• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర చరిత్ర, స్వభావం, పరిధి, అభివృద్ధి

విజ్ఞానశాస్త్రం సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఈ పరిశీలనల నుంచి భావనలు, సిద్ధాంతాలు రూపొందుతాయి. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు తర్వాత జరిగే అనుభవాత్మక పరిశీలనల వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది. విజ్ఞానశాస్త్రం జ్ఞాన విభాగాన్ని, జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతం చేసే ప్రక్రియ అనే రెండింటిని కలిగి ఉంటుంది . - ఫ్రెడరిక్ ఫిట్జ్ పాట్రిక్
 

విజ్ఞానశాస్త్ర స్వభావం
సైన్స్ అనే ఇంగ్లిష్ పదానికి మూలం 'సైన్షియా' (Scientia) లేదా సిరే (Scire).
* 'SCIENTIA' అంటే జ్ఞానం (Knowledge) అని అర్థం.
* SCIENTIA అనేది లాటిన్ పదం.

 

విజ్ఞానశాస్త్రం - కొన్ని నిర్వచనాలు
* వ్యవస్థీకరించిన జ్ఞానాంశమే విజ్ఞానశాస్త్రం
* ప్రకృతి సంభవాలకు వ్యాఖ్యానం లేదా అర్థం చెప్పడమే - విజ్ఞానశాస్త్రం
* సత్యాల కుప్పే - విజ్ఞానశాస్త్రం
* ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై, సంచిత, క్రమీకరించిన అభ్యసనమే విజ్ఞానశాస్త్రం - కొలంబియా ఎన్‌సైక్లోపిడియా
* భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించిన జ్ఞానమే విజ్ఞానశాస్త్రం - ఆక్స్‌ఫర్డ్ అడ్వాన్స్‌డ్ లెర్నర్స్ డిక్షనరీ
* విజ్ఞానశాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడిపదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు. దాని పూర్వ చరిత్ర, అందులోని జీవ ప్రపంచం కూడా. - కార్ల్ పియర్సన్.
* వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞానం. దీనిలో కొన్ని సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక ప్రతిజ్ఞా వాక్యాలను నిర్మిస్తారు - కొహెన్, నాగెల్
* విజ్ఞానశాస్త్రమంటే ఒక మాపనం. మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణనలు, ఫలితాలు లభిస్తాయి. మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా వివరించడానికి వీలవుతుంది - అర్హీనియస్
* ప్రయోగాల పరిశీలనల నుంచి అభివృద్ధి చెంది, తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు, పరిశీలనలకు ఫలితాలనిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగిన భావనల, భావనా పథకాల శ్రేణులే

విజ్ఞానశాస్త్రం  - జేమ్స్ బి.కొనాంట్
         విజ్ఞానశాస్త్రం  =  జ్ఞానం + పద్ధతులు
                    =  ప్రక్రియ + ఉత్పన్నం
                    =  శాస్త్రజ్ఞానం + శాస్త్రీయ పద్ధతి + శాస్త్రీయ వైఖరి

విజ్ఞానశాస్త్ర మూల భావాలు
* విజ్ఞానశాస్త్ర విషయం ప్రపంచంలో పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంది.
* విషయాత్మక విశ్వంలో సామ్యం ఉందని విజ్ఞానశాస్త్రం భావిస్తుంది.
* తప్పక జరుగుతుందనే దృక్పథం కాకుండా జరగడానికి అవకాశముందనే దృక్పథం మాత్రమే విజ్ఞానశాస్త్రానికి ఉంది.
* విజ్ఞానశాస్త్రం సంభావ్యతను మాత్రమే తెలుపుతుంది. కానీ తథ్యాల గురించి తెలపదు.
* నేటి సత్యం గురించి చెబుతుంది తప్ప ఎల్లవేళలా ఉండే సత్యం గురించి మాట్లాడదు.

 


                                 

ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశాలు

యథార్థం: ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే యథార్థం.

ఉదా: 1. పదార్థం స్థలాన్ని ఆక్రమిస్తుంది.
       2. పాదరసం ద్రవరూపంలో ఉన్న లోహం.
     3. చిక్కుడు విత్తనంలో రెండు బీజదళాలుంటాయి.

భావన: ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సాధారణ భావం లేదా అర్థాన్ని వస్తువు, సంకేతం లేదా పరిస్థితి సహాయంతో ఒక వ్యక్తిలో ఏర్పరచేదే భావన.
* జె.డి. నొవాక్ ప్రకారం ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞానశాస్త్రంలో భావనలు.
ఉదా: పని, ఉష్ణోగ్రత, విద్యుత్, అయస్కాంతత్వం.

సాధారణీకరణం: పరస్పర సంబంధం కలిగిన సత్యాల సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించేదే సాధారణీకరణం.
ఉదా: ఉష్ణం వల్ల పదార్థాలు వ్యాకోచం చెందుతాయి.


సిద్ధాంతం: నిరూపితం కాకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన.
ఉదా: కణసిద్ధాంతం, పరమాణు సిద్ధాంతం.


నియమం: విస్తారంగా పరీక్షించి నిరూపితమై, నిశ్చయమైన సిద్ధాంతాలను నియమం అంటారు.
ఉదా: న్యూటన్ గమన నియమాలు.

సూత్రం: ఒక కృత్యం లేదా తార్కికత్వానికి ఆధారమైన ఒక ప్రాథమిక సత్యాన్ని 'సూత్రం' అంటారు.

ఉదా: ఆర్కిమెడిస్ సూత్రం.
 

సంశ్లేషణాత్మక నిర్మాణంలో అంశాలు

పరిశీలన: శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం.

వర్గీకరణ: భావన ఏర్పడటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. పరిశీలన, వర్ణన, ఆలోచన మొదలైనవాటి ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది.

ప్రాగుక్తీకరించడం: సేకరించిన సమాచారం ఆధారంగా తర్వాతి పరిణామాన్ని లేదా సంఘటనను ఊహించడమే ప్రాగుక్తీకరించడం.

ఉదా: వాతావరణ పరిస్థితుల అనుకూలతను బట్టి పంటల దిగుబడి చెప్పగలగడం.


ప్రాక్కల్పన: యథార్థాలను ఆధారం చేసుకుని సమస్య పరిష్కారానికి ఇచ్చే తాత్కాలిక ప్రతిపాదిత ఊహా సమాధానమే ప్రాక్కల్పన.

ప్రయోగ నిర్వహణ: ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడమే ప్రయోగ నిర్వహణ.


వ్యాఖ్యానించడం: లభించిన సమాచారం నుంచి అవసరమైన విషయాలను జాగ్రత్తగా నమోదు చేసి, విభిన్న కోణాలతో వ్యాఖ్యానించడం.

కొలవడం: సత్యాన్వేషణలో పరిశీలనకు విలువ కట్టడానికి ఇది ఒక మార్గం. ఈ మాపనం అనేది వస్తువులు లేదా ప్రక్రియల కచ్చితత్వాన్ని తెలియజేస్తుంది.

ప్రాక్కల్పనలో రకాలు
1. నల్ ప్రాక్కల్పన
2. ప్రకటనాత్మక ప్రాక్కల్పన
3. ప్రాగుక్తి ప్రాక్కల్పన
4. ప్రశ్న ప్రాక్కల్పన

 

ఉత్తమ ప్రాక్కల్పన లక్షణాలు
* పరిశీలించిన విషయాల ఆధారంగా, ఆమోదయోగ్యంగా ఉండాలి.
* నిర్ధారిత సిద్ధాంతాలకు, నియమాలకు వ్యతిరేకంగా ఉండకూడదు.
* తార్కికంగా, వాస్తవంగా ఉండాలి.
* స్పష్టత కలిగి, పునఃపరిశీలనకు వీలుగా ఉండాలి.
* ప్రాక్కల్పన వర్ణన స్పష్టంగా, సులభంగా తక్కువ పదాలతో ఉండాలి.
* దత్తాంశ సేకరణకు అనుకూలంగా ఉండాలి.

Posted Date : 09-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు