• facebook
  • whatsapp
  • telegram

 రాజ్యాంగ అభివృద్ధి - రాజ్యాంగ రచన

        బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన భారత దేశం తన జాతీయ పునర్నిర్మాణం, సాంఘిక, ఆర్థిక, మార్పు సాధన, అనువైన నిర్మాణాల కోసం విశేషమైన కృషి జరిపింది. రాజ్యాంగ నిర్మాణం కోసం ముందుగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్తు). ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు అమెరికాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ (1787 నాటిది).


 ''ప్రజల జీవితానికి, వారి ఆశయాలకు అనుగుణంగా లేని రాజ్యాంగం ప్రజలను అధోగతి పాలుచేస్తుంది". అని జవహర్ లాల్ పేర్కొన్నారు.

 

రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్తు)
        1918, డిసెంబరులో ఢిల్లీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వయం నిర్ణయాధికారం అనే భావనతో భారతీయ ప్రజా ప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తు అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించారు.

     1922, జనవరి 5న గాంధీజీ యంగ్ ఇండియా అనే పత్రికలో ''స్వరాజ్ అనేది బ్రిటిష్‌వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదు" అని పేర్కొంటూ... రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి, ప్రజల అవసరాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగాన్ని రూపొందిస్తుందని అభిప్రాయపడ్డారు.
* స్వరాజ్ అనే పదాన్ని మొదట ఉపయోగించింది: దాదాభాయ్ నౌరోజీ.
* రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించిన భారతీయుడు: ఎం.ఎన్. రాయ్.
* రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన రాజకీయ పార్టీ: స్వరాజ్య పార్టీ
* 1927, మే 17న బాంబే సమావేశంలో రాజ్యాంగ రచన ఆవశ్యకతను గురించి మోతీలాల్ నెహ్రూ ప్రతిపాదించారు. భారతరాజ్య కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన భారత జాతీయ నాయకులు 1928, ఫిబ్రవరి, 28న ఢిల్లీలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని 29 పార్టీలతో కలిసి ఏర్పాటు చేశారు. 1928, మే 19న డాక్టర్ ఎం.ఎ.అన్సారీ అధ్యక్షతన బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

 

ఈ ఉపసంఘంలోని సభ్యులు:
1. లాలా లజపతిరాయ్
2. తేజ్ బహదూర్ సప్రూ
3. సుభాష్ చంద్రబోస్
4. ఎం.ఆర్. జయకర్
5. షోయాబ్ ఖురేషి
6. సర్దార్ మంగళ్‌సింగ్
7. ఎం.ఎన్. అణే
8. సర్.అలీ. ఇమాం
9. జి.ఆర్. ప్రధాన్

      మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను 1928, ఆగస్టు 10న సమర్పించింది. దీన్ని భారతీయులు రాజ్యాంగ రచన కోసం చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు.
* 1925లో అనిబిసెంట్ బ్రిటిష్ పార్లమెంట్‌లో "Common Wealth of India" అనే బిల్లును ప్రతిపాదించి ''ఐర్లాండ్" ప్రజల మాదిరిగానే భారత్ ప్రజలకు శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పించాలని సూచించారు.
* 1936లో జవహర్‌లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాస్తూ ''భారత ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటికి ఒకే ఒక రాజకీయ పరిష్కారం ఉంది. అది భారత్ ప్రజలచే ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు తమను తాము పాలించుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకునే స్వేచ్ఛను కల్పించాలి".
* 1937లో ఫైజ్‌పూర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అధ్యక్షతన మొదటిసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు కోసం డిమాండ్ చేసింది.
* 1938లో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన 'హరిపుర' వద్ద జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అభిప్రాయాన్ని తీర్మానంగా ఆమోదించింది.
* 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశ రాజ్యాంగాన్ని ఇతరుల జోక్యం లేకుండా సార్వత్రిక ఓటు హక్కు ద్వారా ఎన్నుకునే రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా రూపొందించాలని ప్రతిపాదించారు.
* 1939, నవంబరు 12న గాంధీజీ 'భారతీయులతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసినట్లయితే కుల, మత, వర్గాల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది' అని హరిజన్ పత్రికలో వ్యాఖ్యానించారు.
* 1940, ఆగస్టు ప్రతిపాదనల ద్వారా ఆంగ్లేయులు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును గుర్తించారు. 1942 నాటి క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా ఆంగ్లేయులు మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును అధికారికంగా గుర్తించారు.
* 1945, సెప్టెంబరు 19న లార్డ్ వేవెల్ ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ కేంద్రం నుంచి మాట్లాడుతూ అతి త్వరలో రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, వాటికి ఎన్నికైన సభ్యులు రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఎన్నుకుంటారని ప్రకటించాడు.
* 1946 జనవరి, ఫిబ్రవరి నెలల్లో బ్రిటిష్ ప్రభుత్వం రాబర్ట్ రిచర్డ్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యులతో ఒక ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి పంపింది. ఈ బృందం 'భారతీయులు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారు' అని నివేదించింది.
* 1946, మార్చి 24న మనదేశానికి వచ్చిన కేబినెట్ మిషన్ బృందం సిఫార్సులను అనుసరించి, 1946 జూన్, జులై నెలల్లో రాజ్యాంగ పరిషత్తు‌కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి.
* ఈ ఎన్నికలు నైష్పత్తిక ప్రాతిపదికపై ఏక ఓటు బదిలీ పద్ధతిలో జరిగాయి. రాష్ట్రాల్లో కేవలం 28.5% ఓటర్లు మాత్రమే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. రాజ్యాంగ పరిషత్తు‌కు ఎన్నికైన మొత్తం సభ్యులు: 389.
* రాజ్యాంగ పరిషత్‌లో ప్రాంతాలవారీగా కేటాయించిన స్థానాలు

* 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్నికైన 292 మంది వివరాలు

నాలుగు బ్రిటిష్ కేంద్రపాలిత ప్రాంతాలు

రాజకీయ పార్టీల వారీగా రాజ్యాంగ పరిషత్తు-ఎన్నికల ఫలితాలు

* డిసెంబరు 9, 1946 నాటి రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి హాజరైనవారు - మతాలు, సామాజిక వర్గాల వారీగా మొత్తం సభ్యులు: 208

ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్థాన్ డిమాండ్‌తో రాజ్యాంగ పరిషత్తు సమావేశాలను బహిష్కరించింది. ఇలా జరగక ముందు జాతీయ కాంగ్రెస్‌కు రాజ్యాంగ పరిషత్తు‌లో 69% ప్రాతినిధ్యం ఉంది. సమావేశాల నుంచి ముస్లింలీగ్ వైదొలగడంతో దాని ప్రాతినిధ్యం 82%కి పెరిగింది.

* 1947 ఆగస్టులో భారతదేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్తు‌ను కూడా విభజించారు. స్వాతంత్య్రనంతరం భారత రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల సంఖ్య: 299
* స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ పరిషత్తు‌లోని 299 మంది సభ్యుల్లో 229 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు/ఇండియన్ ప్రావిన్స్‌ల నుంచి ఎన్నిక కాగా, 70 మంది సభ్యులు స్వదేశీ సంస్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు.
* 1947, డిసెంబరు నాటికి భారత రాజ్యాంగ పరిషత్తులోని 299 మంది సభ్యుల వివరాలుస్వాతంత్య్రానంతరం - స్వదేశీ సంస్థానాల నుంచి రాజ్యాంగ పరిషత్తు‌కు ప్రాతినిధ్యం

రాజ్యాంగ పరిషత్తులో - వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించినవారు

రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వంలేని ప్రముఖులు:
    1. భారత జాతిపిత: మహాత్మగాంధీ
    2. పాకిస్థాన్ జాతిపిత : మహ్మద్ అలీ జిన్నా
* రాజ్యాంగ పరిషత్తుకు బెంగాల్ నుంచి ఎన్నికైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దేశవిభజన ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోయి, తర్వాత బాంబే రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ అయ్యారు.
* రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో పోటీచేయకుండా, అసాధారణ వ్యక్తులుగా రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ అయినవారు:
    1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
    2. కె.టి. షా
    3. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
* రాజ్యాంగ పరిషత్తుకు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన సోమనాథ్‌లహరి దేశవిభజన ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోయారు.
* రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పరిషత్తులో సభ్యుడిగా ఎన్నికయ్యారు.

రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన మహిళలు: 15 మంది
    1. విజయలక్ష్మి పండిట్
    2. సరోజినీ నాయుడు
    3. దుర్గాబాయి దేశ్‌ముఖ్
    4. రాజకుమారి అమృతకౌర్
    5. హంసా మెహతా
    6. అమ్ము స్వామినాథన్
    7. ఆన్ మస్కార్నే నాథ్
    8. బేగం అజీజ్ రసూల్
    9. సుచేతా కృపలాని
    10. రేణుకారే
    11. పూర్ణిమా బెనర్జీ
    12. లీలా రే
    13. మాలతీ చౌదరి
    14. కమలా చౌదరీ
    15. దాక్షాయణి వేలాయుధన్

రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన తెలుగువారు:
    1. టంగుటూరి ప్రకాశం పంతులు
    2. నీలం సంజీవరెడ్డి
    3. భోగరాజు పట్టాభిసీతారామయ్య
    4. దుర్గాబాయి దేశ్‌ముఖ్
    5. కళా వెంకట్రావు
    6. ఎన్.జి.రంగా
    7. కల్లూరి సుబ్బారావు
    8. మోటూరి సత్యన్నారాయణ
    9. బొబ్బిలి రాజ రామకృష్ణ రంగారావు
    10. సి. దానయ్య

 

రాజ్యాంగ పరిషత్తు తొలిసమావేశం
* గవర్నర్ జనరల్ వేవెల్ ఆదేశం మేరకు రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం 1946, డిసెంబరు 9 (సోమవారం)న ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి 9 మంది మహిళలతో సహా మొత్తం 211 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి జె.బి.కృపలాని సూచన మేరకు ఫ్రెంచి సంప్రదాయాన్ని అనుసరించి హాజరైన సభ్యుల్లో అత్యంత వయోవృద్ధుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

* 1946, డిసెంబరు 11న జరిగిన రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా హెచ్.సి.ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి ఎన్నికయ్యారు.
* ''సహకార ప్రాతిపదికపై భారతదేశం కామన్వెల్త్ రాజ్యం కావాలని, కుల, మత, వర్గరహిత సమాజం ఏర్పడే దిశగా పయనించాలని" డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
* 1946, డిసెంబరు 13న జరిగిన రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని (Objectives & Resolutions) ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని 1947, జనవరి 22న రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించారు.
* 'లక్ష్యాల, ఆశయాల తీర్మానం మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ' అని జవహర్‌లాల్ నెహ్రూ అభివర్ణించారు.
* 'లక్ష్యాల, ఆశయాల తీర్మానాన్ని భారతజాతి జాతక చక్రం'గా కె.ఎం. మున్షీ అభివర్ణించారు.
* అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకూ, అమెరికా రాజ్యాంగానికి ఏవిధమైన సంబంధం ఉందో; అదేవిధమైన సంబంధం లక్ష్యాల, ఆశయాల తీర్మానానికి, భారత రాజ్యాంగానికి ఉందని పేర్కొంటారు.

 

లక్ష్యాలు, ఆశయాల తీర్మానంలోని సారాంశం
* భారతదేశం స్వతంత్య్ర, సార్వభౌమ, సర్వసత్తాక ప్రజాస్వామ్యం అవుతుంది.
* సార్వభౌమ-స్వతంత్య్ర భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలే.
* రాజ్యాంగ పరిషత్తు రూపొందించే రాజ్యాంగ మూలశాసనం భారత ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి.

* ప్రజలందరికీ చట్టరీత్యా సమానత్వాన్నీ, స్వేచ్ఛను కల్పించడానికి హామీ ఇవ్వడం.
* భారత ప్రజలందరికీ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం.
* రాజ్యాంగ పరిషత్‌కు కార్యదర్శిగా హెచ్.వి.ఆర్.అయ్యంగార్, ముఖ్య లేఖకుడిగా ఎన్.సి.ముఖర్జీ, సలహాదారుడిగా బి.ఎన్.రావు వ్యవహరించారు.
* సువిశాల భారతదేశానికి అనుగుణమైన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు బ్రిటిష్ సంప్రదాయ రీతిలో కమిటీ పద్ధతిని అనుసరించి, రాజ్యాంగ పరిషత్తు రెండు రకాల కమిటీలను ఏర్పరిచింది.

 

I. విషయ నిర్ణాయక కమిటీలు (Committees on Substantive Affairs)
ఇవి మొత్తం 12 కమిటీలు: అవి

II. విధాన నిర్ణాయక కమిటీలు: (Committees on Procedural Affairs)
ఇవి మొత్తం 10 కమిటీలు. అవి:

* రాజ్యాంగ పరిషత్తు విధులపై ఏర్పడిన కమిటీకి అధ్యక్షులు: జి.వి. మౌలాంకర్
* రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలన్నింటిలోకి పెద్దది - సలహా సంఘం. వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఏర్పడిన ఈ కమిలోని సభ్యులు 1 + 54 = 55 రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి: డాక్టర్ సచ్చిదానంద సిన్హా
* 1947, జులై 22న రాజ్యాంగ పరిషత్తులో భారత జాతీయ జెండాను ప్రదర్శించి, ప్రతిపాదించినవారు: హంసా మెహతా
* రాజ్యాంగ రచనా ప్రక్రియ, ఆమోదంలో భాగంగా రాజ్యాంగ పరిషత్తు జరిపిన మొత్తం సమావేశాల సంఖ్య: 11
* చివరి సమావేశమైన 12వ సమావేశం 1950, జనవరి 24న జరిగింది.
* దేశ విభజన జరిగి ప్రత్యేక పాకిస్థాన్ ఏర్పాటు కావడంతో మారిన పరిస్థితుల నేపథ్యంలో 'కేంద్ర అధికారాల కమిటీ' తన నివేదికను పునఃపరిశీలన చేసి, తన రెండో నివేదికలో బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది.
* వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రాజ్యాంగ పరిషత్తు సలహాదారుడైన బెనగల్ నరసింగరావు 1947, అక్టోబరు నాటికి ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇతడు రూపొందించిన తొలి ముసాయిదా రాజ్యాంగంలో 243 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయి.

రాజ్యాంగ ముసాయిదా కమిటీ 1947, ఆగస్టు 29
* రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీల్లో అత్యంత కీలకమైంది 1947, ఆగస్టు 29న ఏర్పాటు చేసిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఈ కమిటీలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ప్రముఖ వ్యక్తులకు సభ్యత్వం కల్పించారు.
వారి వివరాలు:
 
    1. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ - అధ్యక్షులు
     2. ఎ. కృష్ణస్వామి అయ్యర్ - సభ్యులు
     3. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ - సభ్యులు
     4. మహ్మద్ సయ్యద్ సాదుల్లా - సభ్యులు
     5. కె.ఎం. మున్షీ - సభ్యులు
     6. బి.ఎల్. మిట్టల్ - ఇతడు దీర్ఘకాలిక అస్వస్థతకు గురికావడంతో ఇతడి స్థానంలో 1947, డిసెంబరు 5న ఎన్. మాధవరావు నియమితులయ్యారు.
     7. డి.పి. ఖైతాన్ - ఇతడు 1948లో మరణించడంతో ఇతడి స్థానంలో టి.టి. కృష్ణమాచారిని నియమించారు.
* ముసాయిదా కమిటీలో న్యాయ విద్యను అభ్యసించని ఏకైక సభ్యులు టి.టి. కృష్ణమాచారి.

 

రాజ్యాంగ పరిషత్తు పని విధానం - 3 దశలు
మొదటి దశ: డిసెంబరు 9, 1946 నుంచి ఆగస్టు 15, 1947 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులను మాత్రమే నిర్వహించింది.
రెండో దశ: ఆగస్టు 15, 1947 నుంచి నవంబరు 26, 1949 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులతోపాటు, దేశ పాలనకు అవసరమైన శాసన విధులను కూడా నిర్వహించింది.
మూడో దశ: నవంబరు 26, 1949 నుంచి మే 13, 1952 వరకు. ఈ కాలంలో రాజ్యాంగ పరిషత్తు కేవలం శాసనవిధులను మాత్రమే నిర్వహిస్తూ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది.
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులను నిర్వహించేటప్పుడు బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించేవారు.
* రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులను నిర్వహించేటప్పుడు అధ్యక్షులుగా జి.వి. మౌలాంకర్, ఉపాధ్యక్షులుగా అనంతశయనం అయ్యంగార్ వ్యవహరించారు.

 

రాజ్యాంగ పరిషత్తు ఆమోదం పొందిన రాజ్యాంగం
* 1949, నవంబరు 26న (శనివారం) రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది.
* ప్రతి సంవత్సరం నవంబరు, 26ను జాతీయ న్యాయదినోత్సవంగా నిర్వహిస్తారు.
* రాజ్యాంగ తయారీకి అయిన వ్యయం: 64 లక్షల రూపాయలు
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ ముసాయిదాను చర్చించి, ఆమోదించడానికి 165 రోజులు పట్టింది.
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించడానికి తీసుకున్న సమయం: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
* రాజ్యాంగ పరిషత్తు సుమారు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసింది.
* రాజ్యాంగ రాతప్రతికి సంబంధించి, రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు రాగా, వాటిలో 2,473 ప్రతిపాదనలను చర్చించి పరిష్కరించింది.
* రాజ్యాంగ పరిషత్తు ఎక్కువ సవరణలను ప్రతిపాదించినవారు: హెచ్.వి. కామత్.

* రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత వెంటనే అమల్లోకి వచ్చిన అంశాలు:
       1) పౌరసత్వం
       2) ఎన్నికలు
       3) తాత్కాలిక పార్లమెంటు
       4) స్వదేశీ సంస్థానాలకు కల్పించిన ప్రత్యేక వసతులు.
* 1950, జనవరి 24న జరిగిన రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశంలో మొత్తం 299 మంది సభ్యులకు, 284 మంది రాజ్యాంగ రాత ప్రతిపై సంతకాలు చేశారు.
రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.
* 'జనగణమన'ను జాతీయగీతంగా ఆమోదించడం
* 'వందేమాతరం'ను జాతీయ గేయంగా ఆమోదించడం
* డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను 'రాష్ట్రపతి'గా ఎన్నుకోవడం
    1949, నవంబరు 26న (శనివారం) ఆమోదించిన రాజ్యాంగం, 1950, జనవరి, 26 (గురువారం) నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి కారణం 1929, డిసెంబరు 31న లాహోర్‌లోని రావి నది ఒడ్డున జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది.

  ఈ తీర్మానం ప్రకారం 1930, జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం సంపూర్ణ స్వరాజ్య దినోత్సవంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఈ విధంగా జనవరి 26కు ఉన్న చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా నూతన రాజ్యాంగాన్ని 1950, జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చారు.
* రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేది 1950, జనవరి 26. రాజ్యాంగంపై ఆమోదముద్ర వేసినవారు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్.
* కామన్వెల్త్ దేశాల సంఘంలో సభ్యత్వం కోసం 1949, మేలో రాజ్యాంగ పరిషత్తు అంగీకరించింది.
* రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగు (ఐరావతం)ను నిర్ణయించారు.
* రాజ్యాంగ పరిషత్తు ద్వారా ఎన్నికైన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మన దేశ మొదటి రాష్ట్రపతిగా 1950, జనవరి 26న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల జనవరి 26న మనం 'గణతంత్ర దినోత్సవం'గా జరుపుకుంటున్నాం.
* స్వాతంత్య్రానంతరం 1948, జూన్ 21 వరకు మౌంట్ బాటన్ మన దేశ గవర్నర్ జనరల్‌గా కొనసాగారు.
* 1948, జూన్ 22 నుంచి బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు భారత గవర్నర్ జనరల్‌గా
సి. రాజగోపాలాచారి వ్యవహరించారు.
* అంబేడ్కర్ బృందం 1948, ఫిబ్రవరి 21 నాటికి ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ రాజ్యాంగంలో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి.

రాజ్యాంగ సభ - చర్చలు
*  అంబేడ్కర్ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగసభలో జరిగిన అనేక చర్చలు, వ్యాఖ్యానాలు కింది విధంగా ఉన్నాయి.
* 'ఈ రాజ్యాంగం 1935 భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్ కాపీలా ఉంది'. - మౌలానా హ్రస్రత్ మొహాని
* 'సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదు. భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారు'. - దామోదర్ స్వరూప్ సేథ్
* 'కుల వ్యవస్థను నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావడం లేదు'.   - ప్రొమథ్ రంజన్ ఠాగూర్
* 'మతం, కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్ష చూపే ఏ చర్యనైనా అంటరానితనం అంటారు'. - శ్రీ రోహిణి కుమార్ చౌదరి
* 'గతంలో మనం ప్రజలకు చేసిన ప్రతిజ్ఞ, ఈ రోజు మనం ప్రజలకు చేస్తున్న ప్రతిజ్ఞ నెరవేర్చాలి. ఈ రోజు నుంచి మనం విశ్రాంతి భవనాల్లో సుఖశాంతులతో ఉండే రోజులు పోయాయి. భారతదేశానికి సేవ చేయడం అంటే అందులోని కోట్లాది మంది వ్యథార్థులకు సేవ చేయడమే'. - జవహర్‌లాల్ నెహ్రూ
* 'తన ప్రాచీన కాలం నాటి సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని పరిత్యజించి, నూతన వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ పరిషత్తు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లుగా ఉంది'. - జవహర్‌లాల్ నెహ్రూ
* ఈ రోజు నుంచి (1950, జనవరి 26) మనం వైరుధ్యాలతో కూడిన సమాజంలోకి ప్రవేశిస్తున్నాం. 'రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది కానీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అసమానత్వం ఉంటుంది'.  - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
* ఎం.వి. పైలీ "Constitutional Government in India" అనే గ్రంథంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను 'భారత రాజ్యాంగ పితగా, ఆధునిక మనువు'గా కీర్తించారు.
* భారత రాజ్యాంగాన్ని ఆంగ్లంలో అందంగా చేతితో రాసింది ప్రేమ్ బిహారి నారాయణరైజ్దా. దీనికి ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా రాజ్యాంగంలోని ప్రతి పేజీలోనూ తన పేరును, చివరి పేజీలో తన పేరుతోపాటు తన తాత పేరును రాసుకుంటానని కోరగా దానికి నెహ్రూ సమ్మతించారు.
* భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రాజ్యాంగంలోని ప్రతి పేజీని కళాత్మకంగా తీర్చిదిద్దింది నందలాల్ బోస్. ఇతడికి సహకరించింది శాంతినికేతన్‌లోని చిత్రకారులు.
* సాంఘిక, ఆర్థిక విప్లవ సాధనే రాజ్యాంగ సభకు మూలాధారమని చెప్పవచ్చు. ఈ లక్ష్యసాధన కోసం రాజ్యాంగ సభలో మూడు రకాల వ్యూవహాలపై చర్చ జరిగింది. అవి:

 

ఎ. గాంధేయ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం ఆర్థిక, రాజకీయ వికేంద్రీకరణ జరగాలి. ప్రతి గ్రామాన్ని స్వయంప్రతిపత్తి ఉండేదిగా రూపొందించాలి. గ్రామ పంచాయతీలు నిర్వహించలేని అధికారాలు మాత్రమే జాతీయ ప్రభుత్వానికి అప్పగించాలి.
* గ్రామీణ ప్రజానీకానికి తమను తాము పునర్ నిర్మించుకోవడానికి తగిన చొరవ, తెలివితేటలు లేవని భారతదేశ సమగ్రత, రక్షణ లాంటి అవసరాలను తీర్చడానికి గాంధేయ సిద్ధాంతం సరిపోదని దీన్ని తిరస్కరించారు.

 

బి. సోవియట్ సామ్యవాద నమూనా: ఇది ఏకపార్టీ వ్యవస్థ మీద ఆధారపడింది. అత్యధిక కేంద్రీకరణతో కూడుకొని, అపరిమితమైన అధికారాలున్న సంపూర్ణ అధికార రాజ్యాంగాన్ని గురించి ఇది తెలియజేస్తుంది. దీన్ని కూడా తిరస్కరించారు.
 

సి. యూరో-అమెరికన్ నమూనా: కేంద్రీకృత రాజ్యాంగంతో ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలు, ప్రత్యక్ష ఎన్నికలు, పార్లమెంట్ ఆధిక్యత, అధికారానికి మూలం ప్రజలు అనేదానిపై ఇది (ఈ నమూనా) ఆధారపడింది.
* రాజ్యాంగ సభ సభ్యులకు, కాంగ్రెస్ సభ్యులకు పాశ్చాత్య ఉదారవాద సంప్రదాయం పట్ల నమ్మకం ఉంది. భారతదేశ ఆధునికీకరణ కోసం పాశ్చాత్య నమూనా అయిన యూరో-అమెరికన్ నమూనానే స్వీకరించారు.

 

రాజ్యాంగ రచన కోసం - రాజ్యాంగ పరిషత్తు ఉపయోగించిన పద్ధతి
* ఒ.పి.గోయెల్ తన గ్రంథం "Indian Government and Politics"లో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన కోసం సర్వసమ్మతి సమన్వయ పద్ధతుల కంటే సర్దుబాటు పద్ధతి (Method of Adoption)ని ఎక్కువగా అనుసరించింది అని తెలిపారు. 
* సర్ధుబాటు పద్ధతిలో పరిస్థితులకు అనుగుణంగా రాజీపడటం, కొన్ని విభేదాలు ఉన్నట్లయితే వాటిని అలాగా ఉండనీయడం ఈ పద్ధతి విధానం.

రాజ్యాంగ పరిషత్తుపై వ్యాఖ్యానాలు:
''రాజ్యాంగ పరిషత్తు దేశంలో ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది" - విన్‌స్టన్ చర్చిల్
''రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వారు నియంత్రణ మండలిగా వ్యవహరించారు" - గాన్ విల్ ఆస్టిన్
* ''రాజ్యాంగ పరిషత్తు‌పై ప్రజాభిప్రాయ నీడలు లేవు" - కె. సంతానం
* ''రాజ్యాంగ పరిషత్తు కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిథ్యం వహించింది" - లార్డ్ సైమన్
* ''రాజ్యాంగ పరిషత్తు భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల వ్యక్తీకరణకు ఒక అడ్డంకిగా మారింది"  - జయప్రకాష్ నారాయణ్

 

భారత రాజ్యాంగానికి ఆధారాలు
      ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైంది భారత రాజ్యాంగం. సుమారు 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. 1950, జనవరి 26న అమల్లోకి వచ్చినప్పుడు మన దేశ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి.

 

1. భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి:
* దీన్ని భారత రాజ్యాంగానికి నకలు (Xerox copy)గా పేర్కొంటారు. రాజ్యాంగంలోని సుమారు 70%కి పైగా అంశాలు ఈ చట్టం నుంచే గ్రహించారు.

భారత ప్రభుత్వ చట్టం - 1935 నుంచి గ్రహించిన అంశాలు
* సమాఖ్య వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు; అత్యవసర అధికారాలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), గవర్నర్ విచక్షణాధికారాలు, ఫెడరల్ న్యాయస్థానం, పరిపాలనాంశాలు.

 

2. బ్రిటన్ రాజ్యాంగం నుంచి:
* పార్లమెంటరీ ప్రభుత్వ విధానం - ద్విసభా విధానం
* ఏక పౌరసత్వం - సమన్యాయ పాలన - కేబినెట్ ప్రభుత్వం
* శాసనసభ్యుల హక్కులు - ఎన్నికల వ్యవస్థ - శాసన నిర్మాణ ప్రక్రియ
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్ - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
* అటార్నీ జనరల్ - రిట్స్ జారీ విధానం - దిగువ సభ ఆధిక్యత
* ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థ - దిగువ సభకు మంత్రిమండలి బాధ్యత వహించడం
* ఉద్యోగుల ఎంపిక పద్ధతులు - ఉద్యోగి స్వామ్యం
* దేశాధిపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం

3. అమెరికా రాజ్యాంగం నుంచి:
* లిఖిత రాజ్యాంగం
* ప్రాథమిక హక్కులు
* రాజ్యాంగ ఆధిక్యం - ప్రవేశిక - న్యాయ సమీక్షాధికారం
* స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ
* రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం
* న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ
* ఉపరాష్ట్రపతి పదవి
* రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం
* దేశాధినేత పేరు మీదుగా పరిపాలనా వ్యవస్థను నిర్వహించడం
* ప్రజాప్రయోజన వ్యాజ్యం (public interest litigation)

 

4. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి:
* ఉమ్మడి జాబితా
* ఉభయ సభల సంయుక్త సమావేశం
* స్వేచ్ఛా వాణిజ్య, వ్యాపార చట్టాలు

* అంతర్ రాష్ట్ర వాణిజ్యం
* భాషలకు సంబంధించిన అంశాలు
* కేంద్ర ఆర్థిక సంఘం

 

5. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి:
* ఆదేశిక సూత్రాలు
* రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి
* రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేసే విధానం
* నైష్పత్తిక ప్రాతినిధ్య ఎన్నిక పద్ధతి

 

6. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి:
* ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ విధానం
* రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం

 

7. సోవియట్ రష్యా రాజ్యాంగం నుంచి:
* సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలు
* సామ్యవాద సూత్రాలు
* ప్రాథమిక విధులు
* దీర్ఘకాలిక ప్రణాళిక


8. జపాన్ రాజ్యాంగం నుంచి:
* చట్టం నిర్ధారించిన పద్ధతి
* ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు

 

9. కెనడా రాజ్యాంగం నుంచి:
* అవశిష్టాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి చెందడం
* ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం
* కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం
* బలమైన కేంద్రం ఉన్న సమాఖ్య విధానం.

 

10. జర్మనీ రాజ్యాంగం నుంచి:
* అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం.

 

11. ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి:
* ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు
* గణతంత్ర (Republic) విధానం
* తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం

భారత రాజ్యాంగంపై - వ్యాఖ్యానాలు
''భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో సుదీర్ఘమైంది, తలమానికమైంది" - సర్ ఐవర్ జెన్నింగ్స్
''భారత రాజ్యాంగం ఇంద్రుడి వాహనమైన ఐరావతం లాంటిది" - హెచ్.వి. కామత్
''భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత" - గాన్‌విల్ ఆస్టిన్
''భారత రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాలను, ప్రయోజనాలను తీర్చేది" - జవహర్‌లాల్ నెహ్రూ
''భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం లాంటిది" - సర్ ఐవర్ జెన్నింగ్స్
''భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య" - కె.సి. వేర్
''భారత రాజ్యాంగం సహకార సమాఖ్య" - డి.ఎన్. బెనర్జీ, గాన్‌విల్ ఆస్టిన్
''ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు అని ఎవరైనా అంటే అందుకు నేను గర్విస్తాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో తప్పు లేదు" - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
''భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది"   - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్

Posted Date : 10-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌