ఉత్సాహంగా పాల్గొంటారు.
* ప్రతిభావంతులైన, క్రమశిక్షణ ఉన్న విద్యార్థులు; ఉన్నతస్థాయిలోని పాఠ్యపుస్తకాలు; పాఠశాలలో బోధన, బోధనేతర కార్యక్రమాల నిర్వహణకు కావల్సిన వనరులు అందుబాటులో ఉండటం; విశాలమైన తరగతి గదులు, పచ్చదనంతో కూడిన ప్రశాంతమైన పాఠశాల ఆవరణ లాంటి అంశాలు ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాలను ఆసక్తితో, అనురక్తితో నిర్వహించడానికి ప్రేరణ కలిగించే అంతర్గత కారకాలుగా పనిచేస్తాయి.

 

2) బహిర్గత కారకాలు (External Factors)
* ఒక నిర్ణీత వ్యవధిలో పదోన్నతులు, విద్యార్హతలు పెంచుకోవడానికి వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి.
* అవార్డులు, ప్రశంసా పత్రాలు బహుకరించడం ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగిస్తుంది.
* కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్ ఉపాధ్యాయ ఉద్యోగ భద్రతపై పలు సిఫారసులు చేశాయి.
* పై కమిషన్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 1983లో పాఠశాల స్థాయి; ఉన్నత విద్య స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానిక రెండు ప్రత్యేక కమిషన్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో ఛటోపాధ్యాయ కమిషన్ ఒకటి. ఇది 1985లో తన నివేదికను సమర్పించింది.

 

ఉపాధ్యాయ పురస్కారాలు (Teacher Awards)
* ఉపాధ్యాయులను గౌరవించి, వారు చేసిన పనిని గుర్తించడానికి జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఉపాధ్యాయ పురస్కారాలను అందిస్తున్నారు.
* ఏటా సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఈ అవార్డులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ప్రదానం చేస్తున్నారు.
* ఈ పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంతో తమ విధులు నిర్వహించి దేశాభ్యున్నతికి పాటుపడుతున్నారు.

Posted Date : 30-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు