• facebook
  • whatsapp
  • telegram

గాలి

ఉనికిలో ఉన్నా.. కంటికి కనిపించదు!



రకరకాల వాయువుల మిశ్రమమే గాలి. అది భూమిపై వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. పీడనాలను, నిరోధాలను కలిగిస్తుంది. వాతావరణంలో, ధ్వనిలో మార్పులకు కారణమవుతుంది. అదే విధంగా ఆమ్లాలు, క్షారాలు అనేక రకాల ప్రతిచర్యల్లో పాల్గొంటాయి. పర్యావరణం తదితరాల భౌతిక లక్షణాలను ప్రభావితం చేస్తాయి.  వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గాలి ప్రభావాలు, ఉష్ణం ప్రదర్శించే ధర్మాలు, వివిధ ఉష్ణవాహకాలు, ఆమ్లాలు- క్షారాల రసాయన చర్యలు, చలనం-కాలం తీరుతెన్నులు, వాటికి సంబంధించిన నిత్యజీవిత అనువర్తనాలపై అభ్యర్థులు పరిజ్ఞానం పెంచుకోవాలి.


మాదిరి ప్రశ్నలు


1.     కిందివాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) గాలికి రంగు లేదు, ఇది పారదర్శక పదార్థం.

బి) భూ ఉపరితలం నుంచి కొంత ఎత్తు వరకు విస్తరించి ఉన్న గాలిని వాతావరణం అంటారు.

సి) వాతావరణంలోకి వెళ్లే కొద్దీ గాలి పలుచబడుతుంది.

డి) గాలి అనేక వాయువుల మిశ్రమ పదార్థం.

1) ఎ, బి సరైనవి     2) బి, సి సరైనవి 

3) సి, డి సరైనవి     4) అన్నీ సరైనవి


2. గాలి దిశను, వేగాన్ని కొలిచే పరికరం?

1) ఆంత్రో మీటర్‌   2) అల్టీ మీటర్‌

3) హైగ్రో మీటర్‌    4) అనిమో మీటర్‌


3. కిందివాటిలో సరైంది.

ఎ) మొక్కలు, జంతువులు శ్వాసక్రియలో O2 ను ఉపయోగించుకొని CO2 ను విడుదల చేస్తాయి.

బి) పదార్థాలు మండించడం వల్ల CO2, ఇతర వాయువులు విడుదలవుతాయి.

సి) గాలిలో N2, O2 లు కలిసి 99% ఉంటే, మిగిలిన 1% CO2, ఇతర వాయువులు ఉంటాయి.

డి) గాలిని కంటితో చూడలేం కానీ దాని ఉనికిని అనుభూతి పొందుతాం.

1) ఎ, బి సరైనవి   2) బి, సి సరైనవి

3) సి, డి సరైనవి   4) అన్నీ సరైనవి


4. కిందివాటిలో సరైన వాక్యాన్ని ఎన్నుకోండి.

1) వీచే గాలిని పవనం అంటారు.

2) గాలి నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను పవన విద్యుత్‌ అంటారు.

3) వేగంగా వీచే గాలులను తుపాన్‌లు అంటారు.  4) పైవన్నీ 


5. కిందివాటిలో సరైంది.

ఎ) జీవులన్నీ వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఎంత ఉపయోగించినప్పటికీ తరగకపోవడానికి కారణం కిరణజన్య సంయోగక్రియ.

బి) మొక్కలు, జంతువులు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి.

సి) మట్టిలో నివసించే జీవులు చేసే రంధ్రాలు గాలిని లోపలికి, బయటికి పంపడానికి ఉపయోగపడతాయి.

డి) గాలిమర ద్వారా బోరు బావి నుంచి నీటిని తోడవచ్చు. పిండిమరను ఆడించవచ్చు.

1) ఎ, బి సరికావు        2) ఎ, బి సరైనవి 

3) బి, సి, డి సరైనవి    4) అన్నీ సరైనవి 


ఉష్ణం


6.     ఉష్ణానికి సంబంధించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) వేడి వస్తువు నుంచి చల్లని వస్తువు వైపు ప్రవహించే శక్తిస్వరూపమే ఉష్ణం.

బి) పనిచేసే సామర్థ్యాన్ని తెలిపే భౌతికరాశి ఉష్ణం.

సి) లస్సీ తాగేటప్పుడు మనలోని ఉష్ణ శక్తి లస్సీలోకి, వేడి టీ తాగేటప్పుడు టీలోని ఉష్ణశక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది.

డి) ఉష్ణాన్ని కొలవడానికి కెలోరిమీటర్‌ను ఉపయోగిస్తారు.

1) ఎ, బి సరైనవి        2) బి, సి సరైనవి

3) ఎ, బి, సి సరైనవి       4) అన్నీ సరైనవి


7.     కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) ఉష్ణం ప్రసరించే దిశను తెలపడాన్ని ఉష్ణోగ్రత అంటారు.

2) వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలపడాన్ని ఉష్ణోగ్రత అంటారు.

3) ఉష్ణం పెరిగితే ఉష్ణోగ్రత తగ్గి, ఉష్ణం తగ్గితే ఉష్ణోగ్రత పెరుగుతుంది.

4) ఉష్ణోగ్రత S.I. ప్రమాణం కెల్విన్‌.


8.     కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) గాలి, నీరు, గాజులను అధమ ఉష్ణవాహకాలు అంటారు.

2) అల్యూమినియం, కాపర్, ఐరన్‌లను ఉష్ణవాహకాలంటారు.

3) మన దేశ శీతోష్ణస్థితిని భారత వాతావరణ విభాగం (IMD) అధ్యయనం చేస్తుంది.

4) ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని మార్చి 21న నిర్వహిస్తారు.


9.     కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) చెంచాను వేడినీటిలో, పాలలో ఒకవైపు ఉంచితే కాసేపటి తర్వాత రెండో వైపు తాకితే వెచ్చగా అనిపించడం ఉష్ణవహనం.

2) నీటిని పొయ్యి మీద వేడి చేసినప్పుడు నీటి ఉపరితలం వేడెక్కడం ఉష్ణసంవహనం.

3) యానకం ఉన్నా, లేకున్నా ఉష్ణప్రసారం జరగడాన్ని ఉష్ణవహనం అంటారు.

4) చలిమంటకు దగ్గరగా ఉన్న వ్యక్తి శరీరం వేడెక్కడం ఉష్ణవికిరణం.


10. కిందివాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) థర్మల్‌ ప్లాస్క్‌ను సర్‌ జేమ్స్‌డేవర్‌ కనుగొన్నాడు.

బి) అత్యంత శీతల ప్రదేశాలలో థర్మామీటర్లలో పాదరసానికి బదులు ఆల్కహాల్‌ను ఉపయోగిస్తారు.

సి) అధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ధ్రత వల్ల వడదెబ్బ తగులుతుంది.

డి) ఆరోగ్యవంతమైన  మానవుడి  శరీర ఉష్ణోగ్రత 37°C.

1) ఎ, బి సరైనవి    2) బి, సి సరైనవి

3) సి, డి సరైనవి    4) అన్నీ సరైనవి



ఆమ్లాలు - క్షారాలు - లవణాలు భౌతిక, రసాయనిక మార్పులు


11. కిందివాటిలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి.

1) ఆసిడ్‌ అనే పదం ఏసిర్‌ అనే లాటిన్‌ భాష నుంచి వచ్చింది.

2) స్వేదన జలం, ఉప్పు, చక్కెర ద్రావణాలను ఆమ్ల, క్షార స్వభావం లేని తటస్థ ద్రావణాలు అంటారు.

3) స్నానపు గదులు శుభ్రపరచడానికి సోడియం హైడ్రాక్సైడ్‌ను ఉపయోగిస్తారు.

4) ఆమ్ల, క్షారాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన శాస్త్రవేత్త అర్హీనియస్‌.


12. కిందివాటిలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి.

1) మందారపువ్వు ఆమ్లంతో కలిసి మెజంటా రంగును, క్షారంతో ఆకుపచ్చరంగును ఇస్తుంది.

2) మిథైల్‌ ఆరెంజ్‌ ఆమ్లంతో కలిసి ఎరుపు, క్షారంతో పసుపుపచ్చ రంగు ఇస్తుంది.

3) ఫినాఫ్తలిన్‌ ఆమ్లంతో ఎలాంటి రంగు ఇవ్వదు. క్షారంతో పింక్‌ రంగు ఇస్తుంది.

4) ఆమ్లం ఎరుపు లిట్మస్‌ను నీలి లిట్మస్‌గా, క్షారం నీలి లిట్మస్‌ను ఎరుపు లిట్మస్‌గా మారుస్తుంది.


13. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్‌ వాయువును విడుదల చేస్తాయి.

2) గుడ్డు పెంకులతో ఆమ్లాలు చర్య జరిపి హైడ్రోజన్‌ వాయువును విడుదల చేస్తాయి.

3) క్షారాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్‌ వాయువును విడుదల చేస్తాయి.

4) ఆమ్లాలు క్షారాలతో చర్య జరిపి లవణం, నీరును ఏర్పరుస్తాయి.


14. కిందివాటిలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి.

1) చీమ, తేనెటీగలు కుట్టినప్పుడు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కాలమైన్‌ను ఉపయోగిస్తారు.

2) ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు- SO2, NO2

3) భారతదేశంలో అనాదిగా దంత దావనానికి వేప, మిస్వాక్, గానుగ పుల్లలను ఉపయోగిస్తారు.

4) హైడ్రాంజియా అనేది మట్టి pH విలువ 5.5 కంటే తక్కువైతే పింక్‌ రంగు పుష్పాలను, pH విలువ 5.5 కంటే ఎక్కువైతే నీలి రంగు పుష్పాలను ఇస్తుంది.


15. కిందివాటిని జతపరచండి.

1) NaOH ఎ) ఆమ్లవిరోధి
2) KOH బి) గాజు, కిటికీలను శుభ్రపరచడం
3) H2SO4 సి) శరీర సబ్బుల తయారీ
4) Mg(OH)2 డి) డిటర్జెంట్ల తయారీ
5) NH4OH ఇ) బ్యాటరీలలో ఉపయోగించే ద్రవం

1) 1-డి, 2-సి, 3-ఇ 4-ఎ, 5-బి

2) 1-ఇ, 2-సి, 3-డి 4-ఎ, 5-బి

3)  1-ఎ, 2-బి, 3-డి 4-సి, 5-ఇ

4)  1-సి, 2-ఎ, 3-బి 4-డి, 5-ఇ


16. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) ఆకారం, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలలో మార్పు జరగడాన్ని భౌతిక మార్పు అంటారు.

2) భౌతిక మార్పులో పదార్థాలు తిరిగి యథాస్థితిని పొందుతాయి, కొత్త పదార్థాలు ఏర్పడవు.

3) మంచు నీరుగా, నీరు నీటి ఆవిరిగా మారడం ఒక రసాయన మార్పు.

4) అద్దం ముక్కలుగా పగలడం ఒక భౌతికమార్పు.


17. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) రసాయన మార్పులో పదార్థం యథాస్థితిని పొందక కొత్త పదార్థాలు ఏర్పడతాయి.

2) రసాయన మార్పులో ఉష్ణం, కాంతి వెలువడి కొత్త వాసనలు ఏర్పడవచ్చు.

3) ఆక్సిజన్‌తో ఐరన్‌ చర్య జరిపి ఐరన్‌ ఆక్సైడ్‌ ఏర్పడటం రసాయన మార్పు.

4) రబ్బరు బ్యాండును సాగదీయడం ఒక రసాయన మార్పు.


18. కిందివాటిలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి.

1) మెగ్నీషియం రిబ్బన్‌ను ఆక్సిజన్‌ సమక్షంలో మండించడం ఒక రసాయన మార్పు.

2) ఇనుముతో చర్య జరపడం వల్ల కాపర్‌ సల్ఫేట్‌ ద్రావణం రంగు మారడం ఒక రసాయన మార్పు.

3) కూరగాయలు, పండ్లను కోసినప్పుడు వాటిపై గోధుమ రంగు పూత ఏర్పడటం రసాయన మార్పు.

4) మన శరీరంలోని ఆహారం జీర్ణం కావడం ఒక భౌతిక మార్పు.


19. కిందివాటిలో సరైన అంశాన్ని ఎంచుకోండి.

1) ఔషధం అనేది వరుస రసాయనిక చర్యల అంత్యపదార్థం.

2) ద్రాక్షను పులియబెట్టడం, పండ్లు పక్వానికి రావడం ఒక భౌతికమార్పు.

3) ప్లాస్టిక్స్, డిటర్జెంట్‌లు రసాయనిక చర్యల వల్ల ఏర్పడే కొత్త పదార్థాలు.

4) కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక రసాయనిక మార్పు.


20. కిందివాటిలో సరికాని అంశం?

1) స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ అనేది ఇనుము, కార్బన్, నికెల్, క్రోమియంల మిశ్రమ లోహం.    

2) స్ఫటికీకరణం ఒక రసాయన మార్పు.

3) సున్నపుతేటను కార్బన్‌ డయాక్సైడ్‌ తెల్లని పాలలా మారుస్తుంది.

4) లోహాలు తుప్పు పట్టే ప్రక్రియను ఉప్పు నీరు వేగవంతం చేస్తుంది.



చలనం - కాలం

21. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని వడి అంటారు.

2) ఒక వస్తువు ప్రయాణించే వేగం కొలవడానికి అనిమో మీటర్‌ను ఉపయోగిస్తారు.

3) ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఓడో మీటర్‌ను ఉపయోగిస్తారు.

4) వడి S.I మాణం మీటర్‌/సెకన్‌.


22. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) సైనికులు కవాతు చేస్తున్నప్పుడు సరేఖీయ చలనంలో ఉంటారు.

2) చలనంలో ఉన్న సైకిల్‌ పెడల్‌ సరేఖీయ చలనంలో ఉంటుంది.

3) పరుగుపందెంలో పాల్గొనే ఆటగాడి చేతులు ఆవర్తన చలనంలో ఉంటాయి.

4) సూర్యుని చుట్టూ తిరిగే భూమి భ్రమణ చలనంలో ఉంటుంది.


 

సమాధానాలు

1-4; 2-4; 3-4; 4-4; 5-4; 6-4; 7-3; 8-4; 9-3; 10-4; 11-3; 12-4; 13-2; 14-4; 15-1; 16-3; 17-4; 18-4; 19-2; 20-2; 21-2; 22-2.


రచయిత: చంటి రాజుపాలెం 
 

Posted Date : 03-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌