విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Jobs: 90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ

  • జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం
  • ఫైర్‌మెన్‌ పాసింగ్‌అవుట్‌ పరేడ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్‌-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ‘మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 31వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇప్పుడు 30 వేలతో కలిపి సంవత్సరం తిరిగే సరికల్లా 60 వేలకు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించబోతున్నాం’ అని వివరించారు.ప్రతి ఉద్యోగాన్ని జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా భర్తీ చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ స్టేట్‌ ఫైర్‌ సర్వీసెస్, సివిల్‌ డిఫెన్స్‌ శిక్షణ సంస్థలో శుక్రవారం ఫైర్‌మెన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ జరిగింది. అలాగే 157 మంది డ్రైవర్‌ ఆపరేటర్లకు కొత్తగా నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘యువత ఏ ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదు. అప్పట్లో నిరుద్యోగులు పాలకులపై ఒత్తిడి తెచ్చి తెలంగాణను సాధించుకోవడంలో కీలకపాత్ర పోషించారు. కానీ గడిచిన పదేళ్లలో నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగలడం దురదృష్టకరం. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగాలను భర్తీ చేయడం ఆరంభించింది. ఎల్బీ స్టేడియంలో ఒకేసారి 31వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు అందించాం. వారిలో మీరు(ఫైర్‌మెన్‌) 483 మంది ఉన్నారు. 

ఇప్పుడు  శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్నారు. ఎవరైనా సరే జీతభత్యాల కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధపడరు. కానీ మీరు మాత్రం విపత్తుల్లో అందరికంటే ముందుండి పోరాడతారు. ఒక సామాజిక బాధ్యతతో.. సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నందుకు సీఎంగా మిమ్మల్ని అభినందిస్తున్నా.  ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చేపట్టబోతున్న బాధ్యత గొప్పగా ఉండాలి

మనతోపాటు మన గౌరవం పెరిగేలా బాధ్యతతో మెలగాలి. ఇది మీ ప్రభుత్వం. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే రూ.2.91లక్షల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధికి ప్రాధాన్యం కల్పించాం. ఉద్యోగులకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే యజమానులు విశ్వాసం కోల్పోతారు. గత పాలకుల హయాంలో అదే జరిగింది. ఎనిమిదేళ్లపాటు సకాలంలో జీతాలు ఇవ్వలేదు. విశ్రాంత ఉద్యోగులకు ఎప్పుడు పింఛను అందుతుందో తెలియకపోవడం బాధాకరంగా మారింది. మేం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తూ ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాం.0

మీ రేవంతన్నగా మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా..
నిరుద్యోగ యువత నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు.. ఆందోళనలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీకు మంత్రులందరూ అందుబాటులో ఉంటున్నారు. మీకేదైనా అవసరమైతే వారికి విజ్ఞప్తి చేయండి. ఉన్నతాధికారులకు చెప్పండి. సమస్య సహేతుకమైనదైతే తప్పకుండా పరిష్కరిస్తాం. మీ రేవంతన్నగా ఎప్పుడూ మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా’’ అని సీఎం రేవంత్‌ అన్నారు.

Updated at : 27-07-2024 13:09:10

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం