విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Appointment: సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. మూడు ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలు జులై 26న సచివాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి కూడా పాల్గొన్నారు. సంఘాల నేతలు పలు సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. వాటిపై స్పందించిన నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘బదిలీలు, పదోన్నతుల్లో జరిగిన చిన్నచిన్న పొరపాట్లను సవరించేందుకు జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలిస్తాం. సీఎంతో చర్చించి రుణమాఫీ అయిపోగానే డీఏలు విడుదల చేయాలనే ఆలోచన ఉంది. 

పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికుల నియామకం, ఉచిత విద్యుత్తుపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం. మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయ బదిలీల పూర్తికి న్యాయపరమైన సమస్యలను తొలగించడానికి చొరవ తీసుకుంటాం. కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి’ అని తెలిపారు. కాగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు, పదోన్నతులు కల్పించినందున కృతజ్ఞతగా ఎల్‌బీ స్టేడియంలో సభ నిర్వహిస్తామని, అందుకు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఆహ్వానిస్తామని కోరగా.. త్వరలోనే 15 మంది నేతలతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఉపాధ్యాయ సంఘ నేతలు తెలిపారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు కటకం రమేశ్, అంజిరెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, చావ రవి, కృష్ణుడు, పర్వత్‌రెడ్డి, భూతం యాకమల్లు, లింగారెడ్డి, అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Published at : 27-07-2024 13:07:07

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం